తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Showing posts with label "గోలీ"లు. Show all posts
Showing posts with label "గోలీ"లు. Show all posts

Monday, 8 September 2025

"గోలీ" లు (97 - 103)

 రవళి మాస పత్రిక (సెప్టెంబర్ 2025) లో ప్రచురితమైన పద్యములు.


"గోలీ" లు (97 - 103) 


కందము: 

ఈశ్వరు డొక్కడె జగతిని  

నశ్వరుడై నిలచియుండు ననుచున్ మదిలో 

విశ్వాసము తో గొల్చిన 

విశ్వమ్మున నరుని బ్రోచు వినరా గోలీ! 


కందము: 

సందుల గొందుల మరి నీ  

ముందరనే నిలచియుండు మురహరి యెపుడున్  

సందియము వలదు నీకు ప  

సందుగ తా గానుపించు సరిగన గోలీ!   


కందము: 

బడియే విద్యార్థుల కిల

గుడియగునట, గురువుగారు కుల దైవమ్మౌ   

బడిపంతులు తనకే కన

బడినంతనె వందనమిడు ప్రభువే గోలీ! 


కందము: 

చక్కగ విశ్వాసమ్మును 

కుక్కయె తా జూపుచుండు కొలదిగ కుడుపన్ 

మెక్కుచు నెంతయొ, సుంతయు 

మక్కువ జూపని నరుడిక మందుడు గోలీ!  


కందము:   

తిట్టకు మోటమినెప్పుడు 

మెట్టది విజయమ్ము జేర, మీదకు జనుచున్ 

నెట్టుము వెనుకకు దానిని 

ముట్టెదవిక జయము, తీరు ముచ్చట గోలీ! 


కందము:

జూదములాడిన నెపుడున్ 

రాదోయీ సిరుల మూట, రాజులె జనిరే

ఖేదము జెందుచు నడవికి

కాదనవారెవ్వరైన గలరే గోలీ!   

 

కందము:

వాక్కను భూషణమున్న న

వాక్కగుదురు జూచు వారు వహ్వాయనుచున్ 

చక్కని పలుకుల ముందర

తక్కిన నగలన్ని గూడ తక్కువ గోలీ!   

Thursday, 24 July 2025

"గోలీ"లు - 96

 

కందము: 

జగమున నరులిట నిరతము

పగలను సెగలను గలుగుచు వగచుట తగునా

జగడము లధికము లగుగద

జగడము వదలిన సుఖమగు జనులకు గోలీ!


Saturday, 31 August 2024

"గోలీ"లు (92-95)

 సెప్టెంబరు '24 "రవళి" మాస పత్రికలో ప్రచురింపబడిన నా రచనలు.  


కందము:  

ఏ పుణ్యమొ నరుడైతివి

ఆ “పుట”యే నీకొకటట నమరెను చరితన్

ఆపక "నీ కథ" వ్రాయుము

“ఆపుట” నేరికిని సాధ్యమగునా గోలీ!


కందము:

నింపాదిగ ధర్మముగా

సంపాదన గూడబెట్టి సత్పురుషులిలన్

ఇంపుగ కొంతను పేదకు  

పంపకముగ కూడ, పెట్ట వలెరా గోలీ!


కందము:

"పగలే" వద్దనియెదరుగ

జగమందున "రాత్రిపని" నిశాచరులెపుడున్  

"పగ"లే వద్దనియెదరుగ

తగ శాంతిని గోరువారు తధ్యము గోలీ!


కందము:

తల పెట్టుము దిశదెలియుచు

నిల నిద్రను బోవువేళ నిక తల్పముపై

తలపెట్టుము సత్కార్యము

నలవాటుగ ప్రతిదినమ్ము నటులే గోలీ!

Wednesday, 10 July 2024

"గోలీ"లు 88 - 91

 


జులై 2024 "రవళి" మాసపత్రికలో ప్రచురితమయినవి.

కందము: 

చిరిగిన బట్టల గట్టిన

నిరుపేదల జూచి జాలి నిజముగ వేయున్

"చిరుగుల" బట్టల గట్టిన

చిరు"గుల" "కలవారి" గనిన సిగ్గగు గోలీ! 


కందము: 

చదువునకు తోడు పిల్లలు 

వదలక సంస్కారము సరి పాటించు విధ

మ్మది నేర్వ వలయు నప్పుడె

చదువులు సార్థకమగుగద జగతిని గోలీ! 


కందము:

దెబ్బలు తగిలినవని శిల 

ఆబ్బా!యని క్రిందబడగ నది బండయగున్  

నిబ్బరముగ నిలచినచో

నబ్బురముగ శిల్పమగుగ నవనిని గోలీ!


కందము:

ముద్దౌచు చమట, నన్నపు 

ముద్దగుగా రైతు జనుల పుణ్యము పండన్   

ముద్దుల బిడ్డని బంచును 

ముద్దుగనా పుడమితల్లి మురిపెము గోలీ! 

Monday, 3 June 2024

"గోలీ"లు (84-87)

 



(జూన్ 2024 రవళి మాసపత్రికలో ప్రచురితమయినవి)


కందము:

కాలము జూడగ మాయా

జాలము, లోకాల బట్టి చక్కగ లాగే

గాలము, దీనిన్ తెలియగ  

జాలము, జాలమున నైన సత్యము గోలీ!


కందము:

మొగమున నొక్కటియౌ చిరు

నగవును మరి వదలబోక నగవలె, నదియే

నగవలె మెరయుచు నీకిక

జగమున గలిగించుగద హుషారును  గోలీ!  


కందము:

దీపములార్పుట మానుము

దీపము వెలిగించి మ్రొక్కి దేవుని చెంతన్

తాపీగా ధ్యానించుము

"హ్యాపీ బర్త్ డే" దినమున హాయగు గోలీ! 


కందము: 

కాలూ చేతులు కదుపగ 

వేలుగ పలునాటలుండ వీడుచు వాటిన్ 

వ్రేలున మీటెడు నాటల  

వ్రేలాడెడు పిల్లవాండ్రు "వేస్టుర"  గోలీ!

 

Thursday, 2 May 2024

"గోలీ"లు - 83



కందము: 

ఓటును వేయుట కొరకై

నోటీయగ రాగ, వలదు "నో" యనవలయున్

పోటీ దారుల తోడన్

పో!"టీ" కూడా వలదని, పోవలె గోలీ!   



Friday, 9 February 2024

"గోలీ"లు - 82



కందము:

మొట్టుచు నెత్తిన గొట్టుచు   

బట్టీ బట్టించ వంటబట్టదు చదువే 

పట్టగ వచ్చును "మార్కులు" 

"ఫట్టు"ర నీ "మార్కు" జూప,"పట్టదు" గోలీ!     



Tuesday, 6 February 2024

"గోలీ"లు 80-81



ఫిబ్రవరి '24 "రవళి" మాస పత్రికలో ప్రచురితమైన నేను వ్రాసిన పద్యములు.


కందము: 

వినవలదుర చెడు మాటలు 

కనవలదుర కానిపనులు కన్నులతోడన్ 

అనవలదుర చెడు పలుకులు 

మనవలదుర మంచిలేక  మనమున గోలీ! 


కందము: 

మన మేమనవలదుర భువి 

మనమే గొప్పని పరుషపు మాటల పరులన్    

మన వలెనందరు సుఖముగ

మనవలెనని దలచవలయు  మనముల గోలీ!

Wednesday, 29 November 2023

"గోలీ"లు 75-79

 "రవళి" మాసపత్రిక రెండవ సంచిక (డిసెంబర్ 2023) నందు ప్రచురించబడిన నేను వ్రాసిన పద్యములు.

 

"గోలీ"లు

 

కందము:

శ్రీమంతుడ నాకేమని 

ధీమాగా కష్టబడక తినికూర్చుంటే

 మంచువోలె కరుగును

చీమంతగ మారు నీదు సిరులే గోలీ!

 

కందము:

పొటీలో గెలుపునకై 

ధాటిగ యత్నించవలయు ధర్మంబుగనే

ఓటమి జెందిన గానీ

ఆటన్ సహజంబనుకొన నగురా గోలీ!

 

కందము:

వండే వంటలు శుచిగా

నుండంగను జేయవలయునుర శుభ్రతగా

"వండే" దాటిన పిదపను

మొండిగ హీట్జేసి తినగబోకుర గోలీ!

 

కందము:

తీయనిదౌ కంఠమ్మే

గాయకునకు నున్న సొగసు కాదులె, భాషన్

హేయముగా పలికి పరువు  

దీయనిదౌ నటులనుంట దివ్యము గోలీ!

 

కందము:

సలుపుచు  నుండుము ధర్మము

నిలలో బోరంగవలయు నిది చేయుటకై

సలుపులు కలిగినగానీ

మెలకువతో సైచి దాట మేలగు గోలీ!  

 

Wednesday, 27 September 2023

"గోలీ"లు - 74

 


కందము: 

అరువది తెచ్చుట కళయే

అరువదినాల్గగు కళలనె యదియొకటేమో!

కరవున దెచ్చిన యరువును

కరవకమును దాని దీర్పగావలె గోలీ!



Wednesday, 6 September 2023

"గోలీ"లు - 73


కందము: 

ఊరకనుండునె కాయము

మీరుచు తా బెరిగిపోవు మిక్కుటముగనే

ఊరకనుండక నేదో

తీరిక లేనట్టి పనుల తిరుగుము గోలీ! 




Thursday, 17 August 2023

"గోలీ"లు - 72

 

కందము: 

పిల్లలు పెనిమిటి గలిగిన 

ఇల్లాలే యిలను జూడ నింటికి వెలుగౌ

ఇల్లాలు "వెల్" గ లేదా 

"ఇల్లాల్" గామారుదురిక నింటను గోలీ.



Thursday, 10 August 2023

"గోలీ"లు - 71

 కందము: 

పర పతి గూడుట మరియున్

పర సతినే గూడుటయు "యెఫైరది" భువిలో

పరగన్ చెడుగతి యగునది 

పరపతి నేగాల్చుటకు "యె  ఫైరది" గోలీ! 



Tuesday, 16 May 2023

"గోలీ"లు - 70

  


కందము: 

లోకులనెప్పుడు దిట్టకు

"లో" కులమనుచెవరినైన, లోకువ యగుగా! 

"ఆకుల"మే యొక రెమ్మకు

ఆ"కుల"మీకులమటునిటు నమరెను గోలీ! 



Sunday, 14 May 2023

"గోలీ"లు-69

  


కందము: 

కడుపున దన్నుచు బుట్టిన 

గడుపారగ బ్రేమబంచుగద సంతునకున్     

కడుపుననుంచుక జూచును 

కడుపుణ్యపురాశి యమ్మ కదరా గోలీ! 


Sunday, 5 March 2023

"గోలీ"లు - 68


కందము: 

ర్యాగింగ్ చేయుట యే యొక 

రోగమురా, దాన్ని జేయ  "రోగ్" వగుదువురా!

రోగమువిడి "జూన్యర్సు"ను

స్వాగతమని పలుకరించ సభ్యత గోలీ!



 

Thursday, 23 February 2023

"గోలీ"లు - 67

 


కందము: 

"వేల"ను బోయుచు కొను నీ

వేలును తాకించి వాడు వేడుక "స్మార్ట్ ఫోన్"

వేలును మాత్రము మరి "రాంగ్"

"వే"లను పెట్టంగబోకు వినుమా గోలీ!   


Wednesday, 28 December 2022

"గోలీ"లు - 66

 

కందము:
"వాయి" ని సరిగా వాడుము
మూయుము కాదన్న వేళ ముప్పది తప్పున్
ఓయీ! లేనిచొ ఓ "వెధ
వాయి" గ నీ పేరుమారు వసుధన్ గోలీ!

Sunday, 18 December 2022

"గోలీ"లు - 65



కందము:
బూతులనెన్నిక జేయగ
బూతులనే తలచి పల్కు బూతుల నేతల్
భూతలమందున జనులకు
భూతమ్ముల వలెను దోచు "బ్రో" యనె గోలీ.


Monday, 14 November 2022

"గోలీ"లు - 64

కందము: 

పాలిచ్చు తల్లి, తదుపరి
పాలిచ్చెడు తండ్రి పైన పండితగురువుల్
పాలించవలయు, బాలల
పాలవ సంస్కార బలము బాగుగ గోలీ!