తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 30 September 2016

సంతాప సభల్ జనులకు సంతసమొసగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సంతాప సభల్ జనులకు సంతసమొసగున్. 



కందము: 
వింతగ ప్రభుతయె మరచిన 
వంతుగ తమ మదిని దలచి పండిత వరులన్ 
కొంతైన పొగడ ప్రజలిడు 
సంతాప సభల్ జనులకు సంతసమొసగున్. 

Thursday 29 September 2016

నీరును గారగ నీయను

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నీరును గారగ నీయను  









కందము: 
మీరేమన్నను సరియే 
మీరెను తెలివంచు నన్ను " మెచ్చిన " సరియే 
నీరును గారగ నీయను 
నీరును నే చెట్లకిడెడు నీమంబెపుడున్. 

Wednesday 28 September 2016

హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి


తేటగీతి: 
పాలకడలిని మధియించు వేళ బుట్టి 
తెల్ల సంద్రము పైనున్న నల్లనయ్య 
నచ్చి నాడని హరి, పద్మనాభుని, ముర 
హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి. 

Tuesday 27 September 2016

కన్నబిడ్డ కంట గారమిడెను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కన్నబిడ్డ కంట గారమిడెను.  


ఆటవెలది: 
ఇంటిలోన దూరి వంటింటిలోనున్న 
తల్లి నోరునొక్కి దాడిసేయ 
దొంగ నెదిరి తాను దొరకక నాతల్లి 
కన్నబిడ్డ, కంట గారమిడెను. 

Monday 26 September 2016

హరుడె హరియు తెలియ హరియె హరుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - హరుడె హరియు తెలియ హరియె హరుడు 








సీసము: 
నెమలి పించ మిచట నెలవంక యచ్చట
నగలేమొ యిట కాల నాగు లచట 
చూడ చక్రమిచట శూలమ్ము గననట
గ్రద్ద యిచట బొల్లి యెద్దదియట
గట్టి వలువలిట గజచర్మ మచ్చట
గంధమిచట బూది కంపులచట 
నల్లరూపమిచట తెల్లని మేనట
లచ్చి యిచట గన బిచ్చ మచట

ఆటవెలది: 
పైకి జూడనిట్లు బాగుగా భేదమ్మె
లోతు దెలియుడయ్య రీతి దెలిసి
హరిని హరుడు నిలచు హరు లోన హరియుండు
హరుడె హరియు తెలియ హరియె హరుడు. 

Sunday 25 September 2016

వాన కురియ మురిసె బడకటింట

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వాన కురియ మురిసె బడకటింట


ఆటవెలది: 
బుంగ మూతి బెట్టి మూలనుండగ పతి 
బుజ్జగించి సతిని ముద్దుజేయ 
నవ్వి దరిని జేర నయముగా వలపుల 
వాన కురియ మురిసె బడకటింట. 

Saturday 24 September 2016

కారు కారు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కారు కారు











ఆటవెలది : 
కారు కారు ముందు కారు కారే కారు 
కారు కారు వెనుక కారె కారు 
కారు మారె రారు కారులేక జనులు 
కారు బారు తీరు జోరు జోరు. 


నాకక్కడ ఇంకేమీ కనబడట్లేదు....కారుల బారు తప్ప...

ఆటవెలది : 
కారు కారు కారు కారు కారే కారు
కారు కారు కారు కారు కారు 
కారు కారు కారు కారు కారే కారు
కారు కారు కారు కారు కారు.  

Friday 23 September 2016

సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్. 


కందము: 
అన్నముదిని వచ్చితినని 
చిన్నగ దానక్క తోడ చెప్పుచు నుండన్
హన్నా! యని బావిటులనె 
"సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్."

Thursday 22 September 2016

(సా) యమునా నది

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - (సా) యమునా నది  










కందము: 
యమునా నది జేసెను సా 
యము నాబాలుండు *హరికి "నది జరగ"దపా 
యము 'నాకని' తెలిసియును భ
యము నావలనెట్టి వేసి యరిగితి వమ్మా! 

*(హరికిన్+అది జరగదు+అపాయము)

Wednesday 21 September 2016

నందమూరి రామారావు నటుడుగాడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నందమూరి రామారావు నటుడుగాడు.









తేటగీతి: 
అనగ ' దేవుని ' యాంగ్లమ్మునందు " గాడు " 
తెలుగు వారికి నావెండి తెరల ఱేడు 
పిచ్చి యభిమానమే పెంచ, పిలుతు రిట్లు 
నందమూరి రామారావు " నటుడు - గాడు "

Tuesday 20 September 2016

"మిక్కీ మౌస్" గణపతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - "మిక్కీ మౌస్" గణపతి 








కందము: 
"మిక్కీ మౌస్" గా మారుచు 
చక్కగ నా వాహనమ్ము చప్పట్లిడగా 
నిక్కడ వీణా నాదము 
పక్కా "ప్లే" జేసెడు గణపతికిని జే!జే! 

Monday 19 September 2016

గొంగళి పురుగు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - గొంగళి పురుగు 








కందము: 
గొంగళి పురుగును జూడగ
కంగారుగ మేను లోన కంపము గలుగున్
రంగా ! కొన్ని దినాలకు
సింగారపు సీతకోకచిలుకై యెగురున్. 

Sunday 18 September 2016

అక్షరములు నేర్చి బిక్షమెత్తె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అక్షరములు నేర్చి బిక్షమెత్తె.


ఆటవెలది: 
తండ్రి చెవిని జెప్ప తన్మయమ్మున జదువ 
చుట్టములును తనకు చుట్టు నిలువ 
వటువు మంత్రమందు బరగుచుండెడి గొప్ప 
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.



Saturday 17 September 2016

చక్కని చెక్కలు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - చక్కని చెక్కలు. 








కందము: 
చక్కగ జేసిన బియ్యపు 
చెక్కలు తినుడయ్య వెన్న చిక్కగ గలిసెన్ 
ముక్కను గొరుకగ కారము 
మిక్కుటముగ లేక తినుచు మెత్తురు మీరే ! 

Friday 16 September 2016

గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్


కందము: 
గరళము గలిగిన 'నూడిల్స్' (మ్యాగీ ) 
సరి దెలియక గరుడ బాబు చక్కగ దెచ్చెన్ 
మరిమరి తిని మరణించెను 
"గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్"

Thursday 15 September 2016

పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్. 


కందము: 
మితిమీరి ఖర్చు జేయుట
నతిథుల బట్టించు కొనని యవగుణములనే   
సుతిమెత్తగ చెప్పగ తన 
పతి - విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్. 

Wednesday 14 September 2016

కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా


ఉత్పలమాల: 
" కోతులు, చాకొ బారులని " కొంటెగ బిల్తురు పాఠశాలలో 
ప్రీతియె బిల్వగా తరలి పెండ్లికి వచ్చుచు మిత్రబృందమే 
ప్రీతిగ తెచ్చినారు తమ' ఫ్రెండ్షిపు ' గుర్తుగ వారితోడ " చా 
కో " తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా.

కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


 సమస్య - కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా. 



Tuesday 13 September 2016

గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర. 


తేటగీతి: 
కర్మలేవియు జేయక, కష్ట బడక
పైని భగవంతుడే జూచు బాగులనుచు 
పలుకు చుండెడి నరులకు, వారి నుదుటి
గీత, నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర!

Monday 12 September 2016

గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.


కందము: 
హరు వీపు పైన కదలుచు
మరి మోతలు మాకులేవు మంచిదటంచున్
హరి మూపున నిడి తిరిగెడి
గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.

Sunday 11 September 2016

కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ


కందము: 
మొరవిని కరుగవదెందుల
కొ? రవియె ప్రేమించినాడు కొమ్మా! నిన్నే 
అరవిరిసిన సిగ్గెందుల 
కొ? రవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ.

Saturday 10 September 2016

బండపైన జొన్నపైరు పండె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బండపైన జొన్నపైరు పండె.


ఆటవెలది: 
ధాన్యమిటకు జేర్చి దాచుటకు మనము 
గాదె కట్ట వలెను కలసి, తగిన 
వస్తువులను దెమ్ము పరచి కట్టుదమింక 
బండపైన - జొన్నపైరు పండె.

Friday 9 September 2016

జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్.


కందము: 
మద్వ్యాపారపు వేళల 
తద్వ్యక్తం బైన రాహు ధాటిగ మూయన్ 
తద్వ్యోమమునందునను, జ 
గద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్. 

Thursday 8 September 2016

రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా


కందము: 
కమ్మని వీణా నాదం
బమ్మహదేవుని కీర్తన లాహా మధురం
బిమ్ముగ సంగీతమున స్వ 
రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

Wednesday 7 September 2016

తీపు - కారము - పులుపు - చేదు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - తీపు - కారము - పులుపు - చేదు....భారతార్థంలో

కుంతి, శ్రీ కృష్ణునితో....


తేటగీతి: 
కార ముఖ్యులు నా సుతుల్, కనగ వీడి 
పోకు రేపులు మాపులు పుణ్య చరిత 
నమ్మితీ పుడమిని జగన్నాథ నిన్ను  
ఆదుకొనవయ్య వారినే చేదుకొనుము. 

Tuesday 6 September 2016

పొగ సెగ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన (చిత్రం) - పొగ సెగ 







కందము: 
చెప్పిన వినవా ! నరుడా ! 
గుప్పున వదిలేటి పొగను కోరకు ! నీకున్
ముప్పే ! ప్రక్కన వారికి 
తిప్పలురా ! ధూమపాన తీరును గనుమా ! 

Monday 5 September 2016

ఏను గురుతెరిగితి నేనుగుతల సామి

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 













ఓం శ్రీ గణేశాయ నమః 


ఆటవెలది:
ఏను గురుతెరిగితి నేనుగుతల సామి!
నిన్నుదలతునయ్య నింద దొలుగ  
గుజ్జురూప! తలను గుజ్జుబెంచుమునాకు
చేటచెవుల దలతు చేటు దులుపు. 

ఆటవెలది: 
బొజ్జపెద్దది మరుగుజ్జు రూపమ్మైన
గజమువంటి శిరము గలిగియున్న  
బుద్ధియున్న చాలు పూజనీయుండౌను  
విఘ్నరాజు తెలుపు విషయమిదియె.    

Sunday 4 September 2016

రాయి - వ్రాయి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - రాయి - వ్రాయి  








కందము: 
రాయిని మోయగ వలదిక 
వ్రాయుట జదువుటను నేర్వవలె నీ వయసున్ 
రాయిని మెట్టుగ వాడుము 
వ్రాయుట జూపెట్టి యెక్కు వరుసగ మెట్లన్.

Saturday 3 September 2016

కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను. 


తేటగీతి: 
తిరుమలేశుని తిరునాడు తీరు గనగ 
వెడల లేనట్టి వేళల వేదనేల 
భక్తి దలచుచు నాస్వామి శక్తికొలది 
కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.

Friday 2 September 2016

జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్.   



కందున: 
అందున గురువే యొసగగ 
డెందమ్మున మెచ్చియప్పుడే క్రొత్తదియౌ 
జందెమ్ము దాల్చి, జీర్ణపు 
జందెమ్మును విడిచి, యజ్వ జన్నము జేసెన్. 

Thursday 1 September 2016

ముక్కల వేపుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన చిత్రం - ముక్కల వేపుడు  








కందము: 
రాజూ రాణీ జోకరు 
రోజూ నామాట వినక రోతయె బుట్టెన్ 
మోజులు దీరెను, మది 'నా
రాజే' గలిగెనుగ నాకు రాణీ ! కనవే !