తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 31 December 2019

బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు.


శ్రీ కంది శంకరయ్య గారు 27-12-2019 న ఇచ్చిన సమస్యకు పూరణ.

సమస్య: బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు.

ఆటవెలది:  
ఇన్నినాళ్ళు నేను వేధించిబంపితి
కూలి పనులకొరకు,కూలిపోవు
వాని భవితగాన వరుసరేపటినుండి 
బడికిఁ బోవు, వాఁడు పనికిరాఁడు.

కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే


శ్రీ కంది శంకరయ్య గారు 31-12-2019 న ఇచ్చిన సమస్యకు పూరణ.

సమస్య: కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే
 
కందము:
ఇంతగ ట్వంటీ నైంటీన్  .
నంతంబగునేడు, వచ్చు నాట్వంటీల్ రెం
డింతలుగ, మది దలచి  నర   ,
కాంతకు, వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే.

Saturday 14 December 2019

సినిమాకు "వంద"నం - 91

సినిమాకు "వంద"నం - 91

ఆటవెలది:
నాభి జూపు లలన నాయికయై పోవు
"నలగగొట్టు" వాడె నాయకుండు
తెలుగు రాని వాడె తీయని "సింగరౌ"
చుండె తెలుగు సినిమ జూడ మండె.


Friday 13 December 2019

సినిమాకు "వంద"నం - 90

సినిమాకు "వంద"నం - 90

ఆటవెలది: 
"చంద"మామయగును "చెంద"మామగ, నోట 
"ళా" ను బలుక నొక్క "లా "గ బలుకు 
తెలుగుతల్లి వినిన తెగ బాధబడిపోవు 
వారి మాట, పాట "వ్యాక్కు" వద్దు. 

Thursday 12 December 2019

సినిమాకు "వంద"నం - 89

సినిమాకు "వంద"నం - 89

ఆటవెలది:
యోగ,డ్రిల్లు గలుపి యూగించ - నాట్యమ్ము
అరుపు, వణుకు, మూల్గు, విరుపు - పాట
"బట్టబయలు" జేయు బట్టల ఫ్యాషన్లు
సినిమ ఫార్ములాలు కనగ నేడు.




Wednesday 11 December 2019

సినిమాకు "వంద"నం - 88

సినిమాకు "వంద"నం - 88

ఆటవెలది: 
భావగర్భితముగ పదునైన మాటల 
పాట వ్రాసినట్టి పండితుండు 
సినిమ పాట లోన చెవు వినబడక 
"బీటు" పోటు తగిలి బిక్క జచ్చె.

Sunday 27 October 2019

మది "దివాలి"

మీకు మీ కుటుంబ సభ్యులకు "దీపావళి శుభాకాంక్షలు".

సీసము:
కామమ్ము జూడగ "కాకరపూవత్తి"
చేతబట్టుచు గాల్చు చివరి వరకు
క్రోధమ్ము "బాంబది" కొంత దూరముబెట్టి
జాగ్రత్తగాబేల్చు సాధనమున
లోభమ్ము "పాంబిళ్ళ" లోనుండి దీయుచు
ముట్టించి మసిజేయి పట్టుబట్టి
మోహమే దలపగా మురియు "తారాజువ్వ"
పైకివదలు కాల్చి ప్రియముగాను

ఆటవెలది:
మదము విసరిగొట్టు మది "నేలటప్పాసు"
మత్సరమ్ము గాల్చు మరి "మతాబు"
లోన వెలుగజేయి జ్ఞానంపు "జ్యోతిని"
మది "దివాలి" యగును మనిషి కెపుడు.

Tuesday 22 October 2019

సినిమాకు "వంద"నం - 87

సినిమాకు "వంద"నం - 87

ఆటవెలది: 
కళ్ళలోననొడలు కదలికలోనైన 
పలుకులోన తగిన భావములను 
చూపలేని వారు చోద్యమే నటులైరి
కొంతమంది జూడ వాంతి గలుగు.

Wednesday 16 October 2019

సినిమాకు "వంద"నం - 86

సినిమాకు "వంద"నం - 86 

ఆటవెలది: 
'పాటకన్నె' నిచ్చె పాపమా కవిగారు 
బాణి పేర నొక్క 'డోణి' లాగె 
'పాడు'వాడు కొంత పాడుజేయ కడకు 
'రూపు'మారి మిగిలె 'రోదనమ్ము'.




Monday 14 October 2019

సినిమాకు "వంద"నం - 85

సినిమాకు "వంద"నం - 85  

ఆటవెలది: 
బండిమీద నేగి పట్నమందున మొన్న 
ఆదివారమింట నదియె నిన్న 
నేడు టీవిలోన నెన్నియో సినిమాలు 
కళ్ళు జాలకుండె కనగ "నెట్టు."

Tuesday 8 October 2019

విజయమ్ముల నీయుమ విశ్వరూపిణీ!

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 

శ్రీ మాత్రే నమః 

ఉత్పలమాల: 
కమ్మని జ్ఞానవంతులుగ గమ్మని దీవెనలందజేసి మో   
దమ్మును బంచి మా బ్రతుకు దమ్మున నీడ్చెడు శక్తినిచ్చి దా
నమ్ముల జేయు బుద్ధి వదనమ్ముల తేజము బెంపుజేసి న్యా
యమ్ముల వర్తనమ్ము విజయమ్ముల నీయుమ విశ్వరూపిణీ!  

Tuesday 1 October 2019

నన్నయ కవివరుండు తెనాలివాఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు 01-10-2019 న ఇచ్చిన సమస్యకు పూరణ.


పెద్దసన్మానమతనికి ప్రియముతోడ 
జేసినారుగ కవిగాను  వాసికెక్క
పొగడియిచ్చిరి బిరుదమ్ముపో "యభినవ
నన్నయ"- కవివరుండు  తెనాలివాఁడు. 


Tuesday 17 September 2019

కుజనులు క్రూరాత్ములు గద గుంటూరు జనుల్.

శ్రీ కంది శంకరయ్య గారు 17-09-2019 న ఇచ్చిన సమస్యకు పూరణ.

సమస్య - కుజనులు, క్రూరాత్ములు గద గుంటూరు జనుల్. 


కందము: 
సుజనులకే సుజనులు మరి
గజగజ వణికింతురు గన  కల్మష నరులన్  
నిజముగ ననుకొందురు మది
కుజనులు, క్రూరాత్ములు గద గుంటూరు జనుల్.  

Friday 6 September 2019

సినిమాకు "వంద"నం - 84

సినిమాకు "వంద"నం - 84 

ఆటవెలది: 
మహితగాన మూర్తి మంగళంపల్లియు 
సుస్వరాలగాత్రి సుబ్బులక్ష్మి 
మహతి మీటునట్టి మన నారదుండుగా 
సినిమ నటన బొందె చిరయశమ్ము.

Wednesday 4 September 2019

సినిమాకు "వంద"నం - 83

సినిమాకు "వంద"నం - 83

ఆటవెలది: 
మధురగీతములకు మారుపేరామెయే 
మరపురాదు పాట మెరుపులీను 
నవ్వుమోముతోడ నందించు పాటలు 
చిత్రసీమలోన చిత్ర గళము.

సినిమాకు "వంద"నం - 82

సినిమాకు "వంద"నం - 82 

ఆటవెలది: 
నాయికయన దలచునా యిక తెలుగున 
చిత్రసీమలోన జేరియొరుల  
ఆ మహానటెవ్వరామెయే 'సావిత్రి'  
నటనమంత "పారు" నామెదరికి. 
 • 

Tuesday 3 September 2019

సినిమాకు "వంద"నం - 81

సినిమాకు "వంద"నం - 81 

ఆటవెలది: 
కోటి గీతములను మీటుగా మధురాలు
కీరవాణి పాట మీరు సుధలు 
దేవియు,మణిశర్మ దీటు వినపసందు 
వందెమాతరమ్ము నందువిందు.

Monday 2 September 2019

సినిమాకు "వంద"నం - 80

సినిమాకు "వంద"నం - 80 


ఆటవెలది: 
పాట వినగ గళము ప్రత్యేకతగనుండు 
మాట ఖంగుమనును మధురముగను 
ఆట,పాట,మాట లలరించు వ్రాతల 
మతుల గెలిచె భానుమతియె మనల.

శ్రీ మహా గణాధిపతయే నమః

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
  
శ్రీ మహా గణాధిపతయే నమః






ఉత్పలమాల: 
తెల్లని వస్త్రముల్ గలిగి తేజముసర్వము వ్యాప్తి జెందుచున్ 
చల్లని వెన్నెలల్ గురియు చక్కని చంద్రుని కాంతి చాయతో 
నల్లన నాల్గు చేతులును యచ్చపు శాంతపు మోము వానినే 
యుల్లమునందునన్ నిలిపి యుంచుదు విఘ్నములన్నిబోవగన్.  

Sunday 1 September 2019

సినిమాకు "వంద"నం - 79

సినిమాకు "వంద"నం - 79

తేటగీతి: 
అల్ల భాన్మతి సావిత్రి యంజలియును
జమున వాణిశ్రి శ్రీదేవి జయసుధలును
నటనమందున తారలై నయనములకు 
వెండితెరమీద బంచిరి విందులిలను. 

Saturday 31 August 2019

సినిమాకు "వంద"నం - 78

సినిమాకు "వంద"నం - 78

ఆటవెలది: 
వేంపు పాత్రలెన్నొ వేనేత్రములు మెచ్చ 
జేసి మెప్పుబొంది చిత్రజగతి 
ప్రీతి నిల్చినారు జ్యోతిలక్ష్మియు జయ 
మాలినిజత రజత మేలితెరను.

Friday 30 August 2019

సినిమాకు "వంద"నం - 77

సినిమాకు "వంద"నం - 77 

ఆటవెలది:
దేశభక్తి పాట తేజమై వెలుగొందు 
భక్తి,రక్తి కైన బల్ పసందు 
ఆటకైన తగిన పోటిగా పాటల 
వ్రాసినారె మిగుల డా.సి.నా.రె.

Thursday 29 August 2019

సినిమాకు "వంద"నం - 76

సినిమాకు "వంద"నం - 76 

ఆటవెలది: 
కలిగి ప్రజ్ఞలెన్నొ గ్రద్దముక్పంతులు 
పేరుబొందె గాద పెద్దగాను 
తాను గొల్లపూడి దట్టీజు సుబ్రావ 
ననుచు తెలుగు వారి మనసు దోచె.

Wednesday 28 August 2019

సినిమాకు "వంద"నం - 75

సినిమాకు "వంద"నం - 75 

ఆటవెలది: 
పెక్కు నాయికలకు 'లక్కు'గా కుదిరిన 
చక్కనైన నటుడు చంద్రమోహ 
ననెడు మెప్పుబొంది నయమైన నటనతో 
ప్రేక్షకులకు నతడు ప్రియము గూర్చె.

Tuesday 27 August 2019

సినిమాకు "వంద"నం -74

సినిమాకు "వంద"నం -74


ఆటవెలది: 
ఏరియల్లు శాస్త్రి యేరి గోలలు, మంచి 
పాటవిలువ నేర్పె 'పాట'వముగ 
శంకరాభరణపు శంకర శాస్త్రిగా 
జేవి సోమయాజి జేలనందె.

Monday 26 August 2019

సినిమాకు "వంద"నం - 73

సినిమాకు "వంద"నం - 73 


తేటగీతి: 
మాట స్పష్టమ్ముగానుండి మదినిదాకు 
కంచు మ్రోగినయట్లుగా ఖంగుమనును 
పెద్ద పాత్రలకాగొంతు పెద్దదిక్కు 
పేరు కొంగర జగ్గయ్య వేరుగాదు. 



Sunday 25 August 2019

సినిమాకు "వంద"నం - 72

సినిమాకు "వంద"నం - 72


తేటగీతి: 
తన ప్రపంచమ్ము తనదని తలపబోక
మనకును మరోప్రపంచపు మనసు మెచ్చు 
పాటలెన్నియొరకముల బాగవ్రాసి 
సినిమ జగతిని శ్రీశ్రీయె వినగజేసె.


Saturday 24 August 2019

సినిమాకు "వంద"నం - 71

సినిమాకు "వంద"నం - 71

ఆటవెలది: 
దర్శకత్వమునగద  విజయనిర్మల 
ఎన్న దాసరెక్కె గిన్నిసునను 
రాఘవేంద్రుడు తన ప్రత్యేకతనుజూపె 
విశ్వనాధుడందె విమల యశము.

Friday 23 August 2019

సినిమాకు "వంద"నం - 70

సినిమాకు "వంద"నం - 70 

ఆటవెలది: 
ఘనసముద్రమంత ఘనమైన యర్థాల 
పాటలందు నింపి ప్రజలకిచ్చి 
సినిమ జగతిలోన సీ,జూ,సముద్రాల 
ముద్ర వైచినారు ముదము మీర.

Thursday 22 August 2019

సినిమాకు "వంద"నం - 69

సినిమాకు "వంద"నం - 69 

ఆటవెలది: 
మనసు గతిని దెలిపె మనసున్న మనిషికి 
సుఖములేదనుచును సూక్తిజెప్పె 
మనసుపైన వ్రాసి మనసైన ఆత్రేయ 
మన సుకవియె మారె మనసుకవిగ.

Wednesday 21 August 2019

సినిమాకు "వంద"నం - 68

సినిమాకు "వంద"నం - 68 

ఆటవెలది: 
క్లబ్బు డ్యాన్సు పాట కంఠమెత్తుచు బాడ 
మత్తుతోడనూపు మెత్తగాను 
ఎల్లలెల్లదాటె నెల్లరీశ్వరిపాట 
లేవలేనివాని లేపు పాట.

Tuesday 20 August 2019

సినిమాకు "వంద"నం - 67

సినిమాకు "వంద"నం - 67 


ఆటవెలది:
సినిమలందు బాడి చిరకీర్తి గాంచిరి 
బాలరావు, జమున, లీల, జిక్కి 
పీబి శ్రీనివాసు, కేబీకె, యేయెమ్ము 
రాజ మరి పిఠాపురమ్ము గూడ.

Monday 19 August 2019

సినిమాకు "వంద"నం - 66

సినిమాకు "వంద"నం - 66


తేటగీతి: 
పాత్ర 'మెరుగుచు' నటియించు పాత్రధారి 
గానమందున పేరున్న గాత్రధారి 
భక్తి పాత్రల కతడేమొ బాగ పేరు 
అవును చిత్తూరు నాగయ్య యతని పేరు. 

Sunday 18 August 2019

సైనికుని మనోగతం

ప్రజ-పద్యం సమూహం లో 11-8-2019 న ఇచ్చిన "సైనికుని మనోగతం" కు నా పద్యం.


సీసము:
మంచుకొండ చలులు మమ్మేమిజేయులే 
మాదు రుధిరమంత మరుగుచుండ 
దప్పికాకలిగూడ దరిజేర రావులే
రక్షణమను కోర్కె కుక్షినుండ 
ఆలుబిడ్డల యూసు లసలంట లేవులే 
దేశమాత కెదుట దిరుగుచుండ 
ముష్కరుండెవ్వండు ముందుకే రాడులే 
'గన్ను 'ల బోలుమా కన్నులుండ 
ఆటవెలది: 
'స్వర్గమే'గదమన జన్మభూమియనగ 
కాచుకొంటి మియిట గాచుకొరకు
శత్రుమూకరాగ జంపుచునే మేము 
'స్వర్గమేగ ' గలము సంతసమున.

సినిమాకు "వంద"నం - 65

సినిమాకు "వంద"నం - 65

తేటగీతి:  
విలనిజమునందు డైలాగు విసరు రీతి 
వినగ హాస్యమ్ము పంచుటన్ విరుపు విధము 
తండ్రిపాత్రల మెప్పించు తనదు నటన 
బాణి గొప్పది తనికెళ్ళ భరణిదెపుడు.



Saturday 17 August 2019

సినిమాకు "వంద"నం - 64

సినిమాకు "వంద"నం - 64


ఆటవెలది: 
సుత్తిజంట పంచె సుతిమెత్త హాస్యమ్ము 
వీరభద్రరావు, వేలు గలసి 
సరిగ క్రొత్తదనము జంధ్యాల యందించె 
అతని బాణి నిలచు ననవరతము.


Friday 16 August 2019

సినిమాకు "వంద"నం - 63

సినిమాకు "వంద"నం - 63

ఆటవెలది: 
నాగభూషణమ్ము నటవిరాట్ గో.రావు 
నూటనొకటి జిల్ల నూతనుండు  
కోట శ్రీనివాసు క్రొత్తయౌ నటనల 
మనసు నిలచినారు మరపురారు.

Wednesday 14 August 2019

పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

 కందిశంకరయ్య గారు 14 - 08 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

కందము: 
దవ్వున నుండెను పతియే 
యివ్వల సతి మల్లెపందిరెడుటనె, మీదన్ 
రివ్వున గాలికి బడగా   
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

సినిమాకు "వంద"నం - 62

సినిమాకు "వంద"నం - 62


ఆటవెలది: 
కోరచూపుజూడ క్రూరమై కనిపించు 
మాటలోన కఠిన మగుపడునులె 
దుష్టపాత్రలోన దూరితానుండును 
ఇలను రాజనాల "విలను" రాజు.

Tuesday 13 August 2019

సినిమాకు "వంద"నం - 61

సినిమాకు "వంద"నం - 61 

ఆటవెలది: 
మనకు దొరికినట్టి మరొక మీరాబాయి 
గానమునువిన మది గలుగు హాయి 
పాటకందమందు పలుక వాణిజయరాం 
తీపిలోకమునను ద్రిప్పు మనల. 

Monday 12 August 2019

సినిమాకు "వంద"నం - 60

సినిమాకు "వంద"నం - 60


తేటగీతి: 
జానపదములకు విఠలా చార్య, తీరు 
గ కమలాకర పౌరాణికమ్ములకును 
చూడ పుల్లయ్యలును మధుసూదనులును 
వారు మీరిరి  దర్శకత్వమున గనగ. 

Sunday 11 August 2019

సినిమాకు "వంద"నం - 59

సినిమాకు "వంద"నం - 59


తేటగీతి: 
మాన్య పెండ్యాల, చలపతి, మామ కే.వి 
రాజనాగేంద్ర, సాలూరి, రాజు టీ.వి 
వేణు, నాయుడును, సుసర్ల, విశ్వనాథ 
సత్య, మితరులు సినిమ సుస్వరములిడిరి.

Saturday 10 August 2019

సినిమాకు "వంద"నం - 58

సినిమాకు "వంద"నం - 58


ఆటవెలది: 
'శేషశైలవాస శ్రీవేంకటేశ'లో 
ఘంటసాల మనకు 'గాన'వచ్చు  
'భళిభళి' యను పాట బాగ మాధవపెద్ది 
గనగవచ్చు సినిమ కన్నులార.

Friday 9 August 2019

సినిమాకు "వంద"నం - 57

సినిమాకు "వంద"నం - 57 


తేటగీతి: 
కత్తియుద్ధాలు కనువిందుగానుజేసి 
నారదునిగాను నటియించి నయముగాను 
లవకుశను సీత మరదియౌ లక్ష్మణునిగ 
ఘనయశమ్మును బొందెగా కాంతరావు.

Thursday 8 August 2019

సినిమాకు "వంద"నం - 56

సినిమాకు "వంద"నం - 56 

ఆటవెలది: 
భావమెద్దియైన పాటయౌ క్రొత్తగా
క్రొత్త భావమేదొ గోచరించు
వినెడు మనసున సిరి వెన్నెలనేనింపు 
సీతరామశాస్త్రి సినిమ పాట.


Wednesday 7 August 2019

మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

శ్రీ కందిశంకరయ్య గారు 07 - 08 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్


కందము: 
మూడైదుల చదువాపెను
మూడార్లకు పెండ్లిగాగ ముచ్చట దీరన్
మూడేండ్లు గడచిపోయెను 
మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్. 

సినిమాకు "వంద"నం - 55

సినిమాకు "వంద"నం - 55


తేటగీతి: 
భావ గీతిక లాతని చేవదెలుపు 
విరహ గీతాల తీయని వేదనుండు   
క్రొత్తపదముల 'జాబిలి కూనజేసి' 
కృష్ణ శాస్త్రియె మనకున్న తృష్ణ దీర్చె.



Tuesday 6 August 2019

సినిమాకు "వంద"నం - 54

సినిమాకు "వంద"నం - 54

తేటగీతి: 
పాటలగని యనగవచ్చు పాటల 'గని' 
ఊరుచుండును పదములే యుబికి యుబికి 
క్లాసు మాసుల మెప్పించు కలము దాల్చి    
పదవి నీయగ వేటూరి పదవిరించి. 

Monday 5 August 2019

సినిమాకు "వంద"నం - 53

సినిమాకు  "వంద"నం - 53 


ఆటవెలది:
బొద్దురూపుతోడ ముద్దుమాటలతోడ 
పొట్టివాడయినను గట్టిగాను 
హాస్యపాత్రలందు హాయిగానవ్వించె
పద్మనాభమతడు బాగుబాగు.


Saturday 3 August 2019

సినిమాకు "వంద"నం - 52

సినిమాకు "వంద"నం - 52

ఆటవెలది: 
గయ్యిమనుచు లేచు గయ్యాళియత్తగా 
ఎదురులేక దిప్పు నెడమచేయి 
పెదిమవిరిచి పలుకు పెడసరమ్ముగ సూర్య
కాంతము నటనమున గలరె సాటి.

Friday 2 August 2019

సినిమాకు "వంద"నం - 51

సినిమాకు "వంద"నం - 51

ఆటవెలది: 
ప్రేక్షకుండు మెచ్చు రేలంగి కనబడి 
నడువ,చూడ,పలుక - నవ్వు నవ్వు 
నవ్వు తానెవచ్చి నటునిగా నిలచెను  
తెలుగు సినిమలోన తెలియరయ్య.

Thursday 1 August 2019

సినిమాకు "వంద"నం - 50

సినిమాకు "వంద"నం - 50

ఆటవెలది: 
స్వచ్చమైన పలుకు సరిగమతోనొల్కు 
నవరసమ్ములందు నాణెముగను 
గీతములను బాడి 'గిన్నీసు' కెక్కెను
తెనుగు కోకిలమ్మ మన సుశీల.

Wednesday 31 July 2019

సినిమాకు "వంద"నం - 49

సినిమాకు "వంద"నం - 49

ఆటవెలది: 
సన్నగొంతు కలికి, సన్నాయితో పోల్కి 
పిల్లవాని పలుకు ప్రియము గొలుపు 
సరిగమలకు పోటి సరి నవ్వులో ధాటి 
జానకమ్మ పాట తేనెయూట.

Tuesday 30 July 2019

సినిమాకు "వంద"నం - 48

సినిమాకు "వంద"నం - 48

ఆటవెలది: 
గానమందు భువిని గంధర్వుడైనాడు 
పాట 'గీత' మార్చె పాటవముగ 
పాటవిరులలోన భావసౌరభమిడి 
పంచె ఘంటసాల 'పాడి' మనకు.

Monday 29 July 2019

సినిమాకు "వంద"నం - 47

సినిమాకు "వంద"నం - 47

ఆటవెలది: 
సాహసమ్ములోన సాటిలేరితనికి 
సాటి నటులయందు స్టారితండు 
తెలుగు 'జేమ్సుబాండు', తెర 'నటశేఖర' 
కృష్ణయనిన నాటి 'కిక్కు' వేరు.

Sunday 28 July 2019

సినిమాకు "వంద"నం - 46

సినిమాకు "వంద"నం - 46

ఆటవెలది: 
ప్రియుని పాత్రలందు పేరునొందినవాడు
కవుల పాత్రలకును గట్టివాడు 
త్రాగుబోతు నటన దానెగా 'సామ్రాట్టు' 
ఎన్ననొక్క పేరె  యేయెనారు. 

Saturday 27 July 2019

సినిమాకు "వంద"నం - 45

సినిమాకు "వంద"నం - 45 

ఆటవెలది:
రామకృష్ణులకును రారాజు రావణ 
రాజుపాత్రలకును రాజితండు 
నాటితెనుగు సిన్మ నటసార్వభౌముండు 
ఎవ్వడనగనేల యెన్టియారు. 

Friday 26 July 2019

తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 07 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ 

 కందము: 
కమ్మని యిరువది పండ్లవి
అమ్మాయీ నీకునిత్తు నందున సగమున్ 
ఇమ్ముగ జేతను బట్టితి
తొమ్మిది, లోనొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ!

సినిమాకు "వంద"నం - 44

సినిమాకు "వంద"నం - 44 

ఆటవెలది: 
యస్వియారు కెదుట నెంటియార్, మాధవ
పెద్ది ఘంటసాల పద్దెములకు 
పోటి నటన జూడ నాటి సిన్మాలలో 
విందు లందు కనులు, వీనులకును.

Thursday 25 July 2019

సినిమాకు "వంద"నం - 43

సినిమాకు "వంద"నం - 43  

ఆటవెలది: 
సినిమలోన నేడ్పు సీనునే జూడంగ
కంట నీటిబొట్టు కదలిరాని 
హాస్య దృశ్యమునకుహాయిగానవ్వని 
మనిషి రాయి కనగ మరి కసాయి. 

Wednesday 24 July 2019

సినిమాకు "వంద"నం - 42


సినిమాకు "వంద"నం - 42


ఆటవెలది: 
ఒంపుసొంపులన్ని వేంపు పాత్రలు జూపె 
నాటి సినిమలందు, నేటి మేటి 
నాయికగన జూప'నా యిక' నేనన 
'పాత్ర'లన్ని నాస్తి వారికయ్యె.

Tuesday 23 July 2019

సినిమాకు "వంద"నం - 41

సినిమాకు "వంద"నం - 41

ఆటవెలది: 
అతిథి చేరిరాగ నానాడు సినిమాకు 
వెడలగాను గలుగు వేడ్క మనకు 
మేటి తెరల వదలి 'గూటి తెరల' జూడ 
చిన్నబోయె సినిమ, చిట్టి! నేడు.

Monday 22 July 2019

సినిమాకు "వంద"నం - 40

సినిమాకు "వంద"నం - 40

ఆటవెలది: 
పాటకన్నెకేమొ మేటిగా సంగీత 
హారములను వేయ నందమొదవు 
మోము గనపడకను మోటుగా "మోతైన" 
ఘోరమగును గాని హారమగునె.

Sunday 21 July 2019

సినిమాకు "వంద"నం - 39

సినిమాకు "వంద"నం - 39

ఆటవెలది: 
యోగ, డ్రిల్లు గలుపి యూగించు నాట్యమ్ము  
అరుపు, వణుకు, మూల్గు, విరుపు పాట 
బట్ట బయలు జేయు బట్టల ఫ్యాషన్లు 
సినిమ ఫార్ములాలు కనగ నేడు.

Saturday 20 July 2019

సినిమాకు "వంద"నం - 38

సినిమాకు "వంద"నం - 38

ఆటవెలది: 
గొందినున్నవాని "నంది" బట్టగజేయు  
సందునున్న భామ "సుందరి " యగు 
గల్లివారికైన "గగన" మందగజేయు 
చిత్రసీమ జూడ "చిత్రసీమ."


Friday 19 July 2019

సినిమాకు "వంద"నం - 37

సినిమాకు "వంద"నం - 37

ఆటవెలది: 
అధిక జనులు మెచ్చునది సిన్మ గావున 
భాష, సంస్కృతులవి పాడుగాక 
అతిని జేయకుండ నన్నియు రసముల 
నందజేసి జూప నందమగును.

Thursday 18 July 2019

సినిమాకు "వంద"నం - 36

సినిమాకు "వంద"నం - 36 

ఆటవెలది: 
సినిమ 'షో'గ జూచి జీవితమ్మందున 
మంచిచెడుల నరసి మసలుకొనుము 
'రీలు' లైఫు వేరు 'రియలు' లైఫే వేరు
తెలిసి గనుము వెండి తెరను నీవు.

Tuesday 16 July 2019

సినిమాకు "వంద"నం - 35

సినిమాకు "వంద"నం - 35

ఆటవెలది: 
జగమునందుగలదె సరి యిందులోనుండు 
ఇందులేనిదేది యిలను లేదు
వ్యాస దేవుడపుడు భారతమ్మున జెప్పె 
సినిమకైన నదియె చేరి పొసగు.

Monday 15 July 2019

సినిమాకు "వంద"నం - 34

సినిమాకు "వంద"నం - 34

ఆటవెలది: 
అందమున్నజాలు నధరాలతడి చాలు
నెత్తులున్న జాలు హత్తుకొనగ 
నాభిశోభ చాలు నటనమక్కరలేదు 
'సినిమ' నాయికలకు శ్రీనివాస.



Saturday 13 July 2019

నాన్న


నాన్న

కందము:
అమ్మయె దైవము సంతుకు
అమ్మకు దైవమ్ము తండ్రి యవనిని జూడన్
ఇమ్మను వాటిని వదలక
నిమ్మహిలో నాన్నయిచ్చు నిష్టముతోడన్.1

కందము:
విత్తనము నాన్న బ్రహ్మయె
విత్తమునే పంచి యిచ్చు విష్ణువు కాదా
చిత్తమున చెడ్డ భావన
చిత్తగు నట్లుగను గాల్చు శివుడే గదరా.2

కందము:
పొట్టన నుంచుక తల్లియె
పుట్టుక తానిచ్చి సంతు బుడమిని నిలుపున్
పొట్టన గుండెలనిడుకొని
పట్టుక తాతండ్రి నేర్పు పుడమిని నడకన్.3

కందము:
బుజ్జాయి గుండెపైనిడి
జొజ్జోయని వీపుదట్టి జోకొట్టుచునే
అజ్జొల్లు మూతి దుడుచుచు
బజ్జుండగబెట్టు నాన్న వాత్సల్యమహో!4

కందము:
ఆరోగము వచ్చినచో
నారోగ్యము బాగుజేయు నాన్నయె, కన్నా
ఆరోప్రాణము నీవను
ఆరోజులు మదిని దలుప నారోగ్యమ్మే.5

కందము:
ఎన్నగ కష్టములున్నను
నాన్నయె తా "నగుచు" నిచ్చునన్ని సుఖమ్ముల్
మిన్నగ పిన్నలకెప్పుడు
నన్నియు 'తానగుచు' నేర్పు నవనిని విద్యల్.6

ఆటవెలది:
పిన్న వయసునందు పిల్లల మనసున
భవిత బీజములను పాదుగొలిపి
పాటుబడును వాని పండింప తండ్రియే
పండువరకు తాను పండుకొనడు.7


కందము:
కడుపున బుట్టిన వానిని
కడుకొను ప్రేమలను తండ్రి ఘనముగ బెంచున్
కడు పుణ్య పురుషుడాతడు
కడుపున తినకున్న, సుతునకన్నము బెట్టున్.8

ఆటవెలది:
బుగ్గమీద నిమిరి ముద్దిచ్చునా వ్రేలు
నడక లోన బడక నడుపు వ్రేలు
తప్పుజేయునపుడు దడిపించునా వ్రేలు
జ్ఞానపథము జూపు నాన్న వ్రేలు.9

ఆటవెలది:
శతక పద్యములను శ్రద్ధగా నేర్పించి
పంచతంత్ర కథల మంచి దెలిపి
పోతనార్యు బలుకు బ్రీతిగా బలికించి
నవ్య పథము జూపు నాన్న ఘనుడు.10

కందము:
అడుగులు నేర్పుచు సుతులకు
నడుగుచునే మంచిచెడుల నన్నిదినమ్ముల్
అడుగున బడకను జగమున
నడుగడుగున తోడునుండు నాన్నకు జయహో!11

ఆటవెలది:
తనదు ప్రక్క వాడు తనను మించిననాడు
తట్టుకొనగలేడు ధరణి నరుడు
తానె ప్రక్కనుండి తనను మించగజేయు
నయముగాను సుతుని నాన్న, నిజము.12

తేటగీతి:
పండు కొనువేళ పొట్టనే పరుపుజేసి
కూరుచొనుటకు వంగుచున్ గుఱ్ఱమగుచు
దొరకు దోబూచులాటలో దొంగయగుచు
శిశువు నాడించు నాన్నకే చేతు నతులు.13

కందము:
కలలను గనుటయు నేర్పును
కలనాడున తోటివారి గనుటయు నేర్పున్
కలలవి కూలిన, నాన్నయె
కలతల బడకుండునట్టి ఘన'తల' నేర్పున్.14

కందము:
మనసున నుండని కోపము
కనులను కనుపింపజేసి కనుచును సుతులన్
ఘనులని తనకనిపించగ
కనిపించగజేయు తండ్రిగద నలుగురికిన్.15

సీసము:
పసితనమ్మునతాను పడకలో దరిజేరి
పంచు వెచ్చదనము పడక చలిని
పదములేరాగను పరుగువెట్టుచునుండ
పదములే బలుకును పదిలమనుచు
నయమున భయమున స్వయముగా ముందుకు
భయము 'నయము'జేసి పంపుచుండు
ఆకలికేమేమి యారోగ్యమో జెప్పు
ఆ కలిధర్మమ్ము లన్నిజెప్పు

ఆటవెలది:
నడక తోడ నేర్పు నడతను, పిల్లల
కోర్పువిలువ, నేర్పు గూర్చి నేర్పు
బుజ్జి చిన్నియనుచు బుజ్జగించుచు వారి
పెంచిపెద్దజేయు మంచి నాన్న.16