తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 26 September 2018

మల్లియ తీవియకుఁగాసె మామిడి కాయల్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - మల్లియ తీవియకుఁగాసె మామిడి కాయల్


కందము: 
అల్లన జవ్వని పైటను 
మెల్లగ తా సర్దుకొనుచు మీదకురాగా 
ల్లరిగా మగడిట్లనె 
'మల్లియ తీవియకుఁగాసె మామిడి కాయల్'

Sunday, 23 September 2018

పతితల ఖండించి వండె బంధువులు దినన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-04-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - పతితల ఖండించి వండె బంధువులు దినన్


కందము: 
కొతిమెరె బాగున్నదిలే 
పతిదేవా కూరలోన బడవేతుననన్ 
సుతిమెత్తగ తా నూపగ
పతి తల - ఖండించి వండె బంధువులు దినన్. 

Sunday, 16 September 2018

దత్తపది - అమ్మ,అయ్య,అన్న,అక్క...రామాయణార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది - అమ్మ,అయ్య,అన్న,అక్క...రామాయణార్థంలో 


అమ్మయుతనయ దశకంఠు కపుడు జెప్పె 
నయ్యసురపతియె విడువ నాజనకజ 
నక్కజమ్మగు నీమాటలనుచు నతడె 
అన్నరుండేమి జేయులే యనెను మిడిసి.

Thursday, 13 September 2018

ఉడుగణపతిధరసుతునకు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

Image result for ganapati images


కం:
దండము నిడుదును, భక్తిని
దండగ నర్పించి జేతు దండిగ నుతులన్
దండగలుబోవ ఘన వే
దండపు వదనంపు మూర్తి దరహాసునికిన్.

కం:
ఉడుగణపతిధరసుతునకు
నిడుముల దొలగంగజేయ నిపుడీ చవితిన్
బెడుదును బెల్లంబటుకులు
కుడుములునుండ్రాళ్ళతోడ కొబ్బరిపలుకుల్.

Monday, 10 September 2018

లంక నేలినాడు లక్ష్మణుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-09-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - లంక నేలినాడు లక్ష్మణుండు. 


ఆ.వె: 
రావణానుజుండు రమ్యమౌ యశమందె 
లంక నేలి, నాడు లక్ష్మణుండు 
రామచంద్రులంత రాజ్యపట్టముగట్టి 
పడతి సీతతోడ వెడలిరాగ.

Saturday, 8 September 2018

చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు


తే.గీ: 
జనుల వాక్యము మన్నించి మనమునందు
జానకినిబంప దలచుచు కానలకును 
మదిని బాధను దిగమ్రింగు మాన్య రామ 
చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు

Monday, 3 September 2018

హర - శివ - భవ - కపాలి, తో శ్రీకృష్ణ స్తుతి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3-09 -2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది : హర - శివ - భవ - కపాలి,  తో శ్రీకృష్ణ స్తుతి. 


కందము: 
కలుషహర! కంసభంజన! 
వెలుగుల రాశి వలెకరుణ వేడిన మాపై 
చిలికించుము భవహర! హరి!
పలికెదము స్తుతులు  విడువక పాలించుమయా!   

Saturday, 1 September 2018

దత్తపది: మార్చి-మే-జులై-డిసెంబరు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-03-2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: మార్చి-మే-జులై-డిసెంబరు తో విళంబికి స్వాగతం. 


తే.గీ: 
కొన్ని రోజులైననుచెడు కోరి తుడిచి 
మార్చి ధరలోన క్రొత్తగా మంచి జూప 
కనులు తడిసెన్ బరుగునను కదలిరావె 
స్వాగతమ్మేయిది విళంబి సరిగ రావె.