తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 31 March 2018

కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 11 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

కం: 
బిరబిర పాలవి పొంగిన 
నురుకుచు చేతులనుబట్టి నువు దింపకుమా 
తరుణీ!పట్కారను నుప 
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

Monday 26 March 2018

రామనామ మనెడు రమ్యమౌ బాణమ్ము

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 











సీసము: 
మంచి పనులజేయ మనసులో తలపోయ 
మారీచ సోదరుల్ మసినిబూయు 
చూడ గట్టితలపు సుగ్రీవమున గోర  
వాలిపోవు ప్రతిగ  వాలిగాడు 
పుణ్యకార్యమొకటి బూనిసేయుదమన్న 
కుంభకర్ణుని మత్తు కూడియుండు
చక్కటినిర్ణయమ్మొక్కటే వలెనన్న  
తలలు పదిగమొల్చి దాడిసేయు

ఆటవెలది: 
నోరు విల్లు గాగ  తీరుగా వేయగా 
నారివోలె దలచి నాల్క తోడ 
రామనామ మనెడు రమ్యమౌ బాణమ్ము
బాధలన్ని దొలగి భవిత వెలుగు .

Sunday 18 March 2018

నిండు జీవితమ్ము పండుగగును.

అందరికీ విళంబి నామ వత్సర ఉగాది శుభాకాంక్షలు.  

ఆ.వె: 
కామమదియె తీపి కారమే క్రోధమ్ము  
లోభమగులె యుప్పు లోని మోహ   
మగును వగరు చేదు మత్సరమ్మేయగు
పులుపు మదమె యగును పూర్తిగాను.

ఆ.వె:
అరులనారుబట్టి యరచేత తగుపాళ్ళు 
పెచ్చుమీరకుండ  పచ్చడిగను
తలచియదుపుజేయ  ధరణిలో నరునకు 
నిండు జీవితమ్ము పండుగగును. 


Thursday 1 March 2018

తల - మెడ - కడుపు - వీపు, భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 10 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: తల - మెడ - కడుపు - వీపు, భారతార్థంలో


కీచకుడు సైరంధ్రి తో....

దేవీ బాపుమెడద వెత 
రావే నాతలపు దీర్ప రాగముతోడన్
ఈవే కడు పులకింతల
నీవీ పుడమిని పొదిగొను నిక్కము దివినే.