తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 17 April 2024

దశరథ నందన

 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః  

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.   


కందము: 

దశరథ నందన రాముని  

దశకంఠుని వైరి మరియు దయగల ప్రభువున్    

దశదిశల నున్న వానిని 

దశలవి మారును గొలువగ దక్కును సుఖముల్.




Monday 15 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 137

 

కందము: 

"ఇల్లాటి రోజు" మరియును

ఇల్లాటీ హాయి రాదు  హెహ్హే యనుచున్

చల్లాకి చిన్నదానితొ

అల్లీబిల్లిగను బాడుటదియొక హాయౌ. 

Sunday 14 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 136

 


కందము: 

"భూమ్మీదా సుఖ పడితే"

అమ్మో యీపాట మస్తు హాయిని నింపున్  

గమ్మత్తుగాను మనసుల

నమ్మధువే గొప్ప, యేల నమృతమ్మనుచున్.



Saturday 13 April 2024

బాల రాముడు

 జికె తెలుగు టాకీస్ వారి ఖగేశ్వరి ఉగాది పురస్కారములు 2024 న  

ద్వితీయ బహుమతి పొందిన  పద్యములు.


అంశం: "నేటి అయోధ్యలో బాల రాముడు" 


ఆటవెలది: 

"మోడి" విడక ధర్మ పోరాటమే సల్ప 

"రామజన్మభూమి" రగడ దీరె     

వందలేండ్ల పిదప నందెగా న్యాయమ్ము   

మందిరమ్ము వెలసె నందముగను. 


మోడి=పట్టుదల 


కందము:

పాలకుడే లోకములకు

పాలకడలిని పవళించు పరమాత్ముండే 

పాలను ద్రావెడి ముద్దుల 

బాలక రూపమ్ము నచట బాగుగ నిలచెన్.


చంపకమాల: 

జననియు జన్మభూమియును స్వర్గముకంటెను గొప్పదన్న నా   

యినకుల భూషణుండు జగదీశుడు కొల్వయె నీ యయోధ్యయే 

తన నిజ జన్మభూమియని, ధన్యతనందిరి భక్తులెల్లరున్ 

మనముల "రామలల్ల మము మన్నన సేయు”మటంచు మ్రొక్కుచున్. 


ఉత్పలమాల: 

ఒద్దిక మందిరమ్ము ఘనమొప్పగ గట్టిరి గా యయోధ్యలో

ముద్దుల బాలరాము సరి మోమును జెక్కిరి సొంపుమీరగా  

పెద్దగ మంత్ర యంత్రబల విగ్రహ మచ్చట నిల్పినారహో

వద్దిక జాగు, సాగుడిక వానిని జూడగ జన్మ ధన్యమౌ. 


ఉత్సాహము:

వరగుణముల రాఘవుండు "బాలు" రూపు నిలువగా   

భరత భూమి సంతసించి భాగ్యమింక నాదనెన్  

త్వరితగతిని భక్తులార!  దర్శనమ్మునందరే! 

స్వరము బెంచి "రామ" యనుచు భక్తి భజన జేయరే! 


Friday 12 April 2024

తప్పులు లేక సాగుడిక

 "భావుక" FB  సమూహము  వారు నిర్వహించిన "క్రోధి" "ఉగాది కవితల పోటీ" లో బహుమతి పొందిన నా పద్యములు.


ఉత్పలమాల:

కాలము మీది గానితరి గష్టములెన్నియు సైపగావలెన్  

గాలము వీడిపోవు, సరికాలము వచ్చి వసంతమందులే

సోలక రండు మీరనుచు, సోయగమొప్పగ గూసె కోయిలల్

జాలినిజూపి "క్రోధి" మము జక్కగ జూడుమ నీదు పాలనన్.

ఉత్పలమాల:

చప్పని జీవితమ్ములిక చప్పున మారగ జేయ బూనుచున్  

రొప్పక తీపి చేదు వగరున్మరి బుల్పుయు నుప్పు కారమే  

యొప్పిన లేహ్యమున్ దినుచు నుత్సహమంది యుగాదివేళలో  

తప్పులు లేక సాగుడిక ధైర్యమునందుచు వెల్గు దారిలో.

 


Tuesday 9 April 2024

"నగు" నుగాది.

 అందరకు "క్రోధి"నామ నూతన సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు.

 

కందము: 

క్రోధియను వత్సరము, వి

రోధములును జనుల కెపుడు రుజలే లేకన్

బాధలు దొలుగగ వలెనని

మాధవునే వేడుకొందు మనసున నెపుడున్.  

 


సీసము: 

ఉచిత తాయిలముల నూరింతయే తీపి  

కరకు మాటలనుట కారమగును   

మందు విందులనిచ్చు మచ్చికయే చేదు   

బాసలెన్నియొ జేయు పలుకు వగరు

పోటిదారుని దిట్టు పోకడయే యుప్పు

బలుపు చేష్టలవియె  పులుపు గదర 

కాకులెన్నియొవచ్చు కోకిల కూతలన్

సంతగా నిదిగొ వసంతమనుచు  

 

తేటగీతి:

ఎన్నికల పండుగది వచ్చె నెంచి మంచి

నాయకులకును మీ ఓటునయముగాను 

వేయ రాష్ట్రమ్ము దేశమ్ము వెలుగులీని 

ఐదునేడులు మీకింక "నగు" నుగాది.     


Tuesday 2 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 135



కందము:
"నీ పేరేంటో చెప్పు" అ
నేపాటయె, యింటిపేరునే చెపు బేబీ!
నూ పాలరాతి బొమ్మని
ఆపానుపు జేరుగుర్తు ననుటయె వహవా!



Monday 1 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 134

 

కందము: 

"చెప్పాలని వుందీ" యను   

గొప్పగు పాటను వినగను కోరిక కలుగున్ 

అప్పటికప్పుడు చెలితో

చప్పున మాట్లాడినట్లె సరి మది తోచున్.  


Saturday 23 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 133

 

కందము:
"ఒక్క క్షణం ఒక్క క్షణం"
చక్కని ఆ పాట మదికి సంతసమిచ్చున్
చిక్కని హాయిని మోయుట
మక్కువయను మోయలేని మందమ్మైనన్.


Saturday 16 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 132

 

కందము:
"ఆ నవ్వుల కోసమె" యని
ఆ నడకల కోసమనుచు నా చెలి మనసున్
ఆనెడి పాటను వినగా
తా నగుచును వచ్చు చెలియ తనివిగ ప్రియునే.

Friday 15 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 131

 

కందము: 

"ఆకులు పోకలు" పాటను

మా కంఠమ్మెత్తి బాడ మనసుప్పొంగున్ 

ఆ కళ్ళతోటి కళ్ళెము 

నా కదములు త్రొక్కినట్టు లాడును మదియే.



Thursday 14 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 130


కందము: 

"కలవరమాయే మదిలో"

ఇలలో నీపాట వినగ నెవ్వరికైనన్

కలియుచు వీణయు వేణువు

వలపుల రాగాలబాడు భావన కలుగున్.   

Tuesday 12 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 129


కందము:

"ఓ నాన్నా! నీ మనసే"
ఆ నాన్నది మనసు వెన్న అమృతమ్మనుచున్
గానముజేసిన పాటయె
మానవునకు నాన్న గొప్ప మదిలో నింపున్.



Monday 11 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 128

 


కందము:
"చీకటిలొ కారుచీకటి
లో కాలమనే" యనుచును లోబాధలహో
ఆకంఠమందు పలుకగ
మాకది విన గుండెలేమొ మరి బరువెక్కున్.


Sunday 10 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 127

 

కందము: 

"నెలవంక తొంగి చూసిం

ది" లలలలాల మనసైన తీయని పాటన్

కలువల రాజును దలచుచు

చెలికాడున్ చెలియ పాడ చెలువము హెచ్చున్.


Saturday 9 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 126

 

కందము: 

"రా! వెన్నెలదొర!" యనుచును

ఆ వింతను కనవదేల యనుచును పాడన్ 

ఆ వాలు కనుల చిన్నది

తావలచిన వాని మ్రోల తనివిగ వాలున్.


Friday 8 March 2024

చల్ల కొండమీది సామి

 ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు

మీకు మీ కుటుంబ సభ్యులు అందరకు "మహా శివరాత్రి" శుభాకాంక్షలు.

కందము: 

కొండంత దేవుడీవని 

కొండంతగ వరములీయ కోరముర హరా!

కొండంత అండగుండుము

కొండెక్కెడివరకు మాకు కోరెదమిదియే. 

ఆటవెలది:

చల్ల కొండమీది సామివే నీవయ్య 

పాల కడలి పైని పద్మ నాభు

నెయ్యమందినావు, నీగొప్ప దెలియగ

పెరుగు భక్తి మాకు ప్రియముగాను. 

ఉత్సాహము: 

భయము గలుగదయ్య నరులు భక్తి నిన్ను గొల్వగా 

జయములవియె చేరనడచు శంకలేక వేడగా

నయముగలుగు జీవితమున నమ్మి పూజ సేయగా

లయములగును  కష్టములును లాభమొదవు ఈశ్వరా .


Thursday 7 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 125

 

కందము:
"నీ కోసం వెలిసిందీ"
మాకా పాటయె చెవులకు మధువులు నింపున్
లోకమ్మున ప్రేమికులే
సోకుగనే పాడుకొంద్రు చూపుచు ప్రేమల్.

Wednesday 6 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 124

 


కందము:
"వయ్యారమొలికె చిన్నది"
అయ్యారే ఇట్టిపాట హాయగువినగా
సయ్యాట లాడబొమ్మను
తొయ్యలితోగూడి, మనసు తొందరజేయున్.


Tuesday 5 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 123



కందము:
"జయహే! నవనీల" వినగ
నయముగ నానందమొదవు, "నల్లనివాడే"
ప్రియముగ "మధురము" లెన్నో
స్వయముగ గలిగుండెననుచు బాగుగ బాడెన్.


Monday 4 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 122



కందము:
"భలె!మంచి చౌక బేరము"
బలెబలె ఆ పాటమాకు బాగుగ నచ్చున్
కలిమిచెలి పతిని వీధుల
నలనారదుడమ్ము విధమహహహా! ముదమౌ.

Sunday 3 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 121

 

కందము: 

"ఓ చెలి! కోపమ?" వినగా

మాచెవులను సోకుగీత మాధుర్యమహో! 

ఆ చివరి పద్యమాహహ!

దోచును మది, "సీను" లోకి తోడ్కొనిపోవున్.


Saturday 2 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 120

 

కందము:
"నను పాలింపగ నడచీ"
వినగా నాపాట మాకు వీనులవిందౌ
కనగా గోపాలుండే
కనికరమున తరలివచ్చి కనినట్లుండున్.

Thursday 15 February 2024

అల"వాట్"సప్



కందము:  

గ్రీట్సులకున్ ముచ్చట్లకు 

మేట్సుల, కాఫీసులకును మేలగునిదియే 

హ్యాట్సాఫ్ నే చెప్పెదమిక 

“వాట్సప్” కే గ్రూపు గాను వందన మనుచున్.


సీసము:  

పంపగా వచ్చులే వాయిస్సు మెస్సేజి

సెల్ఫీలు మరియెన్నొ  చిత్రములను

చూపగా వచ్చులే ఛూజింగు వీడియోస్  

లైవులో ప్రోగ్రాము మూవి వోలె 

మాట్లాడ వచ్చులే మనవారితోగూడి 

కబురులెన్నేనియు కనులగనుచు 

దింపగా వచ్చులే దిక్కౌచు నేరికిన్  

కోరు లొకేషన్ను చేర బంపి 


తేటగీతి: 

నేర్వగా వచ్చు కళలను నేర్పవచ్చు   

మంచిగా జేరి  గ్రూపుల మనమె జేసి

చెప్పగా వచ్చు నేడికన్ సెల్లునందు       

గొప్ప మాధ్యమ"మాయె" వాట్సప్పునిజము.         


తేటగీతి: 

ఉప్పులేనట్టి కూరనే యొప్పుకొనును

అవసరమ్ముల కొన్నింటి నవతలిడును  

నొప్పులెన్నేని బాధించ నోర్చుకొనును

సైపలేడుర నరుడు వాట్సప్పు లేక.


కందము:

అలవాటైతే ప్రీతిగ       

నల వాట్సప్పును వదలరహా! స్మార్ట్  ఫోనున్   

గలవారలు, డే అండ్ నైట్      

కలవారలు లేనివారు  కనెద రడిక్టై.  

       

కందము: 

ఎన్నుచు మాయల మారులె  

నిన్నున్ బడవేసి వలను నిండుగ ముంచన్  

కన్నింగ్ ఛాట్లను జేతురు    

చిన్నా! అన్నోను కాల్సు ఛీ! ముట్టకుమా!   


తేటగీతి:

"గుడ్డుమార్నింగు" వద్దురా "గుడ్డునైటు"  

"టేస్టు" లేనట్టి పోస్టులు "వేస్టు" గదర! 

"ఎత్తిపోతల" పథకమ్ము నెత్తివేయి   

"సరస ఫలముల" బంచు వాట్సప్పు మేలు.    

 

 

Tuesday 13 February 2024

ఘంటసాల పాటల "కందాలు" - 119


కందము:
"డీరిడిరిడిరి డిరిడి" యని
మీరిన గడుసైనపాట మెచ్చుచు వినగా
ఊరుచు హుషారు మదియే
ఊరేగును "హహహహహహ హుహ్హూ" యనుచున్.

Friday 9 February 2024

"గోలీ"లు - 82



కందము:

మొట్టుచు నెత్తిన గొట్టుచు   

బట్టీ బట్టించ వంటబట్టదు చదువే 

పట్టగ వచ్చును "మార్కులు" 

"ఫట్టు"ర నీ "మార్కు" జూప,"పట్టదు" గోలీ!     



Thursday 8 February 2024

క్రొత్త "way" మన పద్యం - 1

 

ఆటవెలది: 

"సాల్టు","క్యాంఫ"రేమొ సరినొక్క కలరుండు  

టెస్టు జేసి చూడ టేస్టు వేరు

"మెన్ను"లోన "జెంట్లిమెన్న"న డిఫరురా  

వర్డ్సు వినుము ఆస్కు వన్సుమోరు.



Wednesday 7 February 2024

ట్రాఫిక్కు"జాము"

 కందము:

హర్రీబర్రీ నగరము
హుర్రే!"ట్రాఫిక్కు జా" మహో, కన వెహికిల్స్
గొర్రెల మందగ తోచును
వర్రీతో "జాము" కడుగు వరకే కదలున్.


Tuesday 6 February 2024

తల తోక

 నిన్న 5-2-2024 న "సాహిత్యం" గ్రూప్ నందు ఇచ్చిన సమస్య "తలతోక లేనివేమనపద్యాలు" కు నా పూరణ.


ఆటవెలది:

ఆటవెలదులందు నందముగాజెప్పె

నీతి, జనులు దెలియ నిజముగ, కల

వె? తలతోక లేనివేమనపద్యాలు

తలయె "విశ్వ", తోక తలప "వేమ"



"గోలీ"లు 80-81



ఫిబ్రవరి '24 "రవళి" మాస పత్రికలో ప్రచురితమైన నేను వ్రాసిన పద్యములు.


కందము: 

వినవలదుర చెడు మాటలు 

కనవలదుర కానిపనులు కన్నులతోడన్ 

అనవలదుర చెడు పలుకులు 

మనవలదుర మంచిలేక  మనమున గోలీ! 


కందము: 

మన మేమనవలదుర భువి 

మనమే గొప్పని పరుషపు మాటల పరులన్    

మన వలెనందరు సుఖముగ

మనవలెనని దలచవలయు  మనముల గోలీ!

Friday 26 January 2024

అల్లూరి

      

గత  2023సం.  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా "అచ్చంగా తెలుగు" గ్రూప్ వారు నిర్వహించిన  పద్యాల పోటీ లో బహుమతి పొందిన పద్యములు.   

 

అల్లూరి సీతారామరాజు


ఉత్పలమాల:  

చేరి పరాయిపాలనను చిక్కిన జాతికి స్వేచ్ఛనీయగా  

భారత మాత దాస్యమును బ్రద్దలు జేయగ బూనిరెందరో

వీరులు, వారిలోన ఘన విప్లవ వీరుడు తెల్గునేలపై

పోరుచు నేల రాలె గద, పుణ్య చరిత్రుడు రామరాజహో!


ఆటవెలది:  

కట్టె నొంటిపైన కాషాయమును తాను

పట్టె విల్లుచేత పటుతరముగ

ఇట్టె రాజు నిలువ నిల మన్య ప్రజకు కన్

పట్టె పరశురామ భాతి నిజము.


కందము:

విల్లమ్ములు చేబూనిన

అల్లూరియె మదిని మెదల నదరుట మొదలై

"తెల్లోడి" గుండె జారుచు

నల్లాడుచు "సేవ్ మి" యనుచు నా "గాడ్" దలచున్.


ఉత్పలమాల:

దిక్కయి మన్నెపుంబ్రజల దీనత మాన్పగ, పోరు సల్పుచున్

పెక్కుగ నాయుధాలు తన పేర టపాలను పంపి దోచుచున్

చుక్కలు చూపినట్టి ఘన శూరుడు, రాజును జంపబూనుచున్

టక్కరి "రూథరూఫరు" "డెటాకు"ను జేయగ నెంచె మాటుగా.


కందము:  

పడమటి సూర్యున కర్ఘ్యము

నిడు రాజుకు "దొంగ దొరలు"  నెక్కిడి "గన్నుల్" 

విడువగ తూటాల్, వీడెను  

పుడమిని, తన కీర్తి వదలి మూసెను కన్నుల్.


Thursday 25 January 2024

ఘంటసాల పాటల "కందాలు" - 118

 


కందము:
"ఆహ్హా ఏమందము" అని
ఓహ్హో నీ చందమనుచు నొహ్హొహొయనుచున్
ఎహ్హెహె త్రాగిన వానిగ
నహ్హహ బల్ పాడినావు, హాయగు వినగన్.

Monday 22 January 2024

రామా!

 అయోధ్యలో రామజన్మభూమి మందిర మందున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా.


కందము: 

జన్మించిన చోటున యా

వన్మందియు వందనములు భక్తిగ జేయన్

చిన్మయ బాలుని రూపున

సన్మతులే పులకరించ స్వామిగ నిలచెన్.


కందము:

మందిరముగాగ మనముల 

నందముగా దీర్చి రాము నాహ్వానించన్

వందలు వేలుగ కోట్లుగ 

నందరు భక్తులు నిలచిరి హ్లాదముతోడన్. 


కందము: 

రామా!యని పిలు, నోరా 

రా! మాయను త్రోసి నిన్ను రక్షించునురా

రాముని దలచిన వచ్చును

రా! మునివందిత చరణుడు, రయమున నరుడా!



Monday 15 January 2024

ముంగిట రంగవల్లులు

 అందరికీ సంక్రాంతి శుభాకంక్షలు 

ఉత్పలమాల: 

ముంగిట రంగవల్లులును, ముచ్చట గొబ్బెమలందు నిల్వగా

చెంగట గంగిరెద్దు మరి జేరగ, నా హరిదాసు పాడగా 

రంగులుగా పతంగులట రమ్యపుటాకసమందు నాడగా  

హంగుగ పుణ్యకాల పథమందున సాగగ నేగె సూర్యుడే.


Friday 5 January 2024

ముగురమ్మలు

"రవళి" ప్రారంభ సంచిక అక్టొబర్ '23 నందు ప్రచురితమైన నా పద్యము.


శార్దూలము:

శ్రీమాతా! నిను గొల్చువారికెపుడున్ సిద్ధించుగా కామనల్

గోమాతా! నిను బెంచువారి కిరవౌ  కొండంతగా దీవెనల్

భూమాతా! నిను నమ్మువారి  కొదవున్  భోజ్యమ్ముకౌ సంపదల్

ధీమంతుల్ విధి గొల్చి, పెంచి సరియౌ తీరున్ మదిన్ నమ్మరే?


Monday 1 January 2024

రమ్మా నూతన వత్సరమ్మ

 మీకు మీకుటుంబసభ్యులకు అందరికీ 2024 నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.


శార్దూలము:
రమ్మా నూతన వత్సరమ్మ, చెడు 'వైరస్సుల్' ధరన్ తేకుమా
తెమ్మా శాంతియు సౌఖ్యముల్ జగతికిన్, తిప్పట్లనే యీకుమా
ఇమ్మా భూజన భోజనమ్ములకునౌ హెచ్చైన సస్యమ్ము, చే
కొమ్మా దీపము భావినింప భువిలో కోట్లాదిగా కాంతులన్.