తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 31 July 2012

రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు

ఆటవెలది:
తనదు కోడలి బాధలు తాళ లేక
'క్రొత్త కోడలు సీరియల్' కోరి చూచి
అందు కోడలి నెప్పుడు నత్త మిగుల
రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు.


Monday, 30 July 2012

నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్

కందము:
ప్రీతిగ మోసము జేయుచు
మేతను మేయుచు ధనమును మేటలు వేసే
నేతల హైటెక్కుల యవి
నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్.

Sunday, 29 July 2012

పచ్చకామెర్ల రోగము పాలకులకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పచ్చకామెర్ల రోగము పాలకులకు

తేటగీతి:  
మంట జూడరు వెలుగుల వెంట జూచు
పాచి జూడరు పైపైని పచ్చ జూచు
వెచ్చ, పచ్చగ దేశమ్ము వెలుగు ననును
పచ్చకామెర్ల రోగము పాలకులకు.

Saturday, 28 July 2012

దత్తపది - "కొమ్మ, ఆకు, కాయ, పండు" పదాలను ఆయా అర్థాలలో కాకుండాశ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - "కొమ్మ, ఆకు, కాయ, పండు"  పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో..

మయసభ నుండి అవమానము తో వచ్చిన రారాజు మనస్థితి...
తేటగీతి:
ఆ కులట కృష్ణ మదమెక్కి యచట నవ్వె
కాయమున గాదు మనసు గాయ మయ్యె
పండుకొన్నను నిద్దుర పట్ట దాయె
కొమ్మ పొగరును దించగా కోరె మనసు .

Friday, 27 July 2012

కమలజునకు భార్య కమలయె గద


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కమలజునకు భార్య కమలయె గద

ఆటవెలది:
చదువు లిచ్చు గాదె  సతి శారదాంబయె
కమలజునకు; భార్య కమలయె గద
సిరుల నిచ్చు చుండు శ్రీ హరికి తగిన 
శక్తి నిచ్చు నంబ  శంకరునకు. 

Thursday, 26 July 2012

గురువు లైన నేమౌను రా కొట్టవచ్చు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గురువు లైన నేమౌను రా  కొట్టవచ్చు.

తేటగీతి:
బుద్ధి సుద్దులు నేర్పు గా బోధ జేసి
ధర్మ మార్గము నడిపించు దైవమయ్యు
పరువు దీసెడి పని జేయ పనికి మాలి
గురువు లైన నేమౌను రా ! కొట్టవచ్చు.

Wednesday, 25 July 2012

స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్.
కందము:
మాతా ! సోనియ ! వందే
మాతర మేతరము కైన మాగతి మీరే !
మాతరమే కాదందురు
స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్.

కందము:
స్వాతంత్ర్యము దెచ్చిన ఘన
నేతలు కనులార జూచి నేడీ గతియున్
ప్రీతిని జెందక యందురు
'స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్'.

Tuesday, 24 July 2012

పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్

ఉత్పలమాల:
అన్నిట వైర మిద్దరకు నడ్డము నిల్వులు నామమందు, చె
ప్ప న్నగ వోలె దాల్చొకరు పన్నగ మొక్కరు యెక్కి త్రొక్కుగా

నెన్నగ తెల్లవా డొకరు నీలపు చాయన నల్ల నొక్కరౌ
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్.

Monday, 23 July 2012

సంహరించు వాఁడు సచ్చరితుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సంహరించు వాఁడు సచ్చరితుఁడు.

ఆటవెలది:
పాపి యైన గాని పరివర్తనము జెంది
హరి ! హరి ! యని వేడ నార్తి తోడ
పాపములను తీసి భక్తుల  కోసమై
సం హరించు 'వాఁడు' సచ్చరితుఁడు.
ఆటవెలది:
పుడమి బాధ దీర్చ పుట్టుచు ప్రతి సారి
హాయి నిచ్చు వాడు  హరియె, చూడ
శిష్ట జనుల గాచి దుష్టల తాబట్టి
సంహరించు 'వాఁడు' సచ్చరితుఁడు.

Saturday, 21 July 2012

రక్షాబంధనము నాఁడు రావల దన్నా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రక్షాబంధనము నాఁడు రావల దన్నా
కందము:
రక్షను గట్టెద నీకే
రక్షాబంధనము నాఁడు రా ! వలదన్నా
లక్షలు, మించిన కానుక,
భిక్షగ నీ ప్రేమ చాలు ప్రియ సోదరుడా !చెల్లెలి పై కోపంతో వున్న అన్నతో చెల్లి...

కందము:
శిక్షను వేయకు మన్నా!
రక్షాబంధనము నాఁడు రావలదన్నా
దీక్షను బూనెద వచ్చెద!
కక్షను విడు ! నిన్ను నన్ను కన్నది ఒకరే !

Friday, 20 July 2012

వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్.

కందము:
దరి జేర వీతి బాధలు
భరియించని కష్ట నష్ట పాపపు భయముల్
మరి - శ్రావణ మాసంబున
వరలక్ష్మీవ్రతముఁ జేయ - వల దని రార్యుల్.

Thursday, 19 July 2012

భద్ర కాళి బెదరి పారి పోయె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భద్ర కాళి బెదరి పారి పోయె

ఆటవెలది:
భక్తి యెక్కు వాయె భజన లెక్కువయయ్యె
కాళి ముఖము బదులు కాంగి రేసు
అమ్మ గారి ముఖము నందముగా దీర్చ
భద్ర కాళి బెదరి పారి పోయె.

Tuesday, 17 July 2012

టప టప టప టప్ప టప టప టప


 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - టప టప టప టప్ప టప టప టప

ఆటవెలది:
పొటుకు పెట్టు నింట పోచమ్మ పలుచోట్ల
పెట్ట గ్లాసు, చెంబు, ప్లేటు, గిన్నె,
చట్టి, ముంత, బిందె , చప్పు డిట్లాయెగా
టప టప టప టప్ప టప టప టప.

Saturday, 14 July 2012

సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.

కందము:
ఓయీ ! మార్చుము ! పూజలు
చేయకు పగిలిన
ప్రతిమకు, చెప్పితి వినుమా !
తీయక నే జేసినచో
సాయీ రూపమ్ము, మనకు సంకటము లిడున్!

Friday, 13 July 2012

కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కేశవుఁడు సచ్చెఁ  గౌరవుల్ ఖిన్నులైరి.

తేటగీతి:
ప్రతిన బూనిన విజయుని బాగు తెలిసి
సంగ రమునందు జంపగా సైంధవుని శి
రస్సు ద్రెంపెడు మార్గమ్ము రయము జెప్ప
కేశవుఁడు,  సచ్చెఁ,  గౌరవుల్ ఖిన్నులైరి.

Thursday, 12 July 2012

విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

ఆటవెలది:
ప్రకృతి వైద్య మునకు పరగ కేరళ జేరి
కాయ గూరల దిని కాయమునకు
'స్టీము బాతు ' జేయ బూనితి నట యా
విరులు దాఁకగానె వేఁడి పుట్టె.
 

ఆటవెలది:
శీత కాలమందు చెప్పగా నొక రాత్రి
విరుల బాణ మేయ పురహరారి
విరులు ముడిచి రాగ కురులందు శ్రీమతి
విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

Wednesday, 11 July 2012

ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

కందము:
ఎవడెవ్విధి తా మారునొ
ఎవనికి తల వ్రాత జూడ నెటు లుండునొ; యా
స్తవనీయ జగత్పిత మా
ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?

Tuesday, 10 July 2012

శ్రావణ మాసమందు నగ జాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - శ్రావణ మాసమందు నగ జాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్

ఉత్పలమాల:
ఆ వనజాక్షు లందరును హాయిగ జేరుచు నొక్కచో సుహృ
ద్భావన, సౌఖ్యముల్ గలుగ భౌముని వారము మ్రొక్కినారుగా
శ్రావణ మాసమందు నగ జాతకు; మ్రొక్కిరి శుక్ర వారముల్

భావన జేయుచున్ మదిని భాగ్యము గల్గు నటంచు లక్ష్మికిన్.

Monday, 9 July 2012

సత్యమునకంటె మేటి యసత్యము గద

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సత్యమునకంటె మేటి యసత్యము గద

తేటగీతి:
నూరు బావులు క్రతువులు నూరు మంది
పుత్ర సంతతి కన్నను, పుడమి లేదు
సత్యమునకంటె మేటి; యసత్యము గద
మహిని
చెడ్డది   మేలగు మరణ మొకటె.

Saturday, 7 July 2012

నల్లులకుఁ జేతు కోటివందనము లిపుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - నల్లులకుఁ జేతు కోటివందనము లిపుడు

తేటగీతి:
జనుల రక్తము బీల్చెడు స్వార్ధ రాజ
కీయ శక్తుల జూడగ న్యాయముగను
దోచు మేలుగ దోచెడు దోమ, జలగ
నల్లులకుఁ జేతు కోటివందనము లిపుడు

Friday, 6 July 2012

లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్

కందము:
ఏకాంతము నందలిగిన
శ్రీ కాంతుని భామ సత్య ఛీ కొట్టగనే
తా కాళ్ళకు మ్రొక్కెను గద
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్! 

Tuesday, 3 July 2012

కప్పులోనఁ బుట్టె గద తుఫాను.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య  -  కప్పులోనఁ బుట్టె గద తుఫాను.

 ఆటవెలది: 
ఆరు వేల యప్పు కారేండ్లు గడిచెను
తీర్చ మనుచు నడుగ తీక్షణముగ
తమ్ము డన్న మధ్య తగవు పుట్టెను వారి
కప్పులోనఁ బుట్టె గద తుఫాను.  

ఆటవెలది:
అల్ప పీడనమ్మె  యధికమై చెలరేగె
వాయు గుండ మాయె వార్ధి లోన
అవని ఇల్లు గాగ నాకసమే కప్పు
కప్పులోనఁ బుట్టె గద తుఫాను.

Monday, 2 July 2012

కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య -  కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్

కందము :
చవు లూరించెడు భాషను
యువతయె యవతలకు నెట్టి, ఓ ! నో ! యనగన్
చెవి యొగ్గి వినగ తెనుగున
కవితా గానమ్ము, లోక కంటక మయ్యెన్ ! 

Sunday, 1 July 2012

సరిసరి మా పనిని సరిగ సాగగ నిమ్మా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సరిసరి మా పనిని సరిగ సాగగ నిమ్మా.

నిగమ శర్మ మిత్రులతో కలసి అత్యవసర పని మీద వెళ్తూ దారిలో కలసిన సానిదాన్ని చూస్తూ ఆగి పోతే .. మిత్రుల మందలింపు....
కందము:
దరి సాని దాని నిగ నిగ
మరి మరి గని, మాపని సగమాపగ గాదా !
సరిగా గని పద నిగమా !
సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!