తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 30 November 2011

అల్లా కాపాడు మనుచు హరి వేడు కొనెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-09-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

    సమస్య -  అల్లా కాపాడు మనుచు హరి వేడు కొనెన్

కం:  అల్లాబక్షను వాడే
        ఇల్లాలికి జబ్బు చేయ నీశ్వరు గొలిచెన్
        చల్లగ చూడగ మిత్రుడు
        అల్లా ! కాపాడు మనుచు హరి వేడు కొనెన్.Tuesday, 29 November 2011

అమెరికాలోన లభియించె నావకాయ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-08-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య - అమెరికాలోన లభియించె నావకాయ. 

తే.గీ:  పూట కూళ్ళమ్మ' పెద్దమ్మ'  స్టేటు కేగె
          ముద్ద పప్పుయు, గోంగూర, మునగ చారు
          పెరుగు ఆవడ, వడియము, పెసర గారె
          అమెరికాలోన లభియించె నావకాయ. 

Sunday, 27 November 2011

పురుషుఁడు ప్రసవించెఁ బుణ్యతిథిని

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-08-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


             సమస్య - పురుషుఁడు ప్రసవించెఁ బుణ్యతిథిని

ఆ.వె:  శంఖచక్రధారి చక్కగా కనిపించి
          దేవకికి మరి వసుదేవు నకును
          పుత్రు నౌదు ననియె పుడమి బాధలు దీర్చ
          పురుషుఁడు ; ప్రసవించెఁ బుణ్యతిథిని. 

Saturday, 26 November 2011

రాముఁడు ముదమున ఖురాను చదివె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-08-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                    సమస్య - రాముఁడు ముదమున ఖురాను చదివె

ఆ.వె:  రామ దాసు బట్టి రాజు తానీషాయె
          బాధ పెట్టె తాను బంది ఖాన

          ప్పు తీర్చి దాసు గొప్పతనము జెప్ప
          రాముఁడు, ముదమున ఖురాను చదివె. 

Friday, 25 November 2011

యమున కేల వస్త్ర మాభరణము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-08-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                        సమస్య -  యమున కేల వస్త్ర మాభరణము.


ఆ.వె:  యముని పూజ జేయ నామె వచ్చెన ? నోనొ !
          యమున కేల? వస్త్ర మాభరణము.
          య! ముని పూజ జేయ నదిగొ తెచ్చెను చూడు
          యమున కేల వస్త్ర మాభరణము.


1. య = యస్ = ఔను

2. యమున కేల ? = యముడి కెందుకు
3. యమున కేల  = యమున చేతిలో 
Thursday, 24 November 2011

పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                    సమస్య - పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య

ఆ.వె:  ఆల మందలన్న నవి దేశ భాగ్యమ్ము
          గోవు తల్లి వలెను గొప్ప గాదె !
          మురళి లోలు డధిక ముచ్చట గాగాచు
          పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య !!
 

Wednesday, 23 November 2011

మాధవుని శిరమ్మునెక్కె మందాకినియే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            సమస్య - మాధవుని శిరమ్మునెక్కె మందాకినియే

కం:  ఈ ధర జేరగ వీడుచు
       మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
       వేద నుతుని జట ముడివడి
       వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ ! 

Tuesday, 22 November 2011

నవమి నాఁడు వచ్చె నాగ చవితి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య - నవమి నాఁడు వచ్చె  నాగ చవితి

ఆ.వె:  పుట్టినింటికి 'కళ'  పురిటికి శ్రీరామ
          నవమి నాఁడు వచ్చె,   నాగ చవితి
          దాటె,  కలిగె నొక్క తనయుడు  ముద్దార
          జూపి మురిసె  భర్త చూడ రాగ. 

Monday, 21 November 2011

వాణీ పుత్రునకు నెలుక వాహనమయ్యెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

           సమస్య -  వాణీ పుత్రునకు నెలుక వాహనమయ్యెన్.

కం:  వీణను మీటుట నాపుము
        వాణీ ! విను, భవుని లీల వాక్కొన వశమే?
        రాణీ ! గజముఖమును శ
        ర్వాణీ పుత్రునకు, నెలుక వాహనమయ్యెన్ !!  

Sunday, 20 November 2011

ఎలుక తోలు నుతికి తెలుపు చేసె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య -  ఎలుక తోలు నుతికి తెలుపు చేసె.


                     ‘టామ్ & జెర్రీ’..కార్టూన్ ఫిలిం లో..
 
ఆ.వె:  నలుపు తెలుపు జేయు ననుచు నొక్కడు మందు
          పిల్లి కమ్మెనొక్క ఫిల్ము నందు
          పని తనమ్ము జూడ ప్రక్కనే యున్నట్టి
          ఎలుక తోలు నుతికి తెలుపు చేసె.

Saturday, 19 November 2011

సంసారిగ మారి యోగి సంతసమందెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         సమస్య - సంసారిగ మారి యోగి సంతసమందెన్


కం:  శాంసన్ యోగీ నక్సల్
       హంసా లక్ష్మిని వరించి యామెయె జెప్పన్
       హింసా ప్రవృత్తి
ని విడచి
       సంసారిగ మారి యోగి సంతసమందెన్. 

Friday, 18 November 2011

ఆలి నంపుచుంటి నేలుకొనుము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య - ఆలి నంపుచుంటి నేలుకొనుము

       అల్లుని తో మామ...

ఆ.వె:   ఆరు మంది పిల్ల లా వా రాయెను          
           ఏడు దైన నేలు కొనను
           అనుచు పంపి నావు  అబ్బాయి పుట్టెను
           ఆలి నంపుచుంటి నేలుకొనుము. 

Thursday, 17 November 2011

పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22- 07 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            సమస్య - పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.

కం:  అందిన ప్రియ నెచ్చెలియే
        అందించెను ప్రియునికి మధురాధర మపుడున్
        కందిన మోమున ' క్లోజ
        ప్పంది ' యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.  

Wednesday, 16 November 2011

రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21- 07 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

           సమస్య - రాధా!యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్

కం:  రాధను పిలిచెను కృష్ణుడు
        రాధా!యిటు రమ్మటంచు -'రాముఁడు పిలిచెన్
        బాధను పడకుము, ఆడెద
        రాధా ! మరి యన్న గూడ రాగా' యనియెన్ !  


రాముడు = బలరాముడు  

Tuesday, 15 November 2011

నా నాటికి తీసికట్టు నాగంభొట్లూ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19- 07 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

          సమస్య -  నా నాటికి తీసికట్టు నాగంభొట్లూ

కం:  మానాన్నే ఆరోగ్యము
        గానుండుట కొరకు తెస్తి గా తాయెత్తున్
        ఈ నాడే, చూడు బాగగు
         నా నాటికి, తీసికట్టు నాగంభొట్లూ!  

Monday, 14 November 2011

గొడుగు కలిగి కూడ తడిసినాఁడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08- 07 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                       సమస్య - గొడుగు కలిగి కూడ తడిసినాఁడు
 
ఆ.వె:  గొడుగు నిచ్చి తల్లి బుడుగును బడికంపె
          వాన రాగ దారి లోన తాను
          పడవ జేసి యాడి పడిపడి చిందేసి
          గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.  

Sunday, 13 November 2011

ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02- 07 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


               సమస్య - ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

 శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయగుం శివ:
(మాయాబజార్) మయా దర్పణం లో చూసిన  వారికి  తమకు ఇష్ట మైనది కనబడుతుంది.

ఆ.వె:  మాయ దర్పణమ్ము మహాదేవుడే జూడ
          తనదు మోము బదులు తారసిల్ల ,
          శంఖ చక్రములతొ శయనించి యున్నయు
          పేంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.  

Saturday, 12 November 2011

కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            సమస్య -  కాంతా  రమ్మనెను యోగి  కడు మోహమునన్

కం:  చింతలు దీర్చగ కావలె
        కాంతారమ్మనెను యోగి, కడు మోహమునన్
        వింతల లోకము దగులక
        చింతనతో తపము జేయ చిట్టడవియె మేల్ ! 

కాంతారము = అడవి  

Friday, 11 November 2011

గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

       సమస్య - గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

కం:  గుండ్రాయని పొర బడితిని
        గండ్రిసుకన పైన మెరసి కనబడుచుండన్!
        ఎండ్రియె యది, కాల్దగులగ
        గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!  

Wednesday, 9 November 2011

రతము ముగియకుండ రమణి లేచె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య - రతము ముగియకుండ  రమణి లేచె.

ఆ.వె:  రాతిరి యెదురింటి రామాయణమ్మును
          చెప్పి పిన్ని గార్కి చెవులు గొరికె,
          రావె! యనగ భర్త, రమ్యమౌ పిన్ని భా
          రతము ముగియకుండ రమణి లేచె.  

Tuesday, 8 November 2011

సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


        సమస్య - సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్.

' నివాస్'  అను వాని బాధలు తగ్గించి ఒక స్వాముల వారు అతనికి గురువుగా మారిన విధం ...

కం:  నారోగము తగ్గించగ
        మీరేదో మంత్ర మునిడి మేల్జేయమనన్
        తీరగు తీర్థమిది నివా
        సా ! రా ! త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్ .

Monday, 7 November 2011

నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  
                      సమస్య - నిన్ను నిన్ను నిన్ను నిన్నునిన్ను

ద్రౌపదిని పాండవులైదుగురు పెండ్లి చేసుకునే సమయంలో వ్యాసుడు వచ్చి వారి సందేహాన్ని తీర్చిన సందర్భం ....

ఆ.వె:  పూర్వ జన్మ మందు శర్వుని పూజించి
          అడిగె తానుగ ' పతి ' నైదు మార్లు
          నాటి వరము వలన నాతి చేకొను నేడు
          నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను.

Sunday, 6 November 2011

మేడపైనుండి పడినను మేలు కలిగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.                 సమస్య - మేడపైనుండి పడినను మేలు కలిగె

తే.గీ:  నర్సు భామను ప్రేమించి నాడు వాడు  
          మేడ పైనుండి పడ చిట్లె మెడలు, జేర
          నాసుపత్రిని ' ఐలవ్యు ' యనెను భామ
          మేడపైనుండి పడినను మేలు కలిగె.

Saturday, 5 November 2011

శునకమ్మైనట్టి హరియె శుభముల నొసగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


     సమస్య -శునకమ్మైనట్టి హరియె శుభముల నొసగున్


కం:  విను త్రిపుర వధకు పరమే
        శున కమ్మైనట్టి వాని స్తుతులను జేయన్
        ఘన కరిమల శబరిమలే
        శునకమ్మైనట్టి హరియె శుభముల నొసగున్.

     పరమేశునకు +  అమ్ము (బాణము) ఐనట్టి 
     శబరిమలేశునకు + అమ్మ ఐనట్టి

Friday, 4 November 2011

టంట టంట టంట టంట టంట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                      సమస్య - టంట టంట టంట టంట టంట.

ఆ.వె:  గదిని గోడకున్న గడియారమున గంట,
          చర్చి గంట, పాఠశాల గంట,
          గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
          టంట, టంట, టంట, టంట, టంట. 

Thursday, 3 November 2011

కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


             సమస్య -  కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు


తే.గీ :  చూపుతో గాల్చె  రతినాధు శూలి నాడు
           కొంగ నొక్కడు మాడ్చెను  క్రోధ దృష్టి
           కంటి నేను పురాణపు గాధలందు
           కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు. 

Wednesday, 2 November 2011

దత్తపది - అల, కల, వల, నెల - రామాయణార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           దత్తపది  - అల, కల, వల, నెల -  రామాయణార్థంలో

       
        అశోక వనంలో సీతతో త్రిజట పలికిన ఊరడింపు మాటలు..

కం:  కలతను జెందకు మమ్మా!
        అల రాఘవు డిటకు వచ్చి యసురుల జంపున్ !
        వలపుల రాణివి నిన్నే
        నెలతా! తాగొని జనునిక నిజమిది వినుమా ! 

Tuesday, 1 November 2011

మందు త్రాగి పొందె మరణ మతడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                     సమస్య -  మందు త్రాగి పొందె మరణ మతడు.


ఆ.వె:  మందు మాను మనుచు మందుడ నీలోక
          మందు భార మనుచు మందలించ;
          మందు, విషము
లిపి మంది చూడగ గ్రామ
          మందు, త్రాగి పొందె మరణ మతడు.