తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 30 December 2017

హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా



కందము: 
"పరమత సహనము" నాటిక 
గురుకులమున వేయుచుండ గూడిరి నటులే 
గిరిధర్ రాముడు మరియును 
హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా!

Thursday, 28 December 2017

కన్ను, ముక్కు, చెవి,నోరు - రామాయణార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ




దత్తపది - కన్ను, ముక్కు, చెవి,నోరు - రామాయణార్థంలో




తేటగీతి: 
ఒప్పు బోధించె వినలేదు చుప్పనాతి
ఆగకన్నుల మిన్నపై కరిగె మ్రింగ 
ముక్కుటంపుల సౌమిత్రి ముందుకురికె
రోషమొప్పగ దూకెనో రుద్రుడగుచు

Tuesday, 26 December 2017

తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ.



కందము: 
ప్రొద్దుననే లేచి నిదుర 
శుద్ధిగ నా పరమ శివుని స్తోత్రంబిడుచు
న్నొద్దిక నొదుగుచునుండిన 
తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ.

Wednesday, 20 December 2017

రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.


కందము: 
రంగని గుడిలో దూరుచు 
దొంగిలి తా విగ్రహమ్ము దొరుకక తృటిలో 
దొంగయె తప్పించుక పా 
రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

Monday, 11 December 2017

చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా. 


కందము: 
ఎక్కువ జ్వరమున్నప్పుడు 
మిక్కుటముగ తీపినోట మెక్కినయపుడున్
చక్కెర రోగిని తినుమన 
చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా. 

Wednesday, 6 December 2017

పండితులు వసింపని ధర పావనము గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 7 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - పండితులు వసింపని ధర పావనము గదా



కందము: 
దండిగ మంచీ చెడులను 
ఖండితముగ తెలిసి జెప్ప గలిగెడి విజ్ఞుల్ 
ఉండిన మంచిది, కుహనా 
పండితులు వసింపని ధర పావనము గదా!

Wednesday, 29 November 2017

అవ్వ - తాత - అత్త - మామ....భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



దత్తపది - అవ్వ - తాత - అత్త - మామ....భారతార్థంలో


కందము: 
అవ్వల బంధుల జూచుచు 
కవ్వడి తా తపన విడువ కదనముపైనన్ 
హవ్వాయని యత్తరి హరి 
నవ్వుచు మామక యనుచును జ్ఞానము జెప్పెన్. 

Wednesday, 22 November 2017

రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.


కందము: 
భీతిల్లకు గ్రహణంబీ
రీతిగ పూర్ణంబు బట్ట రేయిగ మారెన్ 
చూతువె, యదిగో తొలగెను 
రాతిరి - రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

Wednesday, 15 November 2017

గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్


కందము: 
గురువారమ్ముపవాసము 
సరి నీరే ముట్టు తాను, ఛాత్రుండొకడే  
మరియారోజే విందుకు 
గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.

Monday, 13 November 2017

వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - వరమే పది తలల వాని ప్రాణము దీసెన్. 


కం:  
నరవానరులను వదలుచు 
పరులెవ్వరు చంపలేని వరమునుబొందెన్
చరియించకామమున కా 
వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.

Friday, 10 November 2017

పార్థసారథి పరిమార్చె పాండవులను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను.



తే.గీ: 
నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు?
ఏమిజేసెను తా మేనమామ నపుడు?
తోడు వీడకరక్షించె వాడెవరిని? 
పార్థసారథి-పరిమార్చె- పాండవులను.

Saturday, 4 November 2017

మత్తుమందు సేవించుట మంచిదె కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద.



తే.గీ: 
మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు 
మత్తులోనుండ వలదన మాన దలచి 
తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ 
మత్తు, మందు సేవించుట మంచిదె కద.

Tuesday, 31 October 2017

అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది - అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.  

కందము: 
అరి సెగలు గ్రక్కు శరమును 
గురిజూచుచువేయ వడకె కోతులు, చెమటల్ 
మరిగారె, రామ శరణని 
పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్. 

Saturday, 28 October 2017

సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య: సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ


కందము:
ప్రీతిగ మేనున సగమున
చూతుముగా యుమను భవుని సోయగమొప్పన్
రీతిగ సతియన నామెయె 
సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ! 

Monday, 23 October 2017

భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ


కందము: 
ఈగతి పరమత గురువులు 
వాగిరి తమ చుట్టునున్న భక్తులతోడన్ 
జాగరత భారతమ్మును 
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ

Thursday, 19 October 2017

నిత్య దీపావళియెయౌను నిజము నాడు.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
















సీ:
చీకుచింతయనెడు సీమటపాకాయ
వత్తినే ముట్టించి వదలునాడు
పరుల వృద్ధినిజూచి పడునట్టి ఈర్ష్యనే 
చిచ్చుబుడ్డిగ గాల్చి చెలగునాడు
తలదిరిగెడు చెడు తలపులన్నియు గూడ
భూచక్రముగ కాలి పోవునాడు  
పరుష వాక్యమ్ముల పరుల హింసించెడి 
పాముబిళ్ళలు మాడి పడిననాడు      

తే.గీ:   
అహపు తారజువ్వను నింగి కంపునాడు  
శాంతి మత్తాబులే వెల్గు జల్లునాడు   
ముదపు ప్రమిదలకాంతియే ముసురునాడు 
నిత్య దీపావళియెయౌను నిజము నాడు.  



Friday, 13 October 2017

విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విరసంబగు రచన యొప్పె వీనుల విందై.



కందము: 
కిరికిరి మాటల పాటను 
సరిగా బాణీనిగట్టి చక్కగ పాడన్ 
ఉరుకుల పరుగుల యువతకు 
విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

Monday, 9 October 2017

దున్నపాలు పిండ దుత్తదెమ్ము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దున్నపాలు పిండ దుత్తదెమ్ము.


ఆ.వె.
ఆటలేన నీకు నన్నివేళలయందు 
చెవిని బెట్టవేళ చెప్పుమాట 
వేచియుంటినేను వినుమురా గాడిద! 
దున్న! పాలుపిండ దుత్తదెమ్ము.

Tuesday, 3 October 2017

ఏకాదశి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి:  ఏకాదశి

ఛందస్సు- తేటగీతి

నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.


తేటగీతి: 
ఏడు మొదటన పండుగ వేడుకగను 
కాలపురుషుని స్మరియింప కదలివచ్చె 
దయనుగోరుచు బూజించ రయము రండు
శివము గలిగించు విష్ణునే చింతజేయ.

Sunday, 1 October 2017

కట్లపాము చేరి కౌగిలించె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కట్లపాము చేరి కౌగిలించె. 



ఆ.వె. 
తానుజూడనొకడు దైవోపహతుడేను 
గ్రహపు పీడ పట్టి వదలదాయె 
నేనునేస్తమనుచు నిట్టులే పలు యి 
క్కట్లపాము చేరి కౌగిలించె

Saturday, 30 September 2017

మహిషుని సుతులెటుల గలిగె

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 





















కం:
మహిషుని దునిమితివనుచును 
మహిజనులిట దలతురుగద మహిమల తల్లీ!
మహిళల నబలల  జెర'చెడు'
మహిషుని సుతులెటుల గలిగె మరి మహిజెపుమా?  

కం:
పంచుము నీ శక్తులనే
మంచిగ నీ యవనిలోని మహిళలకిపుడే
దించగ దుష్టుల మదమును
దంచగ మానమ్ముదోచు దనుజాధములన్. 

Friday, 29 September 2017

డైనోర - బుష్ - యల్‍జి - డెల్ ..... భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది: డైనోర - బుష్ - యల్‍జి - డెల్ ..... భారతార్థంలో



ఆ.వె:  
భీముడపుడు చాల ప్రీతుడై నోరార 
బుష్కలముగ స్తోత్రములను జదువ 
ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ  
పవనుడెల్ల జూచి పరవశించె. 

Thursday, 28 September 2017

వనితల ఖండించు వాడె బల్లిదుడగురా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వనితల ఖండించు వాడె బల్లిదుడగురా. 



కం: 
వనితల చెరబట్టిన నరు 
గని యూరకనుండబోక కరవాలముతో   
కనికరము లేక దుష్టుడ 
వని, తల ఖండించు వాడె బల్లిదుడగురా.

Sunday, 24 September 2017

వంక లేని దమ్మ రంకు లాడి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వంక లేని దమ్మ రంకు లాడి


ఆ.వె: 
కూటికొరకు గాదె కోటి వృత్తులు సరి 
దినము గడుప తనకు దిక్కులేదు 
రోజుకొక్కరైన మోజు రావలె తన
వంక, లేని దమ్మ రంకు లాడి. 

Monday, 18 September 2017

చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

 శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.



తేటగీతి:  
నీచ కీచకు భీముడే పీచమడచ
నిజముదెలియక కృష్ణపై నిందవేసి 
వానిమిత్రులు తలపోసి పలికిరిట్లు 
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

Thursday, 14 September 2017

చావకండి...బ్లూవేల్స్ "చేతబడి"...జాగ్రత్త.

చావకండి...బ్లూవేల్స్ "చేతబడి"...జాగ్రత్త. 
















కందము:
ఆవల కాద్రా, దార్కా 
ఆ"వల"లో నుంచినారు, అక్కాష్మోరా 
బ్లూవేల్సు రూపమందున 
మీ వేళ్ళనుబట్టి పొడుచు మీకన్నులనే. 

కందము:
ఆటా! కాదది పిల్లల 
వేటది, వారల భవితకు వేటది చూడన్
బ్రూటది, చావుకు బంపే
రూటది,పెకలించ దాని రూటును మేలౌ. 

Tuesday, 12 September 2017

రాధికాప్రియుండు రావణుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాధికాప్రియుండు రావణుండు.


ఆ.వె: 
మదిని మెదులు గాద వదలక వెయ్యేళ్ళు  
ఎంటియారు నటనలిందులోన 
రామచంద్రమూర్తి, రారాజు పాత్రలు
రాధికాప్రియుండు,రావణుండు.

Sunday, 10 September 2017

వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ.



కందము: 
వాఙ్మయము చదువలేదుగ 
వాఙ్మయమను పదముగూడ వ్రాయుట రాదే
ప్రాఙ్ముఖుడగుచును నేర్వక 
వాఙ్మయమున నున్నదెల్ల, వ్యర్థము సుమ్మీ.

Friday, 8 September 2017

కారు. వాచి. టీవి.సెల్లు మహాభారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - కారు. వాచి. టీవి.సెల్లు మహాభారతార్థంలో




ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు. 


తేటగీతి: 
కారు పాండవులెప్పుడు కానివారు
వారు రాజ్యమ్ముకోసమై వాచిలేరు
ఏమిటీ వింతవాదన లెరుకలేక 
చెప్పునామాట వినకుంట సెల్లునయ్య. 

Tuesday, 5 September 2017

దోషమే కాదు చేయుట దొంగతనము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దోషమే కాదు చేయుట దొంగతనము.


తేటగీతి: 
వెన్నుడానాడె యుట్టిపై వెన్న పెరుగు 
పాలు మ్రుచ్చిలి పెట్టె సావాసులకును 
తెలియజెప్పెను పరులకై తిండి కొరకు 
దోషమే కాదు చేయుట దొంగతనము.

Sunday, 3 September 2017

" గుంటూరు " పద్యం

నిన్న 2/09/2017 న "ప్రజ - పద్యం " ఫేస్ బుక్ గ్రూప్ వారు గుంటూరు సెంట్రల్ పబ్లిక్ స్కూల్ బ్రాడిపేట 19/4 నందు నిర్వహించిన "పద్య కవుల ఆత్మీయ కలయిక" కార్యక్రమములో సామాజిక పద్యాలతో పాటు నేను రచించిన " గుంటూరు " పద్యం.

గుంటూరు పద్యం. 

సీ:
అమరలింగడిచట , నట పానకాలయ్య 
కోటేశుడొకవైపు కొలువుదీర
శేషేంద్ర,కరుణశ్రి, జాషువా,తిక్కన్న 
వికటకవి కవిత్వ విభవమలర 
పలనాటి సీమయున్, బల్ కొండవీడుల 
ధరణికోట కథల తనివిదీర 
ప్రత్తి ,మిరప, ధూమ పత్రంబు, గోంగూర 
పంటలందున పేరు పైననెగుర 
తే.గీ: 
చూడ నాగార్జునునికొండ సొంపుమీర
నేతకళ దీప్తి, పేరున్న నేతలలర 
కనగ గుంటూరు పేరునన్ గర్తపురియె
వెలుగుచున్నది జిల్లాగ తెలుగు నేల. 

Monday, 28 August 2017

కమ్మ-మాల-మాదిగ-బాపన...అన్యార్థంలో.

దత్తపది: కమ్మ-మాల-మాదిగ-బాపన...అన్యార్థంలో.

తేటగీతి: 
వినుమా!లవంగమిలాచి  పిసరు పచ్చ
కప్పురమ్మాదిగావేసి కాస్త పోక
చెక్క సున్నమ్ము నాకుపై జేర్చ, కమ్మ 
నైన కిళ్ళియగును బాప నరుగనివెత.

Sunday, 27 August 2017

చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా





సమస్య - చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా




మత్తేభము: 

మనమున్ మెచ్చగనొక్కదాని గనుచున్ మాట్లాడగా చాటుగా 

చిననాటన్ మదిమెచ్చు స్నేహితుడనే చేబట్టగా గోరితిన్

వినుమా నిన్నిక నిష్టమౌ మనముతో పెండ్లాడ నంచున్ వచిం 

చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా


Friday, 25 August 2017

సిద్ధిబుద్ధి నిమ్ము శివుని సుతుడ.

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఓం గం గణపతయే నమః 


Image result for vinayaka images



సీ:
సూక్ష్మ దృష్టి గలిగి చూడగావలెనంచు 
చెప్పుచుండునుమాకు చిన్నికనులు 
వినగమంచిచెడుల వేరుజేయు విధము
చెరగమనుచు జెప్పు చేటచెవులు
సన్మార్గములజేర జాగ్రతగ  వెదకు 
చుండుమంచు దెలుపు తొండమెపుడు 
అక్షరములతోడ కుక్షినింపుచునుండ 
పెరుగువిద్యలనును పెద్దపొట్ట 

ఆ.వె: 
శుభ్రత దగుననుచు శుక్లాంబరము దెల్పు  
నగవు నగయనునుగ నవ్వుముఖము 
నీదు రూపుదలచి నేడువేడెద స్వామి 
సిద్ధిబుద్ధి నిమ్ము శివుని సుతుడ.  
  

Thursday, 24 August 2017

నూజివీడులోనున్నది న్యూజిలాండు


సమస్య - నూజివీడులోనున్నది న్యూజిలాండు

తేటగీతి: 
చదువు చక్కగ చదువుచు సాఫ్టువేరు
కొలువు బొందెను మిత్రుడు కోటిరాజు  
వేరుదేశములోనుండు- వీడు పుట్టె 
నూజివీడులో - నున్నది న్యూజిలాండు

Wednesday, 23 August 2017

శకటమే దక్కె నశ్వమ్ము జారుకొనియె.


సమస్య - శకటమే దక్కె నశ్వమ్ము జారుకొనియె. 

తేటగీతి: 
బండి, గుఱ్ఱమ్ము కొనుటకు పట్టుబట్టి 
సంతకేగితి, మిత్రుండు 'జారు ' వచ్చె 
పోటి బడితిమి బేరాన ధాటి, నాకు 
శకటమే దక్కె, నశ్వమ్ము 'జారు' కొనియె.

Tuesday, 15 August 2017

దత్తపది: కాంత - నారి - మగువ - వనిత ..... అన్యార్థంలో రాముని స్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: కాంత - నారి - మగువ - వనిత
           అన్యార్థంలో  రాముని స్తుతి

తేటగీతి: 
అవని తనయను చేకొన్న యధిపునకును 
కీర్తి కాంతత్వమిలవెల్గు మూర్తిమతికి 
చేరి మదనారి మదిదల్చు శ్రీపతికిని 
మధురమగు వచనునకు నమస్సులిడుదు.

Sunday, 13 August 2017

అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు 


తేటగీతి: 
విజయదశమిని బాలలే వేడ్క మీర 
బాల రూపున పూజలన్ బరగ నిలువ 
పట్టి జూజుచు మననున భక్తితోడ 
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

Tuesday, 8 August 2017

శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.


కందము: 
శ్రీరామ రూపమట్టిది
ఆరెప్పలవేయ మరతురాతని జూడన్ 
తీరుగ నాతిగ మార్చిన 
శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.

Tuesday, 1 August 2017

కనులు వేయి గలిగి కాంచలేఁడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కనులు వేయి గలిగి కాంచలేఁడు



ఆటవెలది: 
కనులు లేనివాడు కనలేడు కాంతిని 
కనులు గలుగువాడు కాంచగలడు 
కాని యున్న కనుల గట్టిగా మూసిన 
కనులు వేయి గలిగి కాంచలేఁడు. 

Sunday, 16 July 2017

కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.


కందము: 
తీరుగ గనగా కవివర 
చేరుచు నాకన్నతల్లి చిన్నారులపై 
మీరుచు జూపెడి సరి మమ 
కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

Saturday, 15 July 2017

నేల - నీరు - అగ్గి - గాలి....మహాభారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - నేల - నీరు - అగ్గి - గాలి....మహాభారతార్థంలో 


కందము: 
మనసింక గాలిపోయెను 
కన నగ్గించెడు నొకండు కర్ణుడు తోడై 
మననీరు ధార్త రాష్ట్రులు 
వనమందున మనల నేల? వారలు వెధవల్. 












Friday, 14 July 2017

నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్


కందము: 
నల్లని మేఘశ్యాముని 
యల్లన వేయైనపేర్ల నాస్తోత్రముతో 
తెల్లని విరులగు, మాలగ 
నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్. 

Tuesday, 11 July 2017

పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.


తేటగీతి: 
తూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి 
చాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత 
పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.

Monday, 10 July 2017

'తల' పదం అన్యార్థంలో ఇష్టదైవస్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది: 'తల' పదం అన్యార్థంలో ఇష్టదైవస్తుతి  


కందము: 
తలచెద నే శ్రీరాముని 
తలచెద సీతమ్మ పతిని దశరథ సుతునే 
తలచెద రవికుల సోముని 
తలచెద మా హనుమ యెపుడు దలచెడు స్వామిన్. 

Sunday, 9 July 2017

శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్.


కందము: 
అనాటి యల్లసానియె
తానే మనుచరిత వ్రాసె ధారుణి, వినుమా
కానగ కాశీ ఖండము 
శ్రీనాథుని కృతిగ మను, చరిత్రయె యొప్పున్.

Saturday, 8 July 2017

రామునకు, సహోదరి గదా రమణి సీత.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామునకు, సహోదరి గదా రమణి సీత.


తేటగీతి: 
చెల్లిపోవును బ్రతుకిట్టి చేష్ట మాను 
పరుల భార్యయె రావణా పరగ చెల్లి
తప్పు మన్నించమనిజెప్పి యప్పజెప్పు 
రామునకు, సహోదరి గదా రమణి సీత.

Friday, 7 July 2017

పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్.



కందము: 
గడిపినది చాలు దినమనె 
నడుగిడుచును చంద్రుడంత కలువలజతకై 
విడిపొండు మీరు చాలని 
పడమట నుదయించెను-రవి, పద్మము లేడ్వన్.

Thursday, 6 July 2017

రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.


కందము:  
రాముని దలచుచు నాడా
రామముగా లంక వనిని రమణిని జూచెన్
రా, మార్కొన రాగా నా 
రామాంతకుడయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.

Wednesday, 5 July 2017

భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.



కందము: 
ఈ మాకూడలి నడచుచు 
కామేశ్వరి నొప్పులనుచు కడుపును బట్టన్ 
ధీమాగ చాటు జేయుచు 
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.

Tuesday, 4 July 2017

కట్టె - నిప్పు - బూది - మసి ... తో పచ్చని ప్రకృతి వర్ణన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - కట్టె - నిప్పు - బూది - మసి ... తో పచ్చని ప్రకృతి వర్ణన.


కందము: 
చుట్టిన నిశి పోయె సమసి 
పట్టుచు సూర్యుండు గొట్ట  బాబూ దినమై 
కట్టెదుట నిండె కాంతులు 
ఇట్టే జీవమ్ము బుట్టె నిప్పుడె గనుమా. 

Monday, 3 July 2017

రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై.



.ఉత్పలమాల: 
పావన నామమున్ గలిగి పల్కెడు వారికి కామధేనువై 
జీవనమందు తా విధము జేరుచు జూపెడు పుణ్యమూర్తియై 
దేవతలంతగోర భువి ధర్మము నిల్పగ కాలరుద్రుడై 
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై. 

Sunday, 2 July 2017

ముగురు స్త్రీలమగఁడు మొదటి యోగి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ముగురు స్త్రీలమగఁడు మొదటి యోగి.


ఆటవెలది: 
గంగభార్యగాదు గంగాధరునకును 
సతియు నొకతె, గిరిజ, సతియు నొకరె 
శంక యేల నరుడ శాంకరి భర్తకు 
ముగురు స్త్రీల? మగఁడు మొదటి యోగి.

Friday, 30 June 2017

వదినా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వదినా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.


కందము: 
మదిలోనన్నే దలచుచు 
పదిలముగా పడకజేర వచ్చిన వనితా 
సుదినమ్మిది తోషపు త్రో 
వది, నా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.

Wednesday, 28 June 2017

గాయము - వాపు - పుండు - రసి....తో ... కీచక వధ వర్ణన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 02 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - గాయము - వాపు - పుండు - రసి....తో కీచక వధ వర్ణన. 


భీముడు కీచకునితో....

కందము: 
త్వరగా యమునే జూపెద 
మెరసిన నా పౌరుషమ్ము మెచ్చగ తుళువా!
పురమున కాపుండెవ్వడు 
గిరగిర నినుద్రిప్పి జంప కీచక! ధూర్తా! 

Sunday, 25 June 2017

కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్. 


కందము: 
అలమున్యాశ్రమమందున 
చెలికత్తెలు రాగ తావి చిందగ, చేతన్ 
గలిగిన సొంపుమొగలి రే 
కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్. 

Saturday, 24 June 2017

నిధనము - శవము - పాడె - చితి తో పెండ్లి వేడుక.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - నిధనము - శవము - పాడె - చితి తో పెండ్లి వేడుక.


కందము: 
వలచితినా మరదలునే 
అలశైశవమునను కలసి యాడిన దానిన్ 
వలదని ధనమున్ కట్నము
చెలువుగ పెండ్లాడ పాడె చెంగున మనసే. 

Friday, 23 June 2017

శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్.



కందము: 
తనమాయను తెలియకయే 
పెనుపందిని గొట్టి నరుడు వీరుండగుచున్
ఘనముగనే వేయగ నీ 
శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్?

Thursday, 22 June 2017

కుడి, జడి, పొడి, గడి ... భారతార్థంలో...

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: కుడి, జడి, పొడి, గడి ... భారతార్థంలో... 


కందము: 
పొడిచిన యెండకు నెండుచు
జడివానల తడిసి వనము సైచితి మికపై 
గడిపెదమజ్ఞాతమ్మును
కుడియెడమగ తీరిపోయి కూలును వెతలే. 

Wednesday, 21 June 2017

పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 01 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్.



కందము: 
ఉర్విజని బాలగణపతి 
పర్వతమున తిరుగుచుండ బట్టుక హరియే 
శర్వాణికీయ సుతునే 
పార్వతి ముద్దాడె, మెచ్చి పంకజనాభున్.

Tuesday, 20 June 2017

శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.



కందము: 
శాస్త్రము లెన్నియొ జదివిన
శాస్త్రికి కోపమ్మెయున్న సరిగాదటులే 
మేస్త్రీ కూలీయైనను 
శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

Monday, 19 June 2017

తాళములో నుండు కప్ప దడదడలాడెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తాళములో నుండు కప్ప దడదడలాడెన్.



కందము: 
తాళము పొమ్మన పొరుగున 
తాళము నింటికిని వేసి తాళము క్రిందన్ 
తాళము వేయగ నా పా 
తాళములో నుండు కప్ప దడదడలాడెన్.

Sunday, 18 June 2017

గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.



కందము: 
ప్రీతిగ పలికిన శ్లోకము 
లే తగు రాగమ్ములోన లెస్సగ బాడెన్ 
ఖ్యాతిగనె ఘంటసాలయె 
గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.

Saturday, 17 June 2017

బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్.



కందము: 
హలమును నేలను బట్టుచు 
పలుగోపాలకులు లాగి వక్రత దున్నన్ 
హల! 'చాలు' చాలు చాలని 
బలరాముఁడు 'సీతఁ' జూచి ఫక్కున నగియెన్.

Friday, 16 June 2017

మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 12 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మూడు నాలుగు గలిపిన ముప్పది కద.



తేటగీతి: 
ముప్పు మూడొక్కచోటను కొప్పులున్న 
ముప్పు దుష్ట చతుష్టయమ్మొకటిగాగ 
చెప్ప ముమ్మాటికిని విను ముప్పుముప్పు 
మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

Thursday, 15 June 2017

దిన, వార, పక్ష, మాస మహాభారతార్థంలో....

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




దత్తపది - దిన, వార, పక్ష, మాస మహాభారతార్థంలో....



కందము:  
కద ధర్మ పక్షపాతివి 
మదినమ్మిన వారమయ్య మాధవ! నిన్నే
కదనమ్మున మాసఖునిగ 
సదయుడ తగు సాయమిచ్చి జయమీయ గదే!

Wednesday, 14 June 2017

కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్. 


కందము: 
ఆర్తిగ నిముసమ్మైనను 
కీర్తించిన భవుని గలుగు కీర్తి శుభమ్ముల్ 
పూర్తిగ నెగగొట్టినచో 
కార్తికమున శివుని పూజ, గడుఁ బాపమగున్

Monday, 12 June 2017

ఇది చూ సి.నా.రె.

డా. సి.నా.రె. గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.


Image result for c narayana reddy images



తేటగీతి:
పాటలెన్నియొ చక్కగా వ్రాసినారె
వేల సాహిత్యముల దారి వేసినారె   
చేరి తెలుగును వెలుగగా జేసినారె
వాణి పుత్రుడవీవుగా వాహ్! సి.నా.రె.  

ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు. 


తేటగీతి: 
బీరువాలోని 'చెస్టు'లో బీరుబోక 
దాచియుంతురు సంపదల్ దారుణముగ 
నల్ల ధనమును మార్చుక, నయమునట్టి 
యెదను జీల్పఁ గనంబడు హేమమణులు.

Sunday, 11 June 2017

తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్


కందము: 
మన్నున కష్టము బడుచును 
అన్నియు ఫలితములిక పరమాత్మునివనుచున్ 
అన్నము జగతికి నిడు రై 
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్. 

Saturday, 10 June 2017

పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు



ఆటవెలది: 
గాటనున్నపశువు కాలుదువ్వుటగని
మోరనెత్త జూచి మోజుగనుచు 
దున్న తోడు బంప తోషమున దలచె 
పడ్డ, "వాఁడు కాఁడు చెడ్డవాఁడు".

Friday, 9 June 2017

భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.



కందము: 
శ్రీమతి శ్రీవారు కలిసి 
రేమో మొగమటుగద్రిప్పి, యిట్టుల తుదకున్  
బామాలుచు భర్త పిలిచె 
భామా రమ్మనుచు, ముదిత భర్తను బిలిచెన్.

Thursday, 8 June 2017

విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే. 



ఉత్పలమాల: 
సుప్రజ పెండ్లిగాగ తగుచోటుకు మిత్రుల జేర బిల్వగా 
విప్రులుగానివారు తగ వేడ్కను నిల్వుగ నూపగా తలల్ 
విప్రకులమ్ము నాదనుచు పెద్దగ నడ్డముగానె చక్కగా 
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే. 

Wednesday, 7 June 2017

సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్.


కందము: 
మొగ్గుచు ధర్మము వైపున 
తగ్గట్టుగ పేదవారి దయతో గనుమా 
దగ్గరకే రానీయకు 
సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్.

Monday, 5 June 2017

బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.


కందము: 
గుండా సుబ్బారాయుడు
కండలవీరుండు బూని ఘనమౌ ప్రతినన్ 
దండిగ పునుగులు బజ్జీల్ 
బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

Sunday, 4 June 2017

హారము గొలిచిన నది పది యామడలుండెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హారము గొలిచిన నది పది యామడలుండెన్.



కందము: 
తీరగు ' నెక్లెస్ ' రోడ్డది
యారహదారియె పురమున కావలనుండెన్ 
మీరిన పట్టణ కంఠపు 
హారము,గొలిచిన నది పది యామడలుండెన్.

Saturday, 3 June 2017

దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.


కందము: 
దేవుళ్ళాడక బయటే
దేవుని మదిలోననిలిపి దేహీ! పాహీ!
దేవుడ ! యన రక్షింపని 
దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

Friday, 2 June 2017

కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కారాగారమున ఘనసుఖంబులు దక్కున్. 



కందము: 
గారాబము తో తల్లియె 
మీరుచు తన సుతుల జేరి మెత్తని బుగ్గల్ 
తీరుగ నిమిరిన తోషులు 
కారా? గారమున ఘనసుఖంబులు దక్కున్.


Thursday, 1 June 2017

అయ్యను గని విరహమందె నతివ సహజమే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 11 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అయ్యను గని విరహమందె నతివ సహజమే.  


కందము: 
అయ్యడవిలోన నుండగ 
తొయ్యలి యా శూర్పణఖయె తొందరబడెగా 
నయ్యతి సుందరుడౌ రా 
మయ్యను గని విరహమందె నతివ సహజమే. 

Wednesday, 31 May 2017

రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.


కందము: 
రణమే కనుడిది సరి ప్రే 
రణమును తానీయ గురుడు రంజిలునటు ధా
రణమంది సమస్యా పూ 
రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.

Tuesday, 30 May 2017

ఫాల్గుణమున దీపావళి పండుగ కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఫాల్గుణమున దీపావళి పండుగ కద.



తేటగీతి: 
రాముడనదేవుడేగద, రాజధాని 
హస్తినాపురమేగద, హాస్యమొక్క 
రసము గాదామరియు శిశిరమ్ము గాద   
ఫాల్గుణమున, దీపావళి పండుగ కద. 

Monday, 29 May 2017

రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.



కందము: 
పాకీల పారద్రోలగ 
దూకిన మన సైనికుండు దుర్ మృతినొందన్ 
వ్యాకులత నెలత కన్నీ 
రై, కనువిప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.

Friday, 26 May 2017

నడిరేయిన్ రవిఁగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నడిరేయిన్ రవిఁగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్. 



మత్తేభము: 
వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్ 
సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో 
నొడిలో పుస్తకముంచివ్రాయ రవి,  తా ' మో ' యంచు ధారాగతిన్ 
నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.


తాము (ఓ) యంచు   
ఉత్పలములు = ఉత్పలమాలా వృత్తములు.

Thursday, 25 May 2017

సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.



కందము:
కోతలరాయుడు జెప్పెను
ప్రీతిగ నేభాగవతము పిప్పిని జేస్తిన్
తాతా !వినుమాయందున
సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.

Tuesday, 23 May 2017

అంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.


కందము: 
రంగముపై శివరాత్రిని 
జంగమదేవరలవోలె శంకర యనుచున్ 
లింగని రూపము స్పటిక శు 
భాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.

Sunday, 21 May 2017

జారుల మాటలను వినని జాతి నశించున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జారుల మాటలను వినని జాతి నశించున్.


కందము: 
దూరముగ బెట్టమందురు  
కోరుచు సత్పురుషులెల్ల, ఘోరమొనర్చే
క్రూరుల,జూదరులను మరి  
జారుల, మాటలను వినని జాతి నశించున్.

Saturday, 20 May 2017

రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.


కందము: 
ఆంధ్రుడ శతకమ్మిట సై
రంధ్రీ! యని వ్రాసినావురా పద్యములన్ 
ఆంధ్ర నిఘంటువు వెదకెద  
రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

Thursday, 18 May 2017

పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.


కందము: 
మేలుగ నీరే పారగ 
కాలువనేతీయ తండ్రి గబగబ వెడలెన్
వీలగు వస్తువులివి గున 
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

Wednesday, 17 May 2017

విదియ నేడు వచ్చె విజయ దశమి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విదియ నేడు వచ్చె విజయ దశమి.


తొమ్మిదవరోజు ఊరికి వెళ్తానంటున్న కూతురుతో తల్లి. 

ఆటవెలది: 
వినుమ వెడల రాదు వెనుక వచ్చిన యూరు
తొమ్మిదవదినమ్ము తొందరేల 
నేనుచెప్పుచుంటి, నీవువచ్చినరోజు 
విదియ,నేడు వచ్చె విజయ దశమి. 

Tuesday, 16 May 2017

అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు


తేటగీతి: 
ప్రక్కనిద్దరుపురుషులు బరగ నిలువ
టీవి సీర్యలు నటిజెప్పె ఠీవిగాను 
మందమతియను నాటకమందు జూడ 
నతఁడు నా పతి, మఱి మగఁ డౌ నితండు. 

Monday, 15 May 2017

మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.


తేటగీతి: 
మేఘనాధుడు దాగగా మేఘమందు 
గురినిజూచుచు సౌమిత్రి చురుకుగాను 
శిరముద్రుంచగ శరముతో, జివ్వుమనుచు 
మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.

Sunday, 14 May 2017

కవియే మఱి పతనమునకు కారణమగురా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కవియే మఱి పతనమునకు కారణమగురా. 


కందము: 
భువిలో నెవ్వడును పరుల
యువిదల సంపత్తుగోరు టొప్పనితనమే 
చెవినివి బెట్టనిచో మన 
కవియే మఱి పతనమునకు కారణమగురా. 

Saturday, 13 May 2017

నకులుఁజంపె రామ నరవిభుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - నకులుఁజంపె రామ నరవిభుండు.



ఆటవెలది: 
బాధబెట్ట సురల భార్యనే చెఱబట్ట
చెప్ప హితమును పెడ చెవిని బెట్ట 
బ్రహ్మ హత్య యయ్యు రావణాధిపు డహీ 
న కులుఁజంపె రామ నరవిభుండు.

Wednesday, 10 May 2017

జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.   



ఆటవెలది: 
మంచి 'క్రాపు ' కొరకు "మంగలి"  నేబిల్చి
కత్తిరించమనుచు కాపు చెప్ప 
నీరుజల్లి తలను నిమురుచు దువ్వెనన్ 
జుట్టు లేని "వాడు"  జుట్టు దువ్వె.   

Tuesday, 9 May 2017

పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణసుతుఁడే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణసుతుఁడే.



కందము: 
పద్మారావ్ మాయబ్బాయ్ 
బద్మాషులు కొంతమంది బాధలు వెట్టన్ 
ఛద్మమునే చేదించుచు 
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ!సుతుఁడే.

Monday, 8 May 2017

ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే



చంపకమాల: 
ధృవుడనుబాలుడే భువిని తిట్టగ తల్లియె పట్టునన్ రమా 
ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు, వింటిరే!
భువిని మృకండుసూనుడు యముంగెలిచెంగద బాలుడై యుమా 
ధవుని పదమ్ములన్ గొలిచి, ధన్యత గాంచె నతండు వింటిరే! 


Saturday, 6 May 2017

వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరుల్. 


కందము: 
వడ్డీకాసులవాడట 
వడ్డించును కామితములు భక్తులకొరకై 
దొడ్డగ కుబేరు ఋణమున 
వడ్డీ చెల్లింప లేడు, వర్షించు సిరుల్. 

Friday, 5 May 2017

తన పార్టీ గెల్చినంతఁ దానేడ్చె నయో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తన పార్టీ గెల్చినంతఁ దానేడ్చె నయో.


కందము: 
జనులకు మందును బోసెను
ఘనముగనే డబ్బుబంచె కట్టలుగనెల 
క్షనులో, చివరకు నొకనూ 
తన పార్టీ గెల్చినంతఁ దా నేడ్చె నయో.

Thursday, 4 May 2017

పడతి నాతిని పెండ్లాడ వలెను వలచి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పడతి నాతిని పెండ్లాడ వలెను వలచి.


తేటగీతి: 
ఈడువచ్చిన యువకుడు వీడులోన 
తిరుగకుండగ నాబోతు తీరుగాను 
సంప్రదాయమ్ము నిలబెట్టు సఖిని,సుదతి 
పడతి, నాతిని పెండ్లాడ వలెను వలచి.

Wednesday, 3 May 2017

రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.


కందము: 
మామనుమరాలు మనుమం 
డేమాత్రము సైపబోరు యెవరల్లరి, యో 
మామా! విద్యార్థులకట 
రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.

Monday, 1 May 2017

తల్లీయని పిలుచెనంట తండ్రిని సుతుడే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల్లీయని పిలుచెనంట తండ్రిని సుతుడే. 



కందము: 
పిల్లలు లవకుశులచ్చట 
నొల్లక యశ్వమ్మునీయ నుద్ధతితోడన్ 
అల్లనరాముడు రాగా 
తల్లీ! యని పిలుచెనంట తండ్రిని సుతుడే. 

అని = యుద్ధము.

Sunday, 30 April 2017

బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.



కందము: 
తీరగు "స్ట్రిక్టాఫీసర్" 
'కారు'ను తనప్రక్కనాపి కన్నెర్రలతో 
జేరుచు 'లాఠీ'నెత్తు క  
బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.

Saturday, 29 April 2017

కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను. 



తేటగీతి: 
కోట తిరిపాలు తలిదండ్రి కూచి, వీడు 
వీడు వీడని వాడను వీడు, దూర 
దేశమున కొలువున కవకాశమనుచు 
కో.తి. కొక జాబు వచ్చిన గొల్లుమనెను. 

Friday, 28 April 2017

అక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - అక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.



కందము: 
అక్కలువమించు సొగసులు
నక్కనులకు గలవటంచు నలుపేయైనన్ 
అక్కజముగ మరదలు సీ 
తక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.