తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 29 February 2012

పాతరలో సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 10-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - పాతరలో సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్



కందము :

ప్రీతిగ ధ్యానము జేయుము
ప్రాత: కాలమ్మునందు పరమేశ్వరునే
ఈ తరి నిద్దుర నీలో
పాతర ! లోసూర్యుఁ డుదయపర్వత మెక్కెన్.

Tuesday 28 February 2012

కుటిలాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 09-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య-  కుటిలాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్.

కందము :
ఇట నాసుపత్రి  జేరగ
కటకమ్మును మార్తురంచు కంటికి,  అకటా !
కటకట! వికటంబాయెను
కుటిలాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్.

Monday 27 February 2012

వల్లకాడులో వివాహ మయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 09-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


         సమస్య -  వల్లకాడులో వివాహ మయ్యె.


ఆటవెలది :
'కాడు' గ్రామ మందు కవిత, కృష్ణల ప్రేమ
పెళ్లి కడ్డు పడిరి పెద్ద లంత
స్నేహి తులును పూని చేసిన చర్యల
వల్ల  'కాడులో'  వివాహ మయ్యె.

Sunday 26 February 2012

భామాకుచమండలంబు భస్మం బాయెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 08-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భామాకుచమండలంబు భస్మం బాయెన్


కందము :
కామారి ముఖము ముద్దిడి
శ్రీమాతను పాల కొరకు జేరగ,   ద్రావన్
ప్రేమలు మీరగ స్కందుడు
భామాకుచమండలంబు భస్మం బాయెన్.

Wednesday 22 February 2012

చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 08-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

 సమస్య - చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు

తేటగీతి :
మల్ల యుద్ధము జేసెడి మల్లి గాడు
మేను వాల్చగ నిదురను మెడను జేరి
చీమ కుట్టగ జచ్చెను,  సింహ బలుడు
చరచి యరచేత నలుపగ చక్కగాను.




Tuesday 21 February 2012

దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు ....


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 07-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.



            సమస్య - దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్

ఉత్పలమాల :

చూచుచు పల్లెటూరి ఘన సోయగమున్, పొలమందు పంటలన్
చూచితి, సవ్వడిన్ వినుచు చోద్యముగా తల నెత్తి గంటి  దో
బూచుల నాడు మబ్బుల  నభోతలమందు విమానమొక్కటిన్,
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్

Monday 20 February 2012

'శివానుగ్రహ ప్రాప్తి రస్తు'.

              వీక్షకులకు మహాశివరాత్రి శివాకాంక్షలు.  'శివానుగ్రహ ప్రాప్తి రస్తు'.

మత్తేభము : 
హరుడా ! సంకట సర్వ పాప హరుడా ! హైమావతీ వల్లభా !
గరుడా రూఢుని డెంద మందు స్థిరుడా ! గంగా ధరా ! శంకరా ! 
పురుగున్ పామును బోయ వాని భువిలో బ్రోవంగ లేదా భవా !
కరుణా  మూర్తివి నీవటంచు దలుతున్ కావంగ రారా శివా ! 

Sunday 19 February 2012

' ప్రజ్ఞా భాస్కరునికి ' పంచ రత్నములు.








బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ( మా అన్నగారు ) శ్రీ గోలి సుబ్రహ్మణ్య శర్మ            అవధాని  గారికి శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది నాడు                 తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు  ప్రజ్ఞా భాస్కర బిరుదముతో 
సత్కరించిన సందర్భముగా నేను భక్తితో సమర్పించిన పద్య పంచ రత్నములు.


శ్రీ దత్త, వేంకటేశ భక్తాగ్రగణ్యా ! సుబ్రహ్మణ్యా !


కం : శ్రీ దత్తాత్రేయుండును 
       వేదము కందని పురుషుడు వేంకట పతియున్ 
       వేదము నేర్పిన గురువులు 
       మీదట జననీజనకులు మిము దీవించున్.


శ్రీ సీతారామయ్య, సుందరమ్మల పుత్రాగ్రగణ్యా !  సుబ్రహ్మణ్యా !


ఆ.వె:'గోలి' వంశజుడవు గోత్రము 'కాశ్యప'
         పల్లె  పల్లనాటి  'పట్లవీడు'
        'సీతరామ ' పుత్ర జ్యేష్టుడవే నీవు
        'సుందరమ్మ' గనిన సుతుడ వీవు. 


శ్రీ బాలగంగాధర శర్మ శిష్యాగ్రగణ్యా! సుబ్రహ్మణ్యా !

ఆ.వె: ఆటలాడు వయసు నన్య పథము బోక 
         స్మార్త విద్య నేర్చి 'గర్త పురిని'
         వేద విద్య బడసి విబుధుండ  వైతివి 
        'కపిల ఈశు పురిని' కష్ట మనక.  


శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయ గురువరేణ్యా ! సుబ్రహ్మణ్యా !
    (పూర్వా శ్రమం : శ్రీ శంకర విద్యాలయం. బాపట్ల)

ఆ.వె: బోధనంబు నందు బాధలు రానీవు 
         వదల బోవు విద్య వచ్చు వరకు 
         హద్దు దాటనీవు ఆచార మిసుమంత
         వదలనీవు శాస్త్ర పరిధి నీవు.

శ్రీకర వేద విజ్ఞాన ప్రజ్ఞా ప్రావీణ్యా ! సుబ్రహ్మణ్యా ! 

కం: అజ్ఞానము నణగారిచి 
      విజ్ఞానము గరపుదువుగ విద్యార్ధులకున్
     'ప్రజ్ఞా భాస్కర' బిరుదము 
      సుజ్ఞానివి నీకు నిడగ శోభను పొందెన్. 

    

గొడ్డు టావు పాలు కుండ నిండె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య - గొడ్డు టావు పాలు కుండ నిండె
  
ఆటవెలది :

కలి యుగమున జూడ కన్పట్టె చిత్రాలు !
విన్నపాలు వినెడి విగ్రహములు
పాలు త్రాగె! చూడ పాల్గారె  వేపకు!
గొడ్డు టావు పాలు కుండ నిండె! 


Saturday 18 February 2012

రారా తమ్ముఁడ రార యన్న యనె నా రాజాస్య ప్రాణేశ్వరున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - రారా తమ్ముఁడ రార యన్న యనె  నా రాజాస్య ప్రాణేశ్వరున్

శార్దూలము : 

చేరన్ పార్థుడు, కృష్ణ యొక్క వనమున్    శ్రీకృష్ణుడే వచ్చెగా
మీరాక్రీ డిని రమ్మ నుండనగనే  మీ యాజ్ఞ చిత్తంబనెన్
చేరన్ బిల్చెను భీముడున్నకులుడున్ చే జూపి  నావైపుకున్
"రారా తమ్ముఁడ! రార యన్న" యనె  నా రాజాస్య ప్రాణేశ్వరున్.  

Friday 17 February 2012

కల్ల లాడు వారె కవులు గాదె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య - కల్ల లాడు వారె కవులు గాదె

 ఆటవెలది :

కల్ల లాడ మనల 'కథలుచెప్పకు' మంద్రు 
కథలు కవిత లల్ల కల్ల వలయు
ముఖము చంద్రు డనుచు  ముక్కు సంపెంగని
కల్ల లాడు వారె కవులు గాదె ! 

Thursday 16 February 2012

కప్పకు సంపంగినూనె కావలె వింటే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


             సమస్య -  కప్పకు  సంపంగినూనె కావలె వింటే

కందము :

అప్పుల తిప్పలు పడు వెం
కప్పకు  మీసాల కున్ను ఘనమగు యింటన్
తుప్పులు పట్టిన తాళపు
కప్పకు  సంపంగినూనె కావలె వింటే!  

Wednesday 15 February 2012

జగను కాప్తమిత్రుఁడు గదా చంద్రబాబు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



సమస్య - జగను కాప్తమిత్రుఁడు గదా చంద్రబాబు 
 
తేటగీతి : 

రొచ్చు పాల్టిక్సు కనలేక పిచ్చి బట్టి
వాగె నిట్టులనొక వ్యక్తి వాడ లోన 

జయకు కరుణకు కుదిరెను సఖ్యతయును 
జగను కాప్తమిత్రుఁడు గదా చంద్రబాబు.

 

Monday 13 February 2012

అక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


 సమస్య - అక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్


నూతన వధూవరులు నమస్కారములు చేసే సందర్భంలో...

కందము :
గ్రక్కున వరుడే బిలిచెను
అక్కా! రమ్మనుచు, మగఁడు నాలిం బిలిచెన్
అక్కకు బావకు మ్రొక్కగ
తక్కిన పనులన్ని మనకు తరువాతనియెన్.  

Sunday 12 February 2012

కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


  సమస్య -  కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు


కందము : 

గౌరి పెద్దన్న పేరేమొ కనకరాజు
'కనక' మామయ్య పిల్లను 'కపి ' యటంచు 
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
'కపిని' కళ్యాణ మాడెను గౌరి కొడుకు. 

Saturday 11 February 2012

మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య - మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్


 శార్దూలము :

కార్తీకంబున దూర దర్శనములో కార్యక్రమమ్ముండెగా
కీర్తీ! ఎప్పుడు వత్తువీవు చెపుమా! ఆత్రంబు లేదేమిటో!
మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో! మధ్యాహ్నకాలంబునన్
నర్తింపంగను నాట్యశాల కెపుడున్ నాకంటె ముందుందువే? 

Friday 10 February 2012

కర్ణు ననిలోన జంపె రాఘవుఁడు చెలఁగి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


  సమస్య - కర్ణు ననిలోన జంపె రాఘవుఁడు చెలఁగి


తేటగీతి : 

రామ రావణ యుద్ధ మారంభ మాయె
తనదు మదిలోన రుద్రుని దలచి కుంభ 
కర్ణు;  ననిలోన జంపె రాఘవుఁడు  చెలఁగి
శత్రు మూకల రావణ సహిత ముగను. 

Thursday 9 February 2012

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


 సమస్య - ఇన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.


చంపకమాల :

వినుమిక నాదు శ్రీమతియె వేడుక మీరగ పుట్టినింటికే
చనియెను కాన్పు నొందుటకు,  చాలొక పిల్లడు చాలునంటి, నే
కనియెద ఆడు పిల్లనని ఖచ్చితమంచును జెప్పె, చూడగ
న్నిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్. 

Wednesday 8 February 2012

మగువను బెండ్లాడె మగువ మరులుదయించన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య -  మగువను బెండ్లాడె మగువ మరులుదయించన్


 కందము:

 మగువా ! నువు నా ప్రాణము
తగునా? నాప్రేమ కాల దన్నగ నన, ప్రే
మగ జూచు పరీక్ష గెలువ
మగువను, బెండ్లాడె మగువ మరులుదయించన్.

Tuesday 7 February 2012

గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



 సమస్య - గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్.


ఉత్పలమాల:

ఎత్తగు వక్ష సంపదయు నెన్నగ చక్కని సోయగంబుతో
మత్తును గొల్పు కళ్ళు గల మాలిని యేగెను మంచి నీటికై
యెత్తెను బిందె నొక్కతరి యేటిని నీటను ముంచి; లేపగా

గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్.

Monday 6 February 2012

పాండురాజుకు పుత్రులు వందమంది

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య -  పాండురాజుకు పుత్రులు వందమంది


తేటగీతి:

పంచ పాండవులే తెచ్చె మంచి పేరు
పాండురాజుకు, పుత్రులు వందమంది
చెడును కురురాజు కిచ్చిరి చివరికిలను
మనసు, మంచియె ముఖ్యమ్ము మందిగాదు. 

Sunday 5 February 2012

జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ము....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

  సమస్య - జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్ .

మత్తేభము:

ఘన నీలాంబరదేహుడై,నిరతమున్ కాలంబులన్ శ్రేష్ఠుడై
కనగా జ్ఞానము గల్గి యుండి వెదుకన్ కన్పించి శిష్టప్రజన్
మునులన్ బ్రోచుచుధర్మమున్నిలుపుటన్ ముందుండి భాసించి దు
ర్జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్ . 

Saturday 4 February 2012

మూడు కనుల వేల్పు మురహరుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య - మూడు కనుల వేల్పు మురహరుండు.

ఆటవెలది:

ఒకరి హృదయమందు నొకరుందు రెప్పుడు
అర్థమొకటె జూడ 'హర 'కు 'హరి ' కి
భేదమేమి లేదు వాదమేల? యొకరె
మూడు కనుల వేల్పు, మురహరుండు.

Friday 3 February 2012

బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య - బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి

ఆటవెలది:  

చారి గొప్ప వాడు, సాధువే, మావూరి
వారి తలను నాల్క,  వైద్యు డతడు
అతనికి తగినట్టి యాలినిచ్చెను గద 
బ్రహ్మ,  చారి భార్య పరమ సాధ్వి. 

Thursday 2 February 2012

తలలొ క్కేబదినాల్గు గానబడియెన్ తద్గౌరి వక్షంబునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


 సమస్య - తలలొ క్కేబదినాల్గు గానబడియెన్ తద్గౌరి వక్షంబునన్.


ఒక సినిమా వాల్ పొస్టర్ లో నాయిక గౌరి వక్షస్థలంపై ఆ సినిమాలోని నటులందరినీ ముద్రించారని భావన...
 
మత్తేభము:
ఇలలో నాయిక 'గౌరి' 'పోస్టరును' తా మీరీతి ముద్రించెగా
వలలా భాగములుండె కప్పుకొనియెన్ వస్త్రంబు వక్షంబుపై
వలలో 'యాక్టరులందరన్' వరుసగా భాగాలుగా జూపగా
తలలొ క్కేబదినాల్గు గానబడియెన్ తద్గౌరి వక్షంబునన్.
 

Wednesday 1 February 2012

సన్నుతి జేయుటొప్పగును సత్య విదూరుల....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య - సన్నుతి జేయుటొప్పగును సత్య విదూరుల నిధ్ధరాస్థలిన్

 ఉత్పలమాల:

ఎన్నికలప్పుడే ప్రజల కెన్నెని తీయని మాటలిచ్చుచున్
ఎన్నిక పూర్తిగాగ 'జనమెవ్వరు?ఛీ' యని మాట మార్చి, సం
పన్నులు గాగ మారుదురు, వారలె గొప్పగు, నేడు జూడగన్
సన్నుతి జేయుటొప్పగును సత్య విదూరుల నిధ్ధరాస్థలిన్.