అయోధ్యలో 5-8-2020 న "రామాలయ" నిర్మాణ శంకుస్థాపన సమయంలో శ్రీరామునికి జేజేలు.
కందము :
దశరథ సుతుడై, బంటుగ
దశబాహుని పంచ ముఖుని దరిజేరిచి యా
దశకంఠుని పరిమారిచి
దశదిశలను ఖ్యాతి గనిన త్రాతకు జేజే!
కందము:
రామా! నిన్నే దల్తుము
రా! మామదిలోన నిలిపి రాజా రామా!
రా! మాయను తొలగింపుము
రా! మా సీతమ్మతోడ రక్షణ నిడుమా!
కందము:
నీజన్మ భూమి గుడినిడ
మా జన్మలు ధన్యమౌను మహిలో రామా!
భూజాని తోడ నిలచుచు
భూజనులను గావుమయ్య పురుషోత్తముడా!
కందము:
రామా! యని గొలిచెదమిక
రా! మాయని రోగములను రక్కసిమూకల్
భూమాతబట్టె, ద్రుంచుము
జామాతవు నీవు గాన జాలినిగనుచున్.
కందము:
"సురవైరు"లు "వైరసు"లయి
ధర నరుల "కరోన" పేర దాడిని సలిపెన్
పరుగున వరగుణ! రావా!
కరుణను కోదండరామ! కావగ రారా!
No comments:
Post a Comment