తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 31 October 2012

కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ

శంకరాచార్యుల తల్లి తోటి వారితో పలికిన పలుకులు.
తేటగీతి:
సన్య సించెను ప్రీతితో శంకరుండు
పెద్దవాడయి పెండ్లాడి పిల్లల గని
నాదు తోడుగ కలిసుండు ననుచు దలచ
కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ.

Tuesday 30 October 2012

జనముఁ గాంచి నేత జాఱుకొనెను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - జనముఁ గాంచి నేత జాఱుకొనెను  

ఆటవెలది: 
కోత లెన్నొ కోసి కోతలను మిగిల్చి
రాగ సభకు నేడు రభస జరిగి
' రచ్చ బండ' లోన 'రచ్చరచ్చను' జేయు
జనముఁ గాంచి నేత జాఱుకొనెను. 

Monday 29 October 2012

మస్తకమ్మును మించునే పుస్తకమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ 

సమస్య - మస్తకమ్మును మించునే పుస్తకమ్ము
తేటగీతి:
నిల్వ జేయు సమస్తము నిశ్చయముగ
విస్తు బోయెడు జ్ఞానమ్ము విస్తరించు
మఱ్ఱి విత్తనమును బోలు మహిమ గలది
మస్తకమ్మును మించునే పుస్తకమ్ము? 

Sunday 28 October 2012

తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ 

సమస్య - తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె

తేటగీతి:
తేనె వంటిది చూడగ తెలుగు కాదె
తేనె యన్నది చెడిపోదు తెలియ గాను
తేనె త్రాగని వారికే తెగుల, దెచట
తెలుఁగు " కల్పవృక్షమునకు" తెగులు పట్టె?

Saturday 27 October 2012

భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె. 
ఆటవెలది:
శివుడు దీక్ష నుండ సేవల జేయుచు
గిరిజ ఎదుట నిల్వ విరుల బాణ
ములను వేయ గాల్చె ముక్కంటి, యా మనో
భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.

Friday 26 October 2012

కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

ఒక పెంపుడు కుక్కను, కుందేలును ఆకతాయి పిల్లలు రాళ్ళువేసి కొట్టగా కాలు విరిగినదని చెప్పుకున్న సందర్భం...
కందము:
ముందే విరిగెను కుక్కకు
కుందేటికి నిన్న విరిగె కుడికాలొకటే
సందున పిల్లలు కొట్టగ
కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

కందము:
చందూ బొమ్మలు వేసెను
కుందేలును కుక్క నొకటి, కునుకున మరచెన్
పొందికగా లేచి కనగ
కుందేటికి మూడు కాళ్ళు, కుక్కకు వలనే.

Thursday 25 October 2012

జనులకు భగినీ హస్తభోజనము విషము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - జనులకు భగినీ హస్తభోజనము విషము

తేటగీతి:
మేన కోడలి కడుగును మేనరికము
తండ్రి యాస్తిని గోరును తనదు భాగ
మనుచు తప్పించు కొనియెడు యనుజులైన
జనులకు భగినీ హస్తభోజనము, విషము

Wednesday 24 October 2012

దుర్గా ! కరుణించమ్మా!

బ్లాగు వీక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు.
కందము:
దుర్గా ! కరుణించమ్మా!
దుర్గమమీ బ్రతుకు నడుప దుఃఖము లాయెన్
దుర్గతుల బడక జూడు  కు
దుర్గా నుండేటట్టుల,  దోయిలి పడుదున్.

Tuesday 23 October 2012

ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

తపస్సును భంగము చేసిన ఒక ఏనుగునకు ముని శాపము నిచ్చుట...

కందము:
ఏనుగ! యెలుకగ పుట్టుము
ఈనా శాపంబు దొలగ దెవ్విధి యనగా
కానల తాపసి, యట్టులె
ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

Monday 22 October 2012

దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్

కందము:
దీపములేదని నింగిని
దీపములై వెలుగు చుండె తీరుగ తారల్
పాపము ధర దీనింగని
దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్.

Sunday 21 October 2012

నరకునకు సత్యభామ సోదరి యగునట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - నరకునకు సత్యభామ సోదరి యగునట

తేటగీతి:
ధరణియే సత్య,  నరకుఁడు తనయుఁ డనఁగ
తల్లితో ననె కాన్వెంటు పిల్లఁ డొకఁడు
నరకునకు సత్యభామ ‘SO' దరి యగు నట
‘MAMMI’యైనను ‘KILL' జేసె మనసులేక.

Saturday 20 October 2012

సొమ్ములున్నవాడె సుగుణధనుడు

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - సొమ్ములున్నవాడె సుగుణధనుడు

ఆటవెలది:
సొమ్ము వినయమగును సొమ్ము వివేకమ్ము
సొమ్ము భూత దయయు సొమ్ము భక్తి
సొమ్ము దానగుణము సొమ్ము శాంతమె యిట్టి
సొమ్ములున్నవాడె సుగుణధనుడు


Friday 19 October 2012

నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?

నా విష్ణుః పృధివీ పతిహి.. అలాగే సరస్వతీ స్వరూపం కానివారు అవధానములు చేయలేరు.అలాంటి ' పుంభావ సరస్వతి' మనసులో మాట.

కందము:
ఓ నలువ రాణి ! నీవే
ఈ నా రసనాగ్ర మందు నిటులుం డనిచో
నే నలలే నొక్క పదము
నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?

Thursday 18 October 2012

అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
శార్దూలము: 
సంతోషంబున నింతి జేయ దొడగెన్ సంతోషి మాతా వ్రతం
బంతన్ జక్కగ పూర్ణమాయె నపుడే "బాస్ ఫోను-మీటింగనెన్"
సుంతా
గండిక భోజనంబుకనగా " సో సారి నాట్ నౌ " వనె
న్నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.

Wednesday 17 October 2012

ఐదువంద లనిన నల్పమెగద.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య -  ఐదువంద లనిన నల్పమెగద.

బంధువుల పెండ్లి లో భార్య  భర్త తో...

ఆటవెలది:
పెండ్లి కొడుకు చూడ పెదనాన్న కొడుకాయె
చాలు పిసిని బుద్ది చాలు లెండి

చాలు వేయి నాకు చదివింపు లకునిమ్ము
ఐదువంద లనిన నల్పమెగద.

Tuesday 16 October 2012

నిషిద్ధాక్షరి - ‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా రామునిపై...

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

నిషిద్ధాక్షరి - ‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా రామునిపై...

కందము:
ఇనకుల తిలకుడు నిలబడి
జనకుని సుత జూచి విల్లు చప్పున లేపన్
గణగణ కదలెను గంటలు
కన నితడేయగును నీదు కాంతుండనుచున్.

Monday 15 October 2012

మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.


శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును. 

ఆటవెలది:
చందమామ దెత్తు,సరి విమానము నిత్తు
చిన్ని నాన్న యనుచు చేరి పలికు
నన్నమింత తినగ నమితమౌ ప్రేమతో
మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.

Sunday 14 October 2012

కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్

కందము:
ఉంచితి నీకై కందులు
కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
పంచను మూలన పిల్లియె
పంచను మనసాయె నాకు పట్టవె యక్కా !

కందము:
దంచిన బియ్యము పోయుము
కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
పంచను పిల్లియె, కుక్కలు
పొంచెను మా వీధిలోన పోయెద నక్కా!

Saturday 13 October 2012

గాలిమేడలు స్వర్గముకన్న మిన్న

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య -  గాలిమేడలు  స్వర్గముకన్న మిన్న

తేటగీతి:
' గాలి' మేడలు కట్టెను గనుల దోచి
' గాలిమేడలు' స్వర్గముకన్న మిన్న
'గాలి'  దీయగ సీబియై కదలి పోయె
'గాలిమేడలు'  నిలుచునె ఘనులకైన.

Friday 12 October 2012

దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే
కందము:
దొరకొని దోచును దొంగలు
దొరికిన ప్రతివారి, పిదప దొరకును; చూడన్
దొరుకరు దొరలన్ దొంగలు
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే.

Thursday 11 October 2012

జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్
కందము:
ఆ 'నారాయణ' గానము
ధ్యానము, ధర్మంబు జెప్పు  ధ్యాసయె గానీ
ఈ నర పామర లోక
జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్.

Wednesday 10 October 2012

మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే.

శార్దూలము: 
మాకున్ గల్గెను నాల్గు కాళ్ళు కరమున్, మాకెక్కువీ రెక్కలే

తోకా డించుచు  గాలిలో నెగురుచున్ తొండమ్ముతో రక్తమున్
పీకల్దాకను పీల్చి పీల్చి జనులన్ భీతిల్లగా జేతుమే?
మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే!

Tuesday 9 October 2012

పరమ పావనమ్ము పరులసొమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - పరమ పావనమ్ము పరులసొమ్ము

ఆటవెలది:
పాల కడలి పైన పవళించు హరి జూడ
బాల కృష్ణు డాయె పాలు దోచె
పడక వీడి వచ్చె పడకనా యట పాలు
పరమ పావనమ్ము పరులసొమ్ము

Monday 8 October 2012

చిరంజీవి సప్తకం ... తెలుగు అనువాదము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - చిరంజీవి సప్తకం ... తెలుగు అనువాదము.

అశ్వత్థామ బలిర్వ్యాసో
హనుమాంశ్చ విభీషణ:|
కృప: పరశురామశ్చ
సప్తైతే చిరజీవిన:||


నిత్య స్మరణీయమైన చిరంజీవుల శ్లోకానికి అనువాదము.

కందము:
బలి, యశ్వత్థామయు, మరి
ఇల వ్యాసుడు, హనుమ, కృపుడు నెన్నగ చేతన్
బలమున్న పరశు రాముం
డెలమి విభీషణుడు నేడ్గు రే చిర జీవుల్.

Sunday 7 October 2012

దామోదరు దిట్టు వాడె ధనవంతు డగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - దామోదరు దిట్టు వాడె ధనవంతు డగున్

కందము:
ఏమాయల వాడో ! గన
దామోదరు దిట్టు వాడె ధనవంతు డగున్
రాముని తిట్టగ గాచెను
ప్రేమారగ రామదాసు పిలువగ దాగెన్.

Saturday 6 October 2012

ద్రోణసుతుడు పాండవులకు ప్రాణసఖుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - ద్రోణసుతుడు పాండవులకు ప్రాణసఖుడు

ఆటవెలది:
ధార్త రాష్ట్రులు,కర్ణుడు, ధూర్త శకుని
పాత్ర ధారులు వచ్చిరి బాగు బాగు
ద్రోణసుతుడు,పాండవులకు ప్రాణసఖుడు
శౌరి పాత్రల వేసెడి వారలెచట ?

Friday 5 October 2012

రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ

కందము:
ప్రీతిగ గుజరాత్ పిల్లయె
నీ తనయుని పెండ్లి యాడె నిరుడే; యపుడే
లేత తమల బుగ్గల గుజ
రాతికి పుత్త్రుండు పుట్టె  రాజీవాక్షీ! 

Thursday 4 October 2012

పువ్వులోన రెండు పువ్వు లమరె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - పువ్వులోన రెండు పువ్వు లమరె

ఆటవెలది:
అమ్మవారి ముఖమె యదియొక పద్మమ్ము
ఆమె కళ్ళు జూడ నందమైన
కలువ పూల వోలె కనుపించ, నిటు తోచె
పువ్వులోన రెండు పువ్వు లమరె.

ఆటవెలది:
మల్లికమ్మ వెడలె తల్లితో వైద్యుని
కడకు, చూచి చెప్పె గర్భ మందు
కవల పిల్ల లనుచు కడకునా వైద్యుండు
"పువ్వు, లోన రెండు పువ్వు లమరె"

ఆటవెలది:
పద్మ వదన తాను పద్మాక్షియే తాను
పద్మ నాభు  పాద పద్మములను
చేరి వత్తు చుండ చిలిపిగా హరి పల్కె
"పువ్వులోన రెండు పువ్వులమరె".

ఆటవెలది:
అల్ల నల్ల కలువ, అర్థ నారీశ్వర
సిగను జూడ నాకు మిగుల తోచె
రెండు పూల తోడ నిండుగా నర్చించ
"పువ్వులోన రెండు పువ్వులమరె"

ఆటవెలది:
వేసి పూవు మ్రుగ్గు వెలది గుమ్మడి పూవు
మధ్య నుంచ మనుచు మనుమరాలి
పంప నచట నిలువ, పడతి యిట్లనియెను
"పువ్వులోన రెండు పువ్వులమరె"


Wednesday 3 October 2012

భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

తేటగీతి:
పరమ శివుడిని మెప్పించు పరమ భక్తు
డైన రావణు డానాడు జానకమ్మ
పట్టి దెచ్చెను, పుణ్యమ్ము వట్టి దాయె
భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

Tuesday 2 October 2012

ఆదరింప వలదు పేదజనుల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - ఆదరింప వలదు పేదజనుల

ఆటవెలది:
పాత్ర తను తెలియక  పైపైన గని వారి
నాదరింప వలదు; పేదజనుల
బాధలన్ని దెలిసి బాధ్యతగా దల్చి
వెతల దీర్చు వాడు విష్ణు సముడు.

Monday 1 October 2012

జీవుడు జీవిఁ జంపుపని జీవిక కోసమె వృత్తి ధర్మమే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - జీవుడు జీవిఁ జంపుపని  జీవిక కోసమె వృత్తి ధర్మమే
ఉత్పలమాల:
దేవుడు జీవు లన్నిటిని దింపెను భూమికి నొక్క పద్ధతిన్
జీవులు వృద్ది బొంద మరి జీవులు ధాత్రిని నిండ కుండగన్
జీవుడు జీవిఁ జంపుపని, జీవిక కోసమె వృత్తి ధర్మమే
జీవుల భుక్తి దక్క మరి చీమను జంపిన గాని పాపమే.