తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 30 November 2013

భిక్షమయ్యా ' అన్న ' పూర్ణ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - భిక్షమయ్యా  ' అన్న ' పూర్ణ 

 
కందము:
అన్నిట మిన్నగు నీశుడు
అన్నన్నా! యన్న మడుగు నమ్మా నిన్నే
అన్న మనగ శక్తియె సరి
నెన్నగ నీ భిక్ష మదియె నిక్కము తల్లీ ! .

Friday, 29 November 2013

ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

కందము:
ఆమని పక్షుల నెన్నియొ
ప్రేమగ తా నింటి లోనె పెంచెను, పెండ్లై
యామె చని పిదప రాగా
ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్. 

Thursday, 28 November 2013

మా 'నవ ' గ్రహ గతులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మా 'నవ ' గ్రహ గతులు

కందము:
ఓ గ్రహము లార మా పై
నాగ్రహమును జూపకుండ నయముగ భువిలో
నగ్రపు భాగము లందగ
మా  గ్రహ గతులను నడుప  నమస్సులు జేతున్.


Wednesday, 27 November 2013

శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?


కందము:
ఎవరికి లోనుండును జగ
మెవరో మూలము జగతికి నెన్నుచు తండ్రీ
భవదంఘ్రి యుగము విడువను
శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

Tuesday, 26 November 2013

ముగురమ్మల మూలపుటమ్మ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - ముగురమ్మల మూలపుటమ్మ


 

ఉత్పలమాల:
అమ్మయె ముగ్గురాయె మన యార్తిని జూచిన చేరదీయుచున్
కమ్మని ప్రేమ నిచ్చుచును గాతురు,  భుక్తిని శక్తి యుక్తులన్
రమ్మని బిల్చి యిచ్చెదరు, రంజిల జేతురు జీవితమ్ము,  నే
నిమ్ముగ గొల్చుచుందు ననునిత్యము నీమము తప్పకుండగన్.

Monday, 25 November 2013

ఇద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - ఇద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.
కందము:
పెద్దమ్మ చెల్లి శ్రీ సతి
విద్దెలనే యిచ్చు తల్లి వినగను విధికే
ముద్దుల సతి గద, కనని
య్యిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్.

Sunday, 24 November 2013

బాలుడు - కాలుడు - కాలకాలుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - బాలుడు - కాలుడు - కాలకాలుడు


కందము:
యముడే వచ్చెను తానె ని
యమములనే దప్పకుండ, హర హర యనుచున్
భయమును వీడుచు గొల్వగ
యమబాధను దీర్చి బాలు నభవుడు బ్రోచెన్.

కందము:
మార్కండేయుని కథయే
తార్కాణము మానవునికి ధారుణి శివు
నిన్ 
కర్కశ రహితుని గొలువగ
నర్కజ బాధలు నిరతము నవియే దీరున్.

Saturday, 23 November 2013

మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా

ఇంట్లో వుంటే అమ్మా నాన్నా కనబడరు...బడిలో తెలుగు వినబడదు...కమ్మనివగు ఆ రెండూ కావాలని ఒక మనవడు తాతతో..

కందము:
అమ్మా నాన్నా ఉద్యో
గమ్మునకే బోవు, నాకు కాన్వెంట్ బడిలో
కమ్మని వేంలేవు, వలెను
మమ్మీ డాడీలు, తెలుఁగు మాటలె తాతా!

Friday, 22 November 2013

నవ్వులరేడు రేలంగి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - నవ్వులరేడు రేలంగి 

 

కందము:
భంగిమ జూపుచు సినిమా
రంగము పై కాలు సేతు లటు నిటు లూపన్
గింగిరములు దిరుగుచు రే
లంగిని జూడంగ నవ్వు లవియే వచ్చున్.

Thursday, 21 November 2013

కోడలున్నచోటు వీడునత్త.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కోడలున్నచోటు వీడునత్త.
ఆటవెలది:
కొడుకు బార్య ? చూడ కొరతలెచ్చట దీరు ?
నూరికున్న నొక్క పేరదేమి ? 
నడక లోన నెంచ కడు నెమ్మ దదియేది ?
కోడలు, న్నచోటు, వీడు, నత్త.

Wednesday, 20 November 2013

పరుగులు దీయదీయ పయి పచ్చిగ పుండయె

ఉత్పలమాల:
బాలును ' బ్యాటు ' బట్టె తన  బాల్యమునుండి, క్రికెట్టు క్రీడలో
వేలుగ ' రన్సు' జేసె గద వేడుక మీరగ,  మించి  చేయగా
జాలుట  కష్టమన్యులకు  చాల ' రికార్డుల ' దాట లేరుగా
మేలుగ భారతీయులిక మెచ్చుచు  ' రత్నమె గా సచిన్ ' యనెన్.


సచిన్ క్రికెట్టు నుండి విశ్రాంతి తీసుకుంటున్నాననగానే - క్రీజు, బాలు, బ్యాటుల మనోగతం...
చంపకమాల:
పరుగులు దీయదీయ పయి పచ్చిగ పుండయె - నింక హాయిలే
మెరుపుగ బాదబాదగను మిన్నుకు మన్నుకు నైతి - హాయికన్
చురుకుగ నూపునూపు తరి చుక్కలుగన్పడె బంతిగొట్ట - హాయ్
మరియిక పండుగంచు మది మెచ్చెను- క్రీజులు, బాలు, బ్యాటులే. నారద ముని వచ్చె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నారద ముని వచ్చె


 

కందము:
నారాయణ ! నారాయణ !
నారద ముని వచ్చెసర్వ నాశన మనుచున్
పేరును బెట్టకు, నిజమిది
తీరుగ కళ్యాణ మగును తిన్నగ గనినన్.

Tuesday, 19 November 2013

యముఁగని రోగార్తుడొక్కడానందించెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - యముఁగని రోగార్తుడొక్కడానందించెన్.

కందము:
యమ పొగ త్రాగుడుకే హృద
యమునకు పెనుజబ్బు రాగ నా వైద్యుడనెన్
క్రమముగ నయమౌనను ధై
ర్యముఁగని రోగార్తుడొక్కడానందించెన్.

Monday, 18 November 2013

భారతరత్న సచిన్ కి అభినందన మాలలు.


ఉత్పలమాల:
బాలును ' బ్యాటు ' బట్టె గద బాల్యమునుండి క్రికెట్టు క్రీడలో
వేలుగ ' రన్సు' జేసె గద వేడుక మీరగ వేరొకండిలన్
చాలడు చేయనట్లు మరి చాల ' రికార్డుల ' నెక్కి నిల్చెగా
మేలుగ భారతీయులిక మెచ్చెను ' రత్నముగా సచిన్ ' యనెన్.


సచిన్ క్రికెట్టు నుండి విశ్రాంతి తీసుకుంటున్నాననగానె క్రీజు, బాలు, బ్యాటుల మనోగతం...

చంపకమాల:
పరుగులు దీయ దీయ పయి పచ్చిగ పుండయె - నింక హాయిలే
మెరుపుగ బాద బాదగను మిన్నుకు మన్నుకు నైతి - హాయికన్
చురుకుగ నూపునూపు తరి చుక్కలు కన్పడె బంతికొట్ట - హాయ్
మరియిక పండుగంచు మది మెచ్చెను క్రీజులు, బాలు, బ్యాటులే.

కర్ణునిగని పెట్టెను నిడి..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కర్ణునిగని పెట్టెను నిడి..

కందము:
కర్ణముల మంత్రమిడ నా
కర్ణించిన కుంతియె దినకరునే పట్టెన్
కర్ణునిగని పెట్టెను నిడి
వర్ణ విహీనత ముఖమున వదలెను నదిలో.

Sunday, 17 November 2013

బోధ సేయు గురుఁడు మూర్ఖుడు కద

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బోధ సేయు గురుఁడు మూర్ఖుడు కద

ఆటవెలది:
కొండ మ్రుచ్చు లకును గోరంత నిజమును
చెప్ప నెంచి చచ్చె చెవుల పిల్లి
చెనటి జనుల మార్చగను సత్య మార్గమ్ము
బోధ సేయు గురుఁడు మూర్ఖుడు కద

Saturday, 16 November 2013

దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్.


ఉత్పలమాల:
కన్నులు జూడ పెద్దవిటు గాంచగ కొమ్ములు చిన్నవైన మా
అన్నయ గారి దున్నకును యన్నుల మిన్నగు మాదు గేదెకున్
కన్నులు గల్సె,  మేనులును గల్వగ నిప్పుడు మాదు గేదెకున్
దున్నకు, దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్.

Friday, 15 November 2013

పడతి యెంకి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - పడతి యెంకి
 


తేటగీతి:
బండి బొమ్మల నమ్మును పడతి యెంకి
ఎండ దిరుగుచు నింటికి నేగు చుండె
' ఇంత మాడ్చిన నల్లటి యింతి కింత
సోయ గంబా ? 'య నెరుపాయె సూర్యుడపుడు. 

Thursday, 14 November 2013

లవకుశులకు వాల్మీకి విద్యాబోధన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - లవకుశులకు వాల్మీకి విద్యాబోధన.


 


కందము:
స్తవనీయ రామ చరితము
శ్రవణమ్ముల కింపు గొలుపు రాగమ్ములతో
లవ కుశులకు నేర్పించితి
వవనిజనే గాచినట్టి యాదికవి! మునీ!

Wednesday, 13 November 2013

గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి

ధారణా బ్రహ్మరాక్షసులకు, అవధాననర' సింహునకు' నమస్కారములతో....
తేటగీతి: 
వాణి మనసున నిల్చిన బలము చేత
పరుల కందని ధారణా పటిమ చేత
చిక్కు లెన్నేని సేయడు లెక్క, వాటి
గఱిక పాటి సేయఁడు గదా, గరికిపాటి

Tuesday, 12 November 2013

అష్టావధానం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అష్టావధానం


 సీసము:
చిక్కు సమస్యను చేపట్టి పూరించు
దత్త పదిని పద్య ధార గలుపు
వ్యస్తాక్షరిని తాను విస్తరించుచు జెప్పు
ఘంట శబ్దములను గణన సేయు
వర్ణ నీయగ వర్ణ వర్ణంబులుగ పల్కు
అప్రస్తుతము తోడ నాట లాడు
నిషిద్ధమున గూడ నిక్కచ్చి గా నుండు
ఘన పురాణములను కథలు నుడువు

ఆటవెలది:
అష్ట కష్ట ములనె యిష్టంబుగా కోరి
అవధరించి  చెప్పు   నాశు వుగను
సరస పద్య ములనె సభ్యులందరు మెచ్చ
తెల్గు జాతి కున్న తేజ మిదియె.

Monday, 11 November 2013

కర్ణుని చరమదశ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కర్ణుని చరమదశ

 
కందము:
నీ ' కన్న ' శక్తిమంతుడు
మూకుమ్మడి శాప ఫలము ముప్పిరి గొనెగా
చేకొని బాణము వేయుము
ఆ కర్ణుడు ' తేరు ' కొనని యప్పుడె విజయా!

Sunday, 10 November 2013

పాపములకు హేతు వగును ప్రణవ మొకటె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పాపములకు హేతు వగును ప్రణవ మొకటె.

తేటగీతి:
సకల మంత్రమ్ము లకు ముందు శక్తి పెరుగ
నిలిచి విలసిల్లు నోంకార మలతి జేయ
రాదు, దానిని నరులు నిరాదరింప
పాపములకు హేతు వగును,  ప్రణవ మొకటె.

Friday, 8 November 2013

ఓంకారము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఓంకారము 


 


కందము:
ఓంకారమ్మది తుమ్మెద
ఝుంకారము వోలె నుండు జూడగ నదియే
శాంకరి పుత్రుని రూపమ
హంకారములే నశించు నానాదముతో.

Thursday, 7 November 2013

నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

తేటగీతి:
మేలు కలుగును దొంగకు మీరు వినుడు
కలిసి యందరు నింటిలో గాలి లేక
మేడ పైకెక్కి నిద్రించ మేలు కొనని
నిద్ర, చేకూర్చు సంపదల్ భద్రముగను.

Wednesday, 6 November 2013

కుంభకర్ణుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కుంభకర్ణుడు
సీసము:
ఏన్గుల రప్పించి యెక్కించి తొక్కించె
ఈటెల తో గ్రుచ్చె నిట్లు నట్లు
భేరి శబ్దము కర్ణ భేరులు పగులంగ
మ్రోగించె మ్రోగించె, ముక్కు వద్ద
మద్య మాంస ములను మస్తు గా తెప్పించి
ఘుమ ఘుమలను జూపె గుప్పు మనగ
పర్వత కాయమ్ము పైకెక్కి కొందరు
వివిధ క్రియల జేసి విసిగి పోయె

తేటగీతి:
ట్టకేలకు నిద్దుర నెటులొ వీడి
కునికి పాట్లను విదిలించి కుంభకర్ణు
డన్న యానతి మీదనా యనికి సాగి
దీర్ఘ నిద్ర పొందెనుగదా  తెలిసి తెలిసి. 

Tuesday, 5 November 2013

తెలుఁగు భాషాభిమానము తొలఁగవలయు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తెలుఁగు భాషాభిమానము  తొలఁగవలయు

కందము:
తెలుగు లెస్సని బలికిరి వెలిగె నాడు
తెలుఁగు భాషాభిమానము, పలుకు నేడు
తెలుగు లెస్సని (less) తెలియక, తెలియ  తగ్గె 
తెలుఁగు భాషాభిమానము-తొలఁగవలయు

Monday, 4 November 2013

తెలు ' గిడుగు '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - తెలు ' గిడుగు '


 


తేటగీతి:
బడుగు వారికి తెలిసెడు పలుకు లందు
రచన గోరుచు తెలుగున (ను) రచ్చ (క్ష) జేసె
గిడుగు వారలు తెలుగింటి పిడుగు వారు
గొడుగు బట్టగ రండయ్య కోవిదులును. 

Sunday, 3 November 2013

శ్రీకర దీపపు వెలుగులుబ్లాగు వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

కందము:
చీకటి వృక్షము బ్రతుకున
కూకటి వేళ్ళైన లేక కూలగ వలెగా 
శ్రీకర దీపపు వెలుగులు
మీకందరకందవలయు మిక్కుటమగుచున్. 

Saturday, 2 November 2013

కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్


కందము:
కమలము వేడిని గోరును
కమనీయపు చలువ రాజు  కలువకు నిచ్చున్
విముఖత మనసులు గలువక
కమలమునకు చంద్రుఁ డేసుఖమ్మును గూర్చున్?

Friday, 1 November 2013

ఒంటరి కమలం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఒంటరి కమలం  తేటగీతి:
మోము వాడెను చూడుమా మోహనాంగి
వేయి రేకుల కనులతో వేచి చూచి
కమల బాంధవు డేతెంచె కమల నీకు
ఆకు పళ్ళెమ్ము నింపెనా వెల్గు చూడు.