తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 31 October 2015

హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

         

కందము: 
కలతను బెట్టిన వానిని
నెలతను చెరబట్టి యనిని నెరపెడు వానిన్
తలలన్నియు బడ కోలా 
హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్. 

చంపకమాల: 
నిలబడి క్షేత్రమంతటను నీరసమందక పంట నీయగా
పొలమును దున్ను వేళ మరి పుట్టిన వ్యర్ధపు మొక్కనెట్టులో
యలయక మట్టుబెట్ట సరి హాలికుడే భువి గూల్చినట్టులే 
హలమున, రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

Friday, 30 October 2015

తలపే... ను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - తలపే... ను 


కందము:  
తల పేను తిరుగుచుండెడి
తలపే బాధించుచుండు, తలలోనున్నన్ 
నెలతల గోటికి చిక్కుచు
నలుగునుగా దాని బ్రతుకు నాల్గుదినాలే ! 

Thursday, 29 October 2015

తమిళకవి యల్లసాని పెద్దనకు నతులు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తమిళకవి యల్లసాని పెద్దనకు నతులు.తేటగీతి: 
తెలుగు గ్రంథమ్ములెన్నియో తెలిసి చదివి 
మనుచరిత్రపు కావ్యమ్ము మనసుదోచ 
కలసి మెచ్చుచు చేసిరి కన్నడకవి  
తమిళకవి, యల్లసాని పెద్దనకు నతులు.

Wednesday, 28 October 2015

జడ "కవి" తలకు సన్మానం.

జడ "కవి" తలకు సన్మానం. తీపి గుర్తు.... సంవత్సరం క్రితం ఇదే రోజు (28-10-2014)  " జడ పజ్యాలు " శతక కర్తలలో నొకనిగా నన్ను కూడా సన్మానించిన శ్రీ బ్నిం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు.    

కందము: 
జడ కందములను వ్రాసితి
జడకందము బెరుగునట్లు సరసముగానే 
మెడలో నా " బ్నిం " గారే 
" మెడలును " వేసిరిగ  నాడు మెప్పులతోడన్.   

Tuesday, 27 October 2015

రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్. కందము: 
మాయగ నున్నది నాకే
' టూయిన్ వన్ ' పద్యమొక్కటున్నదటంచున్ 
మాయన్న గొప్పగను రా
మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.


Monday, 26 October 2015

కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.కందము: 
కొడుకే వైద్యుడు, తల్లికి 
మిడిమేలపు కడుపునొప్పి మిక్కుట మవగా 
పొడిమందునీయ చక్కని 
కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.

Sunday, 25 October 2015

నాన్నా....పులి...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - నాన్నా....పులి...

కందము: 
కల్లలు జెప్పుచు కన్నా ! 
పిల్లలు పరిహాసమాడ పీడలుగలుగున్ 
ఇల్లిదె వినుమా మానెయ్ 
కల్లలు, నాన్నా పులియను కథనే గనుమా ! 


కందము: 
నాన్నా పులియన, రాగా
నాన్నకు పులిలేదనుచును నగుచును జెప్పెన్
నాన్నా పులి యన మరలా 
నాన్నే రాలేదు గాని, నమిలెను పులియే. 

Saturday, 24 October 2015

కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
కందము: 
ఇల జీవన యానములో 
పలుపలు విధముల నుడివిన పథముల గతిలో 
అల వేమన చెప్పిన పలు 
కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

Friday, 23 October 2015

పందికొక్కులవలన లాభమ్ము గలదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పందికొక్కులవలన లాభమ్ము గలదు.తేటగీతి: 
పట్టిచంపగ లేములే పాడు పాడు 
వాటి జంపగ మందులే బరగ జేసి 
అమ్మజూపెడు వారికి నట్టి యెలుక 
పందికొక్కులవలన లాభమ్ము గలదు. 

Thursday, 22 October 2015

మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు  

శ్రీ దుర్గాయైనమః      
కందము:  
భర్గుని దేవీ ! మాతా !
దుర్గా ! నిన్ మదిని వేడి దోయిలినిడ స 
న్మార్గము జూపింతువు, దు
ర్మార్గము మాదరికి రాగ మసియగు గాదా ! 


కందము:
అ మ్మలకే ప్రియ సుతవే !   
అమ్మలకే యమ్మవీవు యపరాజితవే !    
అమ్మహిషు పాలి కాళీ ! 
అమ్మహిమను మహినిజూప  నఘములు ఖాళీ ! 

Wednesday, 21 October 2015

రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరాఉత్పలమాల: 
రాముని విల్లునే వదలి రయ్యిన వచ్చిన బాణమై వనిన్  
భూమిజ జూచి, రక్కసులు భోరున నేడ్వగ సీత నవ్వగా 
ప్రేమగ పెంచినట్టి వని పెళ్ళున మారుతి గూల్చుచుండ నా 
రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా. 

Tuesday, 20 October 2015

గొట్టము మన యిల్లిది

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - గొట్టము మన యిల్లిది కందము: 
గొట్టము మన యిల్లిది నిన్ 
గొట్టనులే బాగ చదువు కొనవే! బడినె 
గ్గొట్టక చదివిన భావిని 
కట్టింతుము నిజము తల్లి ! కనకపు మేడన్

Monday, 19 October 2015

సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
కందము: 
ఆరఘురాముని భక్తుడు 
తేరాగను మూలికలను తెలియక నెవియో 
దారాసుతలును నిజసం 
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.

Sunday, 18 October 2015

జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.కందము: 
ప్రీతిగ కొలువగ రాముని 
త్రాతకు మనసున కొలువిడి దాసుడ వగుచున్ 
నేతకు నౌకరు నేనని 
జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

Saturday, 17 October 2015

అవి నీతి కథలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - అవి నీతి  కథలు


కందము: 
ఇవినీతి కథలు చూడుడు 
అవి నీతిని బోధ సేయు బాలలకెపుడున్ 
అవినీతి త్రోవ బోవదు 
ఇవి నేర్చిన వారి బ్రతుకులింపుగ సాగున్.

Friday, 16 October 2015

అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు. 


తేటగీతి: 
వరముగలదులె ముందట వచ్చునట్టి 
యుగమునందున విధితానె యగును గాద
కోతి సింహంబు ఖగ రాజ క్రోడపు మరి 
యశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

Thursday, 15 October 2015

మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్. కందము: 
మందాకిని ఎక్స్ ప్రెస్సిది 
ఇందాకనె యెక్కినాను హెల్లో ఫ్రెండూ ! 
ముందే స్టేషన్కే రా ! 
మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.

Wednesday, 14 October 2015

గరుడ గమన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గరుడ గమన 
ఆటవెలది: 
గరుడ రేఖ యున్న కరవదు పామంచు 
నరులు చెప్పుచుంద్రు, నాట్య మీవు 
చేయ గొప్పతనము చెప్పగా లేములే 
గరుడ గమను వైన కతన గాదె.

Tuesday, 13 October 2015

భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...


కందము:
తెగ మెచ్చుకొనుఛు నుంటివి
జగమంతయు హరియె యనుచు, సరె! ప్రహ్లాదా ! 
అగుపించని వాడగు నా 
భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.

Monday, 12 October 2015

నిమ్మతొన బిళ్ళలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నిమ్మతొన బిళ్ళలు.కందము: 
నోరూరును చూడగనే 
నీరసమే మాయమౌను నిమ్మల రుచితో 
నీ రస గుళికల నోటను 
మీరందరు చప్పరించ మీకే తెలియున్.

Sunday, 11 October 2015

వరున కిత్తురు కాషాయ వస్త్రములను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వరున కిత్తురు కాషాయ వస్త్రములను
తేటగీతి: 
పాద పూజలు సలుపుచు భక్తి తోడ 
ఫలము లిచ్చుచు దినుటకు, వరము లడిగి 
ఫలమునీయగ భావించి పరమ మౌని 
వరున కిత్తురు కాషాయ వస్త్రములను

Saturday, 10 October 2015

స "వరమా"

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - స "వరమా" 
కందము: 
వరమా చూచునదిచట స 
వరమా చెప్పమ్మ నీవు పదములె దాటెన్ 
కురులవి చూడగ నాకే 
వరమో శాపమ్మొ నుడువ పదములె లేవే !

Friday, 9 October 2015

తరువున వెల్గొందుచుండె తారాగణముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తరువున వెల్గొందుచుండె తారాగణముల్.కందము:
మరణించిన నటరత్నము 
సరి నటసామ్రాట్టు యస్వి సావిత్రి నటన్ 
మురిపించగ వేసిన చి
త్తరువున వెల్గొందుచుండె తారాగణముల్.

Thursday, 8 October 2015

బడికి పదవే పాపా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - బడికి పదవే పాపా
కందము: 
బడికే పోననుచడ్డము 
బడి యేడ్చినగాని వినడు పాపము, నాన్నే 
బడితెను దీయును, దెబ్బలు 
బడి వాతలు బడక బడికి పదవే పాపా ! 

Wednesday, 7 October 2015

పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?కందము: 
పవలున దిరుగరు వారలు 
దివి భువి గానట్టి మధ్య దేశము మసలున్ 
ఎవరన పిశాచులందున 
పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

Tuesday, 6 October 2015

యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత
తేటగీతి:  
ఆట వెలదియందెంతయొ హాయిగాను 
వేదమేజెప్పె గా చూడ వేమనపుడు 
యోగియగుటకు ముందు విరాగి వేమ 
యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత

Monday, 5 October 2015

ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.తేటగీతి:  
ఉదయమందున జూడగా నెదుటి యిండ్ల 
చుక్క బొట్టుతొ కనబడె సుమతి పతియె 
అడ్డనామాలు బెట్టెగా హరిత భర్త 
ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.

Sunday, 4 October 2015

శంకరు డుద్ధతిన్ బరపె సాయక కోటిని రామచంద్రుపై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శంకరు డుద్ధతిన్ బరపె సాయక కోటిని రామచంద్రుపై ఉత్పలమాల: 
శంకర భక్తుడయ్యు తగు సభ్యత లేకనె పట్టి కానలో 
లంకకు దెచ్చి నాడు శుభ లక్షణ సీతను,యుద్ధ భూమిలో 
జంకక గెల్తునంచు మరి శంకరు దల్చుచు నార్షధర్మ నా 
శంకరు డుద్ధతిన్ బరపె సాయక కోటిని రామచంద్రుపై. 


Saturday, 3 October 2015

సజ్జనులకు ప్రీతికరము సారాకొట్టే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - సజ్జనులకు ప్రీతికరము సారాకొట్టే.కందము: 
లజ్జను బొందరు కొందరు 
బుజ్జీ ! మానండనినను బుద్ధిగ వినరే ? 
మజ్జిగ నీయగ దొరకరు 
సజ్జనులకు, ప్రీతికరము సారాకొట్టే.

Friday, 2 October 2015

లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్


కందము:
లంకను పుకారు బెంచిరి 
కింకరులే సీత మనసు కేకలు వెట్టన్ 
ఢంకాగొట్టుచు జెప్పిరి 
"లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్. "

Thursday, 1 October 2015

ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్


కందము: 
దండిగ సుమముల చేకొని 
మెండుగ నిజ భక్తి తోడ మేలగు స్తుతి తో 
నిండగు మది గొల్వగ చా 
ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్