తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 31 January 2019

జడ"కందాలు" - 17


17. భారతంలో 'జడపని'.

అడవిని వాసము ముగియగ
గడుపగ నజ్ఞాతవాస కాలమునందున్
జడపనియే  దిక్కాయెను
గడవగనా ద్రౌపదికిని గష్టము దీరన్.

Wednesday 30 January 2019

జడ"కందాలు - 16


16.ఒక జడ "బాది"తురాలి స్వగతం.

జడ "లాగి" వేయునమ్మయె
జడ లాగుచు "వేయు" బడిని శాడిస్ట్ టీచర్
జడవేయునప్డు "బాదుడు"
జడ వేసినపిదప గూడ, జడ వద్దమ్మో!


Tuesday 29 January 2019

జడ"కందాలు" - 15


15. జడతో "జరభద్రం" సుమా!

జడ లాగుటవలననె గద 
మడిసిరి  దుశ్శాసనుండు మరి కీచకుడున్
జడకడ భద్రము బ్రదరూ!
జడతోనే మారె కొన్ని జాతకములిలన్.  

Sunday 27 January 2019

జడ"కందాలు" - 14


14.జడ ఎంప్లాయ్ మెంట్ స్కీం.

జడ ! నిన్నల్లెడు పనియే
కడుపునకన్నంబు వెట్టు గద యెందరికో
పడతుల "కెంప్లాయ్ మెంటు"ను
పడి చూపుచునుండు "బ్యూటి పార్లర్" లెన్నో.

Saturday 26 January 2019

జడ"కందాలు" - 13


13.భలే మంచి జడ "సీను".

అల్లరి పిల్లకు జడలే
యల్లుచు దానుండ తల్లి, లకలతోడన్
మెల్లగ కదలగ, నెత్తిన
జెల్లను వేయుటయె మంచి "సీనౌ"ను గదా! 

Friday 25 January 2019

జడ"కందాలు" - 12


12.జడ పోషణ మన తరమా ...

జడవకనే 'ఆయిల్సును'
పొడవగుటకు, 'షాంపు' లెన్నొ పోషణమునకై
తడవకు తురుమగ పూలను
తడవక వానలను జూడ తరమే వనితా?




Thursday 24 January 2019

జడ"కందాలు" - 11


11. సవరం వరమే..

పొడగరి వనితలు జూడగ
జడ పొట్టిగనుండ నోపజాలరు, సవరం 
సడిలేకను కట్టుదురుగ
ముడికనబడక, కని'కట్టు' ముదితకు వరమే.

Wednesday 23 January 2019

జడ"కందాలు" - 10



10. జడ త్యాగమయి. 

దేవుని వద్దను మ్రొక్కిడి
ధీవనితలు కురులనీయ   దిరుపతి లోనన్
చావుకు సిద్ధంబగుజడ 
చేవగ త్యాగమును జేసి  క్షేమంబిడుగా.


Tuesday 22 January 2019

జడ"కందాలు" - 9


9.జడ మహాత్మ్యంబెట్టిదనిన.

జడలేక చిన్నికృష్ణుడు
ముడి పింఛము దూర్చి తాను ముద్దులొలుకునా ?
జడలేక శివుడు గంగను
ముడిబెట్టుచు దాని నాపి  మోయంగలడా ? 

Monday 21 January 2019

జడ"కందములు" - 8


8. జడ పదార్థాలు... 

నుడువుమన జడ పదార్ధము
బడిలోనొక బుడుగు చెప్పె పంతులు కిటులన్
జడరబ్బర్ బ్యాండ్, దువ్వెన 
ముడిక్లిప్పులు ననుచు, వాని  ముచ్చట గనుమా.

Sunday 20 January 2019

జడ"కందములు"- 7


7.జడలను పొగడవచ్చు  

ఇంతలు జడలన్ సిగ చే 
మంతులు మల్లెలు గులాబి మందారములన్
బంతులు,సంపెగ దురుమగ  
నెంతైనను పొగడవచ్చు నింతుల జడలన్.  

Saturday 19 January 2019

జడ"కందములు" - 6


6.జడముడి మురిపెం.

జడముడులు వంద రీతుల
ముడివేయుచు మురియుచుంద్రు ముదితలు నిజమే
జడ పద్యచయము వందగ
ముడిబడగా వ్రాసినేను మురిసెదనికపై.


Friday 18 January 2019

జడ"కందములు"- 5



5. రకరకాల జడ శోభలు..

చూడుడు కృష్ణుని జడనే 
చూడుడు మరి రెండుజడల సోయగములనే 
చూడుడు  పూజడ సొగసును 
జూడగ ముడి, కొప్పు, లొప్పి శోభించు గదా. 

Thursday 17 January 2019

జడ"కందములు" - 4


4.మగజడ,ఆడజడ...

మగవానికి జడలుండిన
జగమంతయు యతియె యనుచు జైకొట్టునుగా
మగువలకే జడలుండిన
మగవారికిదోచు రతిగ మదిదోచు గదా! 



Wednesday 16 January 2019

జడ"కందములు" - 3


3.కొమ్మకు ఎన్న్నిరకాల పూలో 

కొమ్మకు నిమ్ముగ జూడగ
నమ్ముమ యొక జాతిపూలె నయముగ బూయున్
'కొమ్మకు' వాల్జడ దురుమగ
కమ్మని పలు జాతి విరులు గంపెడు విరియున్.

Tuesday 15 January 2019

జడ"కందములు" - 2



2.జడ పాము

భామకు వెనుకను జడయే 
పాముగ తానూగుచుండు, పైనన్ జూడన్ 
చేమంతిబిళ్ళ మెరయుచు
తామణిగా వెలుగుచుండు తగగన"పడగన్".  

Monday 14 January 2019

జడ"కందములు" - 1

జడ"కందములు" - 1


1. జడల స్తుతి శ్రీకంఠుని చిక్కులజడ శ్రీకృష్ణుని పింఛమున్న చిత్రపు జడనే శ్రీకరముగ దలచుచు నే ప్రాకటముగ వ్రాతునయ్య పద్యములెన్నో.


సాగవలయు "సంక్రాంతి"

అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకంక్షలు. 

Image result for pongal images



కందము: 
రేగుఫలమువలె తా నూ
రేగుచు మకరంపురాశి రీతిగ రవియే 
రేగుచు నడచును మరిరా
రే!గురుతెరుగుచును "భోగి" రెచ్చుచు జరుపన్.   

కందము:
చక్రము ద్రిప్పగ సూర్యుడు
శుక్రుడు మొదలగు  గ్రహములు శోభలుబెంచన్
వక్రపు గతు'లే మారుచు'    
సక్రమముగ సాగవలయు "సంక్రాంతి" భువిన్.  



Sunday 13 January 2019

జడశతకం


జడ "కందాలు"
(మకుటరహిత జడశతకం)

ముందుమాట

కందము:
జడ కందములను వ్రాసితి
జడకందము బెరుగునట్లు సరసముగానే
మెడలో నా "బ్నిం"గారే
"మెడలును" వేసిరిగ  నాడు మెప్పులతోడన్.

  నాలుగు సంవత్సరాల క్రితం, 2014వ సంవత్సరంలో "ఫేస్ బుక్" లో  నా ఫేస్ "బుక్" చేసుకున్న తొలిరోజుల్లో ప్రముఖ కార్టూనిస్టు, రచయిత శ్రీ భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం) గారు వినూత్న ప్రయోగం చేశారు. "జడశతకం" అనే గ్రూపును ఫేస్ బుక్ లో ఏర్పాటుచేసి అందులో చేరిన కవులను ఒక్కొక్కరిని కనీసం ఐదు కంద పద్యాలను మకుట రహితంగా  "జడ" మీద వాడుక భాషలో "పజ్యాలు" వ్రాయమని కోరారు.అందరు కవులచే అలా వ్రాయబడిన "జడకందాలను" కలిపి "జడ శతకం - జడ పజ్యాలు"గా పుస్తకం వెలువరించాలని వారి కోరిక.అలాగే వారు చెప్పినట్లు 32 మంది కవులచే వ్రాయబడిన " పజ్యాలను" సంకలనం చేసి "జడపజ్యాలు" శతకాన్ని పుస్తకంగా మలచి హైదరాబదులో 28-10-2014 న "జడశతకం"  పుస్తకావిష్కరణ చేసి కవులందరినీ ఉచితరీతిని సన్మానించిన వారి కృషి అభినందనీయము. వారికి నా నమోవాకములు. 
ఇంతకీ చివరాకరికి చెప్పొచ్చేదేంటంటే "అలా" ఐదు పద్యాలు అని మొదలు పెట్టిన నేను "జడ" (పద్యాలు) ఆల్లుకుంటూ అనేకమంది మిత్రులు ఉత్సాహ పరుస్తుండగా "వంద"కు పైగా   "జడలు"  అల్లటం జరిగింది.వాటినుండి   రోజుకొక "జడకందాన్ని" మిత్రులకు చూపాలని నా అబిలాష. వాటి అల్లికలో తప్పులుంటే నిర్మొహమాటంగా తెలుపవలసినదిగా పండితులను కవిమిత్రులను కోరుచున్నాను.నేను మొదటి శతకం వ్రాయగలగటానికి కారణభూతులైన శ్రీ "బ్నిం" గారికి, పద్యరచనలో మెళకువలు మెరుగులు దిద్దుకొనుటకు తగిన వేదిక కల్పించిన "శంకరాభరణం" బ్లాగు   నిర్వాహకులు శ్రీ కందిశంకర గురువర్యులకు, నన్ను ప్రోత్సహించిన మిత్రులకు నమస్సులు మరియు ధన్యవాదములు.  

Monday 7 January 2019

నాన నాన నాన ననన నాన

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 7-1-2019న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - నాన నాన నాన ననన నాన 

ఆటవెలది: 
భాష హిందిలోన వద్దనగానేమి
పలుకుడనుచు నడుగ పంతులయ్య 
పలికె పిల్లలంత పలుమార్లు గుంపుగా
నాన, నాన, నాన, ననన, నాన.

Sunday 6 January 2019

పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 6-1-2019న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్.


కందము: 
పీలుచు ధూమము నిన్నే
చాలించుము చెప్పుచుంటి "చైన్ స్మోకర్ వే"
మేలగురా సిగరెట్ ధూ
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్.  

Friday 4 January 2019

పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 4-1-2019న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట.


తేటగీతి. 
సోమయాజుల యింటను శోభగాను
అరుగుపైన జరిగెవివాహమ్ము నాడు
నేడు తిథిగాన తండ్రిది చూడ నాటి 
పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట.


Tuesday 1 January 2019

వరలుగాక నూత్నవత్సరమ్ము

మీకు మీకుటుంబ సభ్యులకు అందరకు
2019 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

ఆటవెలది:
రాజకీయ శాంతి రాష్ట్రాల నెలకొన
కీచకాధములకు పీచమడగ
సుఖము సౌఖ్యములును శుభమంద ప్రజలకు
వరలుగాక నూత్నవత్సరమ్ము.