తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 29 February 2016

న్యస్తాక్షరి: వి, నా, య, క.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి: అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.


ఆటవెలది:
'వి'ఘ్న రాజ ! నిన్ను వినుతింతు గణపయ్య !
భక్తి  'నా'దు బుద్ధి బాగ పెరుగ 
శూర్పకర్ణ ! మాకు చూడరా 'య'పనింద 
కల్గనట్లు, నీదు కరుణ చిలు'క' . 

Sunday, 28 February 2016

కామదాసులైనఁ గలుగు ముక్తి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కామదాసులైనఁ గలుగు ముక్తి.ఆటవెలది: 
హరునియంశ యైన హనుమయే దాసుడై 
రాము గొలిచె తాను, రండు రండు 
గొప్ప కాదు మనము గోరంత చీమంత 
కామ ? దాసులైనఁ గలుగు ముక్తి.

Saturday, 27 February 2016

నవరాత్రి చందాలు.(మామూళ్ళు)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 


వర్ణన - నవరాత్రి చందాలు.(మామూళ్ళు)  కందము: 
అందాలని సరదాలే 
డెందమ్మున దలతుము వినుడీ దసరాలో 
చందాలే యందాలని 
'ధందా' లను చేయరాగ దడబుట్టు గదా !


కందము: 
మామూలే యడుగుదురుగ 
మామూలని కొందరేమొ, మది మూల్గుచునే  
మా   ' మూల '   నేదిలేదని  
మా ముల్లెలు తీయకున్న మరియొప్పరుగా !  

Friday, 26 February 2016

దెస - నస - పస - వెస, రామాయణార్థంలో ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది - దెస - నస - పస - వెస,  రామాయణార్థంలో ...
తేటగీతి: 
నీవె సరివాడ వో రామ ! నిగ్రహింప
తరలి రాగదె సరిజూడు తాటకదియె
శరమును గని వదలుమన, సమ్మతించి
చంపె దానిని లభియింప సద్గతులును.


కందము: 
దెసలేక తిరుగె కపులును 
నస వెట్టిరి కొందరపుడు నామారుతియే 
పస జూపి లంక కరిగెను 
వెస సీతను జూచివచ్చి విభునికి దెలిపెన్.

Thursday, 25 February 2016

నానృషిః కురుతే కావ్యమ్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణన : నానృషిః కురుతే కావ్యమ్కందము: 
కావ్యము వ్రాయగ జాలున 
శ్రావ్యంబుగ ఛందమందు సత్కృతి నిడునా 
సవ్యంబుగ ఋషిగాకను
సువ్యాపకమందలేరు చూడగ భువిలో.

Wednesday, 24 February 2016

వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరెతేటగీతి: 
పెళ్ళి కుదరక చనిపోయి ప్రేమజంట 
ప్రేతములుగాను మారిరి, ప్రీతి తోడ 
ప్రేతగణములు తలపోసి వేడ్క జేయ 
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె. 

Tuesday, 23 February 2016

న్యస్తాక్షరి: సరస్వతీ స్తుతి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి: సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి’.


తేటగీతి: 
న్నుతింతును నిన్ను నే శారదాంబ 
నవసమ్ముల నొలికించ స్తవము జేతు 
పద్య రచనను జేయు స్వభావమిమ్ము 
భక్తి తోడను రచియించి ప్రణతి నిడుదు.

Monday, 22 February 2016

ఆంధ్ర కే సరి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - ఆంధ్ర కే సరి. 
తేటగీతి: 

తెల్లవారల పొగరేమొ తెల్లబోవ 
తెలుగు ' వాడి ' ని జూపిన తెలుగు వాడ 
గుండు కెదురుగ నిలిచిన గుండె నీది 
ఆంధ్ర కేసరి జేజేలనందుకొమ్మ.

Sunday, 21 February 2016

అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్. 
కందము: 
మిమ్మీ కాన్వెంట్ జేర్చితి 
మమ్మీ యని పిలువలేర ? మా చిల్డ్రన్ ! సీ !
మమ్మీ విధమున వలదని 
యమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.

Saturday, 20 February 2016

శేషశయను పూజ సేయ రాదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శేషశయను పూజ సేయ రాదు. ఆటవెలది: 
పాము పడక వాడు పన్నగభూషణు
డొకరి మదిని యొకరు నొదిగియుండు  
శివుని నింద జేసి శ్రీహరి చాలంచు 
శేషశయను పూజ సేయ రాదు.

Friday, 19 February 2016

కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా. 


కందము: 
పన్నగధర పుత్రునకే 
కన్నియ తా గట్టుచుండెగా పూమాలన్ 
చెన్నుగ విఘ్నములణగుచు
కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా. 

Thursday, 18 February 2016

నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌహిరణ్యకశిపుని గురించి....

కందము: 
నోరార తలపగూడదు 
క్షీరాబ్ది శయనుని పూజ చేయగ రాదే 
ఆ రాక్షస రాజెదుటను 
నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

Wednesday, 17 February 2016

కన్నీటి బిందెలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కన్నీటి బిందెలు.

కందము: 
ఇన్నేని మంచినీటికి 
మున్నీటను సగము మునిగి ముదితలు దాటున్ 
అన్నీటి బిందె బరువుల     
కన్నీరే వారిచుట్టు కదలినదేమో !

Tuesday, 16 February 2016

శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.కందము: 
"ఈ కోటి మీది"  ప్రోగ్రాం 
శ్రీకరరావడిగె ప్రశ్న శేషాచారిన్ 
ఓకే యని చారిటులనె 
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.
దొందూదొందే....

కందము:  
శ్రీకృష్ణారావు చెప్పెను 
శ్రీకృష్ణుని కన్నతల్లి రేవతి గాదే !
శ్రీకృష్ణ మూర్తి చెప్పెను 
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే!

Monday, 15 February 2016

నెమలీకలోడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నెమలీకలోడుకందము: 
వెన్నైన నీకు నొకటే 
మన్నైనను భేదమేది మా బాలకుడా !
వెన్నంటి నిలచి భక్తుల 
మన్ననలను పొందునట్టి మా పాలకుడా !

Thursday, 11 February 2016

' ర ' అనే అక్షరం వాడకుండా శివ ధనుర్భంగం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.నిషిద్ధాక్షరి - ' ర ' అనే అక్షరం వాడకుండా శివ ధనుర్భంగం గురించి కందము: 
జనకుని సభ కనులను గన 
గొనకొని శివధనువున నొక కొననిటు నడచన్ 
ఇనకులమణి, సగముగ నది 
తునుగగ, సగముగ జనకుని దుహితయె నిలిచెన్.

Wednesday, 10 February 2016

కట్టలుదెగు నుత్సాహము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కట్టలుదెగు నుత్సాహము


కందము: 
కట్టలుదెగు నుత్సాహము 
కట్టలుగా డబ్బుజూడ కరముల బట్టన్
పట్టుము దానిని ధర్మపు 
కట్టును నువు దాటకుండ కామిత మీయన్.

Tuesday, 9 February 2016

మాయా " నెట్ "శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - మాయా " నెట్ "  
కందము: 
ఘటనాఘటన సమర్థుడ 
' నెటిజన్లే ' భువికి నీవు నెట్టిన జనులే 
చిటికెన్ వారికి తగు సం
ఘటనలజూపించి ' లైకు ' గైకొను నీవే. 

Monday, 8 February 2016

రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్  కందము: 
ఇమ్మహి నేమియు వలదనె   
నమ్మహిమాన్విత రఘుకుల నాథుని నమ్మెన్ 
కమ్మని నామపు ఘన సా 
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్.   

Sunday, 7 February 2016

సాగర రాగముతో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - సాగర రాగముతో 


కందము: 
సాగర ముందుకు నీవే 
సాగరమే నీకు తోడు సరి భానుండే 
సాగగ నాకాశంబున 
రాగముతో నీవుకూడ రాగము తోడన్. 

1 రాగము= ఎరుపు
2 రాగము= పాట

Saturday, 6 February 2016

వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.కందము: 
వానలకై చూచుచు తా 
మేనును వాల్చెను కునుకున మేలగు రైతే 
తానే కలగనె నందున 
వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

Friday, 5 February 2016

కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి తమ్ముల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి తమ్ముల్కందము: 
ఏట్రా ! పుత్రులు గదరా 
కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి, తమ్ముల్
కాట్రేనికి లేరు గదర 
కాట్రేడనగా శివుండు గదరా తెలియన్ ! Thursday, 4 February 2016

చదరంగం
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - చదరంగం 


కందము: 
చదరంగమునాడినచో 
మెదడెంతయొ పదునుదేలు మేలే గలుగున్ 
వదలక నాడుచు చెక్ నిడి 
వదిలించుడు బద్ధకమ్ము బాలల్లారా !  

Wednesday, 3 February 2016

చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్కందము: 
శుక్రగ్రహ యాత్రకునై
సక్రమముగ పంప పైకి శాట్లైటదియే 
వక్రముగా పైకెగసెను
చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్. 

Tuesday, 2 February 2016

పుంటికూర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పుంటికూర 
తేటగీతి: 
పప్పు గొప్పగనుండును పచ్చడియును 
పులుసుకూరకు బాగుండు పుంటి కూర 
నూనె గోంగూర తలచగా నోరునూరు 
తెలుగు భోజన మిదిలేక తేలిపోవు.

Monday, 1 February 2016

తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్
కందము: 
ఇల్లాలికి నిండె నెలలు 
తల్లీ ! నే వత్తుననుచు తల్లియె చెప్పెన్
కల్లోల వరద వచ్చెను 
తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్.