తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 14 November 2020

బొంద బెడుదుమింక

 అందరికీ దీపావళి శుభాకాంక్షలు.  

 

సీసము:

చిచ్చుబుడ్డియె నీదు జీవితమ్మును బుగ్గి

జేయగా మండుచు చిచ్చుబెట్ట

సీమ టపాకాయ చిన్నినీతలకాయ 

ప్రేలిపొవుగనట్లు కాలిపోగ

చేరితారాజువ్వ మీరునీ బ్రతుకును

పైకి జేర్చుచు నింగి బాతిబెట్ట 

విష్ణు, భూచక్రాలు విరిచినీకొమ్ములు 

వీరంగమాడుచు విసరివేయ


ఆటవెలది: 

నేటి దీపప్రభలు నిండగాబ్రతుకుల

కోరుకొనుచు లేచి కోలుకొనుచు 

అందరమ్ముగలసి మందులన్ గాల్చుచు

బొంద బెడుదుమింక పో! కరోన!


కందము: 

ఈ కోవిడ్ నరకునిపై

టీకాలను వేసి చంపు టెన్నడొ, నాడే

మాకౌ దీపావళియని

లోకమ్ములు వేచియుండె లోకేశ! హరీ!




Thursday 12 November 2020

"గోలీ"లు - 36



కందము: 

తెలుగది వాడిన "షేమని"

తెలివిగ "ఫీలవ్వ"బోకు తింగరి బుచ్చీ!

తెలుగది "వాడిన" షేమని

తెలియగ వికసించి కురియు తేనెలు గోలీ! 


Saturday 7 November 2020

"గోలీ"లు - 35

 

కందము: 

"పని" ముట్టుకొనగ వలయును 

పనిలేకను తిరుగకుండ బద్ధకమనుచున్ 

"పనిముట్టు" కొనగ వలయును 

పనికవసరమైన వేళ వదలక గోలీ! 

Thursday 5 November 2020

"గోలీ"లు - 34



కందము: 

తెగ మెరిసెడి యొక బంగరు

నగవేలే నీవు చూడ నలుగురిలోనన్

నగవే ముఖమున మాయక 

తగనిలచిన, చేరనీక తగవుల గోలీ! 


"గోలీ"లు - 33

కందము:
మన మది కెయ్యది కష్టమొ
మనమది పరులకు సలుపుట మానగ వలెరా
మనవలె యొరులును జగతిని
మనవలెనని తెలిసికొనుచు మసలుము గోలీ!

Tuesday 3 November 2020

కాలున ద్రొక్కెదము 'కరోనా!

 కరోనాపై పోరాటం....అంతర్జాతీయ కవితల పోటీ కొరకు వ్రాసిన పద్యాలు.  



కాలున ద్రొక్కెదము 'కరోనా!


కందము:
మీరుచు సురవైరులు సరి
మారుచు వైరసులుగ భువిని మాయలతోడన్
తీరుగ కనబడకను మరి
మారణహోమమ్ము జేయ మరిగిరియకటా!

ఆటవెలది:
ఊహనగరి బుట్టి యూహింప లేనట్టి
కీడు సేయుచుండె పాడు పురుగు
కొమ్ములన్ని విరిచి కొట్టి కరోనాను
మట్టిగరపుటెపుడు మహిని దేవ! .

ఆటవెలది:  
ప్రక్కవారితోడ పాటించు  దూరమ్ము
తరచు గడుగవలయు కరములెపుడు
ముఖమునకు 'మాస్కు' మూసి కట్టగవలె  
మూడు మంత్రములివి ముప్పుదప్పు.

సీసము:
తగిన సమయమున తగుసూచనిడువార్కి
పాటింపజేసెడు పాలకులకు
వ్యాధులణగజేయు వైద్యబృందములకు
ఊరు శుభ్రబరచు ధీరులకును
దీక్షతో పనిచేయు రక్షకభటులకు
అవసరముల దీర్చు యన్యులకును
భూరివిరాళాలు పూనిబంపెడు వార్కి
పేదలకన్నమ్ము బెట్టు వార్కి    
 
ఆటవెలది:
దీటుగా గనుగొన దివ్యౌషధమ్మునే
శ్రమను జేయుచుండు శాస్త్రులకును
ఈ'కరోన' వేళ నెంతయో కీర్తించి
కోటిదండములను కోరిజేతు.

కందకు:
కాలము మారును నిలబడు
కాలూనుచు రణముజేయ కదలితిమింకన్  
కాలిచి మసినేజేయుచు
కాలున ద్రొక్కెదము నిన్ను గనవె కరోనా!

"గోలీ"లు - 33

 

కందము: 

మన మది కెయ్యది కష్టమొ

మనమది పరులకు సలుపుట మానగ వలెరా 

మనవలె యొరులును జగతిని

మనవలెనని తెలిసికొనుచు మసలుము గోలీ!


Monday 2 November 2020

"గోలీ"లు - 32

 

కందము:
ఏకులము మీదియనుచును
ఆకులమే తక్కువనుచు ననకుము, విడిగా
సోకుగ రెమ్మకు బుట్టిన
ఆకులమే, కలసియుండ నగురా, గోలీ!