తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 27 October 2019

మది "దివాలి"

మీకు మీ కుటుంబ సభ్యులకు "దీపావళి శుభాకాంక్షలు".

సీసము:
కామమ్ము జూడగ "కాకరపూవత్తి"
చేతబట్టుచు గాల్చు చివరి వరకు
క్రోధమ్ము "బాంబది" కొంత దూరముబెట్టి
జాగ్రత్తగాబేల్చు సాధనమున
లోభమ్ము "పాంబిళ్ళ" లోనుండి దీయుచు
ముట్టించి మసిజేయి పట్టుబట్టి
మోహమే దలపగా మురియు "తారాజువ్వ"
పైకివదలు కాల్చి ప్రియముగాను

ఆటవెలది:
మదము విసరిగొట్టు మది "నేలటప్పాసు"
మత్సరమ్ము గాల్చు మరి "మతాబు"
లోన వెలుగజేయి జ్ఞానంపు "జ్యోతిని"
మది "దివాలి" యగును మనిషి కెపుడు.

Tuesday, 22 October 2019

సినిమాకు "వంద"నం - 87

సినిమాకు "వంద"నం - 87

ఆటవెలది: 
కళ్ళలోననొడలు కదలికలోనైన 
పలుకులోన తగిన భావములను 
చూపలేని వారు చోద్యమే నటులైరి
కొంతమంది జూడ వాంతి గలుగు.

Wednesday, 16 October 2019

సినిమాకు "వంద"నం - 86

సినిమాకు "వంద"నం - 86 

ఆటవెలది: 
'పాటకన్నె' నిచ్చె పాపమా కవిగారు 
బాణి పేర నొక్క 'డోణి' లాగె 
'పాడు'వాడు కొంత పాడుజేయ కడకు 
'రూపు'మారి మిగిలె 'రోదనమ్ము'.
Monday, 14 October 2019

సినిమాకు "వంద"నం - 85

సినిమాకు "వంద"నం - 85  

ఆటవెలది: 
బండిమీద నేగి పట్నమందున మొన్న 
ఆదివారమింట నదియె నిన్న 
నేడు టీవిలోన నెన్నియో సినిమాలు 
కళ్ళు జాలకుండె కనగ "నెట్టు."

Tuesday, 8 October 2019

విజయమ్ముల నీయుమ విశ్వరూపిణీ!

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 

శ్రీ మాత్రే నమః 

ఉత్పలమాల: 
కమ్మని జ్ఞానవంతులుగ గమ్మని దీవెనలందజేసి మో   
దమ్మును బంచి మా బ్రతుకు దమ్మున నీడ్చెడు శక్తినిచ్చి దా
నమ్ముల జేయు బుద్ధి వదనమ్ముల తేజము బెంపుజేసి న్యా
యమ్ముల వర్తనమ్ము విజయమ్ముల నీయుమ విశ్వరూపిణీ!  

Tuesday, 1 October 2019

నన్నయ కవివరుండు తెనాలివాఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు 01-10-2019 న ఇచ్చిన సమస్యకు పూరణ.


పెద్దసన్మానమతనికి ప్రియముతోడ 
జేసినారుగ కవిగాను  వాసికెక్క
పొగడియిచ్చిరి బిరుదమ్ముపో "యభినవ
నన్నయ"- కవివరుండు  తెనాలివాఁడు.