తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 28 August 2017

కమ్మ-మాల-మాదిగ-బాపన...అన్యార్థంలో.

దత్తపది: కమ్మ-మాల-మాదిగ-బాపన...అన్యార్థంలో.

తేటగీతి: 
వినుమా!లవంగమిలాచి  పిసరు పచ్చ
కప్పురమ్మాదిగావేసి కాస్త పోక
చెక్క సున్నమ్ము నాకుపై జేర్చ, కమ్మ 
నైన కిళ్ళియగును బాప నరుగనివెత.

Sunday, 27 August 2017

చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా

సమస్య - చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా
మత్తేభము: 

మనమున్ మెచ్చగనొక్కదాని గనుచున్ మాట్లాడగా చాటుగా 

చిననాటన్ మదిమెచ్చు స్నేహితుడనే చేబట్టగా గోరితిన్

వినుమా నిన్నిక నిష్టమౌ మనముతో పెండ్లాడ నంచున్ వచిం 

చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా


Friday, 25 August 2017

సిద్ధిబుద్ధి నిమ్ము శివుని సుతుడ.

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఓం గం గణపతయే నమః 


Image result for vinayaka imagesసీ:
సూక్ష్మ దృష్టి గలిగి చూడగావలెనంచు 
చెప్పుచుండునుమాకు చిన్నికనులు 
వినగమంచిచెడుల వేరుజేయు విధము
చెరగమనుచు జెప్పు చేటచెవులు
సన్మార్గములజేర జాగ్రతగ  వెదకు 
చుండుమంచు దెలుపు తొండమెపుడు 
అక్షరములతోడ కుక్షినింపుచునుండ 
పెరుగువిద్యలనును పెద్దపొట్ట 

ఆ.వె: 
శుభ్రత దగుననుచు శుక్లాంబరము దెల్పు  
నగవు నగయనునుగ నవ్వుముఖము 
నీదు రూపుదలచి నేడువేడెద స్వామి 
సిద్ధిబుద్ధి నిమ్ము శివుని సుతుడ.  
  

Thursday, 24 August 2017

నూజివీడులోనున్నది న్యూజిలాండు


సమస్య - నూజివీడులోనున్నది న్యూజిలాండు

తేటగీతి: 
చదువు చక్కగ చదువుచు సాఫ్టువేరు
కొలువు బొందెను మిత్రుడు కోటిరాజు  
వేరుదేశములోనుండు- వీడు పుట్టె 
నూజివీడులో - నున్నది న్యూజిలాండు

Wednesday, 23 August 2017

శకటమే దక్కె నశ్వమ్ము జారుకొనియె.


సమస్య - శకటమే దక్కె నశ్వమ్ము జారుకొనియె. 

తేటగీతి: 
బండి, గుఱ్ఱమ్ము కొనుటకు పట్టుబట్టి 
సంతకేగితి, మిత్రుండు 'జారు ' వచ్చె 
పోటి బడితిమి బేరాన ధాటి, నాకు 
శకటమే దక్కె, నశ్వమ్ము 'జారు' కొనియె.

Tuesday, 15 August 2017

దత్తపది: కాంత - నారి - మగువ - వనిత ..... అన్యార్థంలో రాముని స్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: కాంత - నారి - మగువ - వనిత
           అన్యార్థంలో  రాముని స్తుతి

తేటగీతి: 
అవని తనయను చేకొన్న యధిపునకును 
కీర్తి కాంతత్వమిలవెల్గు మూర్తిమతికి 
చేరి మదనారి మదిదల్చు శ్రీపతికిని 
మధురమగు వచనునకు నమస్సులిడుదు.

Sunday, 13 August 2017

అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు 


తేటగీతి: 
విజయదశమిని బాలలే వేడ్క మీర 
బాల రూపున పూజలన్ బరగ నిలువ 
పట్టి జూజుచు మననున భక్తితోడ 
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

Tuesday, 8 August 2017

శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.


కందము: 
శ్రీరామ రూపమట్టిది
ఆరెప్పలవేయ మరతురాతని జూడన్ 
తీరుగ నాతిగ మార్చిన 
శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.

Tuesday, 1 August 2017

కనులు వేయి గలిగి కాంచలేఁడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కనులు వేయి గలిగి కాంచలేఁడుఆటవెలది: 
కనులు లేనివాడు కనలేడు కాంతిని 
కనులు గలుగువాడు కాంచగలడు 
కాని యున్న కనుల గట్టిగా మూసిన 
కనులు వేయి గలిగి కాంచలేఁడు.