తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 31 July 2015

కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్ 


కందము: 
చెవియొగ్గి వింటి రాముని
భువిపుత్రిక మేటి కథను పూజ్యుల నోటన్
వివిధములగు వెతలును, శం
క, వినాశనమయ్యె మేటి కావ్యము చేతన్



Thursday 30 July 2015

ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.

తేటగీతి:
అక్కట యర్థము తెలియక
నొక్కడు "కోరుట '" యనుకొనెనో యన " దూఱున్ "
నొక్కుచు చెప్పెను తానిటు
' ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్. '

Wednesday 29 July 2015

కాశి యతిపవిత్రము గద క్రైస్తవులకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కాశి యతిపవిత్రము గద క్రైస్తవులకు.


తేటగీతి:
ముస్లిములకు వారమునను ముఖ్యమగును
శుక్రవారము, వినరయ్య  చూడగాను
ఆదివారము, సంగీత ! హరిత ! కృష్ణ !
కాశి !  యతిపవిత్రము గద క్రైస్తవులకు.

Tuesday 28 July 2015

దుష్ట జనముల సాంగత్య మిష్టమగును


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - దుష్ట జనముల సాంగత్య మిష్టమగును



తేటగీతి: 
చిత్రమేమియు లేదులే శిష్టులకును 
శిష్ట జనముల సాంగత్య మిష్టమగును
తోడు బలమును పెంచగా దుష్టులకును 
దుష్ట జనముల సాంగత్య మిష్టమగును

Monday 27 July 2015

తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.


కందము: 
అయ్యారే పూతనతన
చెయ్యందించుచును పాలు చేరిచి కుడుపన్ 
చయ్యన బీలిచి ప్రాణము
తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

కందము: 
ఇయ్యడవి దీనియాగడ 
మియ్యదియని తెలుపలేను యీక్షణమే రా 
మయ్యా! చంపుమన గురుడు 
తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

Sunday 26 July 2015

తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె



తేటగీతి: 
మేనబావను మెచ్చెను చాన, నాన్న 
వలదు వలదని చెప్పినన్ వాదులాడి 
బావనే కోరి, యొప్పించి బాగుగాను 
తండ్రినే, భర్తగా బొంది తరుణి మురిసె

Saturday 25 July 2015

మామ ముగ్గు బెట్ట మగువ మురిసె



శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 111- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - మామ ముగ్గు బెట్ట మగువ మురిసె



ఆటవెలది: 
పట్నవాసి, భోగి పండుగకే వచ్చి 
మనుమరాలు పల్లెదనము మెచ్చె 
మామ్మగారు నేర్ప మాపటికే చంద 
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

Friday 24 July 2015

నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.


దేవుని తీర్థమైతే మాత్రం మునిగితే చీమ బ్రతుకుతుందా... 

తేటగీతి: 
నీటిలోన బడిన చీమ నిగుడుగాద 
ప్రకృతి ధర్మంబు గద, తాను  ప్రాకిప్రాకి 
తీర్థ మిదియేమి గాదని దిగిన గాని 
నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు. 

Thursday 23 July 2015

గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్


కందము: 
మావాడ బొమ్మలాటను 
భావమ్మున గొంతునెత్తిపాడుచు, కనగా 
నావేణు నాథునొక్కడు 
గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్.

Wednesday 22 July 2015

హైద్రాబా దెంతదూరమయ్య కడపకున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హైద్రాబా దెంతదూరమయ్య కడపకున్



కందము:  
భద్రాచలమును చూచితి
భద్రముగ తిరుమల కాణిపాకము గంటిన్ 
నిద్రించి రేపు బోయెద
హైద్రాబా దెంతదూరమయ్య కడపకున్?

Tuesday 21 July 2015

భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.



తేటగీతి: 
విను మహాశివరాత్రికి విశ్వనాథు 
బిల్వదళముల బూజించి పిల్వదగును 
పరగ విజయదశమినాడు పరమ శివుని 
భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.

Monday 20 July 2015

భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును
 
తేటగీతి:
కన్ను మిన్నును గానక, కనగలేక
పుట్టకుండగ జేయుచు పుట్టిముంచు
వారి కిట్టుల జెప్పిన - "పాపమగును
భ్రూణహత్యలఁ జేయుట " - పుణ్య మగును

Sunday 19 July 2015

చెక్కు, సైన్, మనీ, డ్రా.....భారతార్థంలో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది - చెక్కు, సైన్, మనీ, డ్రా.....భారతార్థంలో.  



అభిమన్యుని మరణ వార్త విన్న అర్జునుని శపథం...
 
తేటగీతి:
ఇటుల సుతునెవడ్రా చంప నిచ్చె, వింటి
సైంధవుండని, వాడిని చంపకున్న
వింటి విడుతును వినుమ నీమంటలోని
కిట్టు వెడలెద నంచెక్కు పెట్టె విల్లు.

Saturday 18 July 2015

తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.


కందము:
మెరుగుగ నింటిని దిద్దుట
మరి బంధువులందరందు మంచిని పొందన్
సరిగా మెలగుట కొమ్ములు
తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.

Friday 17 July 2015

శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.


కందము:
వంకలు లేని, జగతికి శు
భంకరులగు దంపతులను భక్తిని జూడన్
జంకక నింద్రుడు వచ్చెను
శంకరుఁ డుమ, కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.


Thursday 16 July 2015

రాముడు విననియ్యకొనడు రామాయణమున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముడు విననియ్యకొనడు రామాయణమున్.



ఒక మనవడిని రామాయణము సీడీని కొనితెచ్చి ఇమ్మంటే ఇవ్వలేదని  తాత ఆరోపణ..
కందము:
నే ముదుసలి వాడనురా
నామనుమడ! తెమ్మునాకు నచ్చిన " సీడీ "
ప్రేమగ వినెదననిన మా
రాముడు విననియ్య, కొనడు రామాయణమున్.

Wednesday 15 July 2015

చదువురాని వాడు శాస్త్రవేత్త.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చదువురాని వాడు శాస్త్రవేత్త.


ఆటవెలది:  
పొలము పనులజేయు ' పోలయ్య '  కనిపెట్టె
సరళ పద్ధతులను సాగునందు
పట్టుదలయె వలయు పట్టాలు కాదయ్య
చదువురాని ' వాడు ' శాస్త్రవేత్త.

Tuesday 14 July 2015

క్రిస్మస్ నాడవతరించె కృష్ణుడు భువిపై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - క్రిస్మస్ నాడవతరించె కృష్ణుడు భువిపై.

కందము:
అస్మత్ పుత్రుడు వీడే
కిస్మత్ నాకుంది గనుక కేవలమొకడే
సుస్మితముఖు హరివేడగ
క్రిస్మస్ నాడవతరించె, కృష్ణుడు భువిపై.

Monday 13 July 2015

కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

తేటగీతి:
గాడిదలు జేరెనొకచోట వేడుకగను
సభను బెట్టెను ముందుగా సంబరమున
కూరుచున్నవి మెచ్చగా జేరి యొకటి
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము


Sunday 12 July 2015

భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భువిని శాత్రవు లెల్ల బంధువులు  గారె.
 
తేటగీతి:
మొక్కలెక్కడ మొలకెత్తు, మీద జెపుమ
కననజాతశత్రువు గూర్చి కమ్మగాను,
మినప వంటకమొక్కటి మెచ్చ జెపుమ
భువిని - శాత్రవు లెల్ల బంధువులు - గారె.

Saturday 11 July 2015

మాతను బెండ్లియాడి జన మాన్యు డనంబడి పొందె సన్నుతుల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మాతను బెండ్లియాడి జన మాన్యు డనంబడి పొందె సన్నుతుల్


ఉత్పలమాల:
భూతల నాథు మాటవిని బుద్ధిగ రాముడు మ్రొక్కి గుర్వుకే
చేతనుబట్టి యెత్తి విలు చేర్చగ నారిని, దిక్కులన్నియున్
భీతిల ముక్కలాయె, మరి ప్రీతిగ మాలను వేయ జానకీ
మాతను బెండ్లియాడి, జన మాన్యు డనంబడి పొందె సన్నుతుల్

Friday 10 July 2015

కప్పను గాపాడె నొక్క కాకోకదరమే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 -- 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కప్పను గాపాడె నొక్క కాకోకదరమే.

కందము:
అప్పటినిధి గుడినుందని
తప్పుడు నరులేమొ వెడలె తస్కరులగుచున్
మెప్పుగ చుట్టుక తాళపు
కప్పను, గాపాడె నొక్క కాకోకదరమే.

కందము:
తప్పని చెప్పగ నేరం
బిప్పటి యీ రాజకీయ బేరములందున్
తప్పని దని భావించుచు
కప్పను గాపాడె నొక్క కాకోకదరమే.

Thursday 9 July 2015

తరువుల బడగొట్ట దప్పదయ్య.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తరువుల బడగొట్ట దప్పదయ్య. 


ఆటవెలది:
పాఠశాలముందు పరమ శృంగారంపు
భంగిమలను జూపు భామలున్న
' సినిమ ' బొమ్మలన్ని చించి కాల్చగ , చి
త్తరువుల బడగొట్ట దప్పదయ్య.


Wednesday 8 July 2015

హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్. 

కందము:
ఘన వాయు పుత్రుడెవ్వరు ?
కన గురువైనట్టివాడు కానగునెదియో ?
విన శుక్రుడెవరి గురువగు ?
హనుమంతుడు, పూజనీయు, డసురుల కెల్లన్.

Tuesday 7 July 2015

సంజ నిద్దుర చేకూర్చు సంపద లను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య  - సంజ నిద్దుర చేకూర్చు సంపద లను

తేటగీతి:
వదలి చూడుము బాలుడా బద్ధకమును
పరుల దూషణ, చాడీలు,వదలుమయ్య
పాపకర్మలు, హింసను వదలు, వదలు
సంజ నిద్దుర, చేకూర్చు సంపద లను.

Monday 6 July 2015

గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గంగా నది తెలుగు నాట గలగల పాఱున్


కందము:
రంగున తెలుపై మెరయును
సింగారిగ భద్రగిరిని  శ్రీ గోదారే
హంగుగనెండలు పడి  వెలు
గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

Sunday 5 July 2015

భక్తిలేని వాడు పరమ భక్తుడు గద.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భక్తిలేని వాడు పరమ భక్తుడు గద.


తేటగీతి:
చిత్రసీమల నటియింత్రు చేరి నటులు
చదువు లేనట్టి వ్యక్తియాచార్యుడగును
సొమ్ములున్నట్టి మనిషి భిక్షమ్మునెత్తు
భక్తిలేని వాడు పరమ భక్తుడు గద.

Saturday 4 July 2015

రామునిన్ జంపె రణమున రావణుండు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామునిన్ జంపె రణమున రావణుండు


రామ రావణ యుద్ధములో రావణుని చేతిలో చనిపోయిన ఒక కపి వీరుని భార్య పలికిన పలుకులు.
తేటగీతి:
రామదండున జేరుచు రాజసమున
పోరుసల్పగ వీరుడా పోయినావు
మనసు గెలిచిన పతి నిన్ను మతి మరువగ
రాము, నిన్ జంపె రణమున రావణుండు

Friday 3 July 2015

పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.


కందము:
ఉండగ ధర్మజుడే తా
నండగ ధర్మంబు తోడు నగ్రజుడగుచున్
మండెడి గుండెలనాపిరి
పాండు కుమారులు నలుగురు, పదుగురు మెచ్చన్.

Thursday 2 July 2015

ఆది, సోమ, మంగళ, బుధ - భారతార్థం లో...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - ఆది, సోమ, మంగళ, బుధ - భారతార్థం లో...


కపట నిద్రలోనున్న కృష్ణుని వద్దకు వెళ్ళిన అర్జునుని మాటలు.

తేటగీతి:
సోమవంశంపు వారికి సూర్యుడీవు
బుధజనంబులు గొల్చు శ్రీమూర్తి వీవు
మంగళంబులు గల్గగా మదిని దల్తు
ఆది దేవుడ కనుము నీ యర్జునుడను.

Wednesday 1 July 2015

ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా 

కందము :
ఇల చిత్ర నాయికొక్కతె
వెల కొలదగు వలువగట్టె - వేలంబందున్
కలదలపని విలువందెను
ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా !