తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 31 December 2011

కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య -  కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

ఆ.వె:  పొడుగు వాడు కొంగ, పొట్టివాడే కోడి
           ఐదు గ్రుడ్లు, కోడి నారగించ
           పంచ నెంచి రిట్లు - వలెనుగ గ్రుడ్లవి
           కొంగ కైదు,  కాళ్ళు కోడికి వలె.

Friday, 30 December 2011

భామకు చీరేలనయ్య పదుగురు చూడన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

       సమస్య -  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్
 
కం:  ఏమిది కప్పకు చీరెను
       ఏ మహనీయుండు మలచె నీశిల్పమునే
       కామాక్షి, నగ్న సుందరి
       భామకు చీరేలనయ్య, పదుగురు చూడన్.

Thursday, 29 December 2011

బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                సమస్య -  బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!

తే.గీ:  వీధు లందున నడిపించి విశ్వ విభుని
         అమ్మ జూపగ నెంచగ నా మహర్షి 

         మొరలు బెట్టుచు వలదని మ్రొక్కు లిడిరి
         బ్రహ్మచారికి, నెనమండ్రు భార్య లౌర!
 

Wednesday, 28 December 2011

స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         సమస్య - స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె

తే.గీ:   స్వర్ణ సింహాసనమ్మను వర్ణ చిత్ర
          'వాలు పోస్టరు' గాలికి వాలి పోగ
           కుక్క యొక్కటి పైనెక్కె చక్కగాను
          "స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె." 

Tuesday, 27 December 2011

చీమ తుమ్మెను బెదరెను సింహగణము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య -  చీమ తుమ్మెను బెదరెను సింహగణము

తే.గీ:   అడవి దారిన నడచుచు నర్భకుండు
          అనుకరించెను పొలీసు ' హా ర్ను సౌండు '
          హడలి పోయిరి పరుగిడి రన్నలచట
        "చీమ తుమ్మెను,  బెదరెను సింహగణము." 

Monday, 26 December 2011

కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

          సమస్య -  కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్

కం:  చేరగనత్తా మామలు
        వారికి వలసిన విధముగ వంటలు చేసెన్
        వేరుగ తీసెను మామకు
        కారము లేనట్టి కూరఁ, గాంతుఁడు మెచ్చెన్.

Sunday, 25 December 2011

కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                సమస్య - కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె . 


ఆ.వె:  ఒంటి కంటి వాని నొక్క మునిని జేరి
          పండు చేత బట్టి వచ్చి నిలువ,
          మౌన దీక్ష గాన మంచిగా చేయెత్తి
          కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె . 

Saturday, 24 December 2011

సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

          సమస్య - సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా

కం:   హరి శ్రీమతి తా పుణ్యుల
         సిరులను గురిపించి  దరిని జేరుచు దయతో
         మరి పాపిని దరి దీయక
         సిరి వలదను, వాని కిలను చిక్కులె గాదా ?  

Friday, 23 December 2011

తమ్మునికి నన్న వరుసకు తమ్ముడయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            
              
             సమస్య - తమ్మునికి నన్న వరుసకు తమ్ముడయ్యె.

తే.గీ:  చిన్న తనమున కలవగ ' అన్న' లందు
          అన్నయనియందు  రాతని  నాదరమున
          స్వంత అక్కయ జేయును సాయ మెపుడు
          తమ్మునికి,  నన్న వరుసకు తమ్ముడయ్యె. 

Thursday, 22 December 2011

కాకర వేపుడె పసందు కంజదళాక్షీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య -  కాకర వేపుడె పసందు కంజదళాక్షీ

కం:  భీకర హాలాహలమది
        కాకర వేపుడె,  పసందు కంజదళాక్షీ!
       శ్రీ కరు నోటికి,  జూడగ
       శ్రీ కంఠుడు మ్రింగి  జగతి చింతలు దీర్చేన్.

Wednesday, 21 December 2011

ననన ననన నన్ను నినిని నిన్ను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య - ననన ననన నన్ను నినిని నిన్ను

ఆ.వె:  నిన్న ననన నాన్న నిన్ననె నన్ననె
          చచచ చదువు కొనక ష ష ష  షైరు
          కొట్ట,  మరల జేయ కొకొకొ కొట్టెదరిక
          ననన ననన నన్ను నినిని నిన్ను

Tuesday, 20 December 2011

కృష్ణుఁ జంప నెంచి క్రీడి వెడలె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                       సమస్య - కృష్ణుఁ జంప నెంచి క్రీడి వెడలె.

ఆ.వె:  పట్టి వ్యూహ మందు పసివాని జంపిరి
          కాగ సైన్ధవుండె కారణమ్ము
          మట్టి జేతు ననుచు మదిలోన నెరనమ్మి
          కృష్ణుఁ,  జంప నెంచి క్రీడి వెడలె.

Monday, 19 December 2011

కార మొసఁగుఁ జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

       సమస్య -  కార మొసఁగుఁ జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు


తే.గీ:  కల్తి కాటుక వాడిన కనులకు యప
          కార మొసఁగుఁ, జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు
          వలయు నన్నను వాడుడు వనిత లార
          కప్పురమ్ముతో జేసిన కాటుకలనె.

Sunday, 18 December 2011

ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య - ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా


      నాలుగు ఇడ్లీలు,నెయ్యి,కారప్పొడి ... రుచిగా ఉంటాయని ఆశిస్తున్నాను.    

కం:  ఇడ్లీ యిండియ ఫుడ్డే
        ఇడ్లీ, ఘీ, కారపుపొడి యెంతో రుచియౌ
        ఇడ్లీ కి సాటి లేవిక
        ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా? 

Saturday, 17 December 2011

భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య - భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె

              భరతుడు శ్రీ రాముని తో ....

తే.గీ:  'అన్న వదినెల వదలక నహరహమ్ము
          సేవ జేయుచు నుందును చెంత ' ననుచు
          పరగ లక్ష్మణు కిచ్చిన భాగ్యమందు
          భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె

Friday, 16 December 2011

తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-11-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య - తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్

కం: సరిపడు వరముల నిచ్చుచు
       నరు లొసగెడు ముడుపు తోడ నప్పులు దీర్చన్
       చిర కాలపు చింతనతో
       తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్. 

Thursday, 15 December 2011

ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-11-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           సమస్య - ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్

కం:  'కలియుగ మందున బుట్టును
        ఎలుకయె పిల్లికిని  పంది కేన్గని'చెప్పన్
        కలిగెనొక దరిని చూడగ 
        ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.

Wednesday, 14 December 2011

రమ్ము చేయగలదు ప్రాణరక్ష.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-11-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                   సమస్య - రమ్ము చేయగలదు ప్రాణరక్ష.


ఆ.వె:  అక్షరమ్ము లన్ని అటునిటుగా జేర
          మంత్రమగును గాదె; మరణమైన
          పారు నిజము జూడ పంచాక్షరికి 'నక్ష
          రమ్ము చేయగలదు ప్రాణరక్ష'. 

Tuesday, 13 December 2011

బారును సేవించి మంచి బాటను పట్టెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-11-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య -  బారును సేవించి మంచి బాటను పట్టెన్


కం:   కోరిన కోర్కెలు తీరగ
        పారాయణ జేసి గుడిని వరుసగ వేయౌ
        తీరగు శివ లింగంబుల
        బారును సేవించి మంచి బాటను పట్టెన్.

Monday, 12 December 2011

బలరాముడు సీతజూచి ఫక్కున నవ్వెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


         సమస్య - బలరాముడు సీతజూచి ఫక్కున నవ్వెన్

కం:  అల కృష్ణు కన్న యెవ్వరు ?
        కల ఫలితము నెవరి జూచి కదిపెను త్రిజటే ?
        చెలి చక్కలి గిలి కేమనె ?
        బలరాముడు - సీతజూచి - ఫక్కున నవ్వెన్ ! 

Sunday, 11 December 2011

దైవమున్నదె సుతునకు తల్లి కంటె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య - దైవమున్నదె సుతునకు తల్లి కంటె


తే.గీ:  దైవ మన్నది కనరాదు దేవులాడ,
         దేవు డిచ్చెను మనిషికి దేహి యన, య
         దే వరము తల్లి, వలదు సందేహ మనియె
         దైవమున్నదె సుతునకు తల్లి కంటె?  

Saturday, 10 December 2011

కవివరు గపితోడ బోల్చ గా మెచ్చిరహో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           సమస్య - కవివరు గపితోడ బోల్చ గా మెచ్చిరహో

             స్నేహితులు సరదాగా అన్న మాటలు...

కం: ఎవరవు ? హనుమవు నీవే!
       కవివర నీ పేరు జూడ కపి వరుడే! వి
       ప్రవరా ! యని నేస్తంబులు
       కవివరు గపితోడ బోల్చ గా మెచ్చిరహో! 

Friday, 9 December 2011

గణ నాయకు గళమునందు గరళము నిండెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         సమస్య -  గణ నాయకు గళమునందు గరళము నిండెన్

కం:  వణిజుల వ్యాపారమ్ములు,
       గణనమ్ములు మాని  'బందు' గావింపు మనన్
       వణకక  పొమ్మన,  "రౌడీ
       గణ నాయకు" గళమునందు గరళము నిండెన్.

Thursday, 8 December 2011

బోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

     సమస్య - బోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్

       నేటి విద్యా వ్యవస్థ లో కొందరు గురువులు...
 
కం:  సాధన లేకనె విషయము
        శోధన మరిచేయ కుండ సోకుల రాజై
        బాధను పుటలను ద్రిప్పెడు 
        బోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్. 

Wednesday, 7 December 2011

సీతామానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                       సమస్య - సీతామానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా

శా: మూతల్ బెట్టిన కుండలన్ని కదిపెన్ మ్రుచ్చిల్లినా రయ్యయో !
      ప్రీతిన్ మీగడ పాలు వెన్నలెవరో ? రేయంత కాపాడినన్

      చేతన్ బట్టగ నింత లేదు యిదుగో చెప్పమ్మ ఓ రాధికా !
      సీతా !మానస ! చోరుఁ డెవ్వఁ డనినన్ "శ్రీకృష్ణమూర్తే కదా!" 

Tuesday, 6 December 2011

అగ్నితోడ నగ్ని నార్పవచ్చు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                      సమస్య -  అగ్నితోడ నగ్ని నార్పవచ్చు

ఆ.వె:   అగ్గి రవ్వ వోలె నాలి దిట్టుచు  తాగి
           కొట్ట బోగ 'కోటి' - కొరవి దెచ్చి
           చూప సుమతి - గప్పు చుప్పున కూర్చుండె
          'అగ్నితోడ నగ్ని నార్పవచ్చు'.  

Monday, 5 December 2011

చందమామను ముద్దాడసాగె చీమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-09-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

              

              సమస్య -  చందమామను ముద్దాడసాగె చీమ


తే.గీ:  ఆకసంబున జూడగ  నర్ధ రాత్రి 
         నల్లమబ్బులు సాగుచు నచట నిండు
         చందమామను ముద్దాడసాగె; చీమ
         లట్లు తోచెను చుక్కల రాశి జూడ . 

Sunday, 4 December 2011

తెనుగు "పాట" శాల - ఘంటసాల

                             తెనుగు "పాట" శాల - ఘంటసాల
 
సీ:   జానపదమొకండు - జనులు మెచ్చగపాడు
                  పద్యంబు నొక్కడు - పాడగలుగు
      లలితగీతమొకడు - లయబద్ధముగబాడు
                  శ్లోకంబుకొక్కడు - శోభదెచ్చు
      శాస్త్రీయమొక్కడు - శ్రావ్యంబుగాపాడు
                 కీర్తనల యొకండు - కీర్తిబొందు
      భక్తి గీతమొకడు - రక్తిగా పాడును
                పాశ్చాత్యమొక్కడు - పలుక గలుగు
 
.వె:    ఎట్టిపాటగాని  యే శ్లోకములుగాని 
         పద్యమైన మరియు గద్యమైన
         నవరసంబులొలుకు నాయాసమేలేక
         ఘంటసాలవారి గళమునందు.

Saturday, 3 December 2011

పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁడగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-09-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             
           సమస్య - పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁడగున్


కం: నరులకు హితములు, దేవుని
       వరములుగా రూపు దాల్చి వనములె బెరుగన్
       నరుకుచు నట పాదపరూ
       ప రహిత మొనరించువాఁడె,  పాపాత్ముఁడగున్.


పాదపము =  చెట్టు

Friday, 2 December 2011

సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా శంక నీ కేలరా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-09-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                      సమస్య - సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా శంక నీ కేలరా


 శా : ఈ 'రా' ప్రక్కన 'మా' ను వ్రాసి పలుక న్నీశుండె శ్లాఘించుగా
        ఏరా! చింతలు నీకవేల వినరా !ఈ రామనామామృతం
       'సార' మ్మేగద వేదమంత్రములకున్ సందేహ మింకేల నీ
       'సారా' త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా? 

Thursday, 1 December 2011

నక్కకు జనియించె కుక్క యొకటి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-09-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
            


              సమస్య - నక్కకు జనియించె కుక్క యొకటి


ఆ.వె: జిత్తు లన్ని జూపి చిరుత జంపెడు కోర్కె
          నక్కకు జనియించె,  కుక్క యొకటి
          దాని కుటిల బుద్ది దరిజేరి చిరుతకు
          చెప్ప, చంపి వేసె చీల్చి చీల్చి .