తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 30 September 2013

కరి వరదుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కరి వరదుడుకందము:
కరి మకరి పట్ట కష్టపు
వరదను పడిపోయి కావ వరదుని వేడన్
సరగున పరుగిడి వచ్చిన
గరుడ గమన చక్రి హరికి కరములు మోడ్తున్.

Sunday, 29 September 2013

వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె


తేటగీతి:
పల్లెటూరున నుండెను బామ్మగారు
పట్న వాసపు మనుమరాల్ భర్త తోడ
వృద్ధురాలికి, నేఁడు వేవిళ్ళు గలిగె
ననుచు కబురంప మనిజెప్పె నామె నాడు

Saturday, 28 September 2013

చంద్ర, నాగ, గంగ, భస్మ పదాలతో శ్రీకృష్ణ స్తుతి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09- 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - చంద్ర, నాగ, గంగ, భస్మ పదాలతో శ్రీకృష్ణ స్తుతి.


తేటగీతి:
నాగ శయన! కంసాంతక! నల్లనయ్య!
చంద్ర కాంతుల మించెడు చల్లనయ్య!
భస్మ మాయెను నా పాప పంకిలమ్ము
బాలకృష్ణ! నే మునుగంగ భక్తి లోన.   

Friday, 27 September 2013

కన్నయ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09- 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కన్నయ్య

కందము:
వెన్నల దొంగకు భక్తుల
వెన్నుగ దన్నుగ నిలచెడు విశ్వేశునకున్
కన్నయ్యకు నా ద్రౌపది
కన్నయ్యకు సకల జగతి కన్నయ్యకు జే.

Thursday, 26 September 2013

రాలు కరగించు నెదను వరాల నిచ్చు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రాలు కరగించు నెదను వరాల నిచ్చు.
తేటగీతి:
శిలగ నున్నాడు దేవుడు శివుడటంచు
కలత లేల, నమక చమక ముల నిష్ఠ
తోడ నభిషేక ములజేసి వేడ, చెడుగు
రాలు, కరగించు నెదను వరాల నిచ్చు.

Wednesday, 25 September 2013

సిగ్గు లేని వాడు శ్రీ విభుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సిగ్గు లేని వాడు శ్రీ విభుండు.

ఆటవెలది:
బాల కృష్ణు రూపు పాలు వెన్నలు దొంగి
లించినాడు నాడు పొంచి యుండి
జలకమాడు సఖుల వలువల తా దోచె
సిగ్గు లేని వాడు శ్రీ విభుండు.

ఆటవెలది:
సిరిని గలిగి యుండి శ్రీశుండు తానయ్యు 

 నాలు వెడలి పోగ నాకలనుచు 
డవి బాట బట్టె నప్పడిగె కుబేరు
సిగ్గు లేని వాడు శ్రీ విభుండు.

Tuesday, 24 September 2013

మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.
కందము:
పూటకు పూటకు నేనిక
మాటలనే మార్చ ననుచు మాటొ క్కటిగా
మాటలతో నేమా ర్చెడు
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.

Monday, 23 September 2013

అశ్వత్థామ పరాభవము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - అశ్వత్థామ పరాభవము తేటగీతి:
నిదుర నున్నట్టి పిల్లల నీచ వృత్తి
గొంతు గోసిన వీడటే గురు సుతుండు
ఉత్తరించెద నిప్పుడే కుత్తుకనగ
వలదు వలదను పాంచాలి వందనీయ.

Sunday, 22 September 2013

కరము కరము సౌఖ్య కరము సుమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కరము కరము సౌఖ్య కరము సుమ్ము

ఆటవెలది:
కాళి రూపు జూడ కాటుక నలదిన
నల్లదనము గల్గి, నాల్క జూడ
నెరుపు నిండి యుండు నెద దల్చగాను భీ
కరము, కరము సౌఖ్య కరము సుమ్ము

Saturday, 21 September 2013

వందనములు సుబ్బలక్ష్మి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - వందనములు సుబ్బలక్ష్మి

కందము:
విందుగ వడ్డిం చెను గో
విందుని నామామృ తమ్ము వేవిధములుగా
నందిన వారే ధన్యులు
వందనములు సుబ్బలక్ష్మి వందనమమ్మా!

Friday, 20 September 2013

గరుడ గమనుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - గరుడ గమనుడు


తేటగీతి:
గరుడ గమనుని నేనెప్డు గార వింతు
వినత పుత్రుని వీపెక్కు విభుని గొలుతు
సర్ప వైరికి స్వామిని సన్నుతింతు
శ్రీని విడువని వానికి జేలు కొడుదు.

Thursday, 19 September 2013

కబడ్డీ లో ' గీత '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కబడ్డీ లో ' గీత '
 ఆటవెలది:
గీత లోనె గలదు గెలుపోటముల తీర్పు
'గీత' నెరిగి బ్రతుక గెలుపు మనదె
వెనుక శక్తు లెన్ని వేధించి లాగిన
గీత దాక చాపు చేతులనిక.

('గీత' దలచి చూపు చేతలనిక.)

Wednesday, 18 September 2013

తల్లిమగఁడు నాకు తమ్ముఁ డగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 -08-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తల్లిమగఁడు నాకు తమ్ముఁ డగును.

ఆటవెలది:
చిట్టితల్లి నాకు చిననాటి స్నేహితు
రాలు పెండ్లి జరిగె మేలుగాను
వరస నరసి జూడ బంధువే యగు చిట్టి
తల్లిమగఁడు నాకు తమ్ముఁ డగును. 

Tuesday, 17 September 2013

పాలు గాంచి పిల్లి పారిపోయె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 -7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పాలు గాంచి పిల్లి పారిపోయె.
ఆటవెలది:
పా
నీళ్ళు లుపు పధ్ధతి పాతది
నీరు గారె పాల పేరు నేడు
పాలు ' నిల్లు ' గలుగు పాపాల 'పాల్గాని
పాలు' గాంచి పిల్లి పారిపోయె.

Monday, 16 September 2013

య (శ) స్వీ రంగారావు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 -7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - య (శ) స్వీ రంగారావు

 
ఆటవెలది:
సరస పాత్రలకును సారంగ రావేను
రాజ పాత్రకు కుదు రంగ రావు
ఘోర పాత్రలకును ఘోరంగ రావేను
రసము లన్నిట నవ రంగ రావు

Sunday, 15 September 2013

కుచము గోసె మగడు కూర కొరకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 -7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుచము గోసె మగడు కూర కొరకు

ఆటవెలది:
మేత వేసి పెంచి మేక నొక్కటి నాడు
పండు గనుచు దెచ్చి భార్య కెదుట
కత్తి బట్టి నొక్కి కంఠమ్ము, ముందుగా
కుచము గోసె మగడు కూర కొరకు


ఒక భార్యా భర్త తమ తోట లో కాసిన దోస కాయల పరిమాణమును సరసముగా వర్ణిస్తూన్న భావన ...
ఆటవెలది:
దోర వయసు జంట దోస తోటను జేరె
తాటి కాయలనియె తరుణి జూచి
నీదు కుచము లనుచు నిగ నిగ దోసను
కుచము గోసె మగడు కూర కొరకు. 

Saturday, 14 September 2013

నటరాజు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - నటరాజుతేటగీతి:
కదల లయ బద్ధ ముగ జూడ కాదె నాట్య
మటులె జగమంత కదలును నటన వలన
లయలు గలిగిన నటనకు, లయము జేయు
ఘటన లన్నింటి కిని నీవె గతివి దేవ.


Friday, 13 September 2013

పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును.
హరి ధర్మ పక్షపాతి గాని కేవలము పాండవ పక్ష పాతి కాదు. ధర్మము వారి వద్ద లేక పొతే వారితో కూడా ఉండడు..అని నాభావం.

తేటగీతి:
ధర్మ పక్షంబు నిలబడు దైవ మతడు
కోరి చూపడు ప్రేమయు కోపములను
ధర్మ పథమును వీడిన తక్షణమున
పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును.

Thursday, 12 September 2013

వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.
శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయాలి..అది తారు మారు కాకూడదని నా  పూరణ..
కందము:
మరి శ్రావణ భృగు వారము
హరునర్ధాంగీ వ్రతములు నటులే చూడన్
సరి మంగళ వారమునను
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

Wednesday, 11 September 2013

వరలక్ష్మీ వ్రతము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న) చిత్రం - వరలక్ష్మీ వ్రతము. 

 


కందము:
వరముల నీయవె తల్లీ
వరలక్ష్మీ పూజ శుక్ర వారము చేతున్
ధరలో నిలువని వారము
ధరలన్నీ పెరిగి పోయె దండము తల్లీ!

Tuesday, 10 September 2013

కాకరపూ పూచి నిమ్మకాయలు కాచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కాకరపూ పూచి  నిమ్మకాయలు కాచెన్.
కాకర పాదులు బాగా పెరుగుటకు దిష్టి సోకకుండా కట్టిన నిమ్మకాయలు కాచినవని(రక్షించాయని) నా భావం.
కందము:
సోకక జేయగ దిష్టిని
కాకర పాదులకు నిమ్మకాయలు కడితిన్
ఆ కారణమున పెరిగెను 
కాకరపూ పూచి, నిమ్మకాయలు కాచెన్.

Monday, 9 September 2013

ఏకవింశతి (21 ) రకముల పత్రి పేర్లు (పునర్ముద్రణ)

            
  

                అందరకు   గణేశ చతుర్థి శుభాకాంక్షలు. ఏ విషయాన్నయినా చందోబద్దంగా చెప్పటం మన సంప్రదాయం. అలా ఛందో బద్దంగా ఉన్నవాటిని నేర్చుకున్నప్పుడు ఎప్పటకీ మరచి పోము.. చిన్నతనం లో మా తల్లిదండ్రులు  నేర్పిన ఒక పద్యాన్ని ప్రచురిస్తున్నాను.ఇది నేర్చుకున్న వారికి వినాయకుని పూజకు ఉపయోగించ వలసిన ఏకవింశతి (21 ) రకముల పత్రి పేర్లు కరతలామలకము లౌతాయి. ఈ తరం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇస్తున్నాను. ఏమైనా దోషములు, సవరణలు వుంటే విజ్ఞులు, పెద్దలు సూచించినచో సరిదిద్ద గలవాడను.
ఇది సంప్రదాయంగా పెద్దలు చెప్పుచున్న పద్యం . మూలము, రచయిత పేరు తెలియదు.

సీ :  సిద్ధి వినాయకా ! నిన్ను ప్రసిద్ధి గా పూజింతు
                             నొనరంగ నిరువది యొక్క పత్రి !
      దానిమ్మ, మరువము, దర్భ, విష్నుక్రాంత,
                              ఉమ్మెత్త, దూర్వార, ఉత్తరేణి,
     గరికయు, మారేడు, గన్నేరు, జిల్లేడు,
                            దేవకాంచన, రేగు, దేవదారు,
       జాజి, బల్రక్కసి, జమ్మి, ఆవల తుమ్మి,
                          మాచి పత్రియు, నారె, మంచి మునగ,

తే.గీ :      అగరు గంధమ్ము కురువేరు అక్షతలును
               ధూప దీపమ్ము నైవేద్య  *హారతులను 
               భాద్రపద శుధ్ధ చవితిని  పట్ట పగలు   
               కోరి  పూజింతు నిను నేను కోర్కె దీర !   


(* యతి భంగము -సరి యగు పదము తెలిసిన విజ్ఞులు తెలుపగలరు )

వంకర తొండపు దొర...


ఓం శ్రీ గణేశాయనమః
బ్లాగు వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.


 


కందము:
శంకరసుత ! విఘ్నపు నా
శంకర ! నాశంకలన్ని శమియింపుమయా
వంకర తొండపు దొర !  నా
వంకను గని మార్చుమయ్య వంకరబుద్ధిన్.

Sunday, 8 September 2013

కాళీయ మర్దనం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 

వర్ణ (న) చిత్రం - కాళీయ మర్దనం  


 

కందము:
నటరాజును మరపించుచు
చిటిపొటి పాదమ్ము లదమి చిరు నాట్యముతో
పటుతరముగ కాళీయుని
కటకట బడ జేసినావు గద శ్రీ కృష్ణా!

Saturday, 7 September 2013

విషము సేవింప నాయువు పెరుగునయ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.  

సమస్య - విషము సేవింప నాయువు పెరుగునయ్య

తేటగీతి:
విశ్వనాథునికే చెల్లు విషము ద్రావ
మాత పుస్తెల కున్నట్టి మహిమ చేత
నక్క వాతల పోలిక నరులు తెలిసి
విషము సేవింప నాయువు పెరుగునయ్య?

Friday, 6 September 2013

పరమపద సోపాన పటము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - పరమపద సోపాన పటము.కందము:
నిచ్చెనల  నెక్కినప్పుడు
మెచ్చని పాములె మనలను మెక్కగ నపుడున్
హెచ్చుగ నవ్వక నొవ్వక
రెచ్చుచు నాడంగ గెలుపు నిచ్చును హరియే.

Thursday, 5 September 2013

మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

ఆటవెలది:
ఖడ్గతిక్కన సతి ' కదన రంగము నుండి
పారి వచ్చినావు పడతి వీవ?
స్నానమాడు పసుపు నలది నీవ' నుచును
మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

Wednesday, 4 September 2013

త్యాగరాజు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - త్యాగరాజు

కందము:
శ్రీరాముని పై కృతులనె 

రూఢిగ సకల జనులు నౌరా యనగా
పేరొందగ రచియించిన
శ్రీ రాజా త్యాగయార్య చేతును ప్రణతుల్! 

Tuesday, 3 September 2013

రామనామ మహిమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - రామనామ మహిమ
తేటగీతి:
రామ నామము తో కోతి రాటు దేలు
రామ నామము తో నీట రాళ్ళు దేలు
రామ నామము గూల్చును రాక్షసులను
రామ నామము గూర్చును రక్ష యిలను  

Monday, 2 September 2013

ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల

ఆటవెలది:
రాయలనియె నాడు రమ్యముగా తాను
దేశ భాష లందు తెలుగు లెస్స
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల?ను నేడు
దేశ భాష లందు తెలుగు ' లెస్సు ' .

Sunday, 1 September 2013

తమలపాకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - తమలపాకు

ఆటవెలది:
నోరు పండుటందు నోములు పండుట
నందు పూజ లందు నరయ సకల
పెండ్లి పేరటముల పేరున్న దానవు
నాగవల్లి దళమ నతులు నీకు.