తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 30 June 2013

కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్
కందము:
ఈ కీకారణ్యములో
భీకర రాక్షసుల జంపు, విను యజ్ఞమునన్
చీకాకులు రావిక లో
కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్.

Saturday 29 June 2013

రంకు నేర్చిన చిన్నది బొంకలేదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రంకు నేర్చిన చిన్నది బొంకలేదు.

తేటగీతి:
మాయలేడి కిలాడిని మాయ జేసి
రాసలీలల చిత్రించి రట్టు జేసి
తెల్గు 'చానళ్ళ ' చూపించి తెలియ జేయ
రంకు నేర్చిన చిన్నది బొంకలేదు.

Friday 28 June 2013

పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.


కందము:
మిత్రుడు పిలచెను నన్నే
చిత్రములో నాయకునిగ చేయగ, నాన్నా!
చిత్రము 'హిట్' కాదో మీ
పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.

కందము:
మిత్రునితో పోటీ పడి
ఆత్రముగా నే గడింతు ' ఐ ఐ టీ' నా
మాత్రము చేయని చో మీ
పుత్రుడ నే గానటంచు పుత్రుడు పలికెన్.

Thursday 27 June 2013

గంగవెర్రులెత్తి గంగమ్మ యుప్పొంగె







 











గంగాధరుని చూచుటకు వెళ్ళి గంగ పాలైన వారికి నివాళులర్పిస్తూ...
  
ఆటవెలది:
గంగవెర్రులెత్తి గంగమ్మ యుప్పొంగె
వరద వచ్చె భక్త  వరదు ముందె
మూడు కనుల ముందె మూడెగా జనులకు
శవములెన్నొ తేలె శివునిముందె.

కందము:
కట్టగ లేదా గంగను
గట్టిగ నీ జుట్టునందు గంగే తానై
నెట్టుక వచ్చెన చెపుమా
ఇట్టుల జరిగెను హర !హర ! యిల ఘోరంబే !

Wednesday 26 June 2013

మూర్ఖు డతడు రాజ పూజితుండు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మూర్ఖు డతడు రాజ పూజితుండు 

ఓటు ఆయుధముగాగల ఓటరు గురించి...
ఆటవెలది:
ఆయుధమ్ము చేత నమరియున్ననుగాని
వాడి మార్చు కొనడు వాడి బ్రతుకు
ఓట్ల నడుగు వాని యుచ్చులో పడు వాడు
మూర్ఖు డతడు 'రాజ పూజితుండు'.

Tuesday 25 June 2013

తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య- తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

ఆటవెలది:
విద్య విలువ దెలిపి విద్యార్థికే నేర్పి
వాని జగతి గొప్ప వాని జేయ
తప్పు దిద్దుకొనెడు ధైర్యంబు నిచ్చుచు
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

Monday 24 June 2013

పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.

కందము:
నందికి గౌరవ మీయగ
పందిరిమంచమున పూలు పఱచుటె మేలౌ
పందియె వచ్చిన పిలువక
పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.

Sunday 23 June 2013

గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.
బిడ్డ యెలా ఉన్నా గానీ తల్లికి మన్మథుని లాటి అందగాడే...

కందము:
వట్రువ ముఖమా కాదది
పట్రాగా గజ ముఖమ్ము పతియే బెట్టెన్
'ఇట్రా మాతా' యనగా
గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

Saturday 22 June 2013

నాలుగైదు కలుప నలువదయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - నాలుగైదు కలు నలువదయ్యె.

ఆటవెలది:
మూడు మార్లు పదిని ముచ్చటగా వేసి
కలిపి వేసి క్రింద కలుపు మొకటి
పైన వేయు మిచట బాలుడా దానికి
నాలుగైదు కలు
నలువదయ్యె.

Friday 21 June 2013

పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్
కందము:
పరగగ 'వా' కును 'పా' కును
చిరు భేదము తెలియనట్టి చిరుతడు వ్రాసెన్
'వర పురుషు ' మాట నిట్టుల
'పరపురుషునికై' తపింపవలె సతి యెపుడున్.

Thursday 20 June 2013

శని పట్టిన వారల కగు సకలశుభమ్ముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - శని పట్టిన వారల కగు సకలశుభమ్ముల్.

కందము:
వినుమీశ నిన్ను వదలను
కను కరుణను దాటనిమ్ము కష్టములనుచున్
వినుతించ వాడె జూచును
శని పట్టిన, వారల కగు సకలశుభమ్ముల్.

Monday 17 June 2013

పెన్నిధులు గల్గి సుఖియించు బేద వాడె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పెన్నిధులు గల్గి  సుఖియించు బేద వాడె

కందము:
శాంతి గలిగిన నొనగూరు సౌఖ్య మెపుడు
సుఖము శాంతిని బొందడు చూడ నొకడు
పెన్నిధులు గల్గి, సుఖియించు బేద వాడె
సకల సిరులేవి లేకనె శాంతి యున్న. 

Saturday 15 June 2013

మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే.


కందము:
మాధవుని వీడె లక్ష్మియె
మాధవునే కాలదన్న మదమున ఋషియే
బాధలను పెంచె విరహము
మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే.

Monday 10 June 2013

నరకలోకము గలదండ్రు నాకమందు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - నరకలోకము గలదండ్రు  నాకమందు.

 తేటగీతి:
మందు వేసుక జెప్పెను 'మందుడొకడు'
నాకలోకము కనుపించు  'నాక '  మందు
చేరి జెప్పితి " నీవంటి వారి కొరకు
నరకలోకము గలదండ్రు  నాకమందు'".

Sunday 9 June 2013

సినిమాలను జూచు వాఁడు శ్రీమంతుఁ డగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - సినిమాలను జూచు వాఁడు శ్రీమంతుఁ డగున్


కందము:
సినిమాలు తీయ నాంగ్లపు
సినిమాలను జూచు  వాఁడు శ్రీమంతుఁ డగున్
సినిమాను మార్చి మరి కా
సిని  గ ' మ్మత్తులను ' జేర్చి ' చిత్రము ' జేయన్. 

Saturday 8 June 2013

అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు. 

తేటగీతి:
వంట రుచులకు పెట్టరు వంక లేమి
విసరి కసరరు రోగమ్ము పెరుగు ననుచు
మగువ కెప్పుడు చూడగా మగని కున్న
అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.

Friday 7 June 2013

వర్ణ(న)చిత్రం - మాయాబజారు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న)చిత్రం - మాయాబజారు.














సీసము:
భళి భళీ యని చాటె భగవంతు లీలలు
మాయ సుందరి దివ్య మహిమ జూపె 
అసమ తసమ దీయు లనుచు భాషను నేర్పె 
వీరతాళ్ళు మెడను వేసి మెచ్చె 
పుష్టిగాను వివాహ భోజనంబును బెట్టె
విరహమందు సుఖపు విలువ జెప్పె 
ఓహొహో జగమును లాహిరీ యని యూపె
ఓంశాంతి శాంతనె నుచిత రీతి 

ఆటవెలది: 
మరపు రాక మనల మదిని మాయబజారు 
తెలుగు నాట వెలసి వెలుగు చుండె 
యస్వి,యంటియారు, అక్కినేన్రేలంగి 
సహజ నటిని గూడి సరసముగను

Thursday 6 June 2013

కోయ వాడు గొట్టె కుపితుడగుచు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కోయ వాడు గొట్టె కుపితుడగుచు.


ఆటవెలది: 
తోట లోన జేరి తుంటరి బాలుండు
చెట్టునెక్కి మిగుల దిట్టయగుచు
కాచు(పు)వాని యునికి గాంచక పండ్లను
కోయ, వాడు గొట్టె కుపితుడగుచు. 

ఆటవెలది: 
పంది నాదనుచును పందెముతో పోరె 
నరుడు కోయరూప హరుడు నాడు 
అర్జునుండు కొట్ట నావేశమున మాయ 
కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.

Tuesday 4 June 2013

అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

తేటగీతి: 
పూర్వ జన్మంబునందున పుణ్య మింత 
చేయ నందున నేనిట్లు చేయి చాపి 
అడుగు చుంటిని భిక్షంబు ననుచు పిసిని 
అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు. 

Sunday 2 June 2013

తొండ ఘీంకరించెఁ దొండ మెత్తి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తొండ ఘీంకరించెఁ దొండ మెత్తి

ఆటవెలది: 
దొండ పాదు మీద తొండయే జేరగ 
పాదు పీకు చుండ పాడు గజము
కరము లోన దూర గజగజ వణకుచు 
తొండ, ఘీంకరించెఁ దొండ మెత్తి.

Saturday 1 June 2013

తిరుపతి వేంకట కవులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న)చిత్రం - తిరుపతి వేంకట కవులు















కందము:
మా సములే యుండినచో
మీసములే తీతుమంచు మిక్కిలి ఘన వి
శ్వాసముతో చాటిన మన
శ్రీ సత్కవి వర్యులకును చెప్పెద జేజే.