తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 31 August 2015

మల్లెతీగెకు పూచె చేమంతులెన్నొ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మల్లెతీగెకు పూచె చేమంతులెన్నొతేటగీతి: 
మల్లె తీగను, చేమంతి మనసు బడుఛు 
నాటినాడను కుండిలో నాడు - నేడు 
చూడ బట్టెను హతవిధీ ! చీడ లచట 
మల్లెతీగెకు - పూచె చేమంతులెన్నొ

Sunday, 30 August 2015

వెన్నుని " రోల్ "

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - వెన్నుని " రోల్ " 
కందము: 
వెన్ననుదినెనని రోటికి
వెన్నుని కట్టంగ నెంచె నెలత యశోదా
వెన్నును వంచక నిలబడె
వెన్నెల నగుమోము వాడు వేడుక జూపన్

కందము: 
అల్లరి జేసిన పిల్లడు
నల్లని కన్నయ్యకేమొ నడుముకు రోలున్
తల్లి యశోదయె కట్టగ
నల్లన నొకకార్యమునకు నారంభమిదే.

Saturday, 29 August 2015

తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.కందము: 
కలలను మంచివి గనుచు మ
హిలోన నెరవేర్చు కొనుట కెంతయు కృషితో
కలవర పడకను చెడు నడ
తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.

Friday, 28 August 2015

హరికి భార్య పర్వతాత్మజ యుమ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - హరికి భార్య పర్వతాత్మజ యుమ.ఆటవెలది: 
హరుడు సతిని గూడి హరి జూడ వెడలగ  
వెండి కొండ జూడ రండననుచు 
పిలిచె బొట్టు వెట్టి ప్రీతిగా హరిమనో 
హరికి, భార్య పర్వతాత్మజ యుమ.

Thursday, 27 August 2015

వృద్ధురాలిని వధియించె బుద్ధుఁ డలిగి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వృద్ధురాలిని వధియించె బుద్ధుఁ డలిగి.
తేటగీతి: 
బుద్ధు డను పేరు పెట్టిన బుద్ధి పెరిగి 
గొప్ప వాడగు నని దల్చె నిప్పుడేమొ 
బుడ్డి మందుకు సొమ్మమ్మ నడ్డగించ 
వృద్ధురాలిని వధియించె బుద్ధు డలిగి. 

Wednesday, 26 August 2015

కుక్కతోక

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణన - కుక్కతోక తేటగీతి: 
పెక్కు దుష్టుల చిత్తమే కుక్క తోక 
చక్కగానెపుడుండదు కుక్క తోక 
పెక్కుసామెతలనిమిడె కుక్క తోక
కుక్క నూపగ వార్తౌను కుక్క తోక

Tuesday, 25 August 2015

ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా


మొదటి భార్య వలన సంతానం లేక రెండవ పెండ్లి చేసుకున్న వాని మాటలు...
కందము:
పోట్లాడి పెండ్లినాడితి
నెట్లో సతితోడ, రాధనే మలి సతిగా
నెట్లగు తొలి భార్యకిపుడు
ముట్లుడిగిన, రాధ కిపుడు మూడవ నెలరా.

Monday, 24 August 2015

రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.కందము:
ఏమనిచెప్పుదు నప్పుడు
రాముడు, రావణుల యుద్ధ రంగంబునకున్
ప్రేమ నగస్త్యుడు వచ్చెను
రా, ముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.

Sunday, 23 August 2015

కన్నప్ప

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ(న) చిత్రం - కన్నప్ప
కందము:
తిన్నని జ్ఞానము లేదులె
తిన్నని భక్తేమొ పార్వతీశుడు మెచ్చెన్
కన్నుల నీయగ జూడగ
కన్నప్పగ బిల్చి బ్రోచి కరుణను జూపెన్.

కందము:
కన్నప్పగించ జూచెను
కన్నప్పుడు రక్తమింక కారుచు నుండన్
కన్నప్పగించి చూడకు
కన్నప్పను కావుమయ్య కరుణ మహేశా !

Saturday, 22 August 2015

చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె.


తేటగీతి:
కుంతి కన్నియ కనుమానమింత గలుగ
మహిమజూడగ మంత్రమ్ము మదిని దలచె
గదికి బయటను వెలసెను గగనమందు
చంద్ర బింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె. 

Friday, 21 August 2015

వారమన రెండు దినములు వారిజాక్ష

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వారమన  రెండు దినములు వారిజాక్ష

తేటగీతి:
నాకు నుద్యోగమే వచ్చె నాథ ! వినుము
నేను " క్లర్కు " ను పదివేలు నెలకు వచ్చు
శలవులున్నవి వారాన 'శనియునాది
వారమన'  రెండు దినములు వారిజాక్ష!

Thursday, 20 August 2015

తల్లిని గూడి చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తల్లిని గూడి చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.
ఉత్పలమాల:
పిల్లలుగా త్రిమూర్తులను ప్రేమగ జేసియు నూయలూపుచున్
లల్లిల లాలలాలి యని లాలిని
తానసూయ పాడగా
తల్లడిలంగ వాణి, సతితో  సిరివచ్చెను, ప్రకనున్న నా
తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్. 

Wednesday, 19 August 2015

దుష్టాచారములె ముక్తి దొరకొనజేయున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - దుష్టాచారములె ముక్తి దొరకొనజేయున్ 


కందము:
దుష్టుండగు రాక్షసుడే
మాస్టరుగా జేరి జెప్పె మరి శిష్యునికే
శిష్టులు భువిలో సలిపెడి
దుష్టాచారములె ముక్తి దొరకొనజేయున్
Tuesday, 18 August 2015

దత్తపది - సభ,బిల్లు, ప్రతినిధి, తగవు .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

దత్తపది - సభ,బిల్లు, ప్రతినిధి, తగవు
పదాలతో కౌరవసభలో శ్రీకృష్ణుని హితబోధపై పద్యం. 


తేటగీతి:
సంధిజేయగ వచ్చితి సభకు నేను
ఇదియ వినకున్న నగుభయంబిల్లు కూలు
' పాండు కొమరుల ప్రతినిధి! పలుక వలదు
తగవు నీవని ' దెప్పగా తగవులేను.

Monday, 17 August 2015

రావులు మువ్వురు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ(న) చిత్రం - రావులు మువ్వురు

ఆటవెలది:
వారి నటన ప్రతిభ పాటలో పలికించు
ఘంటసాల వారు ఘనముగాను

 గాత్రమునకు తగ్గ గాంభీర్యమౌ నటన
నెంటియారు చేయు నేయెనారు.


కందము:
రావులు మువ్వురు సినిమా
జీవితమున రాజులగుచు జీవించిరిగా
రావలయు మరల వారలు
కావలెనని కోరుచుండెగా తెలుగిళ్ళే.

Sunday, 16 August 2015

భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

కందము:
వెగటగు పరమాన్నమ్మే
తెగ రోగము గలుగువార్కి, తెలియక విలువల్
పగ నెంచ హిందువులపయి
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

Saturday, 15 August 2015

మువ్వన్నెల కేతనంబు


అందరికీ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

కందము:
పువ్వుల రేకులు రువ్వుచు
దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్

చివ్వలు వలదని నవ్వుచు
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

మన మనమన మనమె మనమె మనమన మనమే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మన మనమన మనమె మనమె మనమన మనమే


కందము:
మనమన తెనుగున మనమగు
మనమనగా సంస్కృతమున మనసందురుగా
మనభాష సొగసు జూడుడు
మన మనమన మనమె మనమె మనమన మనమే

Friday, 14 August 2015

మగని జడలోన మందార మాల ముడిచె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మగని జడలోన మందార మాల ముడిచె

తేటగీతి:
సొగసు గనియగు వనితకు శోభగూర్ప
కొనుచు దెచ్చెను పూల చేకొనగ నిచ్చె
మగువ మెచ్చుచు క్రీగంట మగని భంగి
మగని, జడలోన మందార మాల ముడిచె

Thursday, 13 August 2015

గంగాధర


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ(న) చిత్రం : గంగాధర

 
 


కందము:
గంగాధరుడా యేమిది
గంగమ్మను దించినావ కలతను బరువై
కంగారేమియు పడకను
జంగమ దేవర నుతింతు సద్భక్తుడనై

Wednesday, 12 August 2015

శివ - శక్తి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం : శివ - శక్తి  

 
తేటగీతి:
నాగుబాములిచట నగల తళ్కు లచట
తెల్లని యొడ లిచట నల్లదచట
గట్టిచర్మమిచట పట్టుపుట్ట మచట
కారుచిచ్చులిచట కరుణ యచట.

తేటగీతి:
చేరె నిచట నెద్దు సింగగర్జన లట
భిక్షమిచటనన్న రక్షణ యట
బూదిపూత లిచట పూనూనె లచ్చట
ప్రమథగణము లిచట ప్రమద మచట.


ఆటవెలది:
అచటనిచటి రెండు నచ్చము నొకటాయె
నాదిదంపతులుగ నమరిపోయె
భిన్నమైన జగతి భీతిల్ల పనిలేదు
స్తవముజేయ గలుగు శివము, శక్తి. 

Tuesday, 11 August 2015

మేక మెడచన్నుపాలతో మేలు గలుగు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మేక మెడచన్నుపాలతో మేలు గలుగు.
తేటగీతి:
మల్లి తోడను తాజెప్పె మంత్రగాడు
తెమ్ము వీటిని సాంబ్రాణి తిప్పతీగ
నల్ల కోడిని, నిమ్మయు, నాగజెముడు
మేక మెడచన్ను, పాలతో మేలు గలుగు.

Monday, 10 August 2015

రాత్రి యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రాత్రి యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు

ఆటవెలది:
నూత్న వటువు వేడ్క నుదయమ్ము కోసమై
యెప్పుడెప్పుడనుచు నెదురు జూచె
ప్రొద్దు పొడువ గడచి పోవగా నాపాడు
రాత్రి, యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు. 

Sunday, 9 August 2015

తండ్రీ ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తండ్రీ ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.

కందము :
ఉండ్రాజవరపు బిడ్డడ
పుండ్రమ్ముల దాల్చువాడ పురుషోత్తముడా
పండ్రెండేండ్ల సుపుత్రుని
తండ్రీ ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.

కందము :
హండ్రెడ్ పర్సెంట్ క్యూరగు
చుండ్రును వదిలించవచ్చు , చూడుము షాంపూ
గాండ్రింపులేల కవలల
తండ్రీ ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.

Saturday, 8 August 2015

పగటి పూటనిద్రింప సంపద పెరుగును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పగటి పూటనిద్రింప సంపద పెరుగును


తేటగీతి:
పనియె లేదని యేడ్చేవు వరద రాజ !
నైటు వాచ్మెను నౌకరీ నయముగాను
రార ! చూపెద పనిజేసి రాత్రులందు
పగటి పూటనిద్రింప సంపద పెరుగును

Friday, 7 August 2015

కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

కుంతి స్వగతం...
 
తేటగీతి:
వెలుగు రేనిని పిలచితి తెలివి లేక
మంత్ర మహిమను చూడగా మందమతిని
పట్టినొసగెను నాబాగు పట్టకుండ
కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి.

Thursday, 6 August 2015

శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

కందము:
శార్ఙ్గ్యంఘ్రి యనగ నేమిటి ?
శార్ఙ్గ్యంఘ్రి స్మరణ మేది సమకూర్చునయా ?
శార్ఙ్గ్యంఘ్రి ' విష్ణు పాదము '
శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

Wednesday, 5 August 2015

కుంభకర్ణుండు రూపసి కుంతిమగడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుంభకర్ణుండు రూపసి కుంతిమగడు.


తేటగీతి:
పోలికేమియు లేదులే పోల్చి చూడ
వాదమెందుకు వినగదే వారిజాక్షి
కనగ నుదరంబు పెద్దగా గలుగు వాడు
కుంభకర్ణుండు, రూపసి కుంతిమగడు. 

Tuesday, 4 August 2015

యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
కందము:
యమకష్టము మీదకు సమ
యములేకను వచ్చి వాల, హతవిధి యనుచున్
యమహాయిని గూర్పెడు సా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్. 

Monday, 3 August 2015

కోట్లు దినుట నేర్చె కుక్కుటములు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కోట్లు దినుట నేర్చె కుక్కుటములు
ఆటవెలది:
కోళ్ళ బెంచు వాని కొడుకు దినుచు ' నోట్సు ' (oats
)
వాటికిచ్చు కొన్ని వైనముగను
రోజు రోజున కవి రుచి మరిగి వదల
' కోట్లు ' దినుట నేర్చె కుక్కుటములు

Sunday, 2 August 2015

ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా

కందము:
ఆడెడి క్రికెట్టునందున
నోడగ " ఫిక్సింగు " జేసి నోట్లను ముంచన్
వీడుచు దేశపు భక్తిని
ఓడిన, వారలకు దృప్తి యొనగూడు గదా ! 

Saturday, 1 August 2015

రాక్షస వంశ సంభవుడు రాముడు రావణుగన్నతండ్రియే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రాక్షస వంశ సంభవుడు రాముడు రావణుగన్నతండ్రియే

ఉత్పలమాల:
శిక్షణనీయకున్న మరి చిన్నపుడేమియు నేర్పకుండినన్
రక్షణనీయకున్న మన రమ్యపు గాథల జెప్పకుండినన్
భక్షణ జేయ సంస్కృతిని పౌరులు రేపిక నిట్లు జెప్పుగా
'రాక్షస వంశ సంభవుడు రాముడు రావణుగన్నతండ్రియే '