తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 27 May 2020

దూరమని

కందము:
దూరమని జెప్పుచుండిన
దూరుదురే గుంపు గూడి దుర్వర్తనులై
దూరును కరోన తా పో
దూరక యని "దూరిన" మరి యోపరదెట్లో?


Sunday, 10 May 2020

సినిమాకు "వంద"నం - 101

సినిమాకు "వంద"నం - 101

ఆటవెలది:
చివరివరకు జదువ 'సినిమ పద్యాలను'   
'నటనసూత్రధారి' నరుని బ్రోచు 
'చిత్ర జగతి' మాయ చిత్రమ్ముగా ద్రుంచి 
సిరుల నొసగు నిజము శీఘ్రముగను.  

Saturday, 9 May 2020

సినిమాకు "వంద"నం - 100

సినిమాకు "వంద"నం - 100 

ఆటవెలది:
జీవితమ్ము జూడ సినిమయే, దానికి 
దర్శకుండు పైని దైవ మగును 
నీదు పాత్ర నీవు నీటుగా పోషించి
ధరను వీడ నీవె ధన్యజీవి.

Friday, 8 May 2020

సినిమాకు "వంద"నం - 99

సినిమాకు "వంద"నం - 99 

ఆటవెలది:
మానవా కనగను "మానిసి" నే త్రిప్ప       
మారి పోవును "సినిమా"గ నిజము 
మహిని సినిమ నందు మంచిని నిలిపిన 
మనిషి "తిరగ" బడక మహిని నిలుచు. 

Thursday, 7 May 2020

సినిమాకు "వంద"నం - 98

సినిమాకు "వంద"నం - 98

ఆటవెలది:
వయసు పెరుగు చుండ వయ్యారమే తగ్గు 
కాని సినిమ సొగసు గనగ పెరిగె 
చేరి నాటినుండి సిక్స్టీన్సెవెంటీలు
దాటి స్కోపు నిలచె డీటియెస్సు.

Wednesday, 6 May 2020

సినిమాకు "వంద"నం - 97

సినిమాకు "వంద"నం - 97 

తేటగీతి: 
నటుల సైతము మెప్పించు నటుల తాము 
పాము, గుఱ్ఱమ్ము, కోతియు, పావురమ్ము 
కుక్క, యేనుగు, పొట్టేలు గూడ చూడ 
సినిమ నటియించి గురిపించె సిరుల నిజము. 

Tuesday, 5 May 2020

సినిమాకు "వంద"నం - 96

సినిమాకు "వంద"నం - 96

ఆటవెలది:
తెలుగు పాట చెఱకు తీపినే మరపించు 
తీరు మారిపోయె తిన్నగాను 
ఆంగ్ల బాణిలోన ననుసరించుటమాని 
అనుకరించుచుండి రరుపు, విరుపు. 

Monday, 4 May 2020

సినిమాకు "వంద"నం - 95

సినిమాకు "వంద"నం - 95

ఆటవెలది:
మధుర గాయకులును మరి నటరత్నాలు   
వ్రాత, మ్రోత, గొప్ప తీత గాండ్రు 
వెడలిపోయినారు, వెండితెరను నేడు 
పసిడి వెలుగులింక బరగ గలవె?

Sunday, 3 May 2020

సినిమాకు "వంద"నం - 94

సినిమాకు "వంద"నం - 94 

ఆటవెలది:
గొప్పగొప్ప నటులు కొందరకేమియు 
బిరుదులీయలేని పిచ్చి మనది
ఐననేమి వారలందరి మనముల 
స్థిరముగా నిలుతురు బిరుదులవియె.

Sunday, 5 April 2020

కరోనా "కందము"లే....

కరోనా "కందము"లే....

ఊహాన్ నగరిని బుట్టెను
ఊహకు రానట్టి కీడు నుర్విని బెట్టెన్
ఆహా! 'కరోన వైరస్'
హాహాకారమ్ములంటె నయ్యో! భువిలో.

కంటికి కనబడదట మరి
వింటిలె యంటగ జనునట వేగము తోడన్
జంటగ గూడిన నష్టమె
యొంటిగ దూరమ్మునుంట నొక భద్రమ్మౌ.

చేతులు 'సబ్బు'న గడుగక
మూతిని కండ్లను తరచుగ ముక్కును దాకన్
ఖాతరు జేయక దిరిగిన
భీతిని గలిగించు 'జబ్బు' పిలువక జేరున్.

'మాస్కు'ను గట్టుక మూతికి
చూస్కుని పరులకు దూరము జూచుచు నడువన్
'రిస్క'సలుండదు, కాదని
పూస్కుని రాస్కుని దిరిగిన పోదువు పైకే.

పొడిదగ్గు,గొంతునొప్పియు
వడివడి నూపిరిని బీల్చి వదలుట, నొప్పుల్
గడబిడ కడుపున, జ్వరమది
విడువక నుండిన గలువుము వేగమె వైద్యున్.

కొద్దిగ నలతయె గలిగిన
పెద్దగనూహించుచుండ వేయును భయమే
వద్దు యలక్ష్యము చని నా
ప్రొద్దున వైద్యుని గలువగ బోవునదటులే.

తమ వారిని తమ ఇండ్లను
తమ సౌఖ్యము లెక్కనిడక తమ ప్రాణమ్ముల్
క్షమ తోడ సేవజేసెడి
శ్రమజీవులు, వైద్యులు, మన రక్షకులకు జై.

ఇటలీలో పెరిగినదని
ఇట 'లీస్ట'ని పొంగిపోకు మిక 'లక్ డౌనౌ'
నిట 'లాక్ డౌన్' బాటింపక
నిటలాక్షుడు బ్రోవబోడు నిన్నిక వినుమా!

పాలకులు శాస్త్రవేత్తలు
మేలగు సూచనలనీయ మీరక జనగా
లీలగ దీరుచు నిడుములు
కాలమ్మే మారిపోవు గద, శుభమగుగా.

అందము గెలిచెదమని, నీ
కందములేయని కరోన! యణచెదమనుచున్
అందరమొకటై నిలచిన
పొందెదముగ జయము, పారి పోవు 'కరోనా'.

Thursday, 2 April 2020

"సురవైరు"లు "వైరసు"లయి

శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

కందము:
"సురవైరు"లు "వైరసు"లయి
ధర నరుల "కరోన" పేర దాడిని సలిపెన్
పరుగున వరగుణ రావా!
కరుణను కోదండరామ! కావగ రారా!

కందము:
మా యిల్లు ఋష్యమూకము
మూయుచు మేముండ, "వాలి" ముష్టి "కరోనా"
చేయదు దాడిని, రామా!
వేయుచు బాణమ్ము జంపి వేయుము దానిన్.

Wednesday, 25 March 2020

'శార్వరి'యన్న 'రాత్రి'యే.

అందరికీ శార్వరి నామ నూతన తెలుగువత్సర శుభాకాంక్షలు. 

ఉత్పలమాల:  
శార్వరినామ వత్సరమ సంతసమెక్కడ నీవు రాగ నీ
యుర్విని గ్రమ్మె జీకటులయోమయమాయెను, మానవాళి తా
సర్వమునా "కరోన"బడి  "చైను"ల ద్రెంపగ నిండ్ల లోపలన్ 
పర్వము లేక యుండిరిగ బాధగ, 'శార్వరి'యన్న 'రాత్రి'యే.       
    

Thursday, 5 March 2020

సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.

శ్రీ కంది శంకరయ్య గారు 5-03-2020 న ఇచ్చిన సమస్యకు పూరణ.

సమస్య - సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.

కందము: 
చింతామణి గొడ్రాలికి 
చింతను దీర్పంగ నిచ్చె చిటికెడు బూదిన్ 
వింతగ కవలల గనగా 
సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.

Friday, 21 February 2020

బట్టలు లేవని

ఓం నమశ్శివాయ
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

కందము:
బట్టలు లేవని, నోటన్
బట్టగ బలుపలుకు లన్ని పలికెదమే, రా
బట్టగ జూడము సత్యము
బట్టగ నీలీల తరమె? పరమేశ! శివా!
.

Tuesday, 11 February 2020

సినిమాకు "వంద"నం - 93

సినిమాకు "వంద"నం - 93

ఆటవెలది: 
పాట తెలుగె గాని "పాడు" వాడే దాన్ని 
కేక కూతలనెడు "ప్యాకు" లోన 
సాగదీసి విరిచి లాగుచు సినిమలో  
పీకి పాకననిడి  పేరుబొందు. 

Wednesday, 15 January 2020

క్షే మకరపు రాశి

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

చంపకమాల:
చకచక నాకసానబడి సాగి ధనుస్సును దాటి వేడ్కతో
మకరపు రాశి జేర మరి మాకిక పండుగ గాదు సూర్యుడా!
తికమక లన్నిమారి సరి తేజము పొంగుచు తెల్గునేల క్షే
మకరపు రాశిజేరిననె మాకది "భోగి"యు "పొంగలౌ"గదా!


Tuesday, 7 January 2020

సినిమాకు "వంద"నం - 92

సినిమాకు "వంద"నం - 92

ఆటవెలది: 
తెలుగు పేరునిడుట  దేలికగాదల్చి 
తెలుగు వాణి, బాణి తేలిపోవ 
ఇంగిలీసులోన నిరికించ 'సినిమా'ను 
తెలుగు మూగవోయి తెల్లబోయె.Wednesday, 1 January 2020

మెర్రీ ట్వంటీ ట్వంటీ

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 

కందము: 
హర్రీ బర్రీ లైఫున 
క్వర్రీలేంలేక హ్యాపిగా గడవాలోయ్ 
మెర్రీ ట్వంటీ ట్వంటీ 
వర్రీల్ రానట్టి ఇయరు వలె నిలవాలోయ్.