తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 30 September 2012

దత్తపది - ఆలము, మేలము, కాలము, గాలము...వాతావరణ కాలుష్యం పై...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

దత్తపది - ఆలము, మేలము, కాలము, గాలము...వాతావరణ కాలుష్యం పై...

కందము:
మేలము లాడకు నరుడా
కాలముతో, ప్రకృతి వికృత కాలుష్య మవన్
ఆలములో గెలువవు లే
గాలమునకు చిక్కి నీదు  కాయము కాలున్.

Saturday, 29 September 2012

సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

కందము:
మరుడను చిచ్చున కాల్చిన
హరుమదిలో మరల పుట్ట, హరి మోహినియై
మరణము వానికి లేదను
సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

Friday, 28 September 2012

ద్వాదశితిథి మంచి దగును దసరా చేయన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - ద్వాదశితిథి  మంచి దగును దసరా చేయన్.

కందము:
మీదట ఏకాదశి ? ఏ
కాదశి ముందున్న దశమి కార్యము కెటులౌ?
ఈదరి పులి ముసుగెందుకు ?
ద్వాదశితిథి - మంచి దగును - దసరా చేయన్.

Thursday, 27 September 2012

దుర్గా భర్గులను కొలువ దురితము లంటున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - దుర్గా భర్గులను కొలువ  దురితము లంటున్

కందము:
దుర్గతి మతులిటు పలుకగ
"దుర్గా భర్గులను కొలువ" - దురితము లంటున్
మార్గము గనుగొని "శరణని"
దుర్గా భర్గులను కొలువ - దోషము తొలగున్.

Wednesday, 26 September 2012

పాదపపు మూలముండు పైభాగమందు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - పాదపపు మూలముండు, పైభాగమందు

తేటగీతి:
వేద వేద్యుడు చెప్పెగా వేద మంత్ర
మాకులాయెను అశ్వత్థ మందు వెలసి
కోవిదులు గన, క్రిందుండు కొమ్మలన్ని
పాదపపు మూలముండు, పైభాగమందు.

Tuesday, 25 September 2012

అలుక విభూషణము సుజను లగువారలకున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-10-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - అలుక విభూషణము సుజను లగువారలకున్

కందము: 
కలలే పండగ పాకను
వల అల్లిక తడిక దులిపి  వాకిట మ్రుగ్గున్
జిలుకగ గోమయమున తా
మలుక, విభూషణము సుజను లగువారలకున్

Sunday, 23 September 2012

శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-10-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే.

శార్దూలము:
చీకాకుల్ పలువెట్టి కొట్టి జనులన్ చేపట్టుచున్ ద్రవ్యమున్
కీకారణ్యమునుండు చోరునకు సాకేతాధిపున్ మంత్రమే
శ్రీ కారంబుగ జెప్ప నారదుడు, తా చెల్వొందె వాల్మీకిగా
శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే!

Saturday, 22 September 2012

మాయ జేయు ఘనుండె గాంధేయవాది.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-10-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మాయ జేయు ఘనుండె గాంధేయవాది.

తేటగీతి:
హింస కంసుల మనసును హంస జేసి
హత్య బుద్ధుల మాన్పించి సత్య మహిమ
చెప్పి శాంతిని కలిగించి చెడును చెరిపి
మాయ జేయు ఘనుండె గాంధేయవాది.

Friday, 21 September 2012

కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-10-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే

కందము:
పెట్టనిచో కాదు జనని
కొట్టనిచో కాదు తండ్రి కొడుకును, చదువన్
తిట్టనిచో కాదు గురువు
కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే !

Thursday, 20 September 2012

మానినీమణి భర్తనే మఱచిపోయె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మానినీమణి భర్తనే మఱచిపోయె.

తేటగీతి:
తిరుమలేశుని జూడగ వరుసలోన
మోకరిల్లుచు దూసుకు ముందు కేగె
తన్మయంబున; చూడక తనదు వెనుక
మానినీమణి భర్తనే మఱచిపోయె.

Wednesday, 19 September 2012

గజముఖ నీదయ లేకను


బ్లాగు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

 


కందము:  
గజముఖ నీదయ లేకను
గజమైనను బ్రతుకు నడుప గలమా దేవా !
గజమాల వైచి గొలుతును
గజగజ వణకుచును బార ఘన విఘ్నములే !