తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 16 July 2017

కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.


కందము: 
తీరుగ గనగా కవివర 
చేరుచు నాకన్నతల్లి చిన్నారులపై 
మీరుచు జూపెడి సరి మమ 
కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

Saturday, 15 July 2017

నేల - నీరు - అగ్గి - గాలి....మహాభారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 05 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - నేల - నీరు - అగ్గి - గాలి....మహాభారతార్థంలో 


కందము: 
మనసింక గాలిపోయెను 
కన నగ్గించెడు నొకండు కర్ణుడు తోడై 
మననీరు ధార్త రాష్ట్రులు 
వనమందున మనల నేల? వారలు వెధవల్. 
Friday, 14 July 2017

నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్


కందము: 
నల్లని మేఘశ్యాముని 
యల్లన వేయైనపేర్ల నాస్తోత్రముతో 
తెల్లని విరులగు, మాలగ 
నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్. 

Tuesday, 11 July 2017

పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.


తేటగీతి: 
తూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి 
చాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత 
పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.

Monday, 10 July 2017

'తల' పదం అన్యార్థంలో ఇష్టదైవస్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది: 'తల' పదం అన్యార్థంలో ఇష్టదైవస్తుతి  


కందము: 
తలచెద నే శ్రీరాముని 
తలచెద సీతమ్మ పతిని దశరథ సుతునే 
తలచెద రవికుల సోముని 
తలచెద మా హనుమ యెపుడు దలచెడు స్వామిన్. 

Sunday, 9 July 2017

శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్.


కందము: 
అనాటి యల్లసానియె
తానే మనుచరిత వ్రాసె ధారుణి, వినుమా
కానగ కాశీ ఖండము 
శ్రీనాథుని కృతిగ మను, చరిత్రయె యొప్పున్.

Saturday, 8 July 2017

రామునకు, సహోదరి గదా రమణి సీత.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 04 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామునకు, సహోదరి గదా రమణి సీత.


తేటగీతి: 
చెల్లిపోవును బ్రతుకిట్టి చేష్ట మాను 
పరుల భార్యయె రావణా పరగ చెల్లి
తప్పు మన్నించమనిజెప్పి యప్పజెప్పు 
రామునకు, సహోదరి గదా రమణి సీత.

Friday, 7 July 2017

పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్.కందము: 
గడిపినది చాలు దినమనె 
నడుగిడుచును చంద్రుడంత కలువలజతకై 
విడిపొండు మీరు చాలని 
పడమట నుదయించెను-రవి, పద్మము లేడ్వన్.

Thursday, 6 July 2017

రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.


కందము:  
రాముని దలచుచు నాడా
రామముగా లంక వనిని రమణిని జూచెన్
రా, మార్కొన రాగా నా 
రామాంతకుడయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.

Wednesday, 5 July 2017

భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.కందము: 
ఈ మాకూడలి నడచుచు 
కామేశ్వరి నొప్పులనుచు కడుపును బట్టన్ 
ధీమాగ చాటు జేయుచు 
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.

Tuesday, 4 July 2017

కట్టె - నిప్పు - బూది - మసి ... తో పచ్చని ప్రకృతి వర్ణన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - కట్టె - నిప్పు - బూది - మసి ... తో పచ్చని ప్రకృతి వర్ణన.


కందము: 
చుట్టిన నిశి పోయె సమసి 
పట్టుచు సూర్యుండు గొట్ట  బాబూ దినమై 
కట్టెదుట నిండె కాంతులు 
ఇట్టే జీవమ్ము బుట్టె నిప్పుడె గనుమా. 

Monday, 3 July 2017

రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై..ఉత్పలమాల: 
పావన నామమున్ గలిగి పల్కెడు వారికి కామధేనువై 
జీవనమందు తా విధము జేరుచు జూపెడు పుణ్యమూర్తియై 
దేవతలంతగోర భువి ధర్మము నిల్పగ కాలరుద్రుడై 
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై. 

Sunday, 2 July 2017

ముగురు స్త్రీలమగఁడు మొదటి యోగి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ముగురు స్త్రీలమగఁడు మొదటి యోగి.


ఆటవెలది: 
గంగభార్యగాదు గంగాధరునకును 
సతియు నొకతె, గిరిజ, సతియు నొకరె 
శంక యేల నరుడ శాంకరి భర్తకు 
ముగురు స్త్రీల? మగఁడు మొదటి యోగి.