తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 31 December 2016

బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు. ఆటవెలది: 
ఆట పాట తోడ నంతయు సమయమ్ము 
ఖర్చు జేసి చివరి కాలమందు
కాలుడెదురు రాగ కాళ్ళను బట్టెడు
బాటఁ బట్టి " పోవు " వాఁడు ఖలుఁడు. 

Friday, 30 December 2016

నచోరహార్యం న చ రాజహార్యం...కు ..స్వేచ్చానువాదం

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణన - నచోరహార్యం న చ రాజహార్యం...కు ..స్వేచ్చానువాదం ఆటవెలది: 
నృపుడు తస్కరుండు నిగిడి దోచగలేరు 
పెరుగుచున్న మనకు బరువు కాదు
తోడ బుట్టు వారు తోడు దీసుక పోరు 
విద్య గొప్ప ధనము విజ్ఞులార.

Thursday, 29 December 2016

చైత్రమందు వినాయక చవితి వచ్చు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చైత్రమందు వినాయక చవితి వచ్చు.మీలో యెవరు కోటీశ్వరుడు లో ఒకని " పాట్లు" 


తేటగీతి: 
నాల్గు ఆప్షన్ల నిచ్చెగా " నాగు " గారు 
హెల్పు లైన్లేవి లేవుగా యేమిచేతు 
ఫిక్సు జేయంగ జెప్పితి ఫియరు లేక 
చైత్రమందు వినాయక చవితి వచ్చు.

Wednesday, 28 December 2016

బామ్మ యమహా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బామ్మ యమహా  కందము: 
ఆయన బ్రతికున్నప్పుడు 
ఈ యమహా తోల నేర్పె నిదిగో చెల్లీ 
ఆయముని గలిసె నాతం
డీయమ వేగంబు జూడు మిక భయమేలా. 

Tuesday, 27 December 2016

షణ్మాసములనగనొక్కసంవత్సరమే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - షణ్మాసములనగనొక్కసంవత్సరమేకందము: 
షణ్మాస దక్షిణాయన 
షణ్మాసపు టయనమొకటి సరియుత్తరమే 
షణ్ముఖ !వినుమా రెండగు 
షణ్మాసములనగనొక్కసంవత్సరమే. 

Monday, 26 December 2016

యాగమనినఁ గడు భయమ్ము గలిగె

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - యాగమనినఁ గడు భయమ్ము గలిగెఆటవెలది: 
వంట జేసిరింట వందమంది కొరకు 
చూడగ పదిమంది చేరివచ్చె 
ఆపదార్థ ములును యన్నమ్ము నేటికే 
యాగమనినఁ గడు భయమ్ము గలిగె

Sunday, 25 December 2016

ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్. కందము: 
విద్యార్థీ ! వినుమా! విలు 
విద్యను రాముడు విజయుడు, విన నకులుండే 
హృద్యమ్మగునందములో 
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్. 

Saturday, 24 December 2016

ఇందుగలడందులేడని....పద్యభావంతో మరొక పద్యం.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణన - ఇందుగలడందులేడని....పద్యభావంతో మరొక పద్యం.


కందము: 
సందుల గొందుల మరిమీ 
ముందర నే నిలచియుండు మురహరి యెపుడున్ 
సందియము వలదు మీకు ప 
సందుగ తా గానుపించు సరి హరి వెతుకన్.

Friday, 23 December 2016

కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో. ఉత్పలమాల: 
మక్కువమీర గల్గినది మానవ జన్మము, తీరులోపునే 
చక్కగసాటివారలకు సాయము జేయక మోసగించినన్ 
తక్కిన జన్మలందు మరి తప్పక నౌదువు, నిక్కమే సుమా 
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.

Thursday, 22 December 2016

తెలుగు 'వాడి ' కోసం, ఈ బుజ్జాయి.

ఏ వాడనున్నా...
తెలుగు వాడి, 
తెలుగు వాడిపోకుండా
తెలుగు 'వాడను' అనుకోకుండా
'తెలుగువాడను' అనుకుంటూ
తెలుగు 'వాడిని' పెంచాలనుకుని
'తెలుగువాడిని' పెంచాలనుకునే
తెలుగువాడి కోసం, ఈ బుజ్జాయి
తెలుగు పిల్లలకు పరిచయం చేయండి
తెలుగు వాడిననిపించుకోండి
ఒకసారి ఈ బ్లాగును సందర్శించండి. 

golibujji.blogspot.com

శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు.తేటగీతి: 
రామవైరియె జపియించు నామమెద్ది? 
సీతబట్టగ రామయ్య చేసెనేది? 
సీత జాడను లంకలో వెదకెనెవడు? 
శివ - ధనుర్భంగ మొనరించెఁ - బవనసుతుఁడు.

Tuesday, 20 December 2016

చేఁదు తీయనగుచు క్షేమ మొసఁగు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చేఁదు తీయనగుచు క్షేమ మొసఁగు.


ఆటవెలది: 
నమ్మి మనసు దలుచు నరులను శ్రీపతి 
దరిని చేరదీయు తండ్రివోలె 
నమ్మకమ్ము లేక నలుగుచు నుండెడి 
చేఁదు తీయ, నగుచు క్షేమ మొసఁగు.

Saturday, 17 December 2016

రామచంద్రుని రక్షించు రావణుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామచంద్రుని రక్షించు రావణుండు.అశోకవనిలో రాక్షస స్త్రీలు సీతతో...


తేటగీతి: 
శోకమును బాపి నిన్ను యశోకవనిని
మార్చి చేరుచుగా తన మందిరమున 
మాదుమాటలవిని సీత ! మరువ నిపుడు 
రామచంద్రుని, రక్షించు రావణుండు.

Thursday, 15 December 2016

కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్కందము: 
పుట్టింటి వారి మెచ్చుచు
కొట్టుచువేయక నడిగిన కోర్కెలు దీర్చన్ 
మొట్టక నడుగగనే "ఊ" 
కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్. 

Wednesday, 14 December 2016

మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

 
కందము: 
సరి పానకమ్ము వోయుచు 
పెరడుననే ప్రేమతోడ పెంచిన గానీ 
మరి రుచి మారుచు నంటున 
మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

Tuesday, 13 December 2016

అరటి పండు ప్రాణ హరము విషము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అరటి పండు ప్రాణ హరము విషముఆటవెలది: 
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార 
మంచిజెప్పుచుంటి మాన, మందు  
అరయ నాదుమాట ననుకొనకుమాటలో  
నరటి పండు, ప్రాణ హరము విషము. 

Monday, 12 December 2016

చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.


కందము: 
పెనుకేకలనూయలనే 
తనకాలిని తన్నియేడ్వ తల్లియె స్నాన 
మ్మునకేగగ వడినాడిం 
చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్.


కందము: 
వినకను నిద్రను బొమ్మన 
తననెత్తుక బొమ్మననుచు తండ్రిని గోరన్ 
వెనువెంట బయట నాడిం 
చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్

Sunday, 11 December 2016

విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.కందము: 
మస్కా గొట్టక వినుమా 
మూస్కొని నీ నోరు, పెద్ద మూఢుడ ఛీ!ఛీ! 
రాస్కెల్!విని వీడనిచో 
విస్కీ బ్రాండీల "వల " నవిజ్ఞత హెచ్చున్.

Saturday, 10 December 2016

మూడును మూడును గలసిన ముప్పదియేడౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మూడును మూడును గలసిన ముప్పదియేడౌ


కందము: 
మూడూ మూడూ నారే 
మూడుకు మూడిడను ప్రక్క ముప్పది మూడౌ 
చూడగ నెట్టుల మిత్రమ 
మూడును మూడును గలసిన ముప్పదియేడౌ?

Friday, 9 December 2016

వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.తేటగీతి: 
పతికి మారాడకుండగ పరమ భక్తి
అన్నదమ్ముల భార్యలే యణగియుండు 
ప్రక్కనున్నట్టి శ్రీశ్రీనివాసులు పరి 
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

Thursday, 8 December 2016

కావ్యమును లిఖించెఁ గత్తితోడ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కావ్యమును లిఖించెఁ గత్తితోడ.


ఆటవెలది: 
చిన్నతనము లోన చెలికానికే పంప 
హృదయచిత్రమపుడు మదిని తలచి 
వ్రేలు గాటుబెట్టి వేడి రక్తమునద్ది 
కావ్య,  మును లిఖించెఁ గత్తితోడ.

Wednesday, 7 December 2016

మానము పోవలె నటంచు మానిని తలచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మానము పోవలె నటంచు మానిని తలచెన్.కందము: 
నేనేమి సీతగానుగ
యా నిప్పులదూకి నింద నార్పగ, రామా!
నా నాథునకు మదిని యను 
మానము పోవలె నటంచు మానిని తలచెన్.

Tuesday, 6 December 2016

జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.కందము: 
అల 'ల్యాబు ' లోన విద్యా 
ర్థుల కుప్పును జేయు విధము దోపగ జూపన్ 
జలజల లవణము గానే 
జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.    

Monday, 5 December 2016

ముద్దు మగని ప్రాణముల హరించె

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముద్దు మగని ప్రాణముల హరించె


ఆటవెలది:  
శాపమంది యుండి చపలత్వ మతి చేత
పాండురాజు మాద్రి ప్రక్కజేరి
సరసమాడువేళ చనిపోయెగా నాడు 
ముద్దు మగని ప్రాణముల హరించె.

Sunday, 4 December 2016

శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.  


ఆటవెలది: 
ఎదిరి యుద్ధమందు నీపేర్లు గల్గిన 
కరి సమూహమంత యురికి రాగ 
శ్యామ,భీమ,రామ,చక్రి,యశ్వత్థామ 
శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.  

Saturday, 3 December 2016

శవపూజల వలన జన్మ సార్థక మగురా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శవపూజల వలన జన్మ సార్థక మగురా 


కందము: 
అవరోధము లేకుండగ 
జవసత్వము లున్ననాడె సన్మతితోడన్ 
భవనాశకులగు శివకే 
శవపూజల వలన జన్మ సార్థక మగురా!

Friday, 2 December 2016

ముండాయని పిలువమనుచు ముదితయె జెప్పెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముండాయని పిలువమనుచు ముదితయె జెప్పెన్.


కందము: 
పండరి మీ పేరే గద 
పండూయని మిమ్మనెదను పతిదేవా ! నా
కుండిన పేరేగద చా 
ముండా! యని పిలువమనుచు ముదితయె జెప్పెన్.

Thursday, 1 December 2016

రామ యనిననోరు ఱాతి రోలు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామ యనిననోరు ఱాతి రోలు.


ఆటవెలది: 
నామమెద్ది యనిన నాంజనేయుడు మెచ్చు? 
తినుటకేది వలయు తిన్నగాను?
బామ్మ నూరె నాడు పచ్చడి దేనిలో? 
రామ యనిన-నోరు-ఱాతి రోలు.