తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 10 July 2024

"గోలీ"లు 88 - 91

 


జులై 2024 "రవళి" మాసపత్రికలో ప్రచురితమయినవి.

కందము: 

చిరిగిన బట్టల గట్టిన

నిరుపేదల జూచి జాలి నిజముగ వేయున్

"చిరుగుల" బట్టల గట్టిన

చిరు"గుల" "కలవారి" గనిన సిగ్గగు గోలీ! 


కందము: 

చదువునకు తోడు పిల్లలు 

వదలక సంస్కారము సరి పాటించు విధ

మ్మది నేర్వ వలయు నప్పుడె

చదువులు సార్థకమగుగద జగతిని గోలీ! 


కందము:

దెబ్బలు తగిలినవని శిల 

ఆబ్బా!యని క్రిందబడగ నది బండయగున్  

నిబ్బరముగ నిలచినచో

నబ్బురముగ శిల్పమగుగ నవనిని గోలీ!


కందము:

ముద్దౌచు చమట, నన్నపు 

ముద్దగుగా రైతు జనుల పుణ్యము పండన్   

ముద్దుల బిడ్డని బంచును 

ముద్దుగనా పుడమితల్లి మురిపెము గోలీ! 

No comments: