తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 26 January 2024

అల్లూరి

      

గత  2023సం.  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా "అచ్చంగా తెలుగు" గ్రూప్ వారు నిర్వహించిన  పద్యాల పోటీ లో బహుమతి పొందిన పద్యములు.   

 

అల్లూరి సీతారామరాజు


ఉత్పలమాల:  

చేరి పరాయిపాలనను చిక్కిన జాతికి స్వేచ్ఛనీయగా  

భారత మాత దాస్యమును బ్రద్దలు జేయగ బూనిరెందరో

వీరులు, వారిలోన ఘన విప్లవ వీరుడు తెల్గునేలపై

పోరుచు నేల రాలె గద, పుణ్య చరిత్రుడు రామరాజహో!


ఆటవెలది:  

కట్టె నొంటిపైన కాషాయమును తాను

పట్టె విల్లుచేత పటుతరముగ

ఇట్టె రాజు నిలువ నిల మన్య ప్రజకు కన్

పట్టె పరశురామ భాతి నిజము.


కందము:

విల్లమ్ములు చేబూనిన

అల్లూరియె మదిని మెదల నదరుట మొదలై

"తెల్లోడి" గుండె జారుచు

నల్లాడుచు "సేవ్ మి" యనుచు నా "గాడ్" దలచున్.


ఉత్పలమాల:

దిక్కయి మన్నెపుంబ్రజల దీనత మాన్పగ, పోరు సల్పుచున్

పెక్కుగ నాయుధాలు తన పేర టపాలను పంపి దోచుచున్

చుక్కలు చూపినట్టి ఘన శూరుడు, రాజును జంపబూనుచున్

టక్కరి "రూథరూఫరు" "డెటాకు"ను జేయగ నెంచె మాటుగా.


కందము:  

పడమటి సూర్యున కర్ఘ్యము

నిడు రాజుకు "దొంగ దొరలు"  నెక్కిడి "గన్నుల్" 

విడువగ తూటాల్, వీడెను  

పుడమిని, తన కీర్తి వదలి మూసెను కన్నుల్.


Thursday 25 January 2024

ఘంటసాల పాటల "కందాలు" - 118

 


కందము:
"ఆహ్హా ఏమందము" అని
ఓహ్హో నీ చందమనుచు నొహ్హొహొయనుచున్
ఎహ్హెహె త్రాగిన వానిగ
నహ్హహ బల్ పాడినావు, హాయగు వినగన్.

Monday 22 January 2024

రామా!

 అయోధ్యలో రామజన్మభూమి మందిర మందున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా.


కందము: 

జన్మించిన చోటున యా

వన్మందియు వందనములు భక్తిగ జేయన్

చిన్మయ బాలుని రూపున

సన్మతులే పులకరించ స్వామిగ నిలచెన్.


కందము:

మందిరముగాగ మనముల 

నందముగా దీర్చి రాము నాహ్వానించన్

వందలు వేలుగ కోట్లుగ 

నందరు భక్తులు నిలచిరి హ్లాదముతోడన్. 


కందము: 

రామా!యని పిలు, నోరా 

రా! మాయను త్రోసి నిన్ను రక్షించునురా

రాముని దలచిన వచ్చును

రా! మునివందిత చరణుడు, రయమున నరుడా!



Monday 15 January 2024

ముంగిట రంగవల్లులు

 అందరికీ సంక్రాంతి శుభాకంక్షలు 

ఉత్పలమాల: 

ముంగిట రంగవల్లులును, ముచ్చట గొబ్బెమలందు నిల్వగా

చెంగట గంగిరెద్దు మరి జేరగ, నా హరిదాసు పాడగా 

రంగులుగా పతంగులట రమ్యపుటాకసమందు నాడగా  

హంగుగ పుణ్యకాల పథమందున సాగగ నేగె సూర్యుడే.


Friday 5 January 2024

ముగురమ్మలు

"రవళి" ప్రారంభ సంచిక అక్టొబర్ '23 నందు ప్రచురితమైన నా పద్యము.


శార్దూలము:

శ్రీమాతా! నిను గొల్చువారికెపుడున్ సిద్ధించుగా కామనల్

గోమాతా! నిను బెంచువారి కిరవౌ  కొండంతగా దీవెనల్

భూమాతా! నిను నమ్మువారి  కొదవున్  భోజ్యమ్ముకౌ సంపదల్

ధీమంతుల్ విధి గొల్చి, పెంచి సరియౌ తీరున్ మదిన్ నమ్మరే?


Monday 1 January 2024

రమ్మా నూతన వత్సరమ్మ

 మీకు మీకుటుంబసభ్యులకు అందరికీ 2024 నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.


శార్దూలము:
రమ్మా నూతన వత్సరమ్మ, చెడు 'వైరస్సుల్' ధరన్ తేకుమా
తెమ్మా శాంతియు సౌఖ్యముల్ జగతికిన్, తిప్పట్లనే యీకుమా
ఇమ్మా భూజన భోజనమ్ములకునౌ హెచ్చైన సస్యమ్ము, చే
కొమ్మా దీపము భావినింప భువిలో కోట్లాదిగా కాంతులన్.