మీకు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
(చంటిపిల్లలున్న ఇంట్లో దీపావళి నాటి విశేషం)
సీసము:
చిన్ని శిశువు కండ్లు చిందించ కాంతులన్
దీప ప్రమిదలన్ని తిరిగి చూచె
బోసినవ్వును నవ్వి పూయించ వెలుగులన్
భూచక్రమే ఆగి పుడమి దొర్లె
ముద్దు ముఖము ద్రిప్పి మురిపించు చుండగా
విష్ణు చక్రమ్మాగి విస్తుబోయె
తల్లి యొడిని జేరి తారంగ మాడగా
చిచ్చుబుడ్డి ముఖము చిన్నబోయె
ఎర్రబడినమోము నేడ్పులంకించగా
సీమటపాకాయ సిగ్గుజెందె
రోదసినంటగా రోదించ గాతాను
అచట తారాజువ్వ హడలిపోయె
కాలుచేతులనెత్తి కదిలించి విదిలించ
కాకర పూవొత్తి కలవల పడె
వటపత్ర శాయిలా పవళించి భాసించ
మత్తాబు మినుకులే మసకబారె
ఆటవెలది:
సద్దు జేయకనుచు జననియే శాసించ
విదిత మాయె ననుచు వేడ్కమీర
దీవెనిడుచు వెడలె దీపాల పండుగ
శుభములెన్నొ గలుగ శోభ నిండ.
No comments:
Post a Comment