కందము:
కల్లయు కపటమ్మెరుగని
పిల్లలు దైవాల రూపు, పెంచుడు వారిన్
తల్లియు తండ్రియు గురువులు
మల్లెల వలె స్వచ్ఛమైన మనసుల నెదగన్.
కందము:
మొక్కగ నుండగ నప్పుడె
చక్కగ సరియైన విధము సరి వంచవలెన్
దక్కునె మ్రానైన? సుగతి
చక్కని బాలలను మేలు జగతిని నిలుపన్.
కందము:
చెప్పుడు నీతికథలనే
చెప్పుడు మాటలను వినగ చేటగుననుచున్
చొప్పగ జేయక బుద్ధిని
చొప్పడ జేయంగవలయు శోధన ప్రతిభన్.
కందము:
పెద్దలనెడ గౌరవమును
సుద్దుల నోర్మిని, వినయము జూపెడు విధమున్
ముద్దుగ చదువుల నేర్పిన
నద్దియె సరియైన విద్య యగు పిన్నలకున్.
కందము:
గద్దెలనెక్కిన వారలు
పెద్దలు సరిదారి నెరిగి ప్రేమగ నెపుడున్
దిద్దుచు రేపటి పౌరుల
హద్దులలోనుంచి పెంచ హాయగు గదరా!
No comments:
Post a Comment