తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 30 November 2014

హితమితోక్తులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - హితమితోక్తులు.

కందము:
హితమును గూర్పెడు మాటలు
మితముగనే యుండవలయు మీరుచు జెప్పన్
మతమును మానరు మూర్ఖులు
స్తుత మతులకు జాలు హితమితోక్తులు వినగా.

Saturday, 29 November 2014

పదము ' సరిగ ' గలుప

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - సంగీత సాహిత్యములు.

ఆటవెలది:
సరిగ పదము వ్రాయ సాహిత్యమే యౌను
' సరిగమ పదని ' యన సరసమైన
శ్రావ్య మైన శుద్ధ సంగీతమే యౌను
పదము ' సరిగ ' గలుప పాట యగును .

Friday, 28 November 2014

నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్కందము:
" కలదుగ మరియొక ' ఛాన్సే '
విల విల లాడక శ్రమించి విజయుడ వగుమా "
అలనయ్యేయస్సును గత
నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్

Thursday, 27 November 2014

ఇద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఇద్దరు  సతులున్నవాఁడె హితము గడించున్. 

కందము:
ఒద్దిక భార్యయు నొక్కతి
పెద్దదొ చిన్నదొ కొలువగు ప్రియతమ సతియే 
ముద్దుగ చెప్పుదు వినుమి
య్యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.

Wednesday, 26 November 2014

కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.


మత్తేభము:
కరముల్ మోడ్చుచు తా శిఖండి నిలిపెన్ కన్పట్ట నా పార్థుడే
కరముల్ రెండిటి తోడ వైచె నపుడే కాఠిన్యమౌ బాణముల్
హరినే దల్చుచు భీష్ము డప్పు డటనే హా యంచు తా గూలగా
కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.

Tuesday, 25 November 2014

హా (ఆ)ల్ టైం హిట్స్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చలన చిత్రములు.

కందము:
రంగుల చిత్రములందున
బంగరు యుగమది గడచెను  పాటలు వినగా
సంగీతము "హాల్ టైం హిట్స్"
హంగుగ మరి లేవు గాద "ఆల్ టైం హిట్సే "

Monday, 24 November 2014

దారా రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దారా  రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్


శార్దూలము:
దారాసింగను వాడు చేరె నపుడే ధైర్యమ్ము తో సైన్యమున్
మీరాబాయిని పెండ్లియాడె నెపుడో మేనత్త కూతున్ - "హలో "
' మీరా ' వత్తును రెండు వారములలో "మే.కూ." యనన్ ఫోనులో
" దారా " ! రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్ !

( మే.కూ. = మేనత్త కూతురు. )

Sunday, 23 November 2014

కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

ఉత్పలమాల:
బండెడు చాకిరీనఛట పట్నముకే జని చేసివచ్చి తా
పండెను చేతగాక, తన భార్యకు జెప్పగ సైగ జేయుచున్
దండిగ వేసి పౌడరును, తక్కువ చక్కెర, మీగడేది రా
కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

Saturday, 22 November 2014

కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై 

ఉత్పలమాల:
చిన్నది కొండకన్నె మరి చీపురులమ్మగ పట్నమేగగా
వన్నెలు చిన్నెలున్న తగు వల్వలు గట్టని యాడపిల్లలే
కన్నులు మూయకుండ గని కాంచుచు నవ్వుచు వ్రేలు చూప, నా
కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై .

Friday, 21 November 2014

చీపురుకట్ట.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చీపురుకట్ట. 


కందము:
మొత్తము పేరుకు పోయిన
చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
మెత్తని చీపురు కట్టా !
హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !

Thursday, 20 November 2014

గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.  

కందము:
గొడ్రాలొక్కతి కనగ వి
రాడ్రూపుని వేడు కొనగ వేవేవిధముల్
' హైడ్రాప్ '  మందిడ వైద్యుడు
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.

Wednesday, 19 November 2014

గోంగూర పచ్చడి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - గోంగూర పచ్చడి.  


తేటగీతి:
ఆంధ్ర మాతగ పేరున్న యాకు కూర 
ఉల్లి కలుపుచు నూరగా నొల్ల ననరు
నూనె గోంగూర వేయించ నోరునూరు
నోరు కాదది తినకున్న నొట్టి " బోరు ".

Tuesday, 18 November 2014

శిశుపాలుఁడు ప్రాణదాత శ్రీకృష్ణునకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శిశుపాలుఁడు ప్రాణదాత శ్రీకృష్ణునకున్.


కందము:
శిశువుల వైద్యుడు చేసెను
పశుపతి సుతునకు చికిత్స, ప్రాణము వోసెన్
పశుపతి మ్రొక్కెను వైద్యుడు
శిశుపాలుఁడు, ప్రాణదాత, శ్రీకృష్ణునకున్.

( శిశువుల వైద్యుని పేరు శ్రీకృష్ణుడు. ) 

Monday, 17 November 2014

చంద్రగ్రహణము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చంద్రగ్రహణము


తేటగీతి:
రాజుకైనను కాలమ్ము రాక కలసి
మాటునుండగ వలెనను మాట నిజము
గ్రహణ కాలము వీడంగ కాంతి విరిసి
నూత్న తేజంపు వెన్నెల నోలలాడు

Sunday, 16 November 2014

రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో

ఉత్పలమాల:
ఆమహనీయ సాధ్వినిక నారడి బెట్టక నప్పజెప్పుమా
రాముని కన్న తమ్ము గని రౌద్రముతోడను తన్ని నీకికన్
రామ పదాబ్జమే శరణురా యని పల్కెను; రావణుం డహో !
కామ మదమ్ము కన్నులను గప్పి న నచ్చునె సూనృతమ్ములే.

Saturday, 15 November 2014

పిసినిగొట్టు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - పిసినిగొట్టు


ఆటవెలది:
కడుపుకింత తినక కబళ మొరుల కీక
మూట గట్టి దాచి మూల బెట్ట
' మూల ' ధనము బోవు ముద్దుగా నొరులకు
ముద్ద దొరక కితడు మూల బడును.

Friday, 14 November 2014

బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె.


ఆటవెలది:
రామచంద్రు డప్డు రవికుమారుని తోడ
స్నేహ మంది బాస చేసె, పిదప
చెట్టు చాటు తాను చేసుక వేయ నం  
బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె.

Thursday, 13 November 2014

ముందు వెనక కనుచు నుంద్రు.

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కావ్య కన్యక


ఆటవెలది:
ఆడ పిల్ల కిప్పుడాదరంబది లేదు
కవిత వ్రాయ మెచ్చు ఘనులు లేరు
కన్యకైన మంచి కావ్య కన్యకనైన
కనగ ముందు వెనక కనుచు నుంద్రు.

Wednesday, 12 November 2014

నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా


నెల తక్కువ వయసైనా అమ్మతమ్ముడు మామ వరసే కదా.....

కందము:
నెలతకు తమ్ముడు, పుత్రుడు
నెల తేడా తోడ బుట్టె, నిడె  నామములన్
నెల తక్కువ వయసైనను
నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా !

Tuesday, 11 November 2014

సూర్య చంద్రుల నొక చోట జూడగలము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సూర్య చంద్రుల నొక చోట జూడగలము

తేటగీతి:
అమ్మ ముఖమున కన్నులై యలరు చుండు
రవియు నొక్కటి వెన్నెల రాజు నొకటి
అమ్ముఖమ్మును గన భక్తి సమ్ముఖమున
సూర్య చంద్రుల నొక చోట జూడగలము 

Monday, 10 November 2014

వేసవికాలము,

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - వేసవికాలము, 


కందము:
వేసారునుక్క పోతలు
సీసాలుగ చల్ల నీరు సిరి మల్లియలున్
ఆ సపొ టాలును మామిడి
వేసవి కాలమ్ము గలవు వెతలును సుఖముల్. 

Sunday, 9 November 2014

వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

ఆటవెలది: 
అద్దె కొంప లోన నగచాట్లు పడలేక
చేరెడంత భూమి చేరి కట్ట
పిట్ట గూడు బోలు పిసరంత దైన భ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

Friday, 7 November 2014

సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.

తేటగీతి:
'పార్కు' కని వచ్చె నొక్కడు పగటి వేళ
నందు కొనుచుండె తిననెంచి ' ఐసుక్రీము '
అందుకొననెంచి దూకుచు నరచు గ్రామ
సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.

Thursday, 6 November 2014

దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని. 


తేటగీతి:
అద్దె నీయరు నెలనెలా యడుగలేవు
ఖాళి జేయగ చెప్పవు గట్టిగాను
యెదురు తిరిగెడు వారినే యెందుకీవు
దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని.

Wednesday, 5 November 2014

మరునిం బూజించ మేలు మాతామహికిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 

సమస్య - మరునిం బూజించ మేలు మాతామహికిన్.

కందము:
చిరు నవ్వు పెద్ద బొజ్జయు
కరి ముఖమును గలిగినట్టి గణనాథుని నా
సురపూజిత చరణు హరు కొ
మరునిం బూజించ మేలు మాతా ! మహికిన్.

Tuesday, 4 November 2014

మారుతిని గొల్చువారల మతులు చెడును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మారుతిని గొల్చువారల మతులు చెడును. 


తేటగీతి: 
పూజజేసెద నుపవాస ముందుననుచు
గొప్ప బలుకుచు నేరికి జెప్పకుండ
పూరి, వడలను, బోండాలు, పునుగుల నొక
మారు   తిని, గొల్చువారల మతులు చెడును.

తేటగీతి:  
యశము ధైర్యమ్ము బుద్దియు నాయువులును
పెరుగు నిజముగ నరులకు, వికసితమగు
మారుతిని గొల్చువారల మతులు, చెడును
కోతినేమిటి నేనిట్లు గొలుచుటనిన.

Monday, 3 November 2014

తక్కిన నగలన్ని గూడ తక్కువ గాదే !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - వాగ్భూషణము

కందము:
వాక్కను భూషణమున్న న
వాక్కగుదురు జూచు వారు వహ్వాయనుచున్
చక్కని పలుకుల ముందర
తక్కిన నగలన్ని గూడ తక్కువ గాదే !

Sunday, 2 November 2014

శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే

చంపకమాల:
మశకము వోలె కష్టములు మాటికి మాటికి కుట్టుచుండెనా
దశలవి మారుచుండు గద దాటును కష్టములట్లెయుండునా
శశికళలెన్నొ హెచ్చుచును సంతసమందగ పున్నమౌనుగా
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?

Saturday, 1 November 2014

సినీవాలి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - సినీవాలి.


కందము:
కనబడి కనబడ నట్లుగ
కనుపించెడు చంద్ర రేఖ కన నమవాస్యన్
ఘన హరుని పత్ని పేరును
కనగ ' సినీవాలి ' యనగ కంగారేలా ?