తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 31 October 2017

అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది - అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.  

కందము: 
అరి సెగలు గ్రక్కు శరమును 
గురిజూచుచువేయ వడకె కోతులు, చెమటల్ 
మరిగారె, రామ శరణని 
పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్. 

Saturday, 28 October 2017

సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య: సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ


కందము:
ప్రీతిగ మేనున సగమున
చూతుముగా యుమను భవుని సోయగమొప్పన్
రీతిగ సతియన నామెయె 
సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ! 

Monday, 23 October 2017

భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ


కందము: 
ఈగతి పరమత గురువులు 
వాగిరి తమ చుట్టునున్న భక్తులతోడన్ 
జాగరత భారతమ్మును 
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ

Thursday, 19 October 2017

నిత్య దీపావళియెయౌను నిజము నాడు.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
సీ:
చీకుచింతయనెడు సీమటపాకాయ
వత్తినే ముట్టించి వదలునాడు
పరుల వృద్ధినిజూచి పడునట్టి ఈర్ష్యనే 
చిచ్చుబుడ్డిగ గాల్చి చెలగునాడు
తలదిరిగెడు చెడు తలపులన్నియు గూడ
భూచక్రముగ కాలి పోవునాడు  
పరుష వాక్యమ్ముల పరుల హింసించెడి 
పాముబిళ్ళలు మాడి పడిననాడు      

తే.గీ:   
అహపు తారజువ్వను నింగి కంపునాడు  
శాంతి మత్తాబులే వెల్గు జల్లునాడు   
ముదపు ప్రమిదలకాంతియే ముసురునాడు 
నిత్య దీపావళియెయౌను నిజము నాడు.  Friday, 13 October 2017

విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విరసంబగు రచన యొప్పె వీనుల విందై.కందము: 
కిరికిరి మాటల పాటను 
సరిగా బాణీనిగట్టి చక్కగ పాడన్ 
ఉరుకుల పరుగుల యువతకు 
విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

Monday, 9 October 2017

దున్నపాలు పిండ దుత్తదెమ్ము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దున్నపాలు పిండ దుత్తదెమ్ము.


ఆ.వె.
ఆటలేన నీకు నన్నివేళలయందు 
చెవిని బెట్టవేళ చెప్పుమాట 
వేచియుంటినేను వినుమురా గాడిద! 
దున్న! పాలుపిండ దుత్తదెమ్ము.

Tuesday, 3 October 2017

ఏకాదశి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి:  ఏకాదశి

ఛందస్సు- తేటగీతి

నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.


తేటగీతి: 
ఏడు మొదటన పండుగ వేడుకగను 
కాలపురుషుని స్మరియింప కదలివచ్చె 
దయనుగోరుచు బూజించ రయము రండు
శివము గలిగించు విష్ణునే చింతజేయ.

Sunday, 1 October 2017

కట్లపాము చేరి కౌగిలించె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కట్లపాము చేరి కౌగిలించె. ఆ.వె. 
తానుజూడనొకడు దైవోపహతుడేను 
గ్రహపు పీడ పట్టి వదలదాయె 
నేనునేస్తమనుచు నిట్టులే పలు యి 
క్కట్లపాము చేరి కౌగిలించె