తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 30 June 2014

తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తనయుఁ జంపి చేసె జనహితమ్ము.


ఆటవెలది:
ధరను మునుల పుణ్య నరులనే హింసించ
దానవారి హరిని దరికి జేరి
వేడు కొనగ సురలు వేంచేసి కైకసీ
తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

Sunday, 29 June 2014

కబడీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కబడీ


కందము:
నిలబడి చూచెడి వారికి
కలబడినట్లుండు నిజము కబడీ యాటన్
నిలబెట్టి కూత దిరుగుచు
బలమున నోడించవచ్చు పదుగురినైనన్. 

Saturday, 28 June 2014

బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.

కందము:
సంధిని గూర్చగ మునిజన
బంధుడు కౌరవుల జేరి పలుకగ సూక్తుల్
అంధుని కొడుకుల చేతను
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.

Friday, 27 June 2014

మలుపులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - మలుపులు


 
కందము:
ఈ మార్గము చూడుడు కన
గా మానవ జీవితమ్ముగా మలుపులెగా
ఏమాత్రము జారిపడక
క్షేమంబుగ పైకి జేర్చు శ్రీశుని దలువన్. 

Thursday, 26 June 2014

శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.


నందమూరి తారక రామారావు గురించి...


ఉత్పలమాల:
ఆల్పము గాని రూపమది నయ్యెడ రాముడు కృష్ణ రూపమే
కల్పన జేసి జూడగను కాదని వేరుగ జూడజాలమే
సల్పెద జోత లాతనికి సాదృశ తారక రామ రూపుతో
శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

Wednesday, 25 June 2014

ఎన్ టీ యార్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఎన్ టీ యార్

 

కందము:
నట సార్వభౌముడీతడు
పటుతర ప్రజ్ఞను గలిగిన పద్మశ్రీయే 
నట, 'తెలుగు దేశమును' భూ
పటమున వెగించినట్టి భాస్కరు డితడే.

Tuesday, 24 June 2014

గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.


మత్తేభము:
భయమేలేదిక రాముడుండు వరకున్ భాగ్యంబిదే వీడకన్
లయమై పోయెడు నంతదాక మహిలో రామున్ భజింపంగ సం
శయమే వద్దని రామదాసు మరియున్ సత్కీర్తనా చార్య త్యా
గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

Monday, 23 June 2014

కనుమ నాటి పూజ కాటిఁ జేర్చె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కనుమ నాటి పూజ కాటిఁ జేర్చె.

ఆటవెలది:
విశ్వనాథు గొల్చి వీధుల దిరిగెను
మాట నిలుపు కొరకు మగువనమ్మె
విధికి జాలి లేదు విను హరిశ్చంద్రుని
కనుమ, నాటి పూజ కాటిఁ జేర్చె.

Sunday, 22 June 2014

గిరిధారి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - గిరిధారి

 
కందము:
గోపాలుడు గోకులమును
కాపాడెను రాల వాన రయమున రాలన్
ఆ పాకారికి గర్వపు
తాపంబును దీర్చె గనుడు తా గిరిధరుడై.

Saturday, 21 June 2014

కనుమ యనుచు బావగారి కనులను మూసెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కనుమ   యనుచు బావగారి కనులను మూసెన్

కనుమ నాడు ప్రయాణం చెయవద్దు .. నీతో గొడవెందుకు ఉంటాలే అని చెప్పమని
ఒక మరదలు బావగారిని ఆట పట్టించిన సందర్భం...


కందము:
కనుమను వెడలెదవని నా
కనుమానము వచ్చి పెట్టె  గదిలో బెడితిన్
కను, ' మరదల గొడవెందుల
కనుమ '  యనుచు బావగారి కనులను మూసెన్.

Friday, 20 June 2014

మూడు పూవులు నాఱు కాయలు ముప్పదాఱగు ముచ్చటల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మూడు పూవులు నాఱు కాయలు ముప్పదాఱగు ముచ్చటల్.


మత్తకోకిల: 

ఈడు జోడుగ నున్న భామిని కింటి బాధ్యత నీయగా
కీడు లేకను పెంచి పిల్లల కీడు వచ్చిన వెంటనే
కూడి పెండిలి జేసి యొక్కట కూర్మి ప్రేమగ నుండగా
మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాఱగు ముచ్చటల్.

Thursday, 19 June 2014

వివేకానంద

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - వివేకానంద


 కందము:
యువ నాయకుడెల్లప్పుడు
జవ సత్వంబుల నిడుచును జాగృతి గరపెన్
స్తవనీయుడు గద గనహైం
దవజాతికి మన నరేంద్ర దారిని జూపెన్.

Wednesday, 18 June 2014

భారతమున రావణుండు ప్రౌఢిని జూపెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భారతమున రావణుండు ప్రౌఢిని జూపెన్.


కందము:
కోరుచు మునులను జంపగ
మీరిన గర్వంబు తోడ మ్లేచ్ఛుల తోడన్
చేరెను లంకాధీశుడు
'భారతమున' రావణుండు ప్రౌఢిని జూపెన్.

Tuesday, 17 June 2014

మెట్టులనెక్కెదమెట్టులో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం : మెట్టులనెక్కెదమెట్టులో  
కందము:
మెట్టుల నెక్కెద మట మే
మెట్టులొ నిను జూడ గోరి యెంకట సామీ
కొట్టించగ గుండును మా
కట్టములను దీర్చు వడ్డి కాసుల వాడా !

Monday, 16 June 2014

రమణి విల్లు విరిచె ప్రమదమెసఁగ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రమణి విల్లు విరిచె ప్రమదమెసఁగ.


ఆటవెలది:
గురువు దలచి మదిని హరునికి తామ్రొక్కి
జనక సభను నాడు జనులు పొగడ
రమణి జూచు చుండ రవికుల శూర వీ
రమణి విల్లు విరిచె ప్రమదమెసఁగ.

Sunday, 15 June 2014

గంగిరెద్దు మేళం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - గంగిరెద్దు మేళం


 

ఆటవెలది:
గంగిరెద్దు వచ్చె, కప్పుమొక్కటి పంచె
నూపు రమున, పెట్టు నుదుట బొట్టు
వడ్లు డోలు బూర వాయించు వారికి
సంచి లోన పోసి సాగనంపు.

Saturday, 14 June 2014

లోక పా (బా) లకుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - లోక పా (బా) లకుడు 
కందము:
పాలకుడు సకల జగతికి
బాలకుడై యోగనిద్ర పడుకొని యుండెన్
మేలుగ ఓం తేజమ్ములు
పాలన లాలన నుజేయు బాలకు నహహా !   

Friday, 13 June 2014

పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?ఉత్పలమాల:
వద్దని యెన్ని మార్లు మరి వాదన జేసిన చిత్ర సీమలో
హద్దులుదాటి హేయమగు హాస్యపు "సీనులు" పెట్టు టేలనో
సుద్దులు జెప్పు గుర్వులును చూడగ బ్రాహ్మణ వేషగాండ్లపై
పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?

Thursday, 12 June 2014

చిత్తూరు నాగయ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - చిత్తూరు నాగయ్య 
 

తేటగీతి:
పాత్రమెరుగుచు నటియించు పాత్రధారి
గానమందున పేరున్న గాత్రధారి
భక్తి పాత్రల కతడేమొ బాగ పేరు
అవును చిత్తూరు నాగయ్య యతని పేరు


Wednesday, 11 June 2014

బిచ్చగాడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - బిచ్చగాడు   

ఆటవెలది:
చేయి జాపి యడుగ చేయగా సాయమ్ము
చేయి రాదికేమి చేయ గలవు
చొక్క జీర్ణమాయె డొక్కలాగున నేడు
కంటి బాధ నీదు కంటి లోన.

Tuesday, 10 June 2014

రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్.


కందము:
అంగనలు గోమయంబును
ముంగిట గొబ్బిళ్ళు జేసి మ్రుగ్గుల నిడుచున్
బంగరు వాకిళ్ళ నలది
రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్.

Friday, 6 June 2014

ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద.


కందము:
అంగుళీయకమును బట్టి యరుగుచున్న
అరువదడుగుల విగ్రహమాంజనేయు 
నెక్కి దూరగ నొక పిల్ల చక్కగాను
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద.

Thursday, 5 June 2014

బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.


కందము:
మేలగు 'వీడియొ గేమ్సట'
బాలకుడటనాడుచుండె, పరి పరి విధముల్ 
'కీ' లను పడి పడి నొక్కుచు
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.

Wednesday, 4 June 2014

ఉన్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య: ఉన్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా


కందము:
ఉన్నది, లేదని, మనసున
నున్నది దైవంబు కనగ నొక సందేహం
బున్నది, మీపై నమ్మక
మున్నది,  కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!

Monday, 2 June 2014

వ(క)న్నెల చిలుక

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - వ(క)న్నెల చిలుక


కందము:
వన్నెలుగల చిలుకను బహు
కన్నెలు గల చిలుక వోలె, కలయగ జూడన్
అన్నా! పూవిలు కానిని
చెన్నుగ చిత్రించినారు చిత్రం బహఃహా !

Sunday, 1 June 2014

ధర నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ధర నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.మత్తేభము:
ధరలో నెక్కుడు మానవాళి కనగా దారిద్ర్యమున్ దుఃఖసా
గరమున్ దాటగ లేక నావకొరకై గాలింతురే బైటనే
కరినే బ్రోచిన శౌరి ! నిన్మనములో కష్టాల నీడేర్చ శ్రీ
ధర ! నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.