తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 28 February 2017

కుం 'కుళ్ళు '.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కుం 'కుళ్ళు '.  





కందము: 
నీళ్ళను మరగించుచు కుం 
కుళ్ళను పొడిజేసివేసి కూర్చిన నురగన్ 
వ్రేళ్ళను జుట్టును రుద్దగ
కుళ్ళే వదలించి యిచ్చు కురులకు వన్నెన్.

Monday 27 February 2017

పడకగ నుండెడు శేషుడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పడకగ నుండెడు శేషుడు 







కందము: 
పడకగ నుండెడు శేషుడు 
పడుకొన హరి ప్రక్క రెండు ప్రక్కలగను చొ
ప్పడుశంఖము చక్రంబును 
పడుకొన నుయ్యాలలూగె పసిబాలుండై . 

Sunday 26 February 2017

తాటి ముంజలు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం  - తాటి ముంజలు. 









కందము: 
ముంజలు తాటివి జూడుడు
రంజుగ నేనీరు కొబ్బరందున గలవే 
గుంజును నీరును తోడుగ
నంజుకు తిన్నట్టివారి నంటును చలవే.

Saturday 25 February 2017

మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్



కందము: 
మరణము తప్పదు ప్రాణికి 
మరణము లేదయ్య భువిని మనచేతలకే 
మరువక మంచిని సలుపుచు 
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్.


Friday 24 February 2017

వట్టి దిగంబరుడనగా

ఓం నమశ్శివాయ 

Image result for nataraja images


కందము: 
వట్టి దిగంబరుడనగా 
బట్టలులేవంచునీకు పలుకుదురు హరా!  
గట్టిగగన కుదురుగనే  
బట్టబయలు దిశలమధ్య భవ! నీరూపే. 

కందము: 
లయకారుడ వీవంచును 
భయమును బొందేరు జనులు, పరికించినచో
లయబద్ధముగా జగతిని 
స్వయముగనాడింతువీవు భవ! నటరాజా!      

Thursday 23 February 2017

తండ్రులిద్ద ఱతని తల్లియొకతె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తండ్రులిద్ద ఱతని తల్లియొకతె. 



ఆటవెలది: 
తండ్రి యస్తికలను తనయుడు చేపట్ట 
కాశికేగి వాటి గంగగలుప 
పయనమైరియపుడు భద్రమ్ముగా పిన 
తండ్రులిద్ద ఱతని తల్లియొకతె.

Wednesday 22 February 2017

కూటి కేడ్చెడు వాఁడు కంప్యూటరుఁ గొనె.


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కూటి కేడ్చెడు వాఁడు కంప్యూటరుఁ గొనె.



తేటగీతి: 
నేర్చి డీటీపి,ప్రింటింగు నేర్పుగాను 
నౌకరీలేక బ్రతుకను నౌక నడుప 
లోనుబ్యాంకున దొరుకంగ లోనమెచ్చి 
కూటి కేడ్చెడు వాఁడు కంప్యూటరుఁ గొనె.

Tuesday 21 February 2017

చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య.



తేటగీతి: 
తినుట కేదియులేదని తిరుగుచుండ 
గంజి వార్చుక త్రాగగ కడుపుకింత 
పేదవాడని దయతోడ బియ్యమీయ
చర్చిలో సంధ్య, వార్చెను సాయబయ్య.

Sunday 19 February 2017

విధవ యననొప్పు భర్త జీవించియుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 04 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విధవ యననొప్పు భర్త జీవించియుండు.



తేటగీతి: 
ఇంటిపేరది చూడగా ' విశ్వనాథ ' 
పరగ ' ధనలక్ష్మి వర్ధని ' వనిత పేరు 
మిత్రులైనట్టి వారలు మేలమాడ 
' విధవ ' యననొప్పు భర్త జీవించియుండు.

Friday 17 February 2017

పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్.



కందము: 
శశితో తొందరబడినను 
కసరక నాపెద్దలంత కలియుచు చేయన్ 
ముసిముసి నవ్వుల నొడినిడి 
పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్.

Tuesday 14 February 2017

ధర్మజునకుఁ గన్నతల్లి ద్రౌపది యందున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ధర్మజునకుఁ గన్నతల్లి ద్రౌపది యందున్. 



కందము: 
నిర్మల మనమున రాగా 
కర్మము నొనరించి గెలిచి కౌరవతతినే 
శర్మా ! హారతినిచ్చిరి 
ధర్మజునకుఁ గన్నతల్లి, ద్రౌపది యందున్. 

Monday 13 February 2017

తాటితోపులోఁ బాలను ద్రాగవలెను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తాటితోపులోఁ బాలను ద్రాగవలెను.



తేటగీతి: 
త్రాగుబోతుపకీరయ్య తట్టిజెప్పె  
"నాచతుర్ముఖ పారాయణమ్ము పిదప 
చేరి సేవించి తీర్థమ్ము బారునందు 
తాటితోపులోఁ బాలను ద్రాగవలెను. "

Sunday 12 February 2017

కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా. 



కందము: 
సుంతయు జాలిని జూపక 
వింతగ సినిమాల సూర్యకాంతము నిలుచున్ 
శాంతిని నిజజీవితమున 
కాంతుని సేవించు నాతి! " గయ్యాళి " కదా!

Saturday 11 February 2017

పద్యరచనకు గణ,యతి ప్రాస లేల.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పద్యరచనకు గణ,యతి ప్రాస లేల.



తేటగీతి: 
తెలుగు పద్యమ్ము నేర్వరా తెలుగు వాడ 
తేలికయగును చూడరా, చాలు వినర 
ఆటవెలదియు, వ్రాయగా తేటగీతి 
పద్యరచనకు గణ,యతి - ప్రాస లేల?

Friday 10 February 2017

తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా



కందము: 
అలపాలు గారుచున్నను 
తెలియక నే నోటనుంచి తినకుము, వినుమా ! 
వలదిక త్రుంచకు జిల్లెడు 
తులసీ ! దళము మనకు విషతుల్యమ్ము గదా !

Thursday 9 February 2017

కంటెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కంటెల్ మీగాడ్దిగుడ్డుకంకరపీచూ  



కందము: 
ఇంటెలిజెంట్ జెంటును మరి 
మెంటల్ నాకేమిలేదు, మీ టేబుల్పై 
కంటిని చెప్పితి తప్పా!
కం,టెల్ మీ! గాడ్ దిగుడ్డు, కంకర, పీచూ !

Wednesday 8 February 2017

బెండ చెట్టుకుఁగాచెను బీరకాయ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బెండ చెట్టుకుఁగాచెను బీరకాయ.



తేటగీతి: 
బీరతీగెను చక్కగా పెరటిలోన 
నేల ప్రాకగ జేయక నేను గడితి 
పక్కనున్నట్టి బలమైన పచ్చనైన 
బెండ చెట్టుకుఁ,గాచెను బీరకాయ.

Tuesday 7 February 2017

త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త. 


 
ఆటవెలది: 
సమము గాదె చూడ సర్వేశు దృష్టిలో
చిన్న చీమ మరియు చెట్టుచేమ
శునక సామజములు,శుద్ధపండితుడును 
త్రాగుఁబోతు, గొప్ప తత్త్వవేత్త.

Monday 6 February 2017

పండు వెన్నెల కురిపించె భాస్కరుండు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పండు వెన్నెల కురిపించె భాస్కరుండు 



తేటగీతి: 
వరమునందిన కుంతియే పరవశమున 
పనితనమ్మును చూడగా పారజూచి 
రవిని పిలువగ వచ్చుచున్ రయమునచట 
పండు వెన్నెల కురిపించె భాస్కరుండు. 

Sunday 5 February 2017

మాకురెండు కనుల మంటలుండు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - మాకురెండు కనుల మంటలుండు 





ఓం నమః శివాయ 


సీసము: 
ఒక్క కంటనె నిప్పు చక్కగా నీకుండు 
మాకురెండు కనుల మంటలుండు 
కామునొక్కని బట్టి కాల్చివేసితివీవు 
మమ్మునమ్ము జనులు మసియగుదురు 
విషము కంఠమునందు  వెలసియుండును నీకు 
కాయమంతయు మాకు గరళముండు 
నందివాహనమొండు నమరియుండును నీకు 
ఎద్దు మించును బుద్ధి నెన్న మాకు 

తేటగీతి: 
శివగుణమ్ములు నీవద్ద చిత్రమవియె
అవగుణమ్ములు మాకాయె ననెడు మమ్ము  
మందబుద్ధుల దీవించ మదిని గొలుతు 
తలలు మార్చెడు వాడ ! మా తలపు మార. 

Saturday 4 February 2017

కలవారలకున్ గరళము గావలెను సుమీ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కలవారలకున్ గరళము గావలెను సుమీ.



కందము: 
ఇలలో విజ్ఞులు " త్రాగుట " 
వలదని యది గరళమంచు వచియింతురుగా 
యలవాటు విడని పెడమతి 
కలవారలకున్ గరళము గావలెను సుమీ.

Friday 3 February 2017

సేతువు కై సాయము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - సేతువు కై సాయము 








కందము: 
సేతువు కై సాయమ్మును 
జేతును నేనని యుడుతయె చేసెను చూడన్ 
చేతుల జేకొని రాముడు 
ప్రీతిగ నిమిరెనుగ మూపు పెట్టెను గుర్తుల్. 

Wednesday 1 February 2017

ఇది గో మాతా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఇది గో మాతా 












కందము: 
కొమ్మును విసరకుమమ్మా 
ఉమ్మా యని ముద్దునిడుచు నున్నది నీకే 
అమ్మా యిదిగో మాతా 
అమ్మాయే ముదముమీరినది గోమాతా !