తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 30 April 2011

ఇంటరులో తెలు'గింటరులు'........

ఇంటరు పరీక్షల్లో తెలుగు నందు సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులు 15 ,494 మంది - తప్పిన వారు 35 ,725 మంది ఉన్నారట.(నిన్నటి వార్త)... 

               ఇంటరులో తెలు'గింటరులు'

     కం:  వింటిరె!  తెలుగున సున్నా;
           ఇంటరులో మార్కులొచ్చె నేమిది! అయ్యో !
           తుంటరి విద్యార్థులు; *తెలు 
          'గింటరులే' గాద! వారి నేమనవలె!ఛీ!       
          
       * తెలుగింటి + అరులే  (శతృవులే )

Friday 29 April 2011

శంకరాభ(పూ)రణం - ఖరనామము సుతున కొసగె ....

    శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.          

               సమస్య : ఖరనామము సుతున కొసగె కడుమోదమునన్


          కం:  ధరలో నొక్కడు, గలిగిన
               వరపుత్రునిచూచి, తలచి వైయ్యస్సారున్;
               'హరి హర రాజ జగన్ శే
               ఖర ' నామము; సుతున కొసగె కడుమోదమునన్.

Thursday 28 April 2011

శంకరాభ(పూ)రణం - వేదము జదివినపురుషుడు వెధవ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.      

               సమస్య :  వేదము జదివినపురుషుడు వెధవగమారున్

             కం:  జూదములాడుచు, నాస్తిక
                 వాదులదరిజేరి, మాంసభక్షకుడై, తా
                 నేదరి నీమముపట్టక
                  వేదము జదివినపురుషుడు; వెధవగమారున్!

Wednesday 27 April 2011

శంకరాభ(పూ)రణం - భార్యకు బ్రణమిల్లె భక్తి భావము .......

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.      


                     సమస్య : భార్యకు బ్రణమిల్లె భక్తి భావముగదురన్

               కం:   ఆర్య, సుమన్,రవి,రామా
                    చార్యులు,గోవిందు,రాజు,శంతను-గుడిలో
                    భార్యలతోగలసి, హరుని
                    భార్యకు బ్రణమిల్లె; భక్తి భావముగదురన్

                కం:  సూర్యకుల తిలకు రాముని
                    భార్యకు; బ్రణమిల్లె భక్తి భావముగదురన్
                    శౌర్యముతో హనుమంతుడు
                    కార్యము సాధించి, మణిని గైకొని మరలెన్!

Tuesday 26 April 2011

కూకూ!క్వాక్ క్వాక్! మేమే!

                                  కూకూ!క్వాక్ క్వాక్! మేమే!


ఆ.వె.   వేల జనము ముందు వేదిక పైనెక్కి
          ధ్వనుల ననుకరించు ఘనుడొకండు
          పక్షి జంతువులను పలు పలు విధముల
          అనుకరించుచు నపుడరచె నిటుల.

కం.     కూకూ!క్వాక్ క్వాక్! మేమే!
          కాకా! బుస్ బుస్సు! గాండ్రు గాండ్రూ! మ్యావ్ మ్యావ్!
          కోకొరొ కొక్కో! అంబా!
          కీ కీ! హీహిహి! బెక బెక! కిచ కిచ! భౌ భౌ!


Monday 25 April 2011

శంకరాభ(పూ)రణం : విద్య నేర్చిన వాడెపో వింత పశువు ......

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 -01 -2011 న ఇచ్చిన   సమస్యకు నా పూరణ.                    

                                    సమస్య : విద్య నేర్చిన వాడెపో వింత పశువు. 

              తే.గీ.   విశ్వమందున చెప్పుము విజ్ఞుడెవడు?
                    వెళ్ళు మనుటకు ఒకమాట వేగచెప్పు?
                    విద్య లేనట్టి  వానికి వేరు పేరు?
                    విద్య నేర్చినవాడె - పో - వింతపశువు.

Sunday 24 April 2011

శంకరాభ(పూ)రణం : తలలువంచి గగన తలము గనుడు ....

   శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 -01 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.                     

                            సమస్య: తలలువంచి గగన తలము గనుడు


   ఆ.వె.        సీతజాడ వెదకి శ్రీరామభక్తుండు
                  లంకగాల్చి అపర శంకరువలె
                  నాకవాసులార! ఆకసంబుకెగసె
                  తలలువంచి గగన తలము గనుడు!
 
     ఆ.వె.      కొండమీదనున్న కోనేటి చిత్రము
                  అద్భుతమ్ము!చూడుడందములను!
                  తేటనీటిలోన తెలిమబ్బు కనిపించె!
                  తలలువంచి గగన తలము గనుడు!

Saturday 23 April 2011

శంకరాభ(పూ)రణం : బారులు లేనిచోకవులు బావురుమందురు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 -01 -2011 న ఇచ్చిన వారాంతపు  సమస్యకు నా పూరణ.

        సమస్య :  బారులు లేనిచోకవులు బావురుమందురు లోకమందునన్.


    ఉ : ఆ రవి లేక ప్రాణితతి, ఔషధలేమిని రోగులున్,సదా
          చారములేక వైదికులు,స్తన్యము లేకను  చంటిపాప,లా
          హారములేక బీదజను,లాదరమిచ్చెడి మంచి రాజద
         ర్బారులు లేనిచోకవులు బావురుమందురు లోకమందునన్.

Friday 22 April 2011

శంకరాభ(పూ)రణం : దద్దమ్మలకీ జగత్తు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


                          సమస్య : దద్దమ్మలకీ జగత్తు దండుగ  కాదా ?



              కం:  సుద్దులు విద్దెలు నేర్వక,
                  పెద్దలపై ప్రేమలేక, ప్రేలుచు దిరిగే
                  యెద్దులు,పెడ బుద్ధులు గల 
                  దద్దమ్మలకీ జగత్తు, దండుగ కాదా?


Thursday 21 April 2011

శంకరాభ(పూ)రణం ; చెడుగుడు నాట్యమ్ము కొరకు ...

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

        సమస్య :  చెడుగుడు నాట్యమ్ముకొరకు చీనాంబరముల్


       కం:    బడిలో జరిగెడు పోటీ
                చెడుగుడు, నాట్యమ్ముకొరకు,చీనాంబరముల్
                ఉడుపులు వాటికి మరిసరి
                పడునవి కుట్టించి తెండు వడివడి రేపే.

Tuesday 19 April 2011

శంకరాభ(పూ)రణం - కొడుకునకున్ వేనవేలు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

           సమస్య : కొడుకునకున్ వేనవేలు కూతునకొకటే 

         కం:  పడిపడి ఫీజులు కట్టెద               
                కొడుకునకున్ వేనవేలు; కూతున కొకటే
                బడి చాలు నుచితముగ చె
                ప్పెడు చదువను మాట; నేడు వీడగవలెగా!!

Monday 18 April 2011

శంకరాభ(పూ)రణం - గాడిదలకు దెలియు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
       
      సమస్య :గాడిదలకు దెలియు కుసుమ గంధపు విలువల్
 
      కంఈడును జూడకనే పూ
             బోడుల,బాలికలపైన పొగరుతొ యాసిడ్
             దాడులు జేసెడి యేమ
             గ్గాడిదలకు దెలియు కుసుమ గంధపు విలువల్? 

Friday 15 April 2011

మానవా ! మానవా?

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య :" పర్యావరణ పరి రక్షణ " పై స్వేఛ్చా చందం 

కం : కానము మానవ మనుగడ 
       కాననములు లేని నాడు కలలో నైనన్;
      మానవ!వనములు నరుకుట
      మానవ? యికనైన నీకు మనసే లేదా?


Thursday 14 April 2011

దున్నను గొల్చినన్ తొలగు దోషములన్ని...

గతములో భవిష్యవాణి పత్రిక లో ఇచ్చిన సమస్యకు నే జేసిన పూరణము.

సమస్య : దున్నను గొల్చినన్ తొలగు దోషములన్ని లభించు పుణ్యముల్.

ఉ : ఉన్నది  దైవ మొక్కటను  ఉన్నత భావమునెంచి వానినే 
      సన్నుతి జేయగావలయు! శర్వుని రూపున ఆలయంబునం 
      దున్నను; చర్చిలో 'ప్రభుగ ' నున్నను; 'అల్లగ'  ఏమసీదుయం      
      దున్నను; గొల్చినన్ తొలగు దోషములన్ని లభించు పుణ్యముల్ !

Tuesday 12 April 2011

రా ! మారా ! మా .. రామా !రా .. మారామా?

బ్లాగు వీక్షకులకు అందరకూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


మారా!మాధవ! రాజకు
మారా!మా మొరలు వినగ, మమ్ముల బ్రోవన్
మారామా!చాలును యిక
మా రామా!వేగ రార మారారి నుతా!

Monday 11 April 2011

మూగ వాని నోట రాగ మొలికె.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన సమస్యకు నేను చేసిన పూరణ.
సమస్య : మూగ వాని నోట రాగ మొలికె.

ఆ.వె. చిత్ర సీమనేలు గాత్ర ధారి యొకడు 
         రాక రాక తనదు గ్రామమునకు 
         రాగ, పాడుమనుచు ప్రజలందరును చుట్టు 
         మూగ; వాని నోట రాగ మొలికె.

Thursday 7 April 2011

మార్చ్ ౨౦౧౧ సుజనరంజని - సమస్యాపూ రణ

 మార్చ్ 2011 సుజనరంజని వెబ్ పత్రికలో ఇచ్చిన సమస్యలకు నా పూరణలు

సమస్య :  వెన్ను చూప కుండ రన్ను దీసె.

క్రికెట్టు మ్యాచ్ లొ చివరి బంతికి ఒక ఆట గాని పరిస్థితి.
 
ఆ.వె.  గెలుపు ఓటములకు మలుపు ఈ బంతియే!
          పరుగు ఒకటి వలయు బంతి ఒకటె!
          ఫాస్టు బాలు వేయ, భయము లేదని! కొట్టి
          వెన్ను చూప కుండ రన్ను దీసె.

సమస్య : బంట్రోతు భార్య యోగము

కం.  బంట్రోతు భార్య యోగము
       కంట్రీ ఎన్నికలలోన ఘనముగ మారెన్,
       సెంట్రల్ ఎంపీ అవగా
       ఎంట్రీ లో మంత్రి పదవి ఎదురై రాగా.

Monday 4 April 2011

శ్రీ కరం,శుభ కరం ఈ " ఖరం "

 బ్లాగు వీక్షకులందరకూ  నూతన ఉగాది శుభాకాంక్షలు.



ఖర వత్సరమందు హిమశి
ఖర వాసుడు,పురహర, లయ కారుడు, శశిశే
ఖరుడును!ఖరకర కులజుడు,
ఖర దూషణ రావణారి! కలుముల నిడుగా!

Sunday 3 April 2011

ధోని సేనకు తేట 'గీతాభినందన'

ప్రపంచ క్రికెట్ కప్పును సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు.

మొదట సెహ్వాగు మరలగ మొక్కవోక!
సచిను యువరాజు కొహ్లీలు సాహసింప!
ధోని గంభీరు నిలబడి తోడు నిలువ!
కప్పు దెచ్చిరి భారత కలలు పండ!