తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Showing posts with label దీపావళి. Show all posts
Showing posts with label దీపావళి. Show all posts

Monday, 20 October 2025

దీవెనిడుచు వెడలె దీపాల పండుగ

 మీకు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.  


(చంటిపిల్లలున్న ఇంట్లో దీపావళి నాటి విశేషం)   


సీసము:  

చిన్ని శిశువు కండ్లు చిందించ కాంతులన్     

దీప ప్రమిదలన్ని తిరిగి చూచె  

బోసినవ్వును నవ్వి పూయించ వెలుగులన్

భూచక్రమే ఆగి పుడమి దొర్లె     

ముద్దు ముఖము ద్రిప్పి మురిపించు చుండగా  

విష్ణు చక్రమ్మాగి  విస్తుబోయె  

తల్లి యొడిని జేరి తారంగ మాడగా   

చిచ్చుబుడ్డి ముఖము చిన్నబోయె  

ఎర్రబడినమోము నేడ్పులంకించగా 

సీమటపాకాయ సిగ్గుజెందె   

రోదసినంటగా రోదించ గాతాను 

అచట తారాజువ్వ హడలిపోయె   

కాలుచేతులనెత్తి కదిలించి విదిలించ 

కాకర పూవొత్తి కలవల పడె     

వటపత్ర శాయిలా పవళించి భాసించ

మత్తాబు  మినుకులే మసకబారె     

ఆటవెలది: 

సద్దు జేయకనుచు జననియే శాసించ    

విదిత మాయె ననుచు వేడ్కమీర      

దీవెనిడుచు వెడలె  దీపాల పండుగ

శుభములెన్నొ గలుగ శోభ నిండ.      


Thursday, 31 October 2024

ఎన్ని "మందు"లో

 మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ దీపావళి 

శుభాకాంక్షలు. 

దీపావళికి ఎన్ని "మందు"లో........ 

సీసము: 

త్రాగుబోతు నరులు తమ తప్పు దెలియుచు 

"మందు" వాడకమింక మానునాడు

పంటల చీడలన్ పరిమార్చునట్లుగా  

"మందు" కల్తీ లేక అందునాడు  

పిచ్చిగా యువతయే రెచ్చుచు పలు మత్తు   

"మందు"లే కోరక మసలునాడు  

ఆవేశపరులయో ఆత్మహత్యకు చేదు  

"మందు"నే త్రాగక మనెడునాడు  

తేటగీతి:

"మందు"లే యన్ని రోగాల మాన్పునాడు    

"మందు"లకు తగు తెలివి పెంపొందునాడు    

"మందు"లనుగాల్చ చౌకగా నందునాడు 

పూర్తి "దీపాలపండుగ" భువనమందు.  


Sunday, 12 November 2023

పండుగ దీపము

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.


ఉత్పలమాల: 

జీవన యానమందునను చిక్కటి చీకటి క్రమ్ముకొన్న నీ

భావన లందు ధైర్యమును బారగనీయక, నేడు వచ్చె దీ 

పావళియంచు నోర్మియను పండుగ దీపము వెల్గజేయగా 

త్రోవన వచ్చి కార్తికము తోషపు వెన్నెలలందజేయుగా. 


Thursday, 4 November 2021

చెణుకును విసరగ

 మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.


సీసము:
చెణుకును విసరగ సీమటపాకాయ
చిలిపిమాటదియగు చిచ్చుబుడ్డి
వాదనమ్మునుజేయ వంకాయ బాంబౌను
మాట మంచిదియైన మరిమతాబు
ముచ్చట్లు దిరుగగా భూచక్రమును బోలు
పరుషవాక్యమెపుడు పాము బిళ్ళ
హద్దుగనని పల్కు హవ్వాయి చువ్వాయి
విష్ణుచక్రమగును వినయ వాక్కు

ఆటవెలది:
మాటవిలువదెలిసి మహిలోన మెలిగిన
వెలుగు జీవితమ్ము కలిమి నిండు
దీని విలువ దెలియ దీపాల పండుగ
నిలచియుండునెపుడు నిజము నిజము.


Saturday, 14 November 2020

బొంద బెడుదుమింక

 అందరికీ దీపావళి శుభాకాంక్షలు.  

 

సీసము:

చిచ్చుబుడ్డియె నీదు జీవితమ్మును బుగ్గి

జేయగా మండుచు చిచ్చుబెట్ట

సీమ టపాకాయ చిన్నినీతలకాయ 

ప్రేలిపొవుగనట్లు కాలిపోగ

చేరితారాజువ్వ మీరునీ బ్రతుకును

పైకి జేర్చుచు నింగి బాతిబెట్ట 

విష్ణు, భూచక్రాలు విరిచినీకొమ్ములు 

వీరంగమాడుచు విసరివేయ


ఆటవెలది: 

నేటి దీపప్రభలు నిండగాబ్రతుకుల

కోరుకొనుచు లేచి కోలుకొనుచు 

అందరమ్ముగలసి మందులన్ గాల్చుచు

బొంద బెడుదుమింక పో! కరోన!


కందము: 

ఈ కోవిడ్ నరకునిపై

టీకాలను వేసి చంపు టెన్నడొ, నాడే

మాకౌ దీపావళియని

లోకమ్ములు వేచియుండె లోకేశ! హరీ!




Sunday, 27 October 2019

మది "దివాలి"

మీకు మీ కుటుంబ సభ్యులకు "దీపావళి శుభాకాంక్షలు".

సీసము:
కామమ్ము జూడగ "కాకరపూవత్తి"
చేతబట్టుచు గాల్చు చివరి వరకు
క్రోధమ్ము "బాంబది" కొంత దూరముబెట్టి
జాగ్రత్తగాబేల్చు సాధనమున
లోభమ్ము "పాంబిళ్ళ" లోనుండి దీయుచు
ముట్టించి మసిజేయి పట్టుబట్టి
మోహమే దలపగా మురియు "తారాజువ్వ"
పైకివదలు కాల్చి ప్రియముగాను

ఆటవెలది:
మదము విసరిగొట్టు మది "నేలటప్పాసు"
మత్సరమ్ము గాల్చు మరి "మతాబు"
లోన వెలుగజేయి జ్ఞానంపు "జ్యోతిని"
మది "దివాలి" యగును మనిషి కెపుడు.

Wednesday, 7 November 2018

బాబాలగుట్టులే పరికించి "డేరాల"

మీకు మీకుటుంబసభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

సీసము:
ధరను దాటి ధరలు తారలందున జేరె 
చేరి దించుమ నీవు "తారజువ్వ"! 
రెచ్చగొట్టి కులపు చిచ్చురేపెడివారి
ముచ్చెలు గాల్చుమా "చిచ్చుబుడ్డి"!
భూములనేమ్రింగు భూబకాసురులను
భూచక్రమా! కొట్టి పూడ్చుమమ్మ 
బాబాలగుట్టులే పరికించి "డేరాల" 
బ్రద్దలజేయుమా "బాంబు"! నీవె

తేటగీతి: 
వెలుగు పూవులనింటింట వేడ్కమీర
రాల్చు "కాకరపూవొత్తి"! రయముగాను 
మీరలందరు గలియగ మేలుగాను
పూర్తి "దీపాలపండుగ" పుడమి మీద.

Thursday, 19 October 2017

నిత్య దీపావళియెయౌను నిజము నాడు.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
















సీ:
చీకుచింతయనెడు సీమటపాకాయ
వత్తినే ముట్టించి వదలునాడు
పరుల వృద్ధినిజూచి పడునట్టి ఈర్ష్యనే 
చిచ్చుబుడ్డిగ గాల్చి చెలగునాడు
తలదిరిగెడు చెడు తలపులన్నియు గూడ
భూచక్రముగ కాలి పోవునాడు  
పరుష వాక్యమ్ముల పరుల హింసించెడి 
పాముబిళ్ళలు మాడి పడిననాడు      

తే.గీ:   
అహపు తారజువ్వను నింగి కంపునాడు  
శాంతి మత్తాబులే వెల్గు జల్లునాడు   
ముదపు ప్రమిదలకాంతియే ముసురునాడు 
నిత్య దీపావళియెయౌను నిజము నాడు.  



Sunday, 30 October 2016

నిజము దీపాల పండుగౌ ప్రజకు నాడు.


















సీసము:
ధరలు ధరను వీడి 'తార జువ్వ'ల వోలె
            పైకెగయక కనబడిన నాడు 
భుగభుగ మంటలన్ 'భూచక్రము'గ గాక 
        చల్లబడుచు భూమి సాగు నాడు
మారణ హోమాల మానవ 'బాంబు'లే    
    మహిని పేలక శాంతి మసలు నాడు 
సరిహద్దు దేశమ్ము  సరి 'చిచ్చు' బుడ్డులే  
           మండించకుండగా నుండు నాడు

తేటగీతి:
స్త్రీల, బాలల బట్టుక జెరచు ఖలుల 
'విష్ణుచక్రమ్ము' ఖండించి వెలుగునాడు 
నిండు వెలుగులు భువిపైన మెండుగాను 
నిజము దీపాల పండుగౌ ప్రజకు నాడు. 

          

Wednesday, 11 November 2015

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.









కందము: 
ఆకటిక పేద లందరి
యాకటి బాధలకునంద నాహారమ్మే
చీకటి బ్రతుకుల వెలుగు త 
దేకముగా గలుగ నాడు దీపావళియే. 

Thursday, 23 October 2014

వెలిగించు శక్తి నిచ్చెడి జ్యోతిన్





వీక్షకులు అందరికీ దీపావళి పర్వదిన  శుభాకాంక్షలు.  
 













కందము:
యేటికి సరిపడునట్లుగ
నేటికి వెలిగించు శక్తి నిచ్చెడి జ్యోతిన్
యేటికి భయమున్ బడెదవు
మేటిగ చీ'కట్లు' ద్రెంచి మెరుపుగ సాగన్.

Sunday, 3 November 2013

శ్రీకర దీపపు వెలుగులు



బ్లాగు వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

















కందము:
చీకటి వృక్షము బ్రతుకున
కూకటి వేళ్ళైన లేక కూలగ వలెగా 
శ్రీకర దీపపు వెలుగులు
మీకందరకందవలయు మిక్కుటమగుచున్. 

Tuesday, 13 November 2012

ఈ వేళన దీపావళి ....


బ్లాగు వీక్షకులందరకు దీపావళి శుభాకాంక్షలు.
 

కందము:
ఈ వేళన దీపావళి
ఈ వెలుగుల వరుసలన్ని ఇంతింతంతై
ఈవలయుగాక యందరి
జీవితమున వెలుగు రేఖ శ్రీకృష్ణుండే. 

Wednesday, 26 October 2011

నరకిన దీపావళియే నరకాంతక కృష్ణ

               బ్లాగు వీక్షకులందరికీ
దీపావళి శుభాకాంక్షలు.
 శ్రీ మహా లక్ష్మ్యై నమః  
శ్రీ కృష్ణ శ్శరణం మమ


నరకుము మాలో పాపము
నరకుము దుర్బుద్ధి, చింత, నరకుము లేమిన్  
నరకిన దీపావళియే
నరకాంతక కృష్ణ ! నిన్ను నమ్మితి మదిలో !