తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 27 December 2018

కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-12-2018న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ 


కందము: 
క్షీరము బియ్యముతోడుగ
తీరుగ శర్కరను వేసి త్రిప్పుఛు కిస్మిస్
చేరెడు ఖాజులతో మమ 
కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ. 

Wednesday 26 December 2018

వనమునన్ లభించు ఘనసుఖంబు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - వనమునన్ లభించు ఘనసుఖంబు


ఆటవెలది:
ప్రక్కవానిజూచి వెక్కుచునేడ్వక
కలిగినంతలోన గలిగి తృప్తి
సాయమొరులకింత సరిజేయు నరుని జీ
వనమునన్ లభించు ఘనసుఖంబు

Tuesday 25 December 2018

'ఏ - సు - క్రీ - స్తు'- తో శ్రీకృష్ణ స్తుతి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


న్యస్తాక్షరి - 'ఏ - సు - క్రీ - స్తు'- తో శ్రీకృష్ణ స్తుతి


ఆటవెలది: 
ఏన్ గు రక్షజేయ నేగినవానిని
సుజన మునుల బ్రోచు చుండువాని
క్రీడి మనసు లోన వేడుచుండెడువాని
స్తుతులజేతు భక్తితోడ నేను.

Sunday 23 December 2018

నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్


కందము: 
విలవిల లాడుచు, "డాక్టర్"!
తెలుపగలేనట్టి బాధ దీర్పరెయనుచున్
నెలతయె కాలికి గల యా
నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్.

Monday 17 December 2018

ఏక్, దస్, సౌ, హజార్ .... భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది - ఏక్, దస్, సౌ, హజార్ .... భారతార్థంలో 


కందము: 
సౌగంధిక పుష్పమ్మును
వేగముగా దెచ్చుకొరకు వెడలెద సఖియా  
ఆగగనంబహ జారిన 
నాగకనేకదలెదననె యనిలాత్మజుడే. 

Saturday 8 December 2018

కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 12 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.

కందము: 
స్మరణము జేయుచు దేవుని
మరణము వరకును భవాబ్ధి మరిదాటుటకున్ 
తరుణమునెరుగుచు తగునుప
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.

Saturday 1 December 2018

శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై


కందము: 
ఆరవికుల తిలకుడెవడు? 
ఆరాధించు నెవని? హత మార్చెననంగా? 
తీరుగ కుశుడెటు వెలిగెను? 
శ్రీరాముఁడు-శివుని-జంపె- సీతకు సుతుఁడై.