తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 29 November 2017

అవ్వ - తాత - అత్త - మామ....భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



దత్తపది - అవ్వ - తాత - అత్త - మామ....భారతార్థంలో


కందము: 
అవ్వల బంధుల జూచుచు 
కవ్వడి తా తపన విడువ కదనముపైనన్ 
హవ్వాయని యత్తరి హరి 
నవ్వుచు మామక యనుచును జ్ఞానము జెప్పెన్. 

Wednesday 22 November 2017

రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.


కందము: 
భీతిల్లకు గ్రహణంబీ
రీతిగ పూర్ణంబు బట్ట రేయిగ మారెన్ 
చూతువె, యదిగో తొలగెను 
రాతిరి - రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

Wednesday 15 November 2017

గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్


కందము: 
గురువారమ్ముపవాసము 
సరి నీరే ముట్టు తాను, ఛాత్రుండొకడే  
మరియారోజే విందుకు 
గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.

Monday 13 November 2017

వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - వరమే పది తలల వాని ప్రాణము దీసెన్. 


కం:  
నరవానరులను వదలుచు 
పరులెవ్వరు చంపలేని వరమునుబొందెన్
చరియించకామమున కా 
వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.

Friday 10 November 2017

పార్థసారథి పరిమార్చె పాండవులను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను.



తే.గీ: 
నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు?
ఏమిజేసెను తా మేనమామ నపుడు?
తోడు వీడకరక్షించె వాడెవరిని? 
పార్థసారథి-పరిమార్చె- పాండవులను.

Saturday 4 November 2017

మత్తుమందు సేవించుట మంచిదె కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద.



తే.గీ: 
మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు 
మత్తులోనుండ వలదన మాన దలచి 
తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ 
మత్తు, మందు సేవించుట మంచిదె కద.