తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 29 January 2018

విజయ దశమి వచ్చు విదియ నాడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - విజయ దశమి వచ్చు విదియ నాడుఆ.వె: 
శెలవులిచ్చినారు చిన్నవానికి పాఠ 
శాలయందు, వాడు వీలుజూచి
బయలుదేరు గాద పండుగే మనకిక 
విజయ దశమి, వచ్చు విదియ నాడు.

Wednesday, 24 January 2018

చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్. 


కందము: 
మిద్దెనుగట్టించుక తా
ముద్దుగ జొచ్చుటకు మంచి మూర్తంబడగన్ 
పెద్దలుజెప్పగ జేరెను 
చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్. 

Monday, 22 January 2018

రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే.ఉత్పలమాల: 
చేవనుగల్గి బంధువులె చేయుప్రదర్శన లెన్నొ యేండ్లుగా 
నీవిధి వీధినాటకములిచ్చటనచ్చట వేయుచుంద్రుగా 
బావయ చెప్పుచుంటివిను వారలమధ్యన వావివర్సలన్ 
రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే.

Wednesday, 17 January 2018

నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్


కందము: 
నాగుల పటమును దెచ్చెను
నాగులకే పూజసేయ నయముగ పతియే 
బాగున్నదనుచు భక్తిని  
నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్

Monday, 15 January 2018

సంకురాతిరి వేళలో సంబరమున.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 

సీసము: 
గోమయమ్మును దెచ్చి కొట్టి ముద్దలుజేసి
గొబ్బిళ్ళు జేసిన గురుతు దలచి
హరిదాసు కోసమై యరదోసిలిని బట్టి 
బియ్యమ్ము దెచ్చెడు వేడ్క దలచి 
సన్నాయి మేళమ్ము శ్రావ్యమ్ముగామ్రోగ  
గంగి రెద్దులగంతు  ఘటన దలచి
తోకనే తగిలించ తూకమ్ముతోలేచు 
గాలిపటమ్ముల మేలు దలచి 

తేటగీతి:   
నాటి గుర్తులు మనమున నాటియుండ 
ఉత్తరాయణ కాలమే యుర్వి రాగ  
మనము చేరుదమొక్కటై మరలి రండు
సంకురాతిరి వేళలో సంబరమున.       

Sunday, 14 January 2018

భోగిరోజును గడిపెదమోయి రండు.

అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. 

సీసము:
ఉదయమ్ముననులేచి మదినిండ హాయితో
భోగిమంటల చుట్టు తిరిగి తిరిగి
ఆముదమ్ము చెవుల నాముదమ్మున వేసి
దూదుండలను లోన దూర్చిదూర్చి
కుంకుళ్ళ రసముతో గొనిరేగుపండ్లను
వేసి నీటిని తల పోసిపోసి
కళ్ళుమండెడువేళ గండ్రుప్పు నేనోట
నయముగానేబుగ్గ నాన్ చి నాన్ చి

తేటగీతి:
క్రొత్తబట్టల ధరియించి కోర్కెదీర
నల్వురందున దిరిగిన నాటి గురుతు
మరలనొకమారు తలపోసి మనమునందు

భోగిరోజును గడిపెదమోయి రండు.


      

Thursday, 11 January 2018

మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్. 


కందము: 
మెల్లగ కాళీయునిపై 
నల్లనివాడెక్కిత్రొక్క నా బుసల సెగన్ 
అల్లన తటిపై తీగెకు 
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్. 

Monday, 8 January 2018

కనుల రెప్ప లకట కత్తులాయె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - కనుల రెప్ప లకట కత్తులాయె.ఆ.వె:  
దుష్టుడైనవాడు దూరానగనుపింప 
కలికి తిట్టుకొనుచు కనులలోన
వానిబొమ్మదలచి వరుసరెప్పలగొట్టె 
కనుల రెప్ప లకట కత్తులాయె.

Monday, 1 January 2018

హియరీజ్ కమింగు సీ న్యూ

అందరికీ 2018వ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

కందము: 
హియరీజ్ కమింగు సీ న్యూ
ఇయరిన్ ఫ్రంటాఫ్ యు ఫ్రెండ్సు హే టెల్ గ్రీటింగ్స్ 
ఇయరీజ్ వెయిటింగ్ ఫర్, నో
ఫియర్సు, విష్ ఆల్ యు హ్యాపి, బెస్టిన్ ఫ్యూచర్.