తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 30 November 2012

అన్నభార్య వదిన యగుట కల్ల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-12-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - అన్నభార్య వదిన యగుట కల్ల

ఆటవెలది:
వదిన యనగ నన్న భార్యయై యుండును
భార్య యనిన వామ భాగ మగును
కాదననిన లేదు లేదన్న నే విన
నన్న, భార్య వదిన యగుట కల్ల!

ఆటవెలది:
తండ్రి భార్య తల్లి, తమ్ముని బార్యయె
మరదలగును, అత్త మామ భార్య
అన్నభార్య వదిన యగుట కల్లయె కాదు
తెలియ వరుస లన్ని తేట పడును.


(తాను ప్రేమించిన ప్రేమ అనే అమ్మాయిని తన అన్నకు ఇచ్చి పెండ్లి చెయాలని చూచే పెద్దలతో ఒకడు)
 ఆటవెలది: 
 'సీరియలును' గంటి చెప్పెనందొక్కడు
ప్రేమ నాదు 'లవరు' ప్రేమ నాదు
'పవరు' నాకె యగును భార్యగ నేనాడు
అన్నభార్య- వదిన- యగుట కల్ల

Wednesday, 28 November 2012

లచ్చి మగనికి వచ్చెఁ గళంక మిపుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - లచ్చి మగనికి వచ్చెఁ గళంక మిపుడు.

తేటగీతి:  
వచ్చె గాలికి సిరులెన్నొ వరద వోలె
'గాలి'  మేలును ' గని'  చేయ కాని పనులు
భార్య గావున భరియించ వలసి వచ్చె
' లచ్చి' మగనికి వచ్చెఁ గళంక మిపుడు.

Tuesday, 27 November 2012

తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్.

కందము:
తలపుల నిండిన తల్లిని
వలపులతో "లవరు" రాగ వదలుట మేలా?
తెలుగ 'బ్బాయ్' యిటు దలచకు
తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్.

Monday, 26 November 2012

దోషకాల మొసంగు సంతోష గరిమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - దోషకాల మొసంగు సంతోష గరిమ

తేటగీతి:
నాడు లంకను నడుగిడు నపుడు హనుమ
వామ పాదమ్ము నుంచెను ప్రథమ ముగను
యెంచె నిట్టుల సరియగు నెడమ కాలు
దోషకాల మొసంగు సంతోష గరిమ

Sunday, 25 November 2012

పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

కందము:
వినరా మంచము నల్లెద
మనగా నే పద్య మొకటె యల్లెద నంటిన్ 
విని మాబావయె యనెనిటు
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

Saturday, 24 November 2012

పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.
ఉత్పలమాల:
దంచిన బెల్లమున్ మరియు దానికి మిర్యము లిన్ని యాలకుల్
మంచిగ నీటిలో గలిపి మాధురి యొప్పగ పానకమ్మిడన్
యించుక బుద్ధిలేక మరి యెంచుచు పుల్లల జూపు రీతిగా
పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.

Friday, 23 November 2012

హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు 
ఆటవెలది:
ఆది భిక్షు వేడ నన్నంబు సమకూర్చు
భస్మ ధారి నడుగ భాగ్య మిడును
భూత నాధు గొలువ భువి లోన సౌభాగ్య
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు

Thursday, 22 November 2012

చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.
కందము:
చీమలు పామును జంపుట
ఏమారక జూచెను  గుహ కెదుటనె, రేయిన్
యేమని చెప్పుదు కలలో
చీమల పదఘట్టన విని సింహము బెదరెన్. 

Wednesday, 21 November 2012

మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్ 
కందము:     
మణి మాన్యంబుల నొల్లము
గుణమగు మీ యాశ్రమంబు గొప్పని పించెన్
క్షణమును మిము వదలమని ర
మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్ 

Tuesday, 20 November 2012

ఆమెకును నామె కూతున కతడె భర్త.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - ఆమెకును నామె కూతున కతడె భర్త.
తేటగీతి: 
చిత్ర మొక్కటి చూచితి చేరి యందు
రెండు పాత్రలు నటియించె రిషి కపూరు
తల్లి కూతుళ్ళ  గాధయ దందులోన
నామెకును నామె కూతున కతడె భర్త.  

Monday, 19 November 2012

సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.

తేటగీతి:
పరగ తలిదండ్రి గురువుల భక్తి తోడ
పరమ పురుషుని సేవించి వసుధ యందు
మనిన దాన ధర్మము హితమైన సుగుణ
సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.

Sunday, 18 November 2012

తీయనైన పండు తిక్త మయ్యె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - తీయనైన పండు తిక్త మయ్యె

ఆటవెలది:
ఆకలైన వేళ నది యిది యని లేదు
తినగ వేము మిగుల తీయనాయె
కడుపు నిండి యుండ, కడుపు వ్యాధినిబడ
తీయనైన పండు తిక్త మయ్యె

Saturday, 17 November 2012

బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

కందము:
రకరకముల దారుల విడి
సకలంబగు లోక నాథ సర్వేశ్వరునే
ఇక నీవే దిక్కని త్ర్యం
బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.

Friday, 16 November 2012

భారతి భర్త శంభుఁ డని పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - భారతి భర్త శంభుఁ డని పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

ఉత్పలమాల:
మేరలు లేక భూతముల మేలుగ తానయి నిండె శంభుడే
మీరక నొక్క లిప్తయును మిన్నుల మన్నుల ప్రాణి సృష్టి తో
ఈ రచనమ్ము జేయుటకు నెవ్వరు కారణమన్న, భక్తితో
భారతి భర్త - శంభుఁ డని పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?

Thursday, 15 November 2012

బుద్ధి గలుగువారు బుధులు గారు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - బుద్ధి గలుగువారు బుధులు గారు.

ఆటవెలది:
తెలిసి నట్టి విద్య తెలుపని పెడ బుద్ది
వినయ మింత లేని విషపు బుద్ది
కుళ్ళు బుద్ది మరియు కుత్సిత చేష్టల
బుద్ధి గలుగువారు బుధులు గారు.

ఆటవెలది:
చదువులేదు గాని చదివిరి లోకమ్ము
మాయ దెలియ నట్టి మాన్యులైరి
కొందర గని నంత గొప్పవారని మ్రొక్క
బుధ్ది గలుగు,  వారు బుధులు గారు

Wednesday, 14 November 2012

భావింపగఁ గృష్ణుఁ డేక పత్నీవ్రతుఁడే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - భావింపగఁ గృష్ణుఁ డేక పత్నీవ్రతుఁడే.
కందము:
జీవా ! నాటక పాత్రను
ఏ విధముగ పాత్రధారి కేమంటవుగా
ఆ విష్ణు పాత్ర ధారియె
భావింపగఁ గృష్ణుఁ డేక పత్నీవ్రతుఁడే.

Tuesday, 13 November 2012

ఈ వేళన దీపావళి ....


బ్లాగు వీక్షకులందరకు దీపావళి శుభాకాంక్షలు.
 

కందము:
ఈ వేళన దీపావళి
ఈ వెలుగుల వరుసలన్ని ఇంతింతంతై
ఈవలయుగాక యందరి
జీవితమున వెలుగు రేఖ శ్రీకృష్ణుండే. 

Monday, 12 November 2012

కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా

కందము:
రసికుడు రావణ ప్రభువును
రసికత పెండ్లాడ నీవు రాజ్ఞివె యనుచున్
ఉసి గొల్ప నొల్లనన ర
క్కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!

Sunday, 11 November 2012

పసిబాలుడు సంగరమున బగతుల నణచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పసిబాలుడు, సంగరమున బగతుల నణచెన్.

కందము:
కసితో ఝాన్సీ లక్ష్మియె
గస బెట్టుచు నశ్వ మెక్కి కరవాలము తో
వసనము ననుండ మూపున
పసిబాలుడు, సంగరమున బగతుల నణచెన్.

Saturday, 10 November 2012

వాని యనినంతనే మోక్ష పదమొసంగు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - వాని యనినంతనే మోక్ష పదమొసంగు
తేటగీతి:
జనని లోకాల పాలించు సాంబు రాణి
వినుమ నామొరలు మన్నించి విశ్వమందు
జన్మ మీయక దరి జేర్చు శరణమో భ
వాని యనినంతనే మోక్ష పదమొసంగు

Friday, 9 November 2012

కాంతులకున్ గాంతి గూర్చు కాంతకు జేజే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - కాంతులకున్ గాంతి గూర్చు కాంతకు జేజే.
కందము:
కాంతుల మూలము తానై
వంతులుగా సకల జగతి బాధ్యత మ్రోయన్
కాంతలు మువ్వురు వారల
కాంతులకున్ గాంతి గూర్చు కాంతకు జేజే.

Thursday, 8 November 2012

స్వామియే శరణమనెడి వాడు ఖలుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - స్వామియే శరణమనెడి వాడు ఖలుడు

తేటగీతి:
శరణ మన్నను చాలును సంపదలను
భక్త కోటికి నొసగెడు భవ్య మూర్తి
స్వామియే, శరణమనెడి వాడు ఖలుడు
చపలుడైనను బుధ్ధి కుశలత నొసగు.

Wednesday, 7 November 2012

పాడు పున్నమ యిది పండుగ కద

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పాడు పున్నమ యిది పండుగ కద 

ఆటవెలది:
పట్టు బట్టి నీకు పట్టు కోకను దెస్తి
కట్టుకోక నన్ను పట్టుకోక
బెట్టు సేతు వేల ప్రేమ గీతి కలసి
పాడు, పున్నమ యిది పండుగ కద.

Tuesday, 6 November 2012

ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 -11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

కందము:
ఇనకుల తిలకుడు కినుకను
గని జలనిధి నింకజేతు గనుమా యనగా
కనికరము జూపు మని రా
ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

Monday, 5 November 2012

భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 0811-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

కందము:
ఆర్యులు జెప్పగ వింటిని
భార్యా సహితముగ నేడు బంధుజనముతో
కార్య సఫలతకు శివ నిజ
భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

Sunday, 4 November 2012

దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.
ఆటవెలది:
పాల కడలి పైన పవ్వళించును గాని
పాలు వెన్న దోచె, పట్టు వస్త్ర
ములను కట్టు గాని ముదితల చీరల
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.

Saturday, 3 November 2012

గిరిధారికి భార మావ గింజ తలంపన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - గిరిధారికి భార మావ గింజ తలంపన్

కందము:
గిరి తా పేరును మోసెను
బరువులనే మోసి మోసి పరువములోనన్ (వెయిట్ లిఫ్టింగ్)
బరువాయె నొడలు ముదిమిని
గిరిధారికి భార మావ గింజ తలంపన్.

Friday, 2 November 2012

నను బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

సమస్య - నను బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.
మత్తేభము:
ఘనమౌ పుర్రెను చేతబట్టి యడుగున్ కాసింత యన్నంబునే
కన నేత్రంబున నిప్పు గ్రక్కు నొడలన్గప్పేను గా చర్మమే
విన భస్మంబును మేన దాల్చు జడుడే వీనిల్లు కాడందు రై
నను బూజించిన వారె పొందుదురనంతంబైన సత్సంపదల్.

Thursday, 1 November 2012

దత్తపది - మూడు, ఆరు, ఏడు, పది - భారతార్థంలో..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ

దత్తపది -  మూడు, ఆరు, ఏడు, పది - భారతార్థంలో...

శ్రీకృష్ణుడు ధ్రుతరాష్టృ ని  తో....
ఆటవెలది:
ఏడుపదియె మిగులు నేనాడు గెలువరు
మూడు మీకు యుద్ధ మొదవి నపుడు
పదిల మైన రాజ్య మది నాశ నమ్మగు
నారు మీదు వంశ మంత మామ !