తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 30 April 2014

రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.


కందము:
ప్రీతిగ శత పూబాణుల
భాతిని వెలుగొందు హరికి పావన హృదిలో
ఖ్యాతిని పొందెనుగ మురా
రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

Tuesday, 29 April 2014

కాలునిపై కాలూనిన కాళిక

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కాలునిపై కాలూనిన కాళిక


 తేటగీతి:
కాల రూపిణి వీవమ్మ కాళికాంబ
తలపు నీవమ్మ పట్టిన తలయె గుర్తు
తలలు జన్మల గుర్తుగా దండలాయె
కాలమునకే లోబడు కాలుడైన .

Monday, 28 April 2014

తమ్ముఁడ రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తమ్ముఁడ రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

ఉత్పలమాల:
అమ్మడు మెచ్చె మామ గని, యమ్మకు తమ్ముని, ప్రేమ పండగా
అమ్మయు నాన్నయున్ మరియు నమ్మకునాన్నయు నమ్మ మెచ్చగా
నిమ్ముగ పెండ్లి యాడె, మరి నిద్దుర వేళన బిల్చె "నమ్మకే
తమ్ముఁడ రమ్మనెన్" నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

Sunday, 27 April 2014

వరి ' కోత ' లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - వరి ' కోత ' లు కందము:
వరి కోతలు పూర్తాయెను
సరి నూర్పిడి జేసి కుప్ప చక్కగ బెట్టెన్
మరి పంటకు ధర బలుకున
ధర నిలుచున మన కిసాను, దా ' రుణ ' మగునా ?

Saturday, 26 April 2014

పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.తేటగీతి:
మల్ల యోధుడు ముద్దుగా మనుమని దరి
కేగి యాడెను మాపగా నేడ్పు, వాని
గ్రుద్దు తన్నులను తినుచు వద్దని పడి
పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.

Friday, 25 April 2014

శుక్లాంబర ధరం విష్ణుం...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - శుక్లాంబర ధరం విష్ణుం...


 
 కందము:
గజముఖ! శుక్లాంబరధర !
నిజమిదె విష్ణుండవైన నీవే కాదా !
సుజనులు మెచ్చెడి భంగిమ
సృజియించెను భక్తుడొకడు చిత్రము లోనన్.

Thursday, 24 April 2014

నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా
 

శార్దూలము:
ఆక్రందించిన వేడుకొన్న మదినిన్నర్థించు  జీవంబులన్
చక్రిన్ మిత్రుడఁ జేసి బ్రోతువు కదా శంభో! మహేశా ! ధరా
చక్రంబంతట నిండి యుండు జనముల్ చైతన్య మున్ గల్గు నా
నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా! 

Wednesday, 23 April 2014

కాకినాడ కాజా...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కాకినాడ కాజా...


 
కందము:
ఖా! జా! భయ్యా!పేరది
కాజాలకు నాడు నేడు కాకీనాడే
ఆజా ! లేజా ! మస్తు క
లేజా పెరుగును నిజమ్ము లేకర్ సోజా !

Tuesday, 22 April 2014

రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్.

కందము:
ఏమిది రావణ భక్తులె
ఈ మహిలో మరల బుట్టి యిట్లను చుండెన్
ఏమియు లేకనె తప్పులు
రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్.

Monday, 21 April 2014

సాగర .. మధనమ్ము దలచి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - సాగర .. మధనమ్ము దలచి. 


 
కందము:
సాగర నరుడా ముందుకు
సాగర మధనమ్ము దలచి సాధన లోనన్
ఆగకు విషమే వచ్చిన
దాగిన యమృతమ్ము దక్కి త్రాగే వరకున్.

Sunday, 20 April 2014

శివనామము మనకుఁ గలుగఁజేయు నిడుములన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శివనామము మనకుఁ గలుగఁజేయు నిడుములన్

కందము:
అవగత మైనద, శుభములు
శివనామము మనకుఁ గలుగఁజేయు - నిడుములన్
భవ రోగములను దీరుచు
నవనీతపు మానసుండు నగజాపతియే. 

Saturday, 19 April 2014

ఉడ తల క్రిందు ప్రేమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ(న) చిత్రం - ఉడ తల క్రిందు ప్రేమ  


 
కందము:
అందించెద నీ పుష్పము
స్పందించుమ నాదు చేయి చాపితి నీకై
అందని దందుటకై తల
క్రిందుగ నే తపము జేతు, కిమ్మన వేమే !

Friday, 18 April 2014

సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య. 


వరుని కై వెదకుచున్న ఒక ఆడ పిల్ల తండ్రితో..పెళ్ళిళ్ళ పేరయ్య..

తేటగీతి:
'తిక్క' వారింటి పేరయ్య తిక్క లేదు
లక్షణుండైన పెద్ద పేరయ్య కొడుకు
తీరు చుట్టాల నడిగితి వారు జెప్పె
సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.

Thursday, 17 April 2014

నలు (వ) వ్రాత

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నలు (వ) వ్రాత


 కందము:
కలికి దమయంతి నప్పుడు
కలసియె నేనుందుననిన కాఠిన్యముతో
నలుడే వదలెను నిశిలో
నలువ లిఖితమును చెరుపగ నలవియె యగునా?

Wednesday, 16 April 2014

ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.

కందము:
ప్రశ్నించెద నిను భామా !
ప్రశ్నా? నన్నడుగు మామ ! పనికొస్తావా?
ప్రశ్నకు పనికొస్తావా?
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.

కందము:
ప్రశ్నించెద నిను భామా !
ప్రశ్నా? నన్నడుగు మామ ! *వాట్టన నేమీ ?
ప్రశ్నను వెదకుము కనబడు
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.

* what = ఏమి

Tuesday, 15 April 2014

మేఘ సందేశం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ  (న) చిత్రం - మేఘ సందేశం 


 
కందము:
గాలికి చల్లగ కదలుచు
గాలించుము నాదు చెలిని కన్నీరంతా
జాలిగ జల్లుగ చల్లుము

మేలుగ తన దరికి జేరి మేఘమ దయతో.

Monday, 14 April 2014

కారుపై దాశరథులు లంకకు నరిగిరి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కారుపై దాశరథులు లంకకు నరిగిరి.తేటగీతి:
వరముచే గర్వితుండు రావణుని దునుమ

రామ చంద్రుని సతి సీత రక్ష సేయ
దండయాత్రకై వెడలిరి దనుజ మోస
కారుపై దాశరథులు, లంకకు నరిగిరి.

Sunday, 13 April 2014

గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.తేటగీతి:
పూని యవినీతి నే పట్టి పూడ్చివేయ
పాడు బుధ్ధుల పరికించి పాతివేయ
బొంకు రంకుల భువిలోన బొంద వెట్ట
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

Saturday, 12 April 2014

పళని వాసుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పళని వాసుడు


 
కందము:
పళని గిరీంద్రావాసా!
పుళింద కన్యా హృదీశ! భుజగేంద్రహితా!
కళలలరు నో కుమారా!
కలతలు మము జేరకుండ కాపాడగదే!

Friday, 11 April 2014

భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.తేటగీతి:
మూసి ప్రక్కన నడ వలె ముక్కు మూసి
చిన్న వర్షంబుకే నీరు చేరి నిలచు
మూసి లేనట్టి "మ్యాన్ హోల్సు" మూయు మనల
భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.

Thursday, 10 April 2014

మత్స్య యంత్రము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - మత్స్య యంత్రము


 


 కందము:
చేపను కొట్టుట కై తా
చేపట్టెను విల్లు కృష్ణ చేపట్టుటకై
చూపెట్టె విజయుడా సభ
బాపని వేషంబు లోన పాండిత్యమునే.

Wednesday, 9 April 2014

జంకని జింక

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - జంకని  జింక 
 
కందము:
చిరుతకు కడుపే నిండెను
చిరు లేడి యెదుట నిలచుచు  చిక్కిన గానీ
కరకుగ చంపగ బూనదు
మరునాటికి దాచు గుణము మనుజునకుండున్.

Tuesday, 8 April 2014

మీచరణములే బట్టగ

శ్రీ సీతారామాభ్యాం నమః

వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. 

కందము:
మీ చరితము జదువుచు మే
మాచరణమునందు బెట్ట మానవ విధులన్
మీచరణములే బట్టగ
మాచరితము ధన్యమౌను మా రఘురామా ! 

Monday, 7 April 2014

పిల్లనగ్రోవి పిలుపు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పిల్లనగ్రోవి పిలుపు


 
 

కందము:
నల్లని వాడగు కృష్ణుడు
అల్లరి తానాపి రాగ మాలాపింపన్
పిల్లన గ్రోవిని, వినుచును
ఎల్లరు మరి మేను మరచు నిలనే మరచున్.

Sunday, 6 April 2014

కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్.కందము:
"మూడొచ్చె" చల్ల గాలికి
వేడుచు తన కోర్కె జెప్ప వేగముగానే
వేడిగ చేయగ భార్య ప
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్. "

Saturday, 5 April 2014

విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱివాఁడ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱివాఁడ.తేటగీతి: 
బుద్ధి మంతుడ వీవురా - బుజ్జి కన్న !
చదువు బుద్ధిని పెంచురా - చంటి వాడ !
పరుష పదములు వీడు - నా పసిడి కొండ !
విద్య వినయమ్ము నిచ్చు - నా వెఱ్ఱివాఁడ !

Friday, 4 April 2014

ఒం (వం ) టరి బ్రతుకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఒం (వం ) టరి  బ్రతుకుతేటగీతి:
వంట బట్టదు నీ చేతి వంట నాకు
బట్ట కట్టరు బ్రతికి నీ వంట తినిన
ననిన సరదాకె యనుకొంటి నదియు నిజమె
వంట నే జేతు నన జేసె నొంటరిగను.

Thursday, 3 April 2014

తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తలఁ దలంచి మిగులఁ గలత నొందె.


ఆటవెలది: 
పెండ్లి వయసు వచ్చె, పెద్ద వాడా,  కాదు
కన్నె లేమొ ప్రేమ కనగ రారు
సిగ్గు బడుచు తాను ముగ్గు బుట్టను బోలు
తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

Wednesday, 2 April 2014

ఎందరో మహాను భావులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - ఎందరో మహాను భావులు  


ఆటవెలది:
ఒక్క చందమామ చక్కగా నింగిని
వెలుగు, భూమి పైన వెలుగు నిచ్చు
గురువరులును పెక్కు గుర్తించి మ్రొక్కుడు
భరత భూమికున్న భాగ్య మిదియె.

Tuesday, 1 April 2014

మగవారికి పసుపు కుంకుమల నిడుట తగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మగ వారికి పసుపు కుంకుమల నిడుట తగున్.కందము:
మగడున్న మగువ లందరు
సిగలోపల పూలు దురిమి చెలువము మీరున్
తగు వారు, సోదరులు  ప్రే
మగ వారికి పసుపు కుంకుమల నిడుట తగున్.