తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Showing posts with label నిషిద్ధాక్షరి. Show all posts
Showing posts with label నిషిద్ధాక్షరి. Show all posts

Friday, 8 July 2016

శ,ష,స లేకుండా ... వాస్తు దోషంగురించి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి: శ,ష,స లేకుండా ... వాస్తు దోషంగురించి. 



ఆటవెలది: 
మూల లెక్కువైన మూలన బడవేయు 
దారి తప్పు నిచట ద్వారమున్న 
నిల్లు జరిపి కట్ట " నిల్లగు " వెతలన్ని 
నాదు మాట వినిన నాదు కొనును.

Saturday, 21 May 2016

దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


నిషిద్ధాక్షరి - దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.   



తేటగీతి:  
సప్త గిరులను నిలచిన శక్తివి గద 
హరిగ హరునిగ తలపుల గురి కుదిర్చి 
కురులనిచ్చిన దరగని సిరులనిచ్చి
భక్త జనులను రక్షించు పరమ పురుష. 

Sunday, 15 May 2016

శ,ష,స వాడకుండా శిశుపాల వధ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


నిషిద్ధాక్షరి - శ,ష,స వాడకుండా  శిశుపాల వధ. 


శ్రీకృష్ణ ఉవాచ...

కందము: 
అత్తయె కోరగ నిచ్చితి 
నత్తరి నే నొక వరమ్ము, నది దాటెనుగా 
ఇత్తరి తప్పుల బావకు 
కుత్తుక నేనుత్తరింతు కోపము హెచ్చెన్.

Monday, 11 April 2016

ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా రామ రావణ యుద్ధం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి: ‘ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం 




కందము: 
దశకంఠుని యుద్ధములో
మశకము వలె దల్చి గూల్చి మహనీయుండే
కుశలముగా జానకితో
యశమును తాబొంది వెడలె నాకాశగతిన్. 

Wednesday, 30 March 2016

సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా గాంధీజీ స్తుతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా గాంధీజీ స్తుతి 



ఆటవెలది: 
చేతకర్ర పట్టి చిన్ని కొల్లాయిని 
కట్టి తెల్లవారి కాళ్ళు విరిచె 
శాత్యహింస నేర్పి చక్కని స్వేచ్ఛను 
మనకునిచ్చి  నిలిచె మహిని తాత. 
  

Wednesday, 23 March 2016

అనుస్వారాన్ని ఉపయోగించకుండా పెండ్లి విందును గురించి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి


కందము: 
సరి మనువున భోజనమిది 
యరిటాకుల లోనవేడి యన్నము పప్పున్ 
మరి గాచిననేయి, వడలు 
నరిసెలు రసమప్పడ వడియము పాయసమే. 

Wednesday, 16 March 2016

శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా సతీసావిత్రి పాతివ్రత్యాన్ని వర్ణించాలి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని వర్ణించాలి. 



కందము: 
పతినే పట్టుకు పోవగ
బ్రతుకే తిరిగిచ్చు వరకు ప్రక్కకు పోకన్ 
మతితోడనె యముని గెలిచి 
క్షితిలోననె నిలిచె, పేరు చెప్పకె తెలియున్. 

Friday, 11 March 2016

కవర్గాక్షరము ఉపయోగించకుండా కైకేయి వ్యక్తిత్వం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




నిషేధాక్షరి: కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వర్ణించాలి. 




తేటగీతి: 
భరతు రాజును జేయ దా దలచెనేమొ
మరియు మంధర మాట యేమార్చెనేమొ 
ధరను భారమ్ము దగ్గించ తట్టెనేమొ 
పంపె పినతల్లి రాముని వనముజేర.

Friday, 4 March 2016

గురువులు లేని గణపతి స్తుతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణన - గురువులు లేని గణపతి స్తుతి




ఆటవెలది: 
శివుని యురగము గన జిరుభయము గలుగ 
నగపు పడతి పొదివి నదుము కొనగ
నగుచు కరము దులిపి యగమును తగిలెడి
కరివదనుని మదిని గనుచు గొలుతు.

Thursday, 11 February 2016

' ర ' అనే అక్షరం వాడకుండా శివ ధనుర్భంగం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - ' ర ' అనే అక్షరం వాడకుండా శివ ధనుర్భంగం గురించి 



కందము: 
జనకుని సభ కనులను గన 
గొనకొని శివధనువున నొక కొననిటు నడచన్ 
ఇనకులమణి, సగముగ నది 
తునుగగ, సగముగ జనకుని దుహితయె నిలిచెన్.

Friday, 22 February 2013

శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని స్తోత్రం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

నిషిద్ధాక్షరి - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని స్తోత్రం
కందము:
డమరుకమును మ్రోగించుచు
నమరించెను మానవులకు ' అఆ ' మాలన్
కమనీయముగా వ్రాయగ
నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్. 

Friday, 28 December 2012

నిషేధాక్షరి - (క,ఖ,గ,ఘ,ఙ లను) ఉపయోగించకుండా కాకి, కోకిల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

నిషేధాక్షరి - (క,ఖ,గ,ఘ,ఙ లను) ఉపయోగించకుండా కాకి, కోకిల ల సామ్యభేదాలపై

కందము:
నలుపే రెండును చూడగ
తలపే వేర్వేరు యరపు దారులు వేరౌ
తలపున మెత్తురు దీనిని
తలుపులు మూసేరు చూడ దానిని నిజమే ?

Tuesday, 16 October 2012

నిషిద్ధాక్షరి - ‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా రామునిపై...

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

నిషిద్ధాక్షరి - ‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా రామునిపై...

కందము:
ఇనకుల తిలకుడు నిలబడి
జనకుని సుత జూచి విల్లు చప్పున లేపన్
గణగణ కదలెను గంటలు
కన నితడేయగును నీదు కాంతుండనుచున్.