తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 28 June 2018

అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 02 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్. 



కందము: 
ముక్కున కోపమ్మేలనె 
ముక్కెరనే దెత్తునీకు ముడవకె మూతిన్
మక్కువ దీర్చగ రా ! రమ 
ణక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

Wednesday 20 June 2018

బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్.



కందము: 
ప్రీతిగ కొందరు కావ్యపు 
వ్రాతల రామాయణమ్ము రంకనిరి గదా! 
పూత చరిత్రుల కథ నా 
'బూతు పురాణమ్ముఁ' జదువఁ బుణ్యం బబ్బున్.

Sunday 17 June 2018

దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29- 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు



తేటగీతి: 
తనదు చీరెల సొమ్ములన్ తరచి చూచి 
తమకు లేవని లోలోన కుమిలి తలచు 
ఎదర ప్రక్కింటి వారల ఈర్ష్య మరియు 
దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు. 

Friday 15 June 2018

రణమే యవధానమందు రహి మంగళమౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రణమే యవధానమందు రహి మంగళమౌ



కందము:
గణములు యతులును తప్పక 
వణకక నిచ్చిన సమస్య వాక్చాతురితో 
చెణుకులతో సరసపు పూ 
రణమే యవధానమందు రహి మంగళమౌ.

Saturday 9 June 2018

రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 01 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి



తేటగీతి: 
పుట్టినదినము వేడుక బూని సేయ
హారతిమ్మని జెప్పగా దారలకును
దశరథుండట, ముందుగా దరినిజేరి
రామునకు, మువ్వురు సతు లారతు లొసగిరి

Tuesday 5 June 2018

హస్త-చిత్త-స్వాతి-మూల....షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
 

దత్తపది: హస్త-చిత్త-స్వాతి-మూల....షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ


తేటగీతి: 
స్వాతిశయమున తెల్గుభోజనము దినుడు
ఆహ!స్తవనీయ మైయుండు నారు రుచుల 
చిత్తమందున మరువరు జిహ్వ రుచుల
మొత్తమారోగ్య కరమౌను మూలబడరు.

Saturday 2 June 2018

విల్లది రామునకునైన విరువదరమ్మే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - విల్లది రామునకునైన విరువదరమ్మే. 



కందము: 
చల్లని సాయం సమయము
మెల్లగ తుంపరలజల్లు, మిన్నున గనగా 
నల్లన సరి విరిసిన హరి  
విల్లది, రామునకునైన విరువదరమ్మే?