తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 31 March 2017

శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్.


కందము: 
శవముగ మారక మున్నే 
శివమయమౌ జగతి నరుడ! చేయుము ప్రీతిన్ 
శివదర్శనమున్, మరి కే 
శవసందర్శనము,పుణ్యసంపద లిచ్చున్.

Thursday, 30 March 2017

అల్లుడ నయ్యెదన్ సుతుడనయ్యెద ప్రాణవిభుండనయ్యెదన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అల్లుడ నయ్యెదన్ సుతుడనయ్యెద ప్రాణవిభుండనయ్యెదన్.ఉత్పలమాల: 
మెల్లగ నాలకింపుమిక మీకిటుజెప్పెద వీరుముగ్గురున్
చెల్లగ నాకు బంధువులు చేరుచునుందును వీరి లోయెదన్ 
ఇల్లిదెయత్త, తండ్రి, సతి నిట్టుల వర్సగజూడ నయ్యెదన్ 
అల్లుడ, నయ్యెదన్ సుతుడ, నయ్యెద ప్రాణవిభుండ, నయ్యెదన్.

Wednesday, 29 March 2017

హే!మా శ్రీ హేమలంబ

అందరికీ శ్రీ హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు. 

  కందము: 
హేమము గోరను నిను నే 
క్షామమ్మే లేక ధరను సరివత్సరమే 
ధీమాగా పాలించుము 
హే!మా శ్రీ హేమలంబ హిత సహితముగా.  

Tuesday, 28 March 2017

తాత, మామ, బావ,మరది.....వానదేవుని పిలచుట

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది - తాత, మామ, బావ,మరది...వానదేవుని పిలచుట  


తేటగీతి: 
ఇనుడు తాతపననుబెంచె వినడు మొరను 
చల్లదనమమర దిశల మెల్లగాను 
మామనస్సుల తనువుల ' మత్తు ' గలుగ 
వానదేవుడ గబగబా వచ్చి పోవ.

Monday, 27 March 2017

రావణ విభీషణులు రఘురాము సుతులు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రావణ విభీషణులు రఘురాము సుతులు. 


తేటగీతి: 
తాతయొక్కడు మరియును తండ్రియొకడు
కవలపిల్లలు గూడను కలసి నటులు
వారు పేరొందె పాత్రల వరుసగాను 
రావణ విభీషణులు, రఘురాము సుతులు

Sunday, 26 March 2017

పాశుపతమ్ము వేసి హరి పార్థుని జంపెను నిర్దయాత్ముడై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పాశుపతమ్ము వేసి హరి పార్థుని జంపెను నిర్దయాత్ముడై.ఉత్పలమాల: 
ఆశగబబ్రువాహనుడు యర్జున పుత్రుడు నశ్వమేధమున్ 
దేశములన్ని దాటి తన దేశము వచ్చిన యశ్వమంట నా 
వేశముతోడ యుద్ధమని వెంటనె రాగను నాగబాణమౌ 
పాశుపతమ్ము వేసి హరి! పార్థుని జంపెను నిర్దయాత్ముడై. 

Saturday, 25 March 2017

మంచుమల యింద్రనీలమై మండుచుండె

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మంచుమల యింద్రనీలమై మండుచుండె. 


తేటగీతి:  
పెనముపైనట్లు కొలిమిని పెట్టినట్లు 
మండుటెండలు మేనుల మాడ్చుచుండె 
వినుడు మనమంత యొకనెల వెడలవలెను 
మంచుమల, యింద్ర! నీల! మై మండుచుండె.

Friday, 24 March 2017

మరణమందు తోడు మాధవునకు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మరణమందు తోడు మాధవునకు.ఆటవెలది: 
పుడమి బాధ దీర్ప పోరుకై వెడలగ 
మరణమందజేయ నరకునకును 
వెంట బడుచు వచ్చె నంటగా సత్యభా 
మ, రణమందు తోడు మాధవునకు.

Thursday, 23 March 2017

వనిత మీసమ్మునంటి తాబలికెనిట్లు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వనిత మీసమ్మునంటి తాబలికెనిట్లు.తేటగీతి: 
కొడుకు వేషమ్ము వేయగా కోయవాని 
గాను బడిలోన, వెడలెను కన్నతల్లి 
"నటన నందరుమెచ్చాలి నాన్న వినుము " 
వనిత మీసమ్మునంటి తాబలికెనిట్లు.

Wednesday, 22 March 2017

భరతుడంపె రాముని వన వాసమునకు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భరతుడంపె రాముని వన వాసమునకు.తేటగీతి: 
ఎంతపనిని జేసితివమ్మ యెరుకలేక 
తల్లితోగూడి జేసెను తనయుడనుచు 
జనము జగమున నిట్లనుకొనును గాద
భరతుడంపె రాముని వన వాసమునకు.

Tuesday, 21 March 2017

నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా


కందము: 
చేరగ తలిదండ్రి దివికి 
భారముగా తలచుచున్న వదినన్నలతో 
పోరును బడుచును కుమిలెడు 
నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా!

Monday, 20 March 2017

కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్. కందము: 
వనితలు మృదుస్వభావులు 
పనిమంతులు కరుణ నిండు పడతులు, సిరులౌ
వినుమా నరుడా! యందుల 
కని,  కరముం జూపఁ దగదు కాంతలపైనన్. 

Sunday, 19 March 2017

లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.


తేటగీతి: 
నారి సీతమ్మ పుత్రుల నామములెవి?
తల్లి యన్నయు తమ్ములు తనయకెవరు? 
హనుమ యెవ్వరికైదెచ్చె నౌషదములు? 
లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు. 

Saturday, 18 March 2017

ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య  -  ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు. 


విరటుడు కంకుభట్టుతో...


తేటగీతి: 
ఉత్తరమ్మున చెరనున్న మొత్త మాల 
నుత్త చేతుల పోరాడి యొసగు మనకు 
నుత్తరించును శత్రుల మత్తనయుం
డుత్తరుం డర్జునునకంటె నుత్తముండు. 

Friday, 17 March 2017

దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.


తేటగీతి: 
వేద గణితమ్ము, లెక్కలు వేగ జేయ 
ట్రిక్కు నిధులను చూపించు టీచరతడు 
రమ్మనంటిని బుజ్జాయి ! రావదేల 
దొంగ! పద, సేవ జేయ నిధుల్ లభించు. 

Wednesday, 15 March 2017

క్రీస్తు పూజనీయుఁడుగాడు క్రైస్త వులకు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - క్రీస్తు పూజనీయుఁడుగాడు క్రైస్త వులకు. తేటగీతి: 
మేరియన్నను 'మదరౌను' సేవజేయు
వనిత 'సిస్టరు' గానుండు వాస్తవముగ 
చర్చి పూజారి 'ఫాదరు' సరిగ వినుము 
క్రీస్తు పూజనీయుఁడు, 'గాడు ' క్రైస్త వులకు. 

రామచంద్రుండు శయనించె రంభ తోడ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామచంద్రుండు శయనించె రంభ తోడ .


తేటగీతి: 
నాడు సంతోషమునుజెంది, వీడె బాధ 
లన్ని సురలకు ననిదల్చి యమర పతియె 
సమరమందున రావణు జంపగానె 
రామచంద్రుండు, శయనించె రంభ తోడ. 

Tuesday, 14 March 2017

కోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.


కందము: 
మాతా పితరులు గోరగ 
ప్రీతిగనే బావ మెచ్చ-వేడుచు మదిలో 
రీతిగ నంజని సుతుడౌ 
కోతిని-పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్. 

Monday, 13 March 2017

మిరపకాయ బజ్జీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - మిరపకాయ బజ్జీ  

ఆటవెలది: 
నోరుకాలుచున్న గోరంత నదరక 
మెండుకారమింత మండుచున్న 
మిరపబజ్జి దినెడు మేదిని నరులకు 
నేర్పు నోర్చుకొనుట నేర్పుగాను. 

Sunday, 12 March 2017

నీరు జల్లినంత నిప్పు రగిలె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - నీరు జల్లినంత నిప్పు రగిలె. ఆటవెలది: 
ఇంద్రజాలమచట నింపుగా జూపించు
నతడు 'స్టేజి ' పైన నా రుమాలు 
బట్టి ' స్టిక్కు ' చుట్టు పలుమార్లు త్రిప్పుచు 
నీరు జల్లినంత నిప్పు రగిలె. 

Saturday, 11 March 2017

పడవలెనని

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పడవలెనని

 


కందము: 
పడవలెనని జడివానలు
పడలనే కాగితముల బట్టుచు చేయన్ 
బడివదలగ  మిత్రుల వెం 
బడితిరిగెడు జ్ఞాపకములు పైపై దిరిగెన్.

Friday, 10 March 2017

అక్కను బ్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అక్కను బ్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్.


కందము: 
అక్కట యొకటే కన్నని 
మిక్కిలి బాధను బడు నొక మీనాక్షిని తా 
మక్కువమీరగ నొక్కడు
న "క్కను" బ్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్. 

Thursday, 9 March 2017

ధాన్యము గని రైతు తల్లడిల్లె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ధాన్యము గని రైతు తల్లడిల్లె.ఆటవెలది: 
వరిని కుప్పనూర్చి, బండిలోనింటికి
రేపు తెద్దమనుచు రేయి గడుప 
పడిన వర్షమునకు పాడైన తడిసిన 
ధాన్యము గని రైతు తల్లడిల్లె.

Wednesday, 8 March 2017

ఉప్పు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - ఉప్పు 

కందము:  
ఉప్పన విశ్వాసంబగు 
నుప్పన రుచియగు వినగను నుర్విని, కనగా
నుప్పన దీపమునార్పుట 
నుప్పందించుట విషయము నొరులకు జెపుటల్

Tuesday, 7 March 2017

సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో సీసము:
ఏకులవృత్తియే చీకుచింతయులేక   
దానితండ్రియె  నేర్పె తాను జెపుమ  
ఏయూనివర్సిటీ కీపిట్ట వెడలుచు
సాంకేతికపువిద్య జదివె జెపుమ
ఏశిక్షణాకేంద్ర మీరీతి గట్టగా 
చెప్పిబంపెను బూని విప్పి చెపుమ
ఏనెట్టులోన తానెట్టులో వెదకుచు 
విధము జూచె నిదియ విధిగ జెపుమ 

ఆటవెలది: 
ఎండ,వానబడదు 'ఏసీ' గ గదియుండు
గ్రుడ్లుపొదుగ పిట్ట గూడిదియె  
సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో 
ప్రకృతి పెట్టె దాని ప్రతిభ గనుమ.

Monday, 6 March 2017

తే! టమాట.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - తే! టమాట.
తేటగీతి: 
చట్ని నుప్మాను పప్పునన్ చారులోను
రుచిని పెంచును కూరలన్ రోజు రోజు 
రాజు కూరలలోజూడ రామములగ 
తేట మాటల జెప్పితి తే! టమాట.

Sunday, 5 March 2017

వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.తేటగీతి: 
శివుని దయయున్న దానౌను చిటికెలోన 
వసుధలోపల నరుడు శ్రీ వల్లభుండు
కరుణ దప్పిన నిక్కమ్ము మరునిమిషము 
వల్లకాటిలోఁ దిరుగు 'శ్రీవల్లభుండు.'

Saturday, 4 March 2017

రోకలికి కాలు జాఱెఁ దె మ్మాకుమందు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రోకలికి కాలు జాఱెఁ దె మ్మాకుమందు. తేటగీతి: 
పచ్చిపాలను మీగడ, వచ్చి వేడి 
పాలవెన్నను జూపగ పట్టి కొరవి 
కోడలాయని యడుగుచు గుమ్మముకడ 
రో! కలికి కాలు జాఱెఁ దె మ్మాకుమందు. 

Friday, 3 March 2017

త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.


ఉత్పలమాల: 
త్యాగయ వ్రాసె కీర్తనల తా మది గొల్చుచు వేలవేలుగా 
నాగకవ్రాసె కోపమున, నమ్ముచు భక్తిని, బాధలందునన్
బాగుగ రామదాసు, మరి పట్టుగ రాముని కీర్తనా సుధల్ 
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.

Thursday, 2 March 2017

వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.తేటగీతి: 
'వేస్టు' ఖర్చనియంద్రుగా వేడ్కలకును
కానియదిజేరు నిజముగా పేదలకును 
పాలు, సరుకులు,పూలకు మేలుగాను 
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.

Wednesday, 1 March 2017

పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.
కందము: 
పగలును నిశియును మనసున 
పగలేమియులేక శాంత పద్ధతి నొరులన్ 
తగు మర్యాదను తా జూ 
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.