తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 30 April 2016

ముష్టీ సీర్యల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం -  ముష్టీ సీర్యల్ 
కందము: 
పది సంవత్సరముల పై
ముదిమిని నేచూచుచుంటి " ముష్టీ " సీర్యల్ 
ఇదిగో నేడాఖరుగా 
వదలుము పది నిమిషాల్ సమ వర్తీ దయతో !

Friday, 29 April 2016

తీపి - కారము - పులుపు - చేదు ...భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది - తీపి - కారము - పులుపు - చేదు ...భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.తేటగీతి: 
శ్రీ హరిని నమ్ము గమనించి చేదుకొనును
సంధి తలపులు పుణ్యంబు సాగనిమ్ము 
తీపి కబురు సుయోధన తీరుగాను 
పంపు మపకారమెంచక పాండవులకు. 

Thursday, 28 April 2016

పేరులేనట్టి వానికి వేయిపేర్లు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
సమస్య - పేరులేనట్టి వానికి వేయిపేర్లు.
ఆటవెలది: 
బంధుమిత్రులు వెయిమంది వచ్చినారు
బారసాలకు, తలిదండ్రి పేరు నొకటి
చెప్పుమనగా తలకొకటి చెప్పినారు
పేరులేనట్టి "వానికి" వేయిపేర్లు.Sunday, 24 April 2016

దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్ 

కందము: 
ఆ పగటి కాంతి బీలిచి 
లేపనమున రాత్రి వెలుగు లెస్సగు బొమ్మల్ 
చూపుటకు మధ్య పేరిచి 
దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్

Saturday, 23 April 2016

షేక్ హ్యాండు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణవర్ణ (న) చిత్రం - షేక్ హ్యాండుకందము: 
షేక్ హ్యాండు నిచ్చె బుడతడు 
జాక్ హ్యారీపోటరతడు చనుచును దోవన్ 
షేక్ హ్యాండు నిచ్చె నుడతయు 
టేక్ హ్యాపీ విష్షెసనుచు ట్రీ పైకెక్కెన్.

Friday, 22 April 2016

దారి చూపిన రహదారి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణవర్ణ (న) చిత్రం - దారి చూపిన రహదారి 

తేటగీతి: 
చేరి గూల్చిన చెట్ల నెడారియగును
దారితెన్నుయు గానడు ధరణి నరుడు 
చేయవలసిన దొక్కటే చెట్ల పెంపు 
దారి జూపెనుగా రహదారి మనకు

Thursday, 21 April 2016

హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్. కందము: 
హరియన కోతియె మరియొక
హరియన పామౌనటొక్క హరికప్పగుగా 
వరుసగ కనుగొనుడర్ధము
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్. 

Wednesday, 20 April 2016

కన్నీటి తోడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - కన్నీటి తోడు 

కందము: 
మొన్నటి వరకీ వాడన 
నున్నది నేడెచటబోయెనో యని ప్రజలే 
కన్నుల నీరిడి వెదకుచు 
నున్నారిట నీటి కొరకు నూతిని గనుడీ ! 

Tuesday, 19 April 2016

న్యస్తాక్షరి - అంశం, దీపావళి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి - అంశం- దీపావళి.
ఛందస్సు- ఉత్పలమాల. 
మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’.


ఉత్పలమాల: 
దీపములెన్నొ వెల్గి శశి దీపము భూమికి రాత్రి వచ్చెగా 
పాపమె పారద్రోలి ధర బంచగ పుణ్యపు కాంతు లిఛ్ఛటన్ 
పాపిని భూసుతున్ దునుమి వచ్చిన కృష్ణుని సత్యభామనే 
కాపుగ దల్చి గొల్తురిల గాంచుడి మోదమునన్ జనాళినే. 

Monday, 18 April 2016

సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్.


కందము: 
ఉద్గ్రంధములెన్ని గలుగ 
సద్గ్రంధము లెన్నుకొనుచు చదువగ వలెగా  
తద్గ్రంధము లెన్నక విడ 
సద్గ్రంథపఠనము, జనులఁ జవటలఁ జేయున్.

Sunday, 17 April 2016

అమ్మా యిలకందమనుచు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అమ్మా యిలకందమనుచుకందము: 
అమ్మాయిలకిది నేర్పిన 
నమ్మా!యిలకందమనుచు నమ్మడు చీరన్   
అమ్మాయిలకందమనుచు 
నమ్మను తాననుకరించి యటకట్టెనుగా.    

Saturday, 16 April 2016

మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె


తేటగీతి: 
అన్ని తెలిసిన యట్లుగా నాడి మాట 
పిచ్చి కూతల కూయుచు రెచ్చి పోవు 
వారి బోల్చగ పనితప్పె పేరు వెదుక 
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె.

Friday, 15 April 2016

నీటుగ మా మదిని రామ ! నిలచితివయ్యా!

శ్రీరామ జయరామ జయజయ రామ. 
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

తేటగీతి: 
కైకమగనిమాట విని లోకైక పతియె 
వనమునందున కలసి జీవనము సేయ
నవనిసుతతోడ వెడలెతా నవని మెచ్చ
దండకారణ్యమునకు కోదండమంది.  

కోదండ రామా !

కందము: 
జనకుని పలుకులు నిలుపగ  
జనకునిసుత గలిసి వనికి సరివెడలితివే!  
జనుడొక డనెనని యవనిని
వనముల విడువగ   యవనిజ బనిపితివటగా !     

కందము: 
మాటయె ముఖ్యముగా మో 
మాటములేకుండ ధరను మసలితివయ్యా ! 
దీటగు ధర్మపు రూపుగ 
నీటుగ మా మదిని రామ ! నిలచితివయ్యా!Thursday, 14 April 2016

దత్తపది - కోపము - చాపము - తాపము - పాపము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది - కోపము - చాపము - తాపము - పాపము
 ఉపయోగిస్తూ ఉత్తరుని ప్రగల్భములను గురించి.  


ఉత్తరుని ప్రగల్భములు.... 

కందము: 
కోపమునన్ దూర్వాసుడ 
చాపము పట్టంగ నేను సరిరాముండన్ 
తాపమున నగ్ని బోలెద 
పాపము దలపను రిపులను భండనమందున్

Wednesday, 13 April 2016

బోన్సయ్ భామ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - బోన్సయ్ భామ.

కందము: 
బోన్సవి పెరుగక నీమెయె
బోన్సయ్ గా మారెనిటుల, భువనమ్మందే 
యిన్సల్టైనను, దక్కెను 
ఛాన్సే, గిన్నీసు బుక్కు చప్పున నెక్కెన్.

Monday, 11 April 2016

తేలు కుర్చీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - తేలు కుర్చీఆటవెలది: 
తేలు లాటి కుర్చి తేలికయౌ కుర్చి
తెలియ జెప్ప నిటుల విలువ పెరుగు 
తేలు రాశి వారు తెచ్చి కూర్చున్నచో 
తేలి పోవు బాధ తేలు సుఖము

ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా రామ రావణ యుద్ధం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.నిషిద్ధాక్షరి: ‘ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం 
కందము: 
దశకంఠుని యుద్ధములో
మశకము వలె దల్చి గూల్చి మహనీయుండే
కుశలముగా జానకితో
యశమును తాబొంది వెడలె నాకాశగతిన్. 

Sunday, 10 April 2016

అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.  కందము: 
సాంబని పేరే భీష్ముం
డంబయె నగజాతగాగ నామెయె గొలువన్ 
సంబర మందగ భువి జగ 
దంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్. 

Saturday, 9 April 2016

వరదా ! వరదా ?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - వరదా ! వరదా ? 


కందము: 
వరదా ! వరదా ! యనుచును 
మరిమరి నీ భక్త కోటి మనసున దలవన్ 
వరమిచ్చితివా యిట్టుల 
సరితెలుగున కాదు స్వామి సంస్కృతమయ్యా !

Friday, 8 April 2016

ముఖమది చంద్రబింబము

అందరికీ " దుర్మిఖి " నామ సంవత్సర శుభాకాంక్షలు. 


చంపకమాల: 
ముఖమది చంద్రబింబముగ ముచ్చట కొందరికుండినన్ భువిన్    
సుఖమును బంచలేరు మరి జూడగ, దుర్ముఖమంచు నెంచకే         
సఖులుగ మమ్ము జూచియిక సన్మతి సౌఖ్యములందజేయ దు
ర్ముఖియను నామ వత్సరమ  మోడ్చుచు చేతులు స్వాగతింతు, రా !    

Thursday, 7 April 2016

ఆది - సోమ - మంగళ - బుధ, భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది - ఆది - సోమ - మంగళ - బుధ,  భారతార్థంలోతేటగీతి: 
ఆది దేవుని యవతార మాతడౌను 
బుధజనమ్ములు మెచ్చగా బోధ జేసె 
మంగళమ్మగు సంధిని మనసునొప్ప 
భీమరణమింక జరుగును సోమరింప.

Wednesday, 6 April 2016

హనుమానుడె వచ్చినాడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - హనుమానుడె వచ్చినాడు  

కందము: 
తినుమాయనుచును బెడితివి 
పెనుమాయను తలచబోక ప్రియనైవేద్య
మ్మనుమానము జెందకుమా 
హనుమానుడె వచ్చినాడు హాయిగ తినగా.

Tuesday, 5 April 2016

కౌంతేయుల మేనమామ కర్ణుండుగదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కౌంతేయుల మేనమామ కర్ణుండుగదాదుర్యోధనుడి మనోగతం...

కందము:  
ఎంతగనో సాయ పడిరి 
చెంతన నా గెల్పు కొరకు చెప్పగ వారే 
యింతగ నడవుల పంపగ 
కౌంతేయుల - మేనమామ , కర్ణుండుగదా ! 

Monday, 4 April 2016

లాప్ ఠాప్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - లాప్ ఠాప్ 


కందము: 
ఎన్నికలో వాగ్దానము  
నెన్న  కలోనిజమనగ నిటిచ్చెను  'లాప్ టాప్ ' 
మన్నిక జూడగ తాతయె 
దన్నుగ పొగ బీల్చి పైన తట్టెను ' ఠాప్ ఠాప్ ' 

Sunday, 3 April 2016

కూరలమ్మి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - కూరలమ్మి 
కందము: 
కాయలు, కూరలు కావలె 
కాయమ్మునుబెంచ, కొనుము కావలసినవే !
కాయలు కొనలేమమ్మా 
కాయుటలేదమ్మ డబ్బు కాయలవలెనే !

Saturday, 2 April 2016

గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల. 


తేటగీతి: 
కడుపు పండెను చూడ నాకాంతలకును  
సంతసంబును గూర్పుచు నింతులకును 
వారి భర్తలు తిరిగిరాచారమనుచు 
గడ్డములఁ బెంచి - మురిసిరి కాంత లెల్ల.

Friday, 1 April 2016

పీసుశీలయనగ ప్రియమైనకోయిల

మన గాన కోకిల సుశీల గిన్నిసు బుక్ లో స్థానము సంపాదించిన సందర్భంగా...

సీసము: 
భక్తిగీతము విన పారవశ్యముగల్గు 
ప్రేమ గానమనిన ప్రీతి గలుగు 
చిలిపి పాటలకును చెంగున మనసూగు
పంచదారలు పంచు బాలగీతి
కడువిషాదపుపాట కళ్ళనేచెమరించు
హాస్యగీతి మనసు హాయినింపు 
వీణపాటలలోన విఖ్యాతమీగొంతు
లాలిపాటలకును మేలుమేలు

ఆటవెలది: 
పీసుశీలయనగ ప్రియమైనకోయిల 
తెలుగు గాన లతకు తీపికొమ్మ 
స్పష్టమైన స్వరము సరితెలుంగు వరము 
చేరె ' గిన్నిసునను ' జేలు జేలు.  

ప్రేమల చిలుకలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ప్రేమల చిలుకలు


కందము: 
పలికితి ప్రేమలు చిలుకగ 
ములుకుగ దోచెన ? నొలికిన ముచ్చట లన్నీ
బలుపని దలుతువ ? చూపుము 
నలిగితి, నలిగితి ననకను నాపై వలపుల్.