తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 30 April 2015

గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.


కందము:
గతులవి రెండే, కన దు
ర్గతియు సుగతి, చూడ మనకు కాలపు గతిలో
గతియొక్కటుండుగద, దు
ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.

Wednesday 29 April 2015

కర్రీ వేపాకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కరివేపాకు.

 
















సీసము:
ధనియాలతో గల్పి దంచి పొడిని తిన
నూరు శాతము పంచు నోటికి రుచి
చింతపండు గలిపి చేయగా లేహ్యమ్ము
పప్పు గలిపి తిన బాగు బాగు
సాంబారు లో మరి చారులో నొక రెబ్బ
వేయగా ఘుమఘుమ విస్తరించు
తిరగమాతలోన తినగల్గు కూరలో
ఫలహారములలోన పడిన చాలు

ఆటవెలది:
తీయబోకుడయ్య తినకనే ప్రక్కకు
తెలిసి 'కొనుడు'  దీని విలువ ధరను
కర్వెపాకు తినగ కర్రీల వేపాకు
పెంచుడయ్య మీరు పెరటిలోన.

Tuesday 28 April 2015

దోమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - దోమ 

 



 












కందము:
దోమా ! రాక్షస ! చంపుదు
ధీమాగా నాయుధముల దెచ్చితి నిలుమా !
ఈమస్కిటొ కాయిల్సును
ఈమాట్లాలౌట్లు బ్యాట్ల నీ గుడ్నైట్లన్ !


కందము:
మామానవ జాతికి పడ
కేమాత్రము కుదురనీక నిత్తువు బాడ్ నైట్
దోమా! నీవిటెగిరి పడ
కే, మా చెంతను గలదిక నిదిగో గుడ్ నైట్.

Monday 27 April 2015

జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్


కందము:
శంకను దాగగ చాటున
పంకించుచు వేటగాడు బాణము వేసెన్
చంకన బెట్టెను చచ్చిన
జింకను, గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

Sunday 26 April 2015

విశ్వాసము జూపనిచో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - విశ్వాసము.


కందము:
విశ్వాసము జూపనిచో
నా శ్వానము వలెనె బుట్టు నవనిని నరులే
విశ్వాసము జూపంగ న
విశ్వాసపు పాపమపుడు వీడును గాదా ! 

Saturday 25 April 2015

దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.


కందము:
మనుజుండు గాడు కృష్ణుడు
దనుజుల గూల్చంగ దిగిన త్రాతౌ హరియే
విను ధర్మజ నీవున్ భవ
దనుజులు, హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.

Friday 24 April 2015

జూదములో వారెవ్వా !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - జూదము. 



కందము:
జూదములో వారెవ్వా !
రాదోయీ సిరుల మూట, రాజులె జనిరే
ఖేదముజెందుచు నడవికి
కాదన వారెవ్వరైన గలరే చెపుమా ?

Thursday 23 April 2015

శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.



ఉత్పలమాల:
దుష్టుల సంహరించెదను దూరముజేసెద కష్టనష్టముల్
శిష్టుల రక్ష జేతునని చెప్పెను గీతను చూడ నీధరన్
కష్టము లెక్కువాయె మరి గావగ నాతడు చేర రానిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.

Wednesday 22 April 2015

పుస్తకముల జదువు వాని బుద్ధి నశించున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పుస్తకముల జదువు వాని బుద్ధి నశించున్.


కందము:
మస్తకము నిలిపి నేర్వక
విస్తరమగు జగతిలోని విజ్ఞానమునే
స్వస్తిని గూర్పని " వేవో "
పుస్తకముల జదువు వాని బుద్ధి నశించున్.

Tuesday 21 April 2015

శబ్దకాలుష్యము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - శబ్దకాలుష్యము.


కందము:
వీనుల విందగు ధ్వనియే
వీనుల కందిన సుఖమగు, విపరీతముగా
వీనులు కందెడు ధ్వనితో
వీనులు బందగు, నశాంతి వేగమె హెచ్చున్.

Monday 20 April 2015

గణేశ నిమజ్జనము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - గణేశ నిమజ్జనము.


 















కందము:
ముంచెదము దేవ ! మమ్ముల
ముంచకు భవజలధి - నిన్ను మోదముతో మే
ముంచెదము మదిని - పరులను
ముంచెడు మా బుద్ధి మాన్పు మూషికవాహా !

,

Sunday 19 April 2015

తాతను ' వివాహ మాడెను తరుణి మెచ్చి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తాతను ' వివాహ మాడెను తరుణి మెచ్చి


తేటగీతి:
అందగాడగు బావయే నతివనొల్ల
పంతమూనుచు వెదకెను పడతి, కుదిరె
నందమందున చూడగా నధిపు " వాని
తాతను " వివాహ మాడెను తరుణి మెచ్చి

Saturday 18 April 2015

బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్. 


కందము:
కలువల కన్నుల కార్చకు
విలపించుచు కంటినీరు, వేగమె వచ్చున్
లలనా!సీతా ! వినుమ స
బల ! రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్

Friday 17 April 2015

అమృతము సేవించి సురలు హతులైరి గదా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అమృతము సేవించి సురలు హతులైరి గదా.


కందము:
అమృతమె సారా యని చె
ప్పు మతి దో ' చెడు ' రసంపు నాస్వాదకులే
అమృతాశనులగు, కల్తీ
యమృతము సేవించి సురలు హతులైరి గదా !

Thursday 16 April 2015

బడిగంట...గుడిగంట.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణన - బడిగంట...గుడిగంట.



కందము:
బడి గంట మ్రోగె లోనికి
నడుగిడరారండి పలుకులమ్మును కొలువున్
గుడి గంట మ్రోగె లోనికి
నడుగిడరారండి పలుకులమ్మను కొలువన్

Wednesday 15 April 2015

భాష కేలనయ్య వ్యాకరణము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - భాష కేలనయ్య వ్యాకరణము.


ఆటవెలది:
బోసి నవ్వు తోడ బుజ్జాయి దోగుచు
పలుకు పలుకు లోన నొలుకు తేనె
తల్లి తనయ మధ్య తన్మయంబున పలుకు
భాష కేలనయ్య వ్యాకరణము.

Tuesday 14 April 2015

పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్



కందము:
ఏంజేయుద మీరోజున
రంజుగ నను పస్తి నడుగ రాడొకడైనన్
మంజులవాణీ ! పల్కన
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్. 

Sunday 12 April 2015

తులసి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణ (న) చిత్రం - తులసి


కందము:
ఇలలో నీతో సరిగా
తులదూగెడు మొక్క లేదు దోయిలి పడుదున్
తులసీ ! పచ్చగ మా మొగ
సాలన కోటగ నిలచుచు సద్గతులిమ్మా.

Saturday 11 April 2015

శూలి తనయ గంగ, సోదరి యుమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

ఆటవెలది:
"శివుడు- పుత్రి- నీరు- చెల్లెలు- పార్వతి "
శిష్య! వేరు పేర్లు చెప్పమనిన
తడుము కొనక జెప్పె తానిట్లు, గురువరా !
" శూలి- తనయ- గంగ -సోదరి- యుమ. "

విష్ణువు లక్ష్మీ దేవితో...
ఆటవెలది:
చిట్టి విఘ్న పతికి పుట్టిన రోజిది
వేడ్క జూడ లక్ష్మి ! వెడలుదాము
పిలచి నారు మనల ప్రియముగ నా బావ
శూలి, తనయ గంగ, సోదరి యుమ.

Thursday 9 April 2015

అనార్ ( దానిమ్మ )

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అనార్ ( దానిమ్మ ) 






 


















ఆటవెలది:
పండు గింజలన్ని " పండ్లు " గా గనపడు
రంగుజూడ మనసు పొంగు, తినగ
రక్త పుష్టినిచ్చి రంజిల్ల జేయును
ఈ " యనారు "  దినుట శ్రేయమగును.

Wednesday 8 April 2015

కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.


తేటగీతి:
పుత్రసంతానమేగోరి పూజ జేసె
గురువు చెప్పిన విధముగా గొప్ప నిష్ఠ
గలిగి సతితోడ, నేడాది గడచినంత
కొడుకు పుట్టె "సన్యాసికి " గురువు కృపను.

Tuesday 7 April 2015

తెలుగు పద్యము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - తెలుగు పద్యము.



ఆటవెలది:
ఛందమందు పద్యమందమ్ముగానుండు
పామరునికినైన బాడ సుఖము
గాత్ర శుద్ధిగలుగు గానమ్ము సేయగా
తెలుగు పద్య మెపుడు వెలుగు జగతి.

Monday 6 April 2015

సతి సతిఁ గవయంగ సంతు గలిగె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సతి సతిఁ గవయంగ సంతు గలిగె.


ఆటవెలది:
క్రొత్త వరుని మామకోరి పంపగ ' నూటి ' (ఊటీ )
'ప్రేమయాత్ర' కేగె పేర్మి తోడ
హెచ్చు ముదము నంది మెచ్చుచు నేసీ(A.C)  వ
సతి, సతిఁ గవయంగ సంతు గలిగె.

Sunday 5 April 2015

లోభి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - లోభి.


ఆటవెలది:
దాత యిచ్చు కొంత ధనమున్నదానిలో
తాను కొంత తినగ దాచుకొనును
తాను తినకదాచి ధారబోయును గాదె
దాతకన్న లోభి ధన్యుడు గద.

Saturday 4 April 2015

ఆకాశవాణి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - ఆకాశవాణి.



తేటగీతి:
పాట పెట్టెగ నానాడు బాగ నిలిచె
పాత పెట్టెగ మారెగా ' రాత, ' నేడు
రొదలు లేవయ్య ' రేడియో ' సొదలు లేవు
రోదసీలోన ' నాకాశ ' రోదనాయె.

Friday 3 April 2015

ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్.



కందము:
అడ్డాల బిడ్డకిచ్చిన
యొడ్డాణపు బహుమతి నట నొద్దికగానే
బిడ్డకు జూపుచు నవ్వుచు
నొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్.

Thursday 2 April 2015

పచ్చి మిర్చి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పచ్చి మిర్చి









 















కందము:
మిర్చీ గన పచ్చనిదిది
కార్చిచ్చుగ మారు నోట కాయను కొరుకన్
చేర్చుచు నుప్పును, పులుపును
గూర్చిన రుచి పచ్చడౌను కోరుచు తినగా. 


Wednesday 1 April 2015

ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు


తేటగీతి:
ఉల్లమందున విడలేక నుల్లి దినగ
పిల్లలందరు నేడ్వగా తల్లి జెప్పె
నుల్లి ధరనేమొ తలచుక మెల్లగాను
" ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు"