తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 31 May 2012

అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె. 

తేటగీతి: 
వ్రాసె నాయొక్క అభిమాన రచయిత మరి  
పూర్తి యగు దాక విడలేదు పొత్తము కొని
కోరి చదివితి నీనాడు క్రొత్త నవల
'అడవిఁ గాచిన వెన్నెల' హాయి నొసఁగె.


తేటగీతి:
అరయగా నరణ్యమునకు నర్థమేమి?
వెన్న నేమి జేయగ వచ్చు వేడి నేయి?
నిండు పున్నమి యేమిచ్చె నేడు నీకు? 
అడవిఁ - గాచిన - వెన్నెల హాయి నొసఁగె.


తేటగీతి:
ప్రభుత పథకమ్ము లన్నియు పట్టి జూడ 
నడవిఁ గాచిన వెన్నెల,  హాయి నొసఁగె
పద్మనాభుని యనంత పడగ నీడ
పడగ లెత్తిన నిధి కన పడగ నేడు.


తేటగీతి:
రంగురంగుల చిత్రమ్ము రమణి గీయ 
చూచి నాడను, మెచ్చితి చూడ నాకు 
'అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసగె
ను సెలయేటి పై మెరయుచు నున్న తళుకు'.Wednesday, 30 May 2012

అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్ (వగచెన్)


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్ (వగచెన్)

కందము:
బొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులను నాకు తెచ్చిమ్మని - వా 
డల్లరి జేయగ  మామకు
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె వగచెన్.


కందము:
చిల్లర ఖర్చుకు సైత 
మ్మొల్లని మామకు సరైన ముకుతాడయ్యెన్ 
యిల్లును కట్టిమ్మనగా 
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.

Tuesday, 29 May 2012

వ్యాధి యుపశమించె బాధ హెచ్చె


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వ్యాధి యుపశమించె బాధ హెచ్చె 

ఆటవెలది:
జలుబు జేయ నాకు స్వంతముగా తెచ్చి 
మాత్ర వేసి నాను, మరు దినమున 
మందు పవరు పెరిగి మంటలే యొడలంత
వ్యాధి యుపశమించె, బాధ హెచ్చె. 


ఆటవెలది:
కోర్టు వ్యాజ్యమునను కోటిగారే గెల్చె 
స్థల వివాద మిపుడు సమసి పోయె
కళ్ళు దేల వేసె ఖర్చు లన్నియుగూడి
'వ్యాధి యుపశమించె, బాధ హెచ్చె. '

Monday, 28 May 2012

కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా? 

ఉత్పలమాల: 
దెబ్బలతోడ నేననెడి  దేహపు భ్రాంతిని వీడినట్లుగా
కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?
దుబ్బుగ నున్న పీచనెడి దుష్టపు మాయను పీకి వేసి యా 
కొబ్బరి గుజ్జు, నీరమను కోరిన జీవిత మిచ్చి బ్రోవడా ?

Sunday, 27 May 2012

అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్.

కందము: 
పొరబాటని తా జెప్పడు
మరి భారతమున్ జదువడు మా సుబ్బారావ్
సరి సగము దెలిసి చెప్పును 
"అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్."

Saturday, 26 May 2012

అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్.

కందము: 
క్రుంగక మనసున జన వా 
క్కుంగని తనధర్మ మునకు, కులసతియైనన్ 
భంగము నొల్లక, తన య 
ర్థాంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్.


కందము:
చెంగున స్వాతంత్ర్య సమర 
రంగములో దూకి తాను రయమున దెచ్చెన్
అంగపు వస్త్రము గట్టుచు
అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్.

Thursday, 24 May 2012

అల్లరిమూకలను పిలిచి యభినందింతున్శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అల్లరిమూకలను పిలిచి యభినందింతున్ 

కందము: 
అల్లరి చిత్రము జూచితి
పిల్లలతో కలసి, నాకు పిచ్చగ నచ్చెన్
అల్లదొ!యూనిట్ వచ్చెను 
'అల్లరి' మూకలను పిలిచి యభినందింతున్.


కందము: 
పిల్లలు జేయక నల్లరి, 
చిల్లరగా పెద్దవారు చేతురె? మదిలో 
కల్లా కపటము తెలియని 
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్.

Wednesday, 23 May 2012

అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.

ఉత్పలమాల: 
ముచ్చట గొల్పు తెల్గు యిది మోముకు శోభయె మాటలాడ,నీ
కిచ్చిన లడ్డు మీద గన 'కిస్మిసు కాజు' పసందు గూర్చుగా
మెచ్చగ వచ్చు దాని రుచి మిన్నగ జేసెడు 'వర్డ్శ్ ' వాడగన్ 
అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా. 

Tuesday, 22 May 2012

పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్.

కందము: 
ఉదయము గుడిలో చోరుడు
పదిమందికి దొరుక చేసె బడితెల పూజన్ 
పదపడి మ్రొక్కుచు పలుకగ
పదములు లేనట్టి వాఁడు పరుగులు వెట్టెన్. 

Monday, 21 May 2012

హరికి గీతను బోధించె నర్జునుండు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హరికి గీతను బోధించె నర్జునుండు.

తేటగీతి:
అక్క జేరెను హరి తండ్రి అర్జునుండు 
"బావ పై మరదలుగీత మరులు గొనెను 
మేన రికమును చేయుట మేలు యిమ్ము 
హరికి గీతను"- బోధించె నర్జునుండు.

Sunday, 20 May 2012

యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?


పెద్దవాడైన శ్రీ కృష్ణుని జూచి వ్రేపల్లె వాసులు ఆశ్చర్యంతో ...

మతిపోయెన్ మన కృష్ణు జూడ , గతమున్ మాయింట పాల్వెన్నలన్
జత గాళ్ళందర గూడి దొంగిలి, కనన్ జారేను గా పిల్లిలా !
పతి లోకంబుల కాయె నేడు కనగా , బాలుండు పాలుండయెన్ !
యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?

Wednesday, 16 May 2012

రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్

కందము: 
క్యాజీ!దేఖ్ జీ! విన నిటు 
రా  జీ! నామాల జాతరకుఁ దెర లేచెన్
ఈజీ గా పెట్ట ప్రజకు 
రోజీ డ్రామాల జూచి  రోనా 'మా' జీ!

Monday, 14 May 2012

ష ఆది క్ష అంతము నందు గల పద్యము


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ష ఆది క్ష అంతము నందు గల పద్యము.

కందము: 
షండులె నీముందందరు
గండరగండ!పురుష!మరి గతి నీవేరా! 
పండుగ మాకగు నాడే
నిండుగ నీ కరుణ దడువ నిగమాధ్యక్షా!!

Sunday, 13 May 2012

లోకపాలు లేకున్నను లోటు లేదు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - లోకపాలు లేకున్నను లోటు లేదు.

తేటగీతి:
చెడ్డ వారిని నిలబెట్టి చెరిగి వేసి
మంచి వ్యక్తుల నిలబెట్టి మనము కలసి
ప్రజల పాలన నందరు పాలుగొనగ
లోకపాలు లేకున్నను లోటు లేదు.

Thursday, 10 May 2012

దత్తపది - ఇఱుకరాదు, కొఱుకరాదు, నఱుకరాదు, పెఱుకరాదు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - ఇఱుకరాదు, కొఱుకరాదు, నఱుకరాదు, పెఱుకరాదు.

తేటగీతి: 
ఏరి  కోరి సమస్యల నిఱుకరాదు
కోరి పండ్ల నెవరి పైన కొఱుకరాదు
పెరుగ తెల్లని జుట్టును  పెఱుకరాదు
నరుడ!కూర్చున్న కొమ్మను నఱుక రాదు.

Wednesday, 9 May 2012

కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్ 

కందము: 
అరవక కరవక గప్ చుప్!
అరవములో ముఖ్యుడైన ఆ రాజాతో 
మరికలువ 'టూజి స్కామున' 
కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్.

Tuesday, 8 May 2012

చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్

హాలాహలం పుట్టినప్పుడు లోకాలన్నీ గజగజ వణికి పోతుంటే భయపడకండి నేనున్నానని చెపుతూ... భూమాతను ప్రేమతో దగ్గరకు తీసుకుని లాలించినట్లు భావన ... 

కందము:
కందుకము వోలె భూమిని 
పొందికగా చేతబట్టి పోగొట్ట భయం 
బందముగ హరుడు ముద్దిడ 
చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్.  

Monday, 7 May 2012

ఆనందింతురు క్రొత్త దంపతులహో యాషాఢ మేతెంచినన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఆనందింతురు క్రొత్త దంపతులహో యాషాఢ మేతెంచినన్ 

శార్దూలము: 
ఆనవ్వుల్ మది లోన నింపి మరియున్నా మాట పాటల్ సదా 
ధ్యానంబందున నన్నపానములలో తా ప్రక్క నూహించుచున్
మేనుల్ దూరము లైనగాని విరహమ్మే క్రొత్త గా నుందటం
చానందింతురు క్రొత్త దంపతులహో! యాషాఢ మేతెంచినన్.
Sunday, 6 May 2012

చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్

కందము:  
దడువకు, నిర్మల చిత్తము 
మడిగట్టుక, లోకమునకు మాతా పితలై 
అడిగిన చాలును రక్షిం 
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్.

Saturday, 5 May 2012

అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్

కందము: 
రిస్ఖేమియు లేదనుచును 
తా స్ఖలనము నిడక వీర్య దానము చేయన్
చూస్ఖో గొడ్రాళ్ళు గనిరి 
'అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్.'

Friday, 4 May 2012

ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్

కందము: 
ఉదయము భామకు కోపము
పదపడి నే బ్రతిమి లాడ భగ్గున మండెన్
సదమల వాక్కులు చెల్లునె ?
ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్.

Thursday, 3 May 2012

మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.

కందము: 
గతి చెడి  యెటులో జనస
మ్మతమున తా సభ్యుడగుచు మంత్రిగ నుండన్
హత విధి ! మన చట్ట సభను
మతిలేని నరుండు  మిగుల మన్నన నొందున్.

Wednesday, 2 May 2012

రావణున కంజలించెను రామపత్ని


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 01-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రావణున కంజలించెను రామపత్ని

తేటగీతి:  
చెప్పెను విభీషణుడు తాను చేతులెత్తి 
రావణున కంజలించెను; "రామపత్ని
నిప్పు వంటిది  కాలును నీవు గోర
నిట్లు,  కోరుము కాలుని నీవు గోర". 

Tuesday, 1 May 2012

సిరులవలన నేఁడు చేటు గలిగె


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 30-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సిరులవలన నేఁడు చేటు గలిగె

ఆటవెలది:  
స్విస్సు బ్యాంకు నందు సిగ్గులేకను దాచ 
'రియలు బూము' లందు 'రిచ్చి' గాగ 
నడిచి వచ్చి నట్టి నడమంతరపు పాడు 
సిరులవలన నేఁడు చేటు గలిగె.