తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 30 August 2020

"గోలీ"లు - 15

కందము: 

జనులిక "పెద్దల" మాటల

విను యోగము గలిగియున్న "విన్" యోగమగున్

వినకను వినియోగించక

చనువారికి గెలుపు నడక  సాగదు గోలీ!  

Friday 28 August 2020

దత్తపది : పేపర్ - బుక్ - పెన్ - ఇంక్

 శంకరాభరణం బ్లాగునందు 28-8-2020న ఇచ్చిన సమస్యకు నా పూరణ 


దత్తపది : పేపర్ - బుక్ - పెన్ - ఇంక్


ద్రౌపది శ్రీకృష్ణునితో అన్న మాటలు. 


తేటగీతి:

బాధనోర్చితి బుక్కిట బట్టి బట్టి

సైపలేనింక మాధవా సంధియేల

క్రమ్మె పెన్మాయ మమ్ములన్ గాచి నీవె 

అనినిక గెలుపే పరువుగ  నందనిమ్ము. 



 



Thursday 27 August 2020

"గోలీ"లు - 14

కందము: 

ఇల్లాలు సరిగనుండగ 

నిల్లంతయు సరిగమపద లేగద, లేదా? 

"ఇల్లాల్" గ మారిపోవును 

"నిల్ల"గు నానందమంత నిజమిది గోలీ! 


Wednesday 26 August 2020

"గోలీ"లు - 13

కందము: 

నగయొక్కటి లేదనుచును

వగజెందుట మేలుగాదు వసుధను జూడన్  

మొగమున మాయని యొక చిరు

నగవొక్కటి యున్న జాలు నయముగ గోలీ!

Monday 24 August 2020

"గోలీ"లు -12

కందము:

తల పేలే పెరుగును గద 

తలపే లేనట్టివేళ తల శుభ్రత పై 

తలుపులు తెరువవు సుగతికి  

తలపులు మరి మురికియైన తధ్యము గోలీ! 


Saturday 22 August 2020

"గోలీ"లు - 11

కందము: 

వీడక నుండిన ధర్మము 

పీడలు శాపములు తుదకు వీడును,మేలౌ

క్రీడికి వరముగ మారెను

పేడిగ మారెడు బెడదయె వినరా గోలీ!


  

ప్రజల గావుమయ్య ఫాలచంద్ర

 మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.


ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

సీసము:
చేటచెవులవాడ చేటునే తొలగించు
చిన్నికనుల ఱేడ సిరులనిమ్ము
గుజ్జు రూపమువాడ గురువువై దీవించు
పెద్దబొజ్జ ప్రభువ ప్రియముగనుము
వక్రతుండస్వామి వాక్కు స్వచ్చతనిమ్ము
ఏకదంత కరుణ నేలుకొనుము
మూషిక వాహనా మోదమ్ము నందించు
కరిమోము గలవాడ కావుమమ్ము

ఆటవెలది:
భక్తితోడ మ్రొక్కి భజనలే జేయుచు
వేడుకొందుమయ్య విఘ్నరాజ
ప్రబలు రోగములను పట్టిమట్టినిద్రొక్కి
ప్రజల గావుమయ్య ఫాలచంద్ర.

---గోలి. 🙏

Monday 17 August 2020

"గోలీ"లు - 10

కందము: 

భేషుగ వార్తల బెడుదురు 

సోషల్ మీడ్యాన  మంచి సోర్సది, యొకచో

ర్యాషుగ 'వార్' తలబెడుదురు

శోషిం'పగ ' జేయ శాంతి 'సో శాడ్' గోలీ!   

Sunday 16 August 2020

"గోలీ"లు - 9

కందము: 

గీతలు మారగ నరులకు 

గీతను బోధించె "గురువు" కృష్ణుడు, నేడా

గీతను చావుకు గురుతగు

మ్రోతగ నికృష్టులిడుర, రోతర గోలీ! 

Friday 14 August 2020

"గోలీ"లు - 8

 

కందము: 

వాడకనుండిన భాషలు

వాడకనుండున? తెలియుము వాదించకుమా

వాడినదని  వదలక మరి

వాడిన చిగురించు మాతృ భాషయె గోలీ! 


Thursday 13 August 2020

"గోలీ"లు - 7

 

కందము: 

వాడని వీడని లేదులె

వీడని చిరునవ్వు నింపి విరియుచునెపుడున్

వాడని ముఖమున నిలచిన

పీడల నెదిరించవచ్చు ప్రియముగ గోలీ!  

Tuesday 11 August 2020

"గోలీ"లు - 6

 కందము: 

తలపై "హెల్మెట్" బెట్టగ

తలగొట్టుక మాటలెన్నొ తడవకు జెప్పన్

తలనేల దూర్చలేదని

తల నేలను దాకి పగుల, దలతురు గోలీ! 




Monday 10 August 2020

"గోలీ"లు - 5

 

కందము: 

తప్పులు వెదకెడు వారికి 

తప్పులె కనిపించునెపుడు తామొప్పక బల్ 

నొప్పులను బడుచు నొప్పుల 

దప్పులుగా జూపనెంత్రు తప్పక గోలీ! 


Sunday 9 August 2020

"గోలీ"లు - 4

 కందము: 

తప్పని జెప్పిన దప్పును 

తప్పనిసరి యనుచు జేయ దప్పది తప్పే 

తప్పక జేసిన తప్పును 

తప్పక సరిజేయ ముప్పు తప్పును గోలీ!


 

Saturday 8 August 2020

"గోలీ"లు - 3

 "గోలీ"లు - 3

కందము:
కల్తీ సరుకులనమ్మెడు
గల్తీ పనులకు "సజా"తొ కల్ మిల్తా, వో
శాల్తీ సజావ్ గనుండదు
బోల్తా గొట్టును యహీతొ బోల్తా గోలీ!


Thursday 6 August 2020

రామా! నిన్నే దల్తుము

అయోధ్యలో 5-8-2020 న  "రామాలయ" నిర్మాణ శంకుస్థాపన  సమయంలో శ్రీరామునికి జేజేలు. 

కందము :
దశరథ సుతుడై, బంటుగ
దశబాహుని పంచ ముఖుని దరిజేరిచి యా
దశకంఠుని పరిమారిచి
దశదిశలను ఖ్యాతి గనిన త్రాతకు జేజే!

కందము:
రామా! నిన్నే దల్తుము
రా! మామదిలోన నిలిపి రాజా రామా!
రా! మాయను తొలగింపుము
రా! మా సీతమ్మతోడ రక్షణ నిడుమా!

కందము:
నీజన్మ భూమి గుడినిడ
మా జన్మలు ధన్యమౌను మహిలో రామా!
భూజాని తోడ నిలచుచు
భూజనులను గావుమయ్య పురుషోత్తముడా!

కందము:
రామా! యని గొలిచెదమిక
రా! మాయని రోగములను రక్కసిమూకల్
భూమాతబట్టె, ద్రుంచుము
జామాతవు నీవు గాన జాలినిగనుచున్.

కందము:
"సురవైరు"లు "వైరసు"లయి
ధర నరుల "కరోన" పేర దాడిని సలిపెన్
పరుగున వరగుణ! రావా!
కరుణను కోదండరామ! కావగ రారా!

Monday 3 August 2020

"సో" దరి

కందము:
సోదరి కట్టును "రాఖీ"
"సో" దరి జేరుము సతతము శుభమగు నీకున్
సోదర "రక్షయె" నీకన
"సో" "దీ" పూర్ణిమ దినమున "సోదీ"యనకన్.